మారడానికి గతంలో ఒక యుగమో సహస్రాబ్దమో (Millenium) పట్టే విషయాలు కేవలం రెండు మూడు దశాబ్దాల (Decades) వ్యవధానంలోనే మారిపోవడం బహుశా మన సమకాలీన లక్షణమనుకుంటా. ఒక ఇరవయ్యేళ్ళ క్రితం ఏవైతే తప్పుగా భావించామో అవే ఇప్పుడు ఆధికారికంగా, సామాజికంగా, బహిరంగంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఒప్పులై కూర్చోవడం పిదపకాలమహిమ. వేఱే దేశానికి పోయినప్పుడు culture shock తగుల్తుందంటారు. "స్థిరో భవ, వరదో భవ" అనుకుని కడుపులో చల్ల కదలకుండా ఇండియాలోనే కూర్చున్నా కూడా కల్చర్ షాకులు తప్పడంలేదు. దీని భావమేమి తిరుమలేశ ? ఎటు పోతున్నాం.
చెప్పొచ్చేదేంటంటే - ఇవాళ "ద హిందూ" అనే హిందూవ్యతిరేక దినపత్రికలో ఒక వార్తొచ్చింది. దాని సారాంశం -హైదరాబాదులోని English and Foreign Languages University (EFLU) లో ఇకముందు ఆచార్యుల పనితీరు గుఱించి విద్యార్థులే మదింపు (assessment) చేసి తమ తీర్పుని మూసేసిన లకోటాల (sealed covers) లో పెట్టి యాజమాన్యానికి ఇస్తారట. దాని ఆధారంగా యాజమాన్యంవారు ఆచార్యులకు పదోన్నతులూ (promotions) గట్రా మంజూరు చేస్తారట. "బహుశా, ఇలాంటిది అమలు చెయ్యడంలో దేశమంతటికీ మేమే మొదటివాళ్ళం కావచ్చు" అని సంబరపడుతున్నారు సదరు విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ అభయ్ మౌర్యా.
కాబట్టి ఇది ఎక్కణ్ణుంచో అరువు తెచ్చుకున్న బాపతు అని తెలుస్తూనే ఉంది. వాస్తవానికి ఈ పద్ధతి మన రాష్ట్రంలోనే ప్రైవేట్ అన్-ఎయిడెడ్ జూనియర్/డిగ్రీ కళాశాలల్లో గత దశాబ్దన్నర కాలానికి పైబడి విస్తారంగా అమల్లో ఉంది. ఎక్కడిదైనప్పటికిన్ని ఇది సమర్థనీయమైన పద్ధతి కాదు. ఇలాంటివి ఇండియాలో సక్రమంగా వర్కవుట్ అవ్వవు. పైగా EFLU ఒక ప్రభుత్వసంస్థ అని మఱువరాదు. మామూలుగానే మన ప్రభుత్వసంస్థల నిండా వల్లమాలిన రాజకీయాలు, కులగుంపులు, కుట్రలూ, కుహకాలూను. ఇలాంటి వాతావరణంలో ఈ పద్ధతి సత్ఫలితాలిచ్చే అవకాశం పూజ్యం. మనం ఆశించేదొకటి, అక్కడ జరిగేది ఇంకొకటి అవుతుంది. విద్యార్థుల్ని అధ్యాపకుల మీద నిష్పక్షపాత నిర్ణేతలని నమ్మడమే ఇందులో ఉన్న అసలైన తొఱ్ఱ. విద్యార్థుల్లోను, అధ్యాపకుల్లోను లోతుగా పాతుకుపోయిన పార్టీల్ని, ముఠాతత్త్వాన్ని, కక్షసాధింపు ధోరణుల్ని పరిగణనలోకి తీసుకోకపోవడమే ఇందులో ఇమిడి ఉన్న అమాయకత్వం/నిర్లక్ష్యం. మళ్ళీ ఇందులో విద్యార్థినుల ద్వారా రాగల వైవిధ్యభరితమైన తలనొప్పులు మఱికొన్ని.
అధ్యాపకుల వ్యాసంగాన్ని (career), భవిష్యత్తునీ తీసుకెళ్ళి నేరుగా విద్యార్థుల చేతుల్లో పెట్టడం అసమంజసం, అమానుషం కూడా ! కారణాలేవైనప్పటికీ ఇప్పటికే మన సమాజంలో అధ్యాపక పదవి తన గౌరవాన్ని నూటికి నూరుశాతం కోల్పోయింది. తత్ఫలితంగా అధ్యాపక ఉద్యోగానికి గిరాకీ దారుణంగా పడిపోయింది. అందువల్ల ఆంధ్రాలో ఇప్పుడు చాలా కళాశాలల్లో స్నాతకోత్తరులు (Post-graduates) కాకుండా పట్టభద్రులే (Under-graduates) విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇది చట్టవిరుద్ధమైనప్పటికీ జరిగిపోతోంది. మనం ఇప్పుడు ఒక విద్యాపరమైన సంక్షోభం దిశగా పయనిస్తున్నాం. మూలిగే నక్కమీద తాడిపండు పడ్డట్టు ఇలాంటి రిఫరెండమ్ విధానాలు యోగ్యులైనవారిని ప్రభుత్వ అధ్యాపక ఉద్యోగం నుంచి ఇంకా ఇంకా దూరం చేస్తాయే తప్ప అటువైపు ఆకర్షించజాలవు. ఒకడికి ఒక బాస్ ఉంటే బావుంటుంది. కాని విద్యార్థులతో సహా అందరూ నెత్తిమీద మొగుళ్ళై కూర్చుంటే "క్షణక్షణముల్...." అన్నట్లున్న వాతావరణంలో ఎవరు మాత్రం పనిచెయ్యగలరు ?
ఆచరణలో ఇది తరగతి-బాహ్యులైన శక్తుల (extra-classroom forces) కు సువర్ణావకాశంగా మారుతుంది. ఒక మంచి అధ్యాపకుణ్ణి/ అధ్యాపకురాల్ని తమ కులమో, మతమో, ప్రాంతమో, పార్టీనో కాదనీ, లేదా తమకు తానతందానా కొట్టడం లేదన్న ఏకైకకారణంచేతను, అదీ గాకపోతే తాము తప్పు చేస్తుంటే చూసీ చూడనట్లు పోకుండా మందలించారని, లేదా అతని /ఆమె స్థానంలో తమ ఆశ్రితుల్ని దిగెయ్యాలని, లేదా తమ నీచప్రతిపాదనలు వేటికో అంగీకరించలేదనే కక్షతోనో యాజమాన్యమూ, విద్యార్థులూ కలిసి లోపాయికారీగా కుమ్మక్కై రిఫరెండమ్ లో సదరు వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా అన్యాయం చెయ్యొచ్చు.
అలాంటి వాతావరణంలో అధ్యాపకుడి నైతికస్థాయికి సైతం భరోసా లేదు. ఇప్పటిదాకా తరగతిగదిలో కూర్చున్నవాళ్ళే అతని ఆడియన్సు. ఈ పద్ధతి అమల్లో కొస్తే ఎవరెవరినో గమనంలో ఉంచుకుని పాఠాలు చెప్పాల్సొస్తుంది. అతని లక్ష్యశుద్ధి (orientation) దెబ్బతింటుంది. ఇప్పటిదాకా సబ్జెక్టుకు అంకితమైనవాళ్ళు కూడా ఏదో ఒక గుంపుతో చేతులు కలపాల్సొస్తుంది. రాజకీయనాయకుడికి మల్లే అతనిక్కూడా విద్యార్థుల్లో మిత్రులూ, శత్రువులూను ! వాళ్ళెవరో కనిపెట్టడం కోసం అతనికి గూఢచారులు కూడా అవసరమౌతారు. విద్యార్థుల పట్ల అతనికుండాల్సిన అపాక్షిక దృక్పథం నశిస్తుంది. విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తి (autonomy) ఉండాలని అంగీకరించినవాళ్ళు ఒక జ్ఞానప్రదాతగా ఆ విద్యాలయాలకే ఆత్మ అయిన అధ్యాపకుడికి సైతం తనక౧టూ కొంత స్వయంప్రతిపత్తి ఉంటేనే బాగా పనిచెయ్యగలడన్న సత్యాన్ని గుర్తించకపోవడం శోచనీయం. ఇలా అధ్యాపకులమీద ఎన్నికలూ, రిఫరెండాలూ నిర్వహించడానికి సిద్ధపడుతున్న ఘరానా ప్రజాస్వామ్యవాదులు, ప్రజల డబ్బుతో నెలకొల్పిన తమ గ్రంథాలయాల్ని మాత్రం ఆ ప్రజలకే అందుబాటులో లేకుండా చేశారని గమనించాలి.
విద్యార్థులకు అధ్యాపకుడి మీద తీర్పురాసేంత సీనుందా ? ఒక విద్వాంసుణ్ణి మఱొక విద్వాంసుడే గుర్తించగలడు. జీవితానుభవ శూన్యుడైన యువవిద్యార్థి ఎలా గుర్తిస్తాడు ? ఎక్కువమందికి ఇతరుల్లోని గొప్పతనాన్ని గుర్తించే శక్తిసామర్థ్యాలుండవు. విద్యార్థులు ఇందుకు మినహాయింపు కాదు. వాళ్ళు సాధారణంగా తమకు పాఠం అర్థం అయిందా ? లేదా ? అనే విషయం మీద ఆధారపడి అధ్యాపకుడి ప్రతిభని అంచనా వేస్తారు. కాని అదొక్కటే సరైన కొలమానం కాదు.
అసలు అధ్యాపకుల్ని విద్యార్థుల చేత మదింపు చేయించాల్సిన అగత్యం ఏమిటి ? ఒక అధ్యాపకుడు పండితుడవునో కాదో, యోగ్యుడవునో కాదో అతన్ని నియమించే ముందు యాజమాన్యానికి తెలియదా ? అతను పాఠాలు సరిగా చెబుతున్నాడో లేదో అవాంతర పరీక్షల (unit tests) ద్వారా తెలియదా ? వాళ్ళ విభాగాధిపతి (Head of the Department) ఏం చేస్తున్నాడు, ఈ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోకుండా ?
ప్రజాస్వామ్యం కొసవెఱ్ఱిగా మారి తలకు బాగా పట్టేసిన పరిణామమిది. మనమెంత ప్రజాస్వామ్యవాదుల మైనప్పటికీ దానికున్న సహజపరిమితుల్ని సైతం సక్రమంగా గుర్తెఱిగి నడుచుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రాథమికంగా ఒక ప్రభుత్వపరిపాలనాసూత్రం మాత్రమే. అదొక రాజకీయ సిద్ధాంతం మాత్రమే. దానికి అన్ని ఇతరరంగాల్నీ నడిపే తాహతు లేదు. ముఖ్యంగా కుటుంబమూ, విద్య, మతమూ మొదలైనవి ప్రజాస్వామ్యానికి అతీతమైనవి.




6 వ్యాఖ్యలు:
వ్యాసంలోని చివరి వాక్యాలు ఆలోచింపజేసేవి.
కేవలం విద్యార్థుల అభిప్రాయం మీదనే ఆధారపడి (..పనితీరుని ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగేట్లు మరే పధ్ధతి లేనట్టు.. )ఆచార్యుల పదోన్నతులు నిర్ణయించాలను కోవడం మంచిది కాదు.
మీరు చెప్పిన విషయాలు చాలామటుకు సమంజసమే. ప్రజాస్వామ్య సూత్రాల్ని అనుసరించడానికి ప్రజల్లో చాలా ‘పరిణతి’ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘నాగరికమైనవి’ గా పరిగణించబడుతున్న దేశాల్లో చాలా సందర్భాల్లో ఎంత అందంగా, సరళంగా ఇటువంటి విధానాల్ని అవలంబించి మంచి ఫలితాలు సాధిస్తారో చూస్తే, మన సమాజం ఎప్పటికైనా అటువంటి పరిణితి సాధించగలదా అనిపిస్తూ ఉంటుంది. మౌలికమైన నిజాయితీ లోపిస్తే ఎటువంటి కట్టుదిట్టమైన విధానంలోనైనా అడ్డగోలుగా ప్రవర్తించవచ్చు. అది ఒక్కటీ లేకుండా ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే’ చందంగా మనం ఇటువంటి విధానాల్ని దిగుమతి చేసుకుంటూపోతాం. సమీప భవిష్యత్తులో మనం ఇంకా దారుణమైన ‘కల్చర్ షాకులు’ చూస్తాము అనడంలో నాకు ఎంతమాత్రం సందేహం లేదు.
మీరన్నట్లు కేవలం విద్యార్థుల మదింపే కొలమానంగా తీసుకోకూడదు. కావాలంటే వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మురళిగారన్నట్లు అన్నింటా ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడానికి పరిణితి కావాలి.
ఎవర్నో చూసి ఇలా వెర్రి వాతలు పెట్టుకోవడం మనకొక ఫాషనై పోయింది. నన్నడిగితే విద్యార్థుల అభిప్రాయం కూడా అనవసరమే! విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలే అధ్యాపకుల పని తీరుకు నిదర్శనాలు. విద్యార్థులు చేతిలో అధ్యాపకుల జీవితాలు పడితే, విద్యార్థుల మెప్పు సంపాదించడానికి ఏమేమి చేయాలో ఆలోచించడానికే వీళ్ళ టైము సరిపోతుంది.
మీరీ వ్యాసానికి చేసిన మార్పులు చూస్తే రెండో భాగం రాసే ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తోంది. రెండో భాగం కోసం ఎదురు చూసిన నావంటి వారికోసం వీలైతే రాయండి. లేకపోయినా మరొక సందర్బంలో, మరొక వ్యాసంలో మీ ఆలోచనలు పంచుకుంటారని ఆశిస్తాను.
ఈ బ్లాగులోనే ఈ జూలై నెలలో ప్రచురితం కానున్న "మన మానవసంబంధాలు" అనే వ్యాసాల పరంపరలో దీనికి సంబంధించిన అదనపు సమాచారం ఇస్తాను. ఇప్పుడు రాయకపోవడానికి కారణం కూడా అప్పుడు పేర్కొంటాను.
Post a Comment