Wednesday, April 09, 2008

ఎవరి చావు వారు చస్తే తప్పేంటి ?-7

ఆమె చనిపోయిన విషయం గుర్తొచ్చిన రామభద్రానికి తానిప్పుడు చూస్తున్నది భోజేశ్వరి ప్రేతాత్మనన్న విషయం స్పష్టంగా ఆకళింపైపోయింది. భయంతో కళ్ళు పెద్దవిచేసుకుని నోరు తెఱుచుకుని నిశ్చేష్టుడై ఆమెవంక చూస్తున్నాడు. "ఎందుకు భద్రం భయపడుతున్నావ్ ?" అని భోజేశ్వరి నవ్వుతూ గాలిలో కలిసిపోయి అంతర్ధానమైంది. అంతే ! పెరుగూ విరుగూ అన్నీ మర్చిపోయి రామభద్రం ఇంటికేసి పరుగో పరుగు. ఇంట్లోకి రాకముందే మెట్లదగ్గరే పడిపోయాడు. అసలు తాను ఇంటికెలా చేరుకున్నాడో తనకే తెలియదు. అందరూ ఆందోళనతో అతన్ని లేవదీసి లోపలికి మోసుకెళ్ళారు. ఎలా వచ్చిందో గాని అప్పటికప్పుడు 102 డిగ్రీల మాయదారి జ్వరం, రామభద్రం మూసిన కన్ను తెఱవకుండా మూడ్రోజులు పడుకున్నాడు.

ఒంట్లో కాస్త కులాసా చిక్కింతర్వాత తాను చూసినది ఉన్నదున్నట్లు చెబితే ఎవ్వరూ నమ్మలేదు. వాళ్ళ నాన్న అప్పారావు చాలా సంవత్సరాల్నుంచీ నైట్ డ్యూటీలకెళుతున్నాడు. ఆయనకెప్పుడూ ఏ దెయ్యాలూ ఎదురుకాలేదు. అందుకని ఆయన కలాంటి నమ్మకాలేమీ లేవు. "పిఱికి నా కొడకా ! దేన్నో చూసి ఏదో అనుకుని బాగా జడుసుకున్నావులే గాని, ఇంక నోర్ముయ్యెహె !"అని కసిరాడు. తండ్రికి తగ్గ కొడుగ్గా రామభద్రానికీ పెద్దగా నమ్మకాల్లేవు. కాని తాను భోజేశ్వరి ప్రేతాత్మని చూసింది నిజమనీ, అందులో అబద్ధమేమీ లేదనీ, తానేమీ భ్రమపడలేదనీ అతను పలుమార్లు నొక్కివక్కాణించేవాడు. ఆమె ఇతనికెందుకు కనిపించిందో తెలియదు. ఏదేమైనా భోజేశ్వరి మరణానంతరం అతనిక్కనిపించడం అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా !

జీవి శరీరంలో ఒక మెదడుందని మనమందరం అనుకుంటాం. వాస్తవానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మెదడుంది. ఆ మెదళ్ళన్నీ ఒక కేంద్ర మెదటికి లోబడి పనిచెయ్యడం వేఱే విషయం. తద్ద్వారా కేంద్రమెదటికి (పరమాత్మస్వరూపమైన) జీవాత్మ అధిష్ఠానమైనట్లే ఆయా చిఱుమెదళ్ళక్కూడా వేఱువేఱు అధిష్ఠానదేవతలున్నారు. ఉదాహరణకు చేతులకు ఇంద్రతేజస్సు అధిష్ఠానదేవత. కుడిచెవికి పవిత్రనదులు అధిష్ఠానదేవతలు. మర్మాంగానికి ప్రజాపతులు అధిష్ఠానదేవతలు. వృషణాలకు పితృదేవతలు అధిష్ఠానం. ఆయా అధిష్ఠానదేవతలు ఆయా అవయవాల్లో నిత్యనివాసం చేస్తారు. వాళ్ళు మనిషి పుట్టకముందే దైవాదేశం మేఱకు అతని/ఆమె అవయవాల్లో తిష్ఠవేస్తారు. వాళ్ళని భౌతికశరీరంలో కాక అందులో ఉన్న సూక్ష్మశరీరంలో మాత్రమే దర్శించగలుగుతాం. ఆ కారణం చేతనే "దేహో దేవాలయ: ప్రోక్తో జీవో దేవస్సనాతన:" (ఈ దేహమే పవిత్రమైన దేవాలయం. ఇందులో నివసించే జీవుడే నిత్యుడూ, సత్యుడూ అయిన సనాతన భగవంతుడు) అని మన పూర్వీకులు మొత్తుకున్నది. అలాగే చావు సమీపించినప్పుడు దైవాదేశం మేఱకు ఆయా దేవతలు (జీవశక్తులు) తమంతట తాముగా శరీరాన్ని విడిచి వెళతారు. కాని వారు మృతశరీరంలోని పంచభూతాల్లాగా చెల్లాచెదఱు అవ్వరు. వారు సూక్ష్మశరీరాన్ని లోకాంతరాలకూ జన్మాంతరాలకూ తరలిస్తారు. దాన్తో పాటే ఉంటారు. అవి గతజన్మలకు చెందిన పాత కర్మఫలాల యొక్కా, జ్ఞాపకాల యొక్కా దస్తావేజుల్ని జన్మనుంచి జన్మాంతరానికి మోసుకెళతారు.

నిజానికి జన్మలెత్తేది ఆత్మ కాదు, సూక్ష్మశరీరమే. మనుషులు మేల్కొన్న స్థితిలో "నేను, నాది" అని వ్యవహరించేది కూడా దాన్నే. జనం దాన్ని ఆత్మ అని వ్యవహరించడం కేవలం భ్రమప్రమాదజనితం. శుద్ధపొఱపాటు మాత్రమే. ఆత్మస్థితిలో "నేను, నాది" ఉండవు. ఆత్మకు జన్మలూ, చావులూ, సుఖదు:ఖాలూ, ధర్మాధర్మాలూ, పాపపుణ్యాలూ, శుభాశుభాలూ, దేశకాలాలూ ఏమీ లేవు. అది ఒక దేహానికీ, ఒక మతానికీ, ఒక లోకానికీ పరిమితం కాదు. జీవులూ-జడాలూ, కుర్చీలూ-బల్లలూ, రాయీ-రప్పా, చెట్టూ-పుట్టా అన్నింట్లోను ఉండే సర్వాతీత సర్వాంతర్యామి ఆత్మ. అది అస్తిత్వానికే అస్తిత్వం. దానికే దేవుడని నామాంతరం.

ఎందుకు చెబుతున్నానంటే - ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు తమ శరీరంలోని అధిష్ఠాన దేవతల్ని అకాలంగా బలవంతంగా వెళ్ళగొడతారు. దైవాదేశం లేకపోవడం చేత ఆ దేవతలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాని నశించిపోతున్న శరీరంలో ఉండడం సాధ్యపడదు. సదరు దేహం సహజంగా నిర్ణీత సమయానికి పతనమయ్యేటప్పుడు దాని పాత ఫైళ్ళని సజావుగా ప్రశాంతంగా ఇంకో జన్మకు బదిలీ చెయ్యడానికి వాళ్ళు నియమించబడ్డారు. ఆ ఫైళ్ళలో గతజన్మల పాపాలూ, పుణ్యాలూ, జ్ఞాపకాలూ, వాటికి నిర్ణయించబడ్డ ఫలితాలూ అన్నీ ఉంటాయి. దైవద్రోహియైన జీవుడితో కలిసి ఉండడానికి వాళ్ళకిష్టం లేకపోవడంతో ఆ ఫైళ్ళు పట్టుకుని వాళ్ళు తమ లోకాలకు తాము వెళ్ళిపోతారు. తిరిగి దైవాదేశం వచ్చేదాకా ఆ దైవద్రోహి శరీరంలో ప్రవేశించడానికి వాళ్ళు సాహసించరు. ఇంక మిగిలేది ఏమిటి ? అంటే ఏ అధిష్ఠానదేవతలూ లేనటువంటి పాడుపడ్డ దేవాలయంలాంటి దైవద్రోహపు సూక్ష్మశరీరం. దాన్ని సామాన్యులు దెయ్యం/పిశాచం అని వ్యవహరిస్తారు. అధిష్ఠాన దేవతలు గతం తాలూకు అన్ని ఆనవాళ్ళూ తమవెంట తీసుకెళ్ళిపోవడంతో జీవి తన సర్వస్వాన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డ పరమబికారి దివాలాకోరులా మారిపోతాడు/మారిపోతుంది. దేవుడికి దూరమైపోవడం మాట సరేసరి. అంతకుముందటి జన్మల్లో చేసిన అమూల్యమైన, మహోజ్జ్వలమైన పుణ్యఫలాలు చాలావఱకు రద్దయిపోతాయి. అదొక భయంకరమైన పరిస్థితి. చచ్చీచెడీ ఏడాదిపాటు చేసిన ప్రాజెక్టు మొత్తం నిశ్శేషంగా క్ర్యాష్ అయిపోయే సంభావ్యతని ఊహించుకోండి. కోట్లల్లో మీరు డిపాజిట్లు పెట్టిన బ్యాంకు ఆకస్మికంగా మూతపడిపోయాక దాన్ని తిరిగి ఎప్పుడు తెఱుస్తారో మీ డబ్బు మీకెప్పుడు చేతికందుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడితే మీ అవస్థ ఎలా ఉంటుందో యోచించండి !

బతికున్న రోజుల్లో సంపాదించుకున్నపుణ్యఫలం అపారంగా ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం పిశాచజన్మ తప్పదు. ఇందుకు కొన్నిసార్లు దైవక్రోధం కారణం కాగా, మఱికొన్నిసార్లు ఆయనకి ఏ కోపమూ లేకపోయినా పిశాచజన్మే ఇస్తాడు. అది తప్ప వేఱే గత్యంతరం లేని పరిస్థితిని ఆయనకు అత్మహంతకులు కల్పిస్తారు. కారణం ఏంటంటే - దేవుడికి సంబంధించినంతవఱకు ఈ ప్రపంచంలో నిజంగా వ్యర్థుడూ, పనికిమాలినవాడూ ఎవడూ లేడు. అందరూ ఆయనకు ఏదో ఒక రకంగా పనికొచ్చేవాళ్ళే. చిన్నదో-పెద్దదో, మంచో-చెడ్డో ప్రతివాడికీ ఆయన తన జగన్నాటకంలో ఒక పాత్ర ఇచ్చి దాన్ని సక్రమంగా పోషించమని భూలోకంలోకి పంపిస్తాడు. ఇక్కడ మన సన్నిధానంలో జరగాల్సిన సంఘటనలున్నాయి. మనమీద మనకు తెలియకుండా ఆధారపడే మనుషులున్నారు. మనం ఆత్మహత్య చేసుకుంటే మన స్థానాన్ని నిజంగా మనలానే భర్తీచెయ్యగలవాళ్ళెవ్వరూ లేరు. మనం కేవలం పాత్రధారులమే కనుక మనకిందులో లోతుపాతులు పెద్దగా అర్థంకావు. సమాజం దృష్టిలో ఒకడు పోతే మఱొకడు (No one is indispensable, they say.). కాని దేవుడి దృష్టిలో కాదు. ఒక అప్పారావుకు ఇంకో సుబ్బారావు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాడు. ప్రతివాడూ ఒక విశిష్టవ్యక్తి (unique personality). అందుచేత ప్రజాస్వామ్యాలూ, ప్రజాభిప్రాయాలూ, గణాంకాలూ (statistics) ఆయనకి గడ్డిపోచతో సమానం. ఆయన మనుషుల్ని గుంపులుగా కాక వ్యక్తులుగా చూస్తాడు. పైపైన కాక లోలోపలికి తొంగిచూస్తాడు. ఆ తీఱికా, ఓపికా, నేర్పూ ఆయన కొక్కడికే సొంతం.

కాబట్టి ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే - ఆ చర్య దేవుడి ప్రణాళికలో భాగం కాకపోవడంతో అతనికి/ఆమెకు వెంటనే మానవజన్మనివ్వడం ఆయనకు ఇబ్బందికరంగా మారుతుంది. ప్రపంచంలో 330 కోట్లమంది ఆడవాళ్ళు ఉన్నప్పటికీ, మానవజన్మెత్తాలని ఆత్రంగా కాచుక్కూర్చున్న ఆత్మల సంఖ్యతో పోలిస్తే అందుబాటులో ఉన్న మానవగర్భాల యొక్క వాస్తవసంఖ్య చాలా పరిమితమైనది. అవి వందేళ్ళకంటే ముందే రకరకాల వ్యక్తులకు కేటాయించబడి ఉంటాయి. వీటిల్లో ఎక్కడో ఒకచోట ఉన్నపళాన ఆత్మహంతకుల్నిఇఱికించడం ఆయనక్కూడా సాధ్యపడదు. అసలు ఆయన వాళ్ళగుఱించి అంత తీవ్రంగా ఆలోచించాలంటే తమ జీవితంలో ఆయనకు ఏదో ఒక సేవా, ప్రార్థనా చేసి ఉన్న చరిత్ర వాళ్ళకు ఉండాలి కదా ! ఆయనకు ఎంత దయ ఉన్నప్పటికీ అంతిమంగా గర్భాన్ని మొయ్యాల్సింది ఆడది కనుక ఆమె అందుకు సరిపోతుందో లేదో, ఆమెకి ఇలాంటిది ఇష్టమౌనో కాదో కూడా ఆయన చూస్తాడు. అరుదుగా అలాంటి ఆడది దొరికినప్పడు ఆమెకి ఒకే కాన్పులో ముగ్గురిని, నలుగురినీ, ఐదుగురినీ కూడా ప్రసాదించేస్తాడు. ఆయన ఒకణ్ణి పుట్టించాలంటే అంతకుముందే చాలా పూర్వరంగాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఆయన ఒక వైద్యుణ్ణి పుట్టించాలంటే కనీసం వెయ్యిమంది రోగుల్ని కూడా పుట్టించాలి. ఒక పోలీసుని పుట్టించాలంటే కనీసం ఒక వందమంది నేరస్థుల్ని కూడా పుట్టించాలి. ఇది కేవలం మనుషుల సంగతి. ఇతర జీవజాలం సంగతి ఇందుకు కొన్ని లక్షల రెట్లు సంక్లిష్టం. దీన్ని ఆయన మాత్రమే నిర్వహించగలడు. అలాంటి భగవంతుణ్ణే అయోమయంలోకి నెట్టేస్తాడు బుద్ధిహీనుడైన ఆత్మహంతకుడు. తత్ఫలితంగా ఆయన ఆత్మహంతకులకు పిశాచజన్మ ఇచ్చి వాళ్ళ ఆత్మహత్యాపాతకం పరిహారమయ్యేదాకా, పునర్జన్మకి పరిస్థితు లనుకూలించేదాకా వేచిచూస్తాడు. ఆ అనుకూల పరిస్థితులు ఏర్పడ్డానికి వందేళ్ళు పట్టొచ్చు, వెయ్యేళ్ళు పట్టొచ్చు, పదివేలేళ్ళు కూడా పట్టొచ్చు. ఇదొక loop-line గా, waiting list గా భావించవచ్చు. పుట్టగతులు (మళ్ళీ పుట్టడానికి మార్గాలు) లేకపోవడమంటే ఇదే.

అనాథలైన వీథిపిల్లల్ని పోగేసి వాళ్ళతో భిక్షమెత్తించే నేరస్థ ముఠాలున్నట్లే - ఇలా ఆత్మహత్యలకు పాల్పడి దైవబలాన్ని కోల్పోయి పిశాచరూపాన్ని పొందిన మానవాత్మల్ని వెతికిపట్టుకుని క్షుద్రమంత్రాలతో బంధించి వాటికేవో భౌతికానుభవాల్ని ఎఱగా వేసి తమ యొక్క నీచకార్యకలాపాలకు వాటిని వాడుకునే దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ మన సమాజంలో రహస్యంగా సంచరిస్తున్నారని మర్చిపోవద్దు. వాళ్ళని తక్కువ అంచనా వెయ్యొద్దు. కొన్నికొన్ని పిశాచాల్ని తమకప్పగించవలసిందిగా వాళ్ళు పిశాచాలకు రాజైన బేతాళుణ్ణి ఆవాహన చేసి ప్రార్థిస్తారు. అలా...అలా... ఒకసారి ఆత్మహత్యచేసుకున్న జీవి పరిస్థితి రోజురోజుకీ దారుణంగా దిగజారిపోతూ ఉంటుంది. కనుచూపు మేఱలో దాన్నుంచి విముక్తే కనిపించదు. అలా గత 400 సంవత్సరాల నుంచి పిశాచాలుగానే మిగిలిపోయినవాళ్ళున్నారు. ఆ ప్రస్తావన ఇక్కడ సందర్భ సహితం కాదు. ఐతే పిశాచత్వం గుఱించిన నా పరిశోధన వివరాల్ని ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్లాగులో ఇలాగే వరుస-టపాలుగా ప్రకటిస్తాను.

చచ్చే ధైర్యమున్నప్పుడు బతికే ధైర్యం కూడా ఉండాలి.(సమాప్తం)

3 వ్యాఖ్యలు:

ramya said...

ఆసక్తి కరంగా ఉందండీ చాలా వివరంగా రాశారు. ఇది చదిన వారెవ్వరూ ఆత్మహత్య అనే ఆలోచనే చేయరనిపిస్తుంది.
మీ తరువాతి టపాలకోసం ఎదురుచూస్తూ ఉంటాను.

Murali said...

మీరు ఈ వ్యాసంలో కొత్తగా చేర్చిన భాగాన్ని చూశాకా ఒక సందేహం కలిగింది. కుటుంబ నియంత్రణ అన్నది ఈ మధ్యనే వచ్చిన పరిణామం కదా. దాన్ని పాటించడం కూడా ఆత్మహత్యలాగే ఫ్రీ విల్ ని ఉపయోగించి దైవ సంకల్పాన్ని ధిక్కరిస్తూ మానవుడు తీసుకున్న స్వేచ్ఛ కాదంటారా?

అలాగే మామూలు హత్యల సంగతి ఏమిటి? అది కూడా ఒక మనిషి తన ఫ్రీ విల్ ని ఉపయోగించి మరొక జీవితాన్ని అంతం చెయ్యడమే కదా. అది రాసి పెట్టి ఉంది అనలేము కదా... అలాగే మరి యాక్సిడెంట్లు? ట్రాఫిక్ నియంత్రణ సరిగా చెయ్యకపోవడం, తాగి కారు నడపడం, వాటి వల్ల ప్రాణాలు పోవడం - ఇవన్నీ ముందే రాసిపెట్టి ఉండే అవకాశం లేదేమో. అవి కూడా ఫ్రీ విల్ పరిధిలోకే వస్తాయేమో??

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఇది free will కీ దైవసంకల్పానికీ మధ్య విచక్షణ చూపలేక మనిషి పడే అయోమయం (confusion). ఈ అయోమయానికి మూలకారణం - మనిషి ప్రతివిషయాన్నీ generalize చెయ్యడానికీ conclusions లాగడానికీ పడే తొందఱ. ఇలాంటి అయోమయం ఎలా వస్తుందనేది - నర్తకీ, ఆమె ప్రియుడూ ఒకే విధంగా చనిపోలేదని తెలియజేసిన సందర్భంలో నేను రాశాను. మీరు ౩ సంభావ్యతల్ని ప్రస్తావించారు.

౧. కుటుంబ నియంత్రణ :- దేవుడు మనకు రకరకాల ప్రతిభాపాటవాలు ఇచ్చాడు. వాటిల్లో సంతానశక్తి (Reproductive capability) ఒకటి. ఇది కూడా చెయ్యీ, కాలూ లాంటిదే. అవి మనకున్నప్పుడు వాటిని మనం వాడుకుంటామో లేదో అనేది మన ఇష్టానికే వదిలిపెట్టాడు. అందుచేత కుటుంబనియంత్రణ తప్పుకాదు. దానివల్ల పాపం రాదు. కుటుంబనియంత్రణ తప్పయితే బ్రహ్మచర్యం కూడా తప్పే అవుతుంది. అయితే సదరు FP నిర్ణయం free will కాదు. బుద్ధి: కర్మానుసారిణీ అని ఒక వ్యక్తికి కలిగే సంతానం ఒక ప్రత్యేక సంఖ్య దగ్గర ఆగిపోవాల్సి ఉన్నప్పుడు ఆ సంఖ్య దగ్గరికొచ్చేసరికల్లా అతనికి/ఆమెకి FP సంకల్పాలు కలుగుతాయి. FP అవకాశం లేని కాలంలో సంతానసంఖ్యని వాళ్ళబదులు విధే నిర్ణయించేది. ఇది జగజ్జాతకానికి సంబంధించిన విషయం. అదిక్కడ విస్తరించి రాయలేను.

౨. హత్యలు :- వీటిల్లో కొన్ని free will కాగా మఱికొన్ని విధినిర్ణయాలు. సమస్య మఱింత జటిలమైనట్లుంది కదూ ! అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది - అన్ని హత్యలూ ఒకటి కాదని ! కొన్ని actions కాగా మఱికొన్ని reactions (revenges). హత్యలకు బలౌతున్నవాళ్ళంతా అమాయకులు కారు. వాళ్ళల్లో కొందఱు పూర్వజన్మలో హత్యచేసి శిక్షతప్పించుకున్న కేటగరీ. కొందరు ప్రాచీనకాలంలో ఎవరో ఒక రాజు దగ్గర సైనికులుగా ఉండి శత్రురాజ్యాల్లోని నిరాయుధులైన అమాయక ప్రజల్ని హత్యచేసినవాళ్ళు. అందుకు వాళ్ళ రాజు వాళ్ళని ఆ రోజుల్లో భారీగా సన్మానించి కూడా ఉంటాడు. తాము చేసింది మంచిపనేనని వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. మఱికొందఱు హత్యచెయ్యకపోయినా అవతలివాడి చావుని మన;స్ఫూర్తిగా కోరుకున్నవాళ్ళు. లేదా ఒక హత్యజరిగినప్పుడు మనసా వాచా కర్మణా ఆనందించినవాళ్ళు. వాళ్ళు పాపం ! ఈ జన్మలో అమాయకుల్లాగానే కనపిస్తారు. మన గుండెలు ద్రవిస్తాయి కూడా ! కాని వాళ్ళ పాత ఫైళ్ళు దేవుడి దగ్గర ఉన్నాయి. నిజమేంటో అయనకు తెలుసు. ఇలాంటివాళ్ళు ఒకే నగరంలో గాని రాజ్యంలో గాని ఒకేసారి పోగుపడ్డప్పుడు అక్కడ భూకంపాల్లాంటి వైపరీత్యాలూ, యుద్దాల్లాంటి ఈతిబాధలూ సంప్రాప్తమౌతాయి.

ఇవి కానటువంటి కేటగరీ free will హత్యలు. ఇవి హతుల జాతకాల్లో సూచించబడవు. వీటికి శిక్షలుంటాయి.

౩. యాక్సిడెంట్లు :- వీటిల్లో ఒక్కటి కూడా free will తో జరిగేది కాదు.