ఆత్మహత్య పర్యవసానాలు :ఆమె కొన్నివందల సంవత్సరాల క్రితం ఉత్తరభారతదేశంలో ముస్లిమ్ గా జన్మించింది. ఆ రోజుల్లో మంచి సౌందర్యవతి. ఒక సుల్తాను కొలువులో తాను రాజనర్తకిగా పనిచేసేది. ఆమెకొక హిందూయువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ వారి వివాహం అటూ ఇటూ ఎవరికీ ఇష్టంలేదు. చాలా గొడవలు కూడా అయ్యాయి. అందుచేత అందరినీ వదిలిపెట్టి ఆ రాజ్యానికి దూరంగా ఎటైనా పారిపోయి పెళ్ళిచేసుకోవాలని, భార్యాభర్తలుగా జీవించాలని వారిద్దరూ నిశ్చయించుకున్నారు. అలా వారు బయలుదేరి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ పోయి ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఆమె ప్రియుడికి స్నానం చెయ్యాలనిపించింది. ఆమెని ఒడ్డునే ఉండమని చెప్పి అతను నదిలోకి దిగాడు. దిగి నాలుగడుగులు లోపలికి వేస్తూనే "అమ్మో ! మునిగిపోతున్నాను. నేను మునిగిపోతున్నాను"అని కేకలు వేశాడు. అతనికి ఈత రాదు. నర్తకి దిగ్భ్రాంతిచెంది చూస్తూండగానే ఆమెకి భర్త కావాల్సినవాడు ఆ విధంగా మునిగిపోయాడు, క్షణాలమీద చనిపోయాడు. నర్తకి కూడా వెనువెంటనే ఆ నదిలోకే దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ ప్రేమకథ అలా అనూహ్యంగా అర్ధాంతరంగా పరిసమాప్తమైంది.
ఆమె మళ్ళీ 1941-42 ప్రాంతంలో ఆంధ్రదేశంలో హిందూస్త్రీగా జన్మించింది. ఆమె పూర్వజన్మప్రియుడేమయ్యాడో తెలియదు. ఆమెక్కూడా ప్రస్తుతం తన పూర్వజన్మ గుర్తులేదు. కాని తన పూర్వజన్మని శోధించడానికి ఆమె జ్యోతిష్కుల్ని అనుమతించింది. ఈ జన్మలో తాను తెలుగుదైనప్పటికీ, తనకి ఉర్దూ ఒక్కముక్క కూడా రాకపోయినా ఆ భాషంటే మటుకు చాలా ఇష్టం. ముస్లిమ్ లను గుఱించిన సినిమాలూ, వారికి సంబంధించిన పాతబడ్డ కోటలూ రాజప్రాసాదాలూ చూడ్డమంటే కూడా చాలా ఇష్టం. ఆ జన్మలో లాగే ఈ జన్మలో కూడా తనకి వివాహం కాలేదు. కారణం ఆమెకీ తెలియదు. ఈ జన్మలో కూడా ఆమె కాస్తో కూస్తో అందగత్తే. అలా అని ఎవరినీ ప్రేమించలేదు. ఆమెని కూడా ఎవరూ ప్రేమించలేదు, పెళ్ళిచేసుకుంటానని ముందుకు రానూలేదు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటీ కుదరలేదు. కాని ఆమె బాగా చదువుకుంది. నాట్యమైతే రాదు కానీ అనేక కష్టనష్టాలనుభవించింది.
ఆమె ఈ మధ్యలో ఇంకెక్కడా జన్మలెత్తలేదని భావించబడుతోంది. ఎందుకంటే ఒకానొక భారతీయ జ్యోతిశ్శాస్త్ర పద్ధతి ననుసరించి కనుగొనబడ్డ ఆమె యొక్క తక్షణ పూర్వజన్మల్ని గుఱించిన ప్రశ్నలో పై ఉదంతం మాత్రమే తెలియవచ్చింది. ఈ నడిమి కొన్నివందల సంవత్సరాల వ్యవధానాన్ని ఆమె ఎక్కడ గడిపిందో అంతకాలమూ ఎలా ఉందో తెలియరావడంలేదు. పూర్వజన్మలో ఆమె తన ప్రియుడి మరణానంతరం ఆత్మహత్యకు పాల్పడ్డంలోని ఉద్దేశం (motive) కూడా సరిగా అర్థంకావడంలేదు. ఇంత కష్టపడి ఈ ప్రాచీన సంఘటనకు చేసిన జ్యౌతిషిక పునర్ నిర్మాణం (astrological reconstruction) లో సైతం ఈ విధంగా కొన్ని పూరింపబడని ఖాళీలు మిగిలిపోయాయి. అతను లేని తన జీవితం వ్యర్థమని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకుందా ? లేక చావైనా బతుకైనా ఇద్దరమూ కలిసే అనుకుని చనిపోయిందా ? లేక దు:ఖోద్వేగంలో నిరాశోపహతస్థితిలో తొందఱపడి నిర్ణయం తీసుకుందా ? జంటగా వెళ్ళినది కాస్తా ఒంటరిగా వెనక్కి రావాల్సిరావడం అవమానకరంగా భావించిందా ? లోకాపవాదేదైనా మీదపడుతుందని భయపడిందా ? తన ప్రియుడు తన కళ్ళముందే మునిగి చనిపోతూంటే చేతగాక చేష్టలుదక్కి చూడాల్సివచ్చి అతనికి ఆ క్లిష్టపరిస్థితిలో ఏ సహాయమూ చెయ్యలేకపోయిన తన అసమర్థతని అసహ్యించుకుని ఒకవిధమైన ఆత్మనిందాభావంతో చనిపోవ నిశ్చయించుకుందా ? ఏది ఏమైనా ఆమె పాల్పడ్డది ఆత్మహత్యకు, ఒక నిషిద్ధపాపానికి ! అయితే సతీసహగమనం శాస్త్రసమ్మతమైనప్పుడు ఆమె చేసింది మాత్రం శాస్త్రవిరుద్ధమెలా అవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. అది ఆత్మహత్య కానప్పుడు ఇది మాత్రం ఆత్మహత్య ఎలా అవుతుంది ? అంటే సతీసహగమనం కూడా ఆత్మహత్యే. అది పుణ్యం కాదు, పాపమే. సతీసహగమనం యొక్క మూలాల్ని శోధించినప్పుడు బయటపడే విషయమిది. ఆ ప్రస్తావన ఇక్కడ ప్రసక్తం (relevant) కాదు కనుక ఇంతకంటే ఎక్కువ రాయలేను.
ఆత్మహత్య చేసుకున్నవారు చనిపోయాక పిశాచాలవుతారు. కనుక ఆమె చనిపోయాక పిశాచమై కొన్నివందల సంవత్సరాలు అలాగే ఉండిపోవడం చేత ఈ మధ్యలో జన్మలెత్తలేకపోయి ఉండొచ్చు. పిశాచజన్మ సాంకేతికంగా లోకాంతరం కావడానా, మానవలోకంతో సంబంధం లేనిదిగా భావించడం మూలానా అది పూర్వజన్మప్రశ్నలలో కనిపించడం అరుదు. అందువల్లనే ఆమెయొక్క తక్షణ పూర్వజన్మ గుఱించిన ప్రశ్నలో ఆనాటి రాజనర్తకి జన్మ ఒక్కటే తెలియవస్తూండి ఉండొచ్చు. ఈ జన్మలోని కష్టాలక్కూడా ఆనాటి ఆత్మహత్యాపాపం కొంతవఱకు కారణం కావచ్చు. "జన్మజన్మలకూ నువ్వే నా భర్తవి" అంటూ ప్రేమమైకంలో చేసిన భావోద్వేగపూరితమైన, హృదయపూర్వకమైన ప్రతిజ్ఞల వల్ల ఈ జన్మలో కూడా భర్త లభించకపోయి ఉండొచ్చు.
మఱికొంత వచ్చే టపాలో....
Thursday, April 03, 2008
ఎవరి చావు వారు చస్తే తప్పేంటి ?-5
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
నామాంకం (లేబెల్) : అవశ్యమ్ అనుభోక్తవ్యమ్
Subscribe to:
Post Comments (Atom)




2 వ్యాఖ్యలు:
inta detailed gaa avida janmala gruinchi chepparu intaku avida evaro telusukovalani chala kutuhalam ga undi.mee pata tapalalo cheppainattu devudu manishiki iacchinavi nirlakshyam chesi ento sandhinchinattu bhavistunnaru.ilanti nighudamainavi enno maina rahasyalu enno bharata desam lo unnayi.naaku kooda ilantivi chala interesintg ga untayi jyotishyam gurinchi telusukovalante ekkada modalu pettalo talupagalaru.
౧. అసలు ఈ కేసులో మనకు లభిస్తున్న వివరాలు తక్కువే.
౨. పేర్లూ ఊర్లూ వద్దులెండి. ఆ మనిషి గోప్యత (privacy)కి కూడా మనం గౌరవం ఇవ్వాలి కదా !
౩. భారతదేశంలోని అనేక ప్రాచీనసంప్రదాయవిద్యలు పోషణ లేక నశించిపోతున్నాయి.
౪. సాధారణ జ్యోతిష్యం మీద పుస్తకాలు చాలా చోట్ల దొరుకుతాయి. వాటిని చదవడంతో ప్రారంభించవచ్చు. ఈ కాలంలో గురువులు దొరకరు. కారణం - వాళ్ళ విద్య మనకు నేర్పిస్తే వాళ్ళకంటే గొప్పవాళ్ళమైపోతామేమోనని వాళ్ళ భయం.
౫. ఆసక్తి మంచి విషయమే. కానీ అంతకంటే, మానవజీవిత దు:ఖాల్నీ సమస్యల్నీ పరిష్కరించాలనే ఆత్రుత ఇంకా మంచిది.
Post a Comment