Wednesday, April 09, 2008

ఎవరి చావు వారు చస్తే తప్పేంటి ?-6

లౌకికదృష్టితో చూస్తే ఇద్దరూ ఒక్కసారే ఒక్కలాగే చనిపోయినట్లు అనిపిస్తుంది. కాని ఆ రెండు చావులకూ మధ్య చాలా తేడా ఉంది. అతను బతికి బావుండాలనుకున్నాడు. ఆమెని పెళ్ళి చేసుకుని ఆనందంగా జీవించాలనుకున్నాడు. కాని అలా అర్ధాంతరంగా చనిపోవాల్సి వస్తుందనుకోలేదు. కాని ఇంకొన్ని గంటల్లో తమ వివాహం అయిపోతుందనగా అతను అనివార్యంగా చనిపోయాడు. అందువల్ల అతను పుట్టుకతోనే అల్పాయుష్కుడయ్యుంటాడని తోస్తుంది. ఆ రకంగా అతను ఇరుక్కున్న జలగండం విధినిర్ణయం. అందుచేత అతనిది అకాలమరణమే గాని అసహజ మరణం కాదు. అతనికి చనిపోయాక వేఱేచోట జన్మించే యోగం రాసిపెట్టి ఉంది. అతన్ని నర్తకి పెళ్ళిచేసుకోవడమూ అంత త్వరలో విధవరాలుగా మారడమూ దేవుడికి అభిమతం కాదు. అందుకనే ఇంకొన్ని గంటల్లో వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారనగా అతన్ని ముందుగానే తీసుకెళ్ళిపోవడం. కాని నర్తకి సంగతి అలా కాదు. అయితే ఆ సమయంలో ఆమె కూడా అతని మనీష (mood)లోనే ఉంది. మఱి జరిగినదాన్ని బట్టి చూస్తే మాత్రం ఆమెకి ఆ జన్మలో వివాహయోగం ఉన్నట్లు తోచదు. ప్రియతముల దుర్మరణాన్ని ఆసాంతం కళ్ళారా చూసినవాళ్ళు ఒక జీవితకాలానికి సరిపడా దిగ్భ్రాంతికి లోనౌతారు. వాళ్ళు మళ్ళీ పూర్తిగా పూర్వపు మనుషులయ్యేది కల్ల. ఆ రకంగా ఆమె అతని మరణానంతరం వెనక్కి వెళ్ళిపోయి ఇంక ప్రేమలూ పెళ్ళిళ్ళ లాంటి తగలాటాలేం పెట్టుకోకుండా అతని గతస్మృతుల నీడలో ఒంటరిగా జీవించే యోగం బహుశా రాసిపెట్టి ఉంది. కాని ఆ నొసటిరాతకి వ్యతిరేకంగా ఆమె భగవంతుడిపై తిరగబడింది. తన దయనీయమైన దురదృష్టానికి అక్కడికక్కడే నిలువునా అధోపాతాళానికి క్రుంగిపోయింది. ఆ భంగపాటులో ఆత్మహత్య చేసుకుంది.

ఏ బాధల నుంచి తప్పించుకోవాలని మనుషులు ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ పుట్టి సరిగ్గా అవే బాధల్ని అంతే స్థాయిలో అనుభవించాల్సి వస్తుంది. ఆవార మిగిలిన ఆయుర్దాయం మళ్ళీ అదే బాధానుభవం కోసం మళ్ళించబడుతుంది. అందువల్ల ఆత్మహత్యతో ఆశించిన ప్రయోజనం నెఱవేఱదు. ఉదాహరణకి - ఎయిడ్స్ సోకిందని ఆత్మహత్య చేసుకున్నవారు మళ్ళీ పుట్టి, లేదా అసలింకా పుట్టకముందే తల్లిగర్భంలో ఉండగానే ఆ రోగం సంక్రమించవచ్చు. అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న నర్తకి ఈ జన్మలో కూడా జీవితాంతం అవివాహితగా ఉండిపోవాల్సివచ్చింది.

ఆత్మహత్య పర్యవసానాలు : (ఈ ఉదంతంలో పేర్కోబడుతున్న వ్యక్తులు ఇంకా జీవించే ఉన్నారు కనుక వారి గోప్యత నిమిత్తం వారి పేర్లని స్వల్పంగా మార్చడమైనది)

(క్రీ.శ.1980-90) ఎమ్.రామభద్రం వాళ్ళ నాన్న అప్పారావు ఆ రోజుల్లో గుంటూరు పోలీసు శాఖలో కానిస్టేబుల్. వాళ్ళు గుంటూరులో సంపన్నులు నివసించే నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ క్వార్టర్సులో ఉండేవారు. నగరంపాలెం కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తులు గల ప్రాంతం. గుంటూరు జిల్లాకి సంబంధించిన పరిపాలనాయంత్రాంగం యావత్తూ అక్కడే కేంద్రీకృతమై ఉంది. ఆ క్వార్టర్సులోనే భోజేశ్వరి అనే ఒక తెలివైన చలాకీ పిల్ల ఉండేది. ఆమే, హుస్సేన్ అనే ఒక తెలుగు ముస్లిమ్ యువకుడూ ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారం చాలా నెలలపాటు నడిచింది. తరువాత అతనికి వేఱేచోట ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. అయినా మధ్యలో అప్పుడప్పుడు గుంటూరు వచ్చి ఆ పిల్లని కలిసి వెళ్ళేవాడు. ఈలోగా అతని తల్లిదండ్రులు అతనికొక ముస్లిమ్ సంబంధం చూశారు. వాళ్ళింట్లో, వాళ్ళూ వాళ్ళూ ఏం మాట్లాడుకున్నారో మఱి, మొత్తం మీద భోజేశ్వరిని మర్చిపోయి తన కులం అమ్మాయిని చేసుకోవడానికి హుస్సేన్ అంగీకరించాడు. పెళ్ళి ఏర్పాట్లన్నీ శరవేగంతో జరిగిపోయాయి. శుభలేఖలు కూడా అచ్చేశారు. మర్నాడు పెళ్ళి అనగా హుస్సేన్ బావుండదనుకున్నాడో ఏమో భోజేశ్వరికి ఫోన్‌చేసి తన పెళ్ళి విషయం చెప్పేశాడు. తన పెళ్ళికి తప్పకుండా రావాలని కూడా ఆహ్వానించాడు. "అందరికీ వ్యక్తిగతంగా శుభలేఖలిచ్చి ఇంతకాలంపాటు స్నేహంచేసినదాన్ని నాకు మాత్రం ఇంత ముఖ్యమైన విషయం ఫోన్‌లోనా చెప్పేది ?" అని నిష్ఠూరమాడింది భోజేశ్వరి. "సరే ! స్వయంగా వచ్చి శుభలేఖ ఇస్తాలే."అన్నాడు హుస్సేన్. అన్నప్రకారంగానే మఱో గంటలో భోజేశ్వరివాళ్ళ ఇంటిముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. శుభలేఖ తీసుకుని అభినందనలు చెప్పింది. "చివరిసారిగా నేనిచ్చే కాఫీ తాగవా ?" అని అడిగింది. సరేనన్నాడు హుస్సేన్, భోజేశ్వరి వాలకం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంటూ. అక్కడున్న వార్తాపత్రిక తీసి తిరగెయ్యసాగాడు. వంటగదిలోకి వెళ్ళిన భోజేశ్వరి బయటికొచ్చింది, అగ్నిదేవతలా ఒంటినిండా కిరోసినాయిల్ వాసనతో నిలువెల్లా నాలుకలు సాచిన జ్వాలలతో భగభగ దహించుకుపోతూ చడీచప్పుడూ లేకుండా అతని దగ్గరికొచ్చి మీదపడి అతన్ని గట్టిగా పట్టుకుని వాటేసుకుంది. వార్తాపత్రిక చదువుకుంటున్న హుస్సేన్ ఒక జీవితకాలపు దిగ్భ్రాంతిని పొందాడు. ఆ వచ్చినదీ, దహించుకుపోతున్నదీ, తనని పట్టుకున్నదీ ఎవరో అతనికి చప్పున అర్థంకాలేదు. "భోజేశ్వరీ ! భోజేశ్వరీ !"అని సహాయం కోసం పిలుస్తూ పెనుగులాడుతున్నాడు. కాలిపోతున్న భోజేశ్వరి "నేనే...నేనే...భోజాన్ని" అంటూ కాలిపోతోంది. ఆ గొంతు విన్నాక అసలు విషయం అర్థమైంది హుస్సేన్‌కి. ఆమెనుంచి ఎలానో తప్పించుకుని ఆమె గడియపెట్టి ఉంచిన తలుపుని తెఱుచుకుని బయటికి పరిగెత్తాడు. అతని ఒళ్ళు కూడా కొంత కాలింది. అతన్ని పొరుగువాళ్ళు వెంటనే ఆస్పత్రికి తరలించారు. భోజేశ్వరి అక్కడికక్కడే సజీవంగా కాలి బొగ్గైపోయింది. హుస్సేన్ పెళ్ళి వాయిదాపడింది కాని నెలరోజుల చికిత్స అనంతరం అతను శారీరికంగా మళ్ళీ మామూలు మనిషయ్యాడు.

రామభద్రం వాళ్ళ నాన్న ఆరోజుల్లో రాత్రిపూట విధినిర్వహణలో పడి ఇంటికి ఆలస్యంగా వచ్చి భోజనం చేసేవాడు. ఆయనకొక విచిత్రమైన అలవాటు ఉండేది. అదేమిటంటే రాత్రిపూట పెరుగన్నం తినడం. భోజేశ్వరి చనిపోయిన 15 రోజులకి ఆయన యథాప్రకారం రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చేసరికి ఇంట్లో పెరుగు లేదు. నగరంపాలెం కలక్టరాఫీసు దగ్గర ఒక హోటల్లో రోజూ 24 గంటలూ పాలూ పెరుగు అమ్ముతారు. భారతీయ నగరాల్లో ఇలాంటి 24-గంటల సేవలు చాలా మామూలు విషయం. నిద్రపోతున్న వేళలో తనని తండ్రి ఇలా లేపి ఏదో ఒక పనికి పంపడం రామభద్రానికి కొత్త కాదు. అందుచేత ఒక స్టీలు టిఫిన్ డబ్బా పట్టుకుని పెరుగు తేవడం కోసం గుంటూరు జిల్లా కలెక్టరాఫీసు దగ్గరికి బయలుదేరాడు. నగరంపాలెం ఒక విలాసవంతమైన ప్రాంతం (posh area) కావడం చేత ఆ రోడ్లన్నీ అర్ధరాత్రివేళ కూడా పట్టపగల్లా ధగద్ధగాయమానంగా మెఱిసిపోయేలా అధికారులు శ్రద్ధవహిస్తారు. రామభద్రం ఈలవేసుకుంటూ పాటపాడుకుంటూ ఆ నిర్జన రహదారికున్న సువిశాలమైన పేవ్‌మెంట్ (సైడ్‌వాక్) మీద నడుస్తున్నాడు. ఆ సైడ్‌వాక్ పక్కన గాలికి చిఱుసవ్వడితో ఊగుతున్న అవెన్యూ ప్లాంటేషన్ వెనుకనుంచి "భద్రం !" అనే నెమ్మదైన ఆడగొంతు పిలిచిన పిలుపు వినపడింది. ఈ సమయంలో ఈ రోడ్డుమీద ఆడవాళ్ళెవరా ? అనుకుంటూ రామభద్రం పక్కకి తిరిగి చూశాడు. ఆ చెట్టు వెనక విద్యుద్దీపాల నీడల్లో ఎఱ్ఱటి చింతనిప్పుల్లాంటి కళ్ళతో అదే చిఱునవ్వుతో-

ఆమె...ఆమె...భోజేశ్వరి ! సరిగ్గా 15 రోజుల క్రితం కాలిపోయి చచ్చి బూడిదైన భోజేశ్వరి !!


మఱికొంత వచ్చే టపాలో...

4 వ్యాఖ్యలు:

సూర్యుడు said...

కథలు బాగున్నాయి, క్రైం రిపోర్ట్ లాంటి టి.వి సీరియల్స్ కి పంపించొచ్చు కదా

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

వీటి ప్రయోజనం వేఱు.

Aganthaka said...

guruvu garu, mi kathalu leda nijamga garijina vishayalu chadavadani bhayamga unnayi,

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మన సంగతి ఇలా ఉంటే స్వయంగా చూసినవాళ్ళ మాటేమిటి ? భయపడితే ఏ పరిశోధనా చెయ్యలేం.