చాలాకాలం క్రితం తెలుగు దూరదర్శన్ కుంటలో (అప్పట్లో అది నడిచిన స్థాయికి ఛానల్ అనే పదం వాడ్డం ఇష్టం లేదు) నెలకోసారి "జాబులూ, జవాబులూ" అని ఒక కార్యక్రమం వచ్చేది. ఆ నెలలో కుంటలో ప్రవహించిన కార్యక్రమాల మీద వీక్షకుల అభిప్రాయాలకూ, సందేహాలకూ, ఆకాంక్షలకూ స్టేషన్ డైరెక్టర్ గారు సమాధానాలిచ్చేవారు. అవేమీ సంతుష్టికరంగా ఉండేవి కావు గాని ఇప్పటి ప్రైవేటు ఛానళ్ళకంటే చాలా నయం.
ఇప్పుడున్న తెలుగుఛానళ్ళవాళ్ళెవరికీ తాము ప్రసారం చేస్తున్నకార్యక్రమాల బాగోగుల గుఱించి -మన - అనగా వీక్షకుల అభిప్రాయాలు అవసరం లేదు. అందుకే ఇప్పుడు మాటవరసకైనా జాబులూ లేవు, జవాబులూ లేవు, బుఱ్ఱ ఖరాబులే తప్ప ! వాళ్ళు తమ యిష్టమొచ్చినవి ప్రసారం చేస్తూంటారు. చచ్చినట్లు చూడ్డమే ఇప్పుడు మన పని. నాకర్థంకాని విషయం ఇంకొకటేమిటంటే మనం పెద్దగా విరగబడి చూడకపోయినా "మా యొక్క ఫలానా ధారావాహిక అదుర్స్ బెదుర్స్" అంటూ వాళ్ళకు వాళ్ళే నంది, పంది వగైరా అవార్డులు ఎలా ఇచ్చేసుకుంటున్నారా ? అని ! దీనిక్కారణం - టీవీ కార్యక్రమాల మీదా, సినిమాల మీదా ప్రజాభిప్రాయ నివేదన జరగాల్సినంతగా జరక్కపోవడం. ఇంతకాలమూ ఇలా ఉందంటే సరే ! కాని బ్లాగుల్లాంటి ప్రజామాధ్యమం విస్తరిస్తున్న దశలో కూడా మనం నచ్చని కార్యక్రమాల మీదా సినిమాల మీదా గొంతెత్తకపోవడం మంచిది కాదు. కాబట్టి ఆ ప్రస్తావనల మీద రాసే బ్లాగులు విఱివిగా పుట్టాలి.
ఇదివరకేమో గాని ఇప్పుడు మాత్రం వీడియో బ్లాగింగు చెయ్యడానికి అన్నీ మంచి శకునములే. ముఖ్యంగా బ్లాగర్ డాట్ కామ్ లో గత కొద్దినెలలనుంచి నేరుగా దృశ్యకాల (videos) ని టపా చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టడం బ్లాగేతిహాసంలోనే ఒక చరిత్రాత్మక మలుపు. Youtube నుంచి జావా సంజ్ఞావళి (Java code) ని బ్లాగులో పొందుపఱచుకోవడం, మన బ్లాగు ముందు ససేమిరా అని మొఱాయించడం, మనమేమో దాని కాళ్ళూ గడ్డం పట్టుకుని నీచంగా బ్రతిమాలడం - ఈ పాతముచ్చటలకింక స్వస్తి. ఇదొక్కటే సరిపోదు. ఒక సినిమా గుఱించి మనం మన బ్లాగులో సమీక్ష రాయగలగాలంటే, రాసినా మన అభిప్రాయానికి పాఠకులు విలువివ్వాలంటే సదరు సినిమాలోని సన్నివేశాల్ని టూకీగా వారికి ప్రదర్శించి చూపాలి. లేదా కనీసం కొన్ని స్టిల్స్ అయినా టపా చెయ్యాలి. అదెలా చెయ్యాలో ఇక్కడ చర్చిస్తున్నాం.
ఇందుకు ముఖ్యంగా అవసరమైనది మన దగ్గర ఉన్న సి.డి./డి.వి.డి. ని మనకిష్టమైన విదంగా దృశ్యాలు దృశ్యాలుగా విడగొట్టుకుని భద్రపరచుకోగల వెసులుబాటు. దీనికోసం ప్రత్యేకవిధమైన సాఫ్టువేరు కావాలి. అదృష్టవశాత్తు Aone Software అనే సంస్థవారు అలాంటి సాఫ్టువేరుని చాలా చౌకగా కేవలం 25 అమెరికన్ డాలర్లకే అందిస్తున్నారు. దాని పేరు Ultra Video Splitter (ఇకముందు UVS అందాం). దాన్ని పరీక్షించగోరేవారు http://www.aone-soft.com/splitter.htm అనే లంకెలో దిగుమతి చేసుకోవచ్చు. దిగుమతి చేసుకున్నాక UVS తాలూకు ప్రతీకం (icon) ఒకటి మీ డెస్క్ టాప్ మీద కూర్చుంటుంది.ఏవన్ వారి UVS సాఫ్టువేరుని ఉపయోగించే పద్ధతి :-
౧. మీరు దృశ్యాలుగా విడగొట్టదల్చుకున్న సినిమా తాలూకు సి.డి.ని మీ కంప్యూటర్ యొక్క సి.డి./డి.వి.డి. డ్రైవ్ లో చొప్పించండి.
౨. UVS icon మీద జమిలినొక్కండి. అప్పుడు Please Register Your Copy అని ఒక పెట్టె ప్రత్యక్షమౌతుంది. UVS ని కొనుక్కున్నవారి కంప్యూటర్లలో ఆ పెట్టె కనిపించదు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఎంత పెద్ద నిడివి గల దృశ్యాన్ని select చేసినా UVS Trial Verson కేవలం మూడు నిమిషాల నిడివినే విడగొడుతుంది. Regd. Version కి ఇలాంటి పరిమితుల్లేవు. సరే ! ఆ పెట్టెలో క్రింది భాగాన Try అని ఉన్న బొత్తాముపై నొక్కండి. UVS User Interface ప్రత్యక్షమౌతుంది. దాని ముందో వెనకో పైన చూపిన విధంగా మళ్ళీ ఇంకో విండో ప్రత్యక్షమౌతుంది. అందులో ఉన్న ఫైళ్ళ జాబితా కనిపిస్తుంది. వాటిల్లో MPEG అని ఉన్న ఫైలుని select చెయ్యండి.
౩. అప్పుడు పైన చూపిన విధంగా మళ్ళీ ఇంకో విండో ప్రత్యక్షమౌతుంది. అందులో ఉన్నదృశ్యాల జాబితా కనపిస్తుంది. వాటిల్లో ఎక్కువ మెగాబైట్లున్న దృశ్యాన్ని UVS లో ప్రదర్శనకు ఎంచుకోండి (click చెయ్యండి). అదే అసలు సినిమా.
౪. పైన కనిపిస్తున్న JPEG బొమ్మ UVS User Interface. ఇందులోని వివిధ భాగాల గుఱించి తెలుసుకుంటే దీన్ని ఇతోధికంగా ఉపయోగించుకోగలం. కొనుక్కున్న సాఫ్టువేరులో ఇంతకంటే ఎక్కువ సదుపాయాలుంటాయి.(అ) పై బొమ్మలో కుడివైపున Help, Exit అనే icons కింద 1. Source File 2. Output Folder అని రెండు కాలమ్ లు ఉన్నాయి. వాటిని మీరు నింపనక్కఱలేదు. మీరు Open icon మీద నొక్కి ఎంచుకున్న ఫైళ్ళ యొక్క లొకేషనే దానంతటది Source File లోకి వచ్చేస్తుంది.
(ఆ) పై బొమ్మలో కింద ఎడంచేతివైపున తెల్లగా మీకొక Story bar కనిపిస్తుంది. సినిమా ఆడడం మొదలు కాగానే అదంతా నీలిరంగు బార్ గా మారిపోతుంది. ఆ బార్ కింద మీకు ఆఱు ప్రతీకాలు కనిపిస్తాయి. అవి-
1. Play 2. Pause 3. Stop = తెలిసినవే.
4. Mark Start Point = మీరు కత్తిరించదల్చుకున్న దృశ్యం దగ్గరికి సినిమా కథ వచ్చీ రాగానే మీరీ బొత్తాము మీద నొక్కెయ్యాలి (ఒక్కసారి మాత్రమే).
5. Mark End-point = మీరు కత్తిరించదల్చుకున్న దృశ్యం అయిపోవస్తూనే మీరీ బొత్తాము మీద నొక్కెయ్యాలి (ఒక్కసారి మాత్రమే).
6. Clear Mark = మీకు మీ దృశ్య ఎంపిక నచ్చక మళ్ళీ మొదటినుంచి మొదలుపెట్టదల్చుకుంటే దీనిమీద నొక్కాలి.
(ఇ) బొమ్మలో అన్నింటికంటే అట్టడుగున మీకొక Progress bar కనిపిస్తుంది. సి.డి. లోనుంచి విడగొట్టడానికి మనమెంచుకున్న దృశ్య ప్పని ఎంతవఱకు అయిందో అది ఆకుపచ్చ నిలువు చాఱలతో తెలియజేస్తుంది.
(ఈ) కొన్నిసార్లు నేరుగా UVS User Interface పైన ఎడంచేతివైపున గల Open అనే icon మీద నొక్కితే సి.డి./డి.వి.డి లోని ఫైళ్ళ వివరాలు గల విండో ప్రత్యక్షమౌతుంది. అక్కడ అన్నింటికంటే ఎక్కువ మెగాబైట్లు గల ఫైలుని select చేసుకుని Open అనాలి. అప్పుడు UVS Interface లో సినిమా ఆడడం మొదలౌతుంది.
౫. Mark End-point బొత్తాము మీద నొక్కాక Pause లేదా Stop బొత్తాము నొక్కాలి. అప్పుడు Story bar మీకు పై బొమ్మలో ఉన్న విధంగా కనిపిస్తుంది. బార్ లోని నీలిభాగం మీరు కత్తిరించిన దృశ్య పరిమాణానికి ప్రతిబింబం.
అప్పుడు UVS User Interface పైభాగంలో ఉన్న ఈ Split బొత్తాము మీద నొక్కండి. UVS మీరు ఎంచుకున్న దృశ్యభాగాన్ని మెయిన్ సి.డి./డి.వి.డి నుంచి విడగొట్టడం మొదలుపెడుతుంది. ఆ పని తాలూకు ప్రగతి Interface కి అట్టడుగున ఉన్న progress bar లో ఈ క్రింది తెఱపట్టు (screen capture) మాదిరి సూచించబడుతుంది.
౮. భద్రపఱిచాక సదరు వీడియోఫైలు యొక్క Thumbnail మీద కుడినొక్కు (right-click) నొక్కితే ఈ క్రింది పెట్టెలో మాదిరి దాని భోగట్టా యావత్తూ ప్రదర్శితమౌతుంది. ముఖ్యంగా అది ఎన్ని MB లు వచ్చిందో గమనించండి. ఆ Thumbnail మీదే జమిలి-నొక్కితే (ఉన్నవాళ్ళు) Windows Media Player లో మునుజూపు (Preview) చూసుకోవచ్చు :
౯. ఇప్పుడు మనం విడగొట్టిన సినిమా సన్నివేశాన్ని బ్లాగులోకి టపాచెయ్యడానికంతా సిద్ధమైనట్లే. చెయ్యాల్సిందల్లా మన బ్లాగు Compose Box లోకి వెళ్ళడం. అక్కడ Box పైన, చివర్నుంచి మూడో ప్రతీకమే (icon) వీడియో ఎగుమతుల కొఱకు ఉద్దేశించినట్టిది. (ఈ క్రింది బొమ్మ చూడండి). దాని మీద నొక్కండి.
౧౦. అప్పుడు ఈ క్రిందివిధంగా ఒక సంవాదపేటి వస్తుంది. ఇందులో Browse అనే బొత్తాము మీద నొక్కితే మీ కంప్యూటర్ లోని ఫైళ్ళు ప్రదర్శితమౌతాయి. వాటిల్లోంచి మీ అభిమాన సినీ-క్లిప్పింగుని ఎంచుకుని Video Title అనే వివరాన్ని నింపండి. దాని క్రింద I agree...etc. అని ఉన్నచోట నొక్కి UPLOAD VIDEO అనండి. మీ క్లిప్పింగు మీ బ్లాగులోకి ఎగుమతి కావడం మొదలవుతుంది. మీ వీడియో యొక్క పరిమాణాన్ని బట్టి ఆ ఎగుమతి ఎంత సమయమైనా తీసుకోవచ్చు కనుక వేచి చూడండి. తొందఱపడి వెబ్ పుట తిప్పెయ్యొద్దు. అంతగా అవసరమనుకుంటే ఇంకో విహారిణి (BROWSER) తెఱవండి. ఎగుమతయ్యాక కూడా మీ బ్లాగు Processing.... అంటూ తాత్సారం చేస్తుంది. భరించాలి. మీరు బ్లాగులో పెట్టదల్చుకున్న అన్నిదృశ్యాల ఎగుమతీ పూర్తయ్యాక వాటి మధ్యలో మీ పాఠ్యాన్ని (text) టైపు చెయ్యాలి.


