Tuesday, April 29, 2008

బ్లాగర్ డాట్ కామ్ బ్లాగుల్లోకి PDF కవిలెల పొందుపర్పు

బ్లాగరులు కాకముందే కవులూ, రచయితలైనవారికి ఎదురయ్యే బుఱ్ఱతొలుచు సమస్య - తమ పాతరచనల్ని తమ బ్లాగుల్లోకి ప్రచురించడం ఎలా ? అనేది. వాటన్నింటినీ మళ్ళీ అక్షరమక్షరమూ ఆసాంతం టైపుచేసి బ్లాగులోకి ఎక్కించడం చాలా కష్టం. అయితే ఇప్పటికే కంప్యూటరీకరింపబడి ఎలక్ట్రానిక్ గా భద్రపఱచబడ్డ ఫైళ్ళని మాత్రం మన బ్లాగులోకి యథాతథంగా ఎక్కించడానికి అవకాశముంది. ముందుగా గుర్తించాల్సిన విషయం - బ్లాగర్ డాట్ కామ్ కి చెందిన బ్లాగుల్లో స్వతహాగా పాఠ్యకవిలెల (text files) పొందుపర్పుకి వెసులుబాటు లేదు. అయినా సరే, అలా పొందుపఱచుకోవడానికి ఒక దివ్యమైన డొంకతిరుగుడు ఉపాయం లేకపోలేదు. ఇంకో విషయం - ఇక్కడ సూచిస్తున్న మార్గం కేవలం ఆతిథ్యం పొందే బ్లాగులకే కాక స్వతంత్ర సాలెగూళ్ళ(Websites)క్కూడా అక్కఱ కొస్తుంది. స్వతంత్ర గూళ్ళకు ఇలాంటి ఉపాయాల అవసరం ఏమిటంటారా ? మన సైటుకు కేటాయితమైన జ్ఞాపకజాగా (allotted memory space)ని పొదుపు చేసుకోవచ్చు.

ఏయే ఫైళ్ళని ఎక్కించగలం ? :- అది scribd వారు అనుమతించిన సంప్రకారాల్ని (file formats) బట్టి ఉంటుంది. సాధారణంగా MS-Word, Open Office, PDF, JPEG, GIF ఫైళ్ళన్నీ నిరాటంకంగా ఎగుమతవుతాయి

మనం చెయ్యాల్సింది ఇది :-

1.ముందుగా http://scribd.com/ సైటులోకెళ్ళి ఉచితంగా sign up అవ్వండి. మీ సంకేతపదాన్ని (password) మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.

2. అక్కడ వెబ్ పుట పైన upload అనే బొత్తాము (బటన్) ఉంటుంది. దాని మీద నొక్కండి. ఆ సైటులోనే upload పుట ఒకటి తెఱుచుకుంటుంది.

3. అందులో మళ్ళీ ఇంకో Click here to upload/browse బొత్తాము ఉంటుంది. దానిమీద నొక్కండి. అప్పుడు మీ కంప్యూటర్ లో ఉన్న My Documents చిట్టా తాలూకు మెన్యూ విండో ప్రత్యక్షమౌతుంది. అందులో మీక్కావాల్సిన PDF file ఎంచుకోండి. open అనండి. సదరు ఫైలు scribd.com లోకి ఎగుమతి కావడం మొదలవుతుంది.

4. ఎగుమతి పూర్తయ్యేదాకా వేచిచూడండి. పూర్తయ్యాక అదే వెబ్ పుటలో publish అనే column ప్రత్యక్షమౌతుంది. అక్కడ మీరు తప్పనిసరిగా నింపాల్సిన వివరాలు :

౧. మీ ఫైలు పేరు

౨. ఫైలు గుఱించిన వివరణ

౩. ఫైలుకివ్వాల్సిన Tag

౪. ఫైలు కేటగరీ ఎంపిక.

వీటిల్లో మొదటి రెండూ మీరు తెలుగులోనే చెయ్యడానికి అవకాశం ఉంది. మీరు కేటగరీ నింపకపోతే scribd.com వాడే తన యిష్టమొచ్చిన Default Category కేటాయిస్తాడు. అది ఖచ్చితంగా బావుండదు.

5. ఇవన్నీ నింపాక Publish అని నొక్కండి. మీ ఫైలు scribd.com లోకి ఎక్కినట్లే ! ఎక్కినట్లు తెలియజేస్తూ ఇంకో వెబ్ పుట తెఱుచుకుంటుంది కూడా.

6. scribd.com వెబ్ పుట పైభాగంలో కనిపించే మీ User-name మీద నొక్కితే మీ వ్యక్తిగత scribd ఖాతాల పుటలోకి వెళతారు. అక్కడ మీరు ఎగుమతి చేసిన ఫైలు కనిపిస్తుంది. దానిపేరుమీద నొక్కితే ఇంకో వెబ్ పుట తెఱుచుకుంటుంది.అక్కడ మీ ఫైలు i-Paper software వారి ప్రత్యేక విండోలో పైకీ కిందికీ బద్దలతో జరుపుకొని చూసుకోవడానికి వీలుగా దర్శనమిస్తుంది.

7. దానిపైనే సదరు ఫైలు తాలూకు Embed code బొత్తాము (Scribd.com వారు కేటాయించినది) కనిపిస్తుంది. దానిమీద నొక్కి ఆ code చూసి copy చేసి మీ బ్లాగు యొక్క Compose Box లో అతికించండి. Publish అనండి. ఇప్పడు మీ బ్లాగు యొక్క బహిరంగ పుటలో ఆ ఫైలు యావత్తూ Youtube మాదిరి ప్రత్యక్షం. మీ పాఠకులు దానికున్న బద్దతో పైకీ కిందికీ జరుపుకుని మొత్తం ఫైలుని చదువుకుంటారు. ఉదాహరణకు నా బ్లాగులో నేను పెట్టిన ఫైలుని ఈ కిందిలంకెలో చూడవచ్చు.

http://www.tadepally.com/2007/09/blog-post_11.html

ఇదంతా మొదట్లో అదో మాదిరిగా అనిపించవచ్చు. పోను పోను మీరే ఆస్వాదిస్తారు. కొన్నిసార్లు "మీరు embed చేసిన కోడ్ బాలేదు గట్రా" అంటూ మీ బ్లాగు మిమ్మల్ని సతాయించవచ్చు. అయినా నిరుత్సాహపడకుండా పాతకోడ్ చెఱిపేసి కొత్తకోడుతో ప్రయత్నిస్తూ విజయులం కావాలి. కొన్నిసార్లు scribd.com కేటాయించిన సంజ్ఞావళి (Code) ని మనం అనువుగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది, మనకు HTML గాని Java గాని తెలిస్తే !


ప్రత్యామ్నాయం : నేరుగా బ్లాగులోకి మీ ఫైళ్ళని ఎక్కించాలనుకుంటే మాత్రం http://blog.co.uk/ లో సంతకించండి (sign up అవ్వండి). అక్కడ ఒక బ్లాగు ప్రారంభించండి.

(తెలుగుబ్లాగు గుంపులో ఈ విషయమై శ్రీ జాన్ హైడ్ కనుమూరిగారడిగిన ప్రశ్నకు నేనిచ్చిన సమాధానాన్ని బ్లాగులో పెట్టమని నెటిజన్ గారిచ్చిన సూచనకు అనుగుణంగా .....ఆ సమాధానాన్నే మఱికొంత విస్తరించి ఇక్కడ వ్రాయడమైనది)

2 వ్యాఖ్యలు:

Chandra sekhar చెప్పారు...

నమస్కారం అండి. మీరు రాసిన పోస్ట్ చదివాను. నేను కుడ ఒక బ్లాగ్ ని ప్రారంభించాను. కొన్ని డాకుమెంట్స్ ని పబ్లిష్ చేద్దామని గూగుల్ లో వెతికితే స్క్రిబ్ద్.కం సైట్ దొరికింది. దానిలోకి వెళ్లి ఫైల్ ని అప్లోడ్ చేసి ఏమ్బెద్ కోడ్ ని నా బ్లాగ్ లో కాపీ చేశాను. కాకపోతే రెండు విండోస్ ఓపెన్ అవుతున్నాయి. మీ బ్లాగ్ లోలాగ సింగల్ విండో రావటం లేదు. చాలా సార్లు చేశాను. పోనీ మరోసారి ట్రై చేసి చూస్తాను. మీరు చాలా వివరంగా రాసినందుకు సంతోషం.

netizen చెప్పారు...

సోదాహరణగా వ్రాసిన మీ టపా బాగుంది. జ్యోతక్క గారి టపాలో జాన్ గారి "అమ్మ" (బ్లాగుల సంకలనం) మొన్న ఇలానే పలకరించింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.