13.3.08
పి.వి.నరసింహారావు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్
8:20 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: నా అనుకోలు (assumption)
ఈరోజు మన తెలుగుజాతి చరిత్రలో ఒక శుభోదయం. మనకంటూ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం మొదలుకాబోతున్న శుభతరుణం. ఈ అదృష్టం మద్రాసుకు కొన్ని దశాబ్దాల క్రితమే కలిగింది. అప్పట్లో మద్రాసు తెలుగువారి రాజధాని అవుతుందని దానితోపాటే దాని విమానాశ్రయం కూడా మనదే అవుతుందనీ ఆశించినప్పటికీ నెహ్రూ రాజాజీ కలిసి మన జాతికి వ్యతిరేకంగా చేసిన కుట్రల మూలంగా మద్రాసును కోల్పోయాం. ఇంకా ఎన్నో జిల్లాల్నిసైతం కోల్పోయాం. మనవాళ్ళు చేసిన మహాపాపం ఏమిటంటే ఆకాలపు దేశభక్తి మత్తులో వాళ్ళ పెద్దఱికం మీదా వాళ్ళ నిష్పాక్షికత మీదా గుడ్డినమ్మకం పెట్టుకోవడమే. అదంతా గతచరిత్ర అనుకుని వదిలేసి మన విమానాశ్రయం మనమే కట్టుకున్నా కూడా ఇంకా దాని విషయంలో బయటివాళ్ళ కుట్రలకు బలైపోతూ ఉండడమే నాకు మింగుడుపడని మిస్టరీగా మారింది.
మన విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అట. ఇదే నాకు మింగుడుపడని అసహ్యం. ఈ రాష్ట్రంలో దేనికీ తెలుగువాళ్ళ పేర్లే లేవు. కారణం-మన బానిసత్వం తప్ప తదన్యం గోచరించడం లేదు. శ్రీహరికోటలో ఉన్నఅంతరిక్షకేంద్రానికి సతీష్ ధావన్ పేరు పెట్టారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉన్న పరిశోధనాలయాలకు మెహతా ల్యాబ్స్ అని పేరుపెట్టారు. కె.జి.బేసిన్ లో ఉన్న ఒక గ్యాసు వెలికితీత కేంద్రానికి దీన్ దయాల్ హై అని పేరు పెట్టారు. ఏమిటిదంతా ? మన తెలుగువాళ్ళ పేర్లు మాత్రం ఏ రాష్ట్రంలోను ఎవరూ పెట్టుకుంటున్నట్లు కనిపించదు. పాపం ఎవరివాళ్ళు వాళ్ళకు గొప్ప. ఎవరికీ ఏమీ కానివాళ్ళం ఎందుకూ పనికిరానివాళ్ళం మనమే.
అందుచేత నేను మన బానిస ప్రభుత్వం పెట్టిన ఈ రాజీవ్ గాంధి అనే పేరుని నిర్‌ద్వంద్వంగా బహిష్కరిస్తున్నాను. రాజీవ్ గాంధి మనకు ఏమీ కాడు. రాజీవ్ గాంధి కన్నా గొప్ప స్థాయి గల నాయకుడు మన పి.వి.నరసింహారావు. అందుకే మన బానిస ప్రభుత్వం ఎలా ఏడ్చినా సరే, ఎలా చచ్చినా సరే, మన అంతర్జాతీయ ఆగమనాల కేంద్రాన్ని (International arrivals terminal) ని మనం ప్రజలం, మన తెలుగువాదులం అందరం పి.వి.నరసింహారావు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని పిలుచుకుందాం. స్వదేశ ఆగమనాల కేంద్రాన్ని ఎన్.టి.ఆర్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ అని పిలుచుకుందాం.
రండి అందరం చేతులు కలుపుదాం. తెలుగువారి మానసిక భావదాస్యాన్ని వదిలిద్దాం.
