14.4.08

టిబెట్ : ఒక జాతి-ఒక సంప్రదాయం-ఒక దేశం-ఒక రాజ్యం !



పవిత్రమైన శ్రీరామనవమినాడు పచ్చి అబద్ధాలాడలేను. ఎవరైనా ఆడుతూంటే విని భరించలేను. వాళ్ళకు తానతందానా పాడలేను. గవర్నమెంటాఫ్ ఇండియాకి కోపమొచ్చినా సరే ! చైనాకు తాపమొచ్చినా సరే !

ఎందుకంటే ఓ ప్రజాచైనా ! నువ్వు సత్యాన్ని చెఱబట్టలేవు. నువ్వు చరిత్రని ఉరితియ్యలేవు. నువ్వు ఎల్లకాలమూ ఒక జాతిని నోరుమూయించలేవు. నీ చెప్పుల కింద వేసి నలపనూ లేవు. అదే సాధ్యమైతే ఇండియాని ఇప్పటికీ గ్రేట్ బ్రిటనే పరిపాలిస్తూండేది. అదే వీలుపడితే చైనాని ఇప్పటికీ రాజే పరిపాలిస్తూండేవాడు. ఎప్పుడో అందరమూ చచ్చాక ఉదయించనున్న కమ్యూనిజపు ఉషస్సుని మీ గతితార్కిక భౌతికవాదం (Dialectical Materialism) చూడగలదు. అదేంటో ఖర్మ, చరిత్రలో కొన్ని కోట్లసార్లు నిరూపణైన సరళతర విషయాలు మాత్రం దాని దృష్టిపథాని కందవు. అయినా మీరింకా కమ్యూనిస్టులేననీ, లోపాయికారీగా హిట్లర్ వారసులు కారనీ మీరు చెబితే మేము నమ్మాలి.



ఒక ఆదర్శం నుంచి అడ్డం తిరిగిపోయిన వైనం-ప్రజాచైనా కంటే ఇండియాని చూస్తేనే ఎక్కువ అసహ్యమేస్తుంది. ఆ చెడ్డీ తడుపుకుంటున్న విధానం చూస్తే డోకొస్తోంది. ఇలాంటి, ఆదర్శాల్లేని ప్రజాస్వామ్యం కన్నా నీతిగల నిరంకుశత్వం మిన్న. టిబెట్ విషయంలో ప్రజాచైనాని ఇండియా ఇప్పుడు సమర్థించడానికి గల ఏకైక కారణం - కాశ్మీర్, అస్సామ్, నాగాలాండ్ విషయాల్లో ప్రజాచైనా మద్ధతు కావాలని. కాని అది ఇండియాకి మద్ధతిస్తోందా ? ఆయా రాష్ట్రాల్లో తీవ్రవాదుల దగ్గర బయటపడుతున్న, పట్టుబడుతున్న ఆయుధాలన్నీ ప్రజాచైనావాళ్ళు అందించినవే. ఇంకా ఏం చేస్తోంది ప్రజాచైనా ? మనం టిబెట్టు ప్రజాచైనాలో భాగం అంటున్నందుకు బదులుగా అరుణాచల్ ప్రదేశ్ మాదే నని వాదిస్తోంది. మన్నుంచి ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగాల సంగతి అతీగతీ లేదు. పిసరంత సిక్కిమ్ ని ఇండియాలో భాగం అని ప్రజాచైనా ఆమధ్య అంగీకరించినందుకు మనవాళ్ళు తెగబోల్డు సంబరపడిపోయారు. ఇకపై ప్రజాచైనా-ఇండియా సంబంధాలు బంగారు బాటే నన్నట్లు తెగ ఆనందగంతులేశారు.

తనకంటూ సుస్థిరమైన విదేశాంగ విధానమే లేని దౌర్భాగ్యదేశం మనది. మనం ఎందుకు ఎవరితో స్నేహం చేస్తామో మనకే తెలియదు. ఇదొక రీజినల్ పవర్ అట. అందరూ రీజినల్ పవర్లే శ్రీలంకా, మాల్దీవులతో సహా ! సిగ్గు లేకపోతే సరి !

ఇప్పుడు ప్రజాచైనా ఏమంటోంది ? ఈ ప్రశ్నే మఱోలా వేస్తే - ప్రజాచైనా అంటున్న ఏ మాటలకు ప్రజాఇండియా భళి భళీ అని వంతపాడుతోంది ?టిబెటన్లది వేర్పాటువాదం. ప్రజాచైనా తన జాతీయ సమైక్యం విషయంలో రాజీపడదు. దలైలామా ఇండియాలో కూర్చుని టిబెట్ లో హింసనీ వేర్పాటువాదాన్నీ ఎగసన దోస్తున్నాడు.




వీళ్ళు చైనీయ పోలీసులనుకుంటున్నారా ? కాదు, వీళ్ళు ఢిల్లీ రాష్ట్రపోలీసులు ! ఇండియాలో టిబెటన్ ఆందోళనకారుల్ని అణచివేస్తున్నారు.

ఔరా ! చివరికి జాతీయవాదాన్ని ఎలా భ్రష్టుపట్టించారు ! జాతీయవాదమంటే ఒక్కొక్క జాతీ స్వతంత్రంగా తనకంటూ ఒక రిపబ్లిక్ ఏర్పఱచుకోవడమనే అర్థం పోయి - ఒక బలిష్ఠమైన జాతి ఇతరజాతుల్ని ఆక్రమించుకుని వాళ్ళ వనర్లు దోచుకుని పైకి మాత్రం అందరమూ ఒకటే అంటూ దొంగవేషాలు వెయ్యడమనే నీచస్థాయికి దిగజార్చారే ! తమవాళ్ళని లక్షోపలక్షలుగా తీసుకొచ్చి స్థానిక జాతుల్ని అల్పసంఖ్యాకులుగా మార్చి "ఇక మీకీ భూమి మీద ఏ హక్కూ లే"దనే స్థాయికి ప్రజాస్వామ్యాన్ని కూడా దిగజార్చారే ! ఇదేమని అడిగితే కాల్చిచంపుతూ మళ్ళీ ఆ చచ్చినవాళ్ళ మీదే నిందలు మోపుతున్నారే ! ఇది కాకుండా టిబెట్ లో గత 50 ఏళ్ళల్లో మఱింకేమైనా జరిగిందా ? ఈ మాట అన్నవాడు పాపాత్ముడా ? ఇవి చైనా "జాతీయవాదాన్ని" చూసి ఓర్వలేక కిట్టనివాళ్ళు వేస్తున్న అభాండాలా ? నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా ఎవరూ ఏమీ చూడకుండా ఎందుకు కట్టడి చేస్తున్నావ్ ? నీళ్ళు నమలకుండా చెప్పవోయ్, నాకు సమాధానం కావాలి.



దలైలామా వేర్పాటువాది అట. చైనా టిబెట్ ని ఆక్రమించుకోక ముందు దలైలామా టిబెట్ కి రాజు అనే విషయాన్ని ఎందుకు ఉద్దేశపూర్వకంగా మఱుగుపఱుస్తున్నారు ? ఆయన్నొక టెఱ్ఱరిస్టుని చేసి ఎందుకు మాట్లాడుతున్నారు ? ఏ రాజైనా తన దేశానికి వ్యతిరేకంగా తానే టెఱ్ఱరిజం చేస్తాడా ? దీనికి తోడు పుండు మీద కారంలా ప్రణబ్ ముఖర్జీ పిచ్చికూతలొకటి. "దలైలామా మతనాయకుడు. అ ఇండియాలో ఆయన కార్యకలాపాలు మతధార్మిక విషయాలకే పరిమితం కావాలి." మనకు మతమూ రాజకీయమూ వేఱు కానీ తరతరాల టిబెట్ సంప్రదాయంలో మతనాయకుడే రాజు అనే సత్యాన్ని విస్మరించి టిబెట్టేదో ఇండియాలాంటి దేశమైనట్లు మాట్లాడ్డం. ఇదీ వీళ్ళకున్న లోకజ్ఞానం !

బలమైన దేశాలు పోయి చిన్న దేశాల్ని ఆక్రమించుకోవడం, వాళ్ళు మన కాశ్మీర్ గుఱించి ఎక్కడ మాట్లాడతారోనని మనం ప్రతి దురాక్రమణనీ సమర్థిస్తూ పోవడం - ఇటీవలి కాలంలో చాలా తఱచుగా జరుగుతోంది. మళ్ళీ చీకటి యుగాలు సిద్ధమయ్యాయి. ఆక్రమించుకునే దేశాలు, ఆక్రమించుకోబడే దేశాలూ - ఇదీ వరస ! ప్రజాస్వామ్యాలొచ్చి ఉద్ధరించిందేమీ లేదు.

ఇలాగే చేస్తూ పోతే మనం అసలు ఇలాంటి అన్ని సామ్రాజ్యాల గుఱించీ పునరాలోచన చెయ్యాల్సొస్తుంది.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్