Saturday, March 08, 2008

ఎవరి చావు వారు చస్తే తప్పేంటి-3

ఆత్మహత్యకు దారితీసే దుర్యోగాల్లో పిశాచగ్రస్తయోగం ఒకటిగా చెప్పబడింది.అంటే జన్మలగ్నంలో రాహుచంద్రులు కలిసి ఉండడం.ఇలాంటి కేసులు రెండు తగిలాయి.సదరు వ్యక్తులకు పిశాచం ఆవహించడం మూలంగా మతిస్థిమితం తప్పింది గాని ఆత్మహత్య చేసుకోవడమైతే జరగలేదు. కాని అలాంటివాళ్ళు ఎప్పటికీ చేసుకోరని కూడా ఖచ్చితంగా చెప్పలేం.ఈ దుర్యోగం గుఱించి విపులంగా రాయడానికి ఇది తగుచోటు కాదు.వేఱే వ్యాసపరంపరలో రాస్తాను.

బహుకాల పరిశోధనల తరువాత హత్యలూ ఆత్మహత్యలూ దొంగతనాలూ దాడులూ ద్రోహాలూ లేదా అలాంటి విషాదాలు (tragedies) సాధారణంగా 4 మఱియు 8 అనే అంకెలకు సంబంధించినవని గుర్తించబడింది.అంటే ఇవి ఐకాంతిక (stand-alone) సంఖ్యలుగా ఉన్నప్పుడు లేదా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 4 గానీ 8 గానీ అయినప్పుడు మాత్రమే ప్రమాదకరంగా పరిణమిస్తాయి.అంతేతప్ప ఒక పెద్దసంఖ్యలో భాగంగా నాలుగో ఎనిమిదో ఉన్నంతమాత్రంచేత కొంపలేమీ మునగవు.వీటిల్లో మొదటిది (4) రాహువుకు సంబంధించిన అంకె.రెండోది (8) శనికి సంబంధించినది.వీటి ఆకారమే ఉరిపోసుకున్నట్లు ఉండడం గమనార్హం. శనివద్ రాహు: (రాహువు, శని వలెనె) అని శాస్త్రాలు పేర్కొనడం చేత రాహువు దాదాపుగా శనిలాగానే ప్రవర్తిస్తూ ఆయన ఇచ్చే ఫలితాల్నే తాను కూడా ఇస్తాడు.

అన్ని అంకెల్నీ కూడగా 4 లేదా 8 వచ్చే సంఖ్యలు కూడా ప్రమాదకరమైన సంకేతాలే.అంటే 13, 17, 22, 26, 31 లాంటి తేదీలూ, ఆ నెంబర్లు గల ఇళ్ళూ గదులూ వీథులూ వాంఛనీయం కాదు.అలాగే 35, 40, 44, 53, 62, 71, 103, 107, 202, 206, 301, 305, 400, 404, 503, 602, 701 మొదలైన నెంబర్లు కూడా ! ఇవి మనిషి కంటికి కనిపించని ప్రతీప శక్తుల్ని (negative forces) ని అమితంగా ఆకర్షిస్తాయి.దురదృష్టాల్ని ఆహ్వానిస్తాయి.ముఖ్యంగా-నాలుగో నెంబరు వ్యక్తులూ ఎనిమిదో నెంబరు వ్యక్తులూ వాటిల్లోకి ప్రవేశించినప్పుడూ ఆ తేదీలు కూడా నాలుగో నెంబరు, ఎనిమిదో నెంబరు అయినప్పుడు ఒక సర్క్యూట్ పూర్తవుతుంది.ఇంక భయంకర విస్ఫోటంతో నేరం జరగడమే తరువాయి.(నాలుగో నెంబరు వ్యక్తి అంటే ఆ తేదీన పుట్టినవాడు)ఈ నెంబర్లు గల ఇళ్ళకు ఏళ్ళతరబడి పాతకాపులైనవాళ్ళని ఎవరినడిగినా తమ యింట్లో ఒక పెనువిషాదం జరిగిందని చెబుతారు.కాని అక్కడ ఉండడం మానేస్తే ఆ నష్టం జరగదు.ఈ నెంబర్లు గల వాహనాలు కూడా మంచివి కావు.కానీ కర్మచాలక అలాంటి సంఖ్యలు అజ్ఞానులచేత ఆధికారికంగా కేటాయించబడ్డ సందర్భాల్లో ఆ కేటాయిత సంఖ్య పక్కన "అ" అనే తెలుగు అక్షరాన్ని గాని A అనే ఆంగ్ల అక్షరాన్ని గానీ అనాధికారికంగా జతచేర్చుకుని వ్యవహరించడం మూలంగా 90 శాతం కీడు జరక్కుండా తప్పించుకోవచ్చు.

అలాగే వీథిమూతల (Dead-ends or blind alleys) పక్కనే ఉన్న ఇళ్ళలో నివసించే కుటుంబాల్లో కూడా ఏదో ఒకరోజు ఒక అసాధారణమైన విషాదం చోటుచేసుకోవచ్చు.అది సాధారణంగా వంశనాశనం చేసే రీతిలో ఉంటుంది.అంటే ఆ కుటుంబంలో కనీసం ఒక మగపిల్లవాడు అల్పాయుష్కుడుగా నిస్సంతుగా తొందఱగా చనిపోవచ్చు.ఆడపిల్లలకు ప్రమాదం లేదు.కాని అటువంటి సందర్భంలో వారి తండ్రికి ప్రమాదం ఉంటుంది.అది ఆత్మహత్య ద్వారా కూడా కావచ్చు.ఈ రహస్యం చాలామందికి తెలియదు. అందుచేత హైదరాబాదు నగరం ఇలాంటి వీథిమూతలతో నిండిపోయింది.కాలనీల మధ్య వివాదాలు, వీథిని పొడిగించడానికి నగరపాలకసంస్థ ఒప్పుకోకపోవడం, వేఱే ఏదో ప్రైవేట్-పబ్లిక్ ఆస్తి వీథి చివర అడ్డురావడం, భద్రతాభయాలూ, ఏదీ లేకపోతే ఆ వెంచర్‌ని రూపొందించిన రూపశిల్పి (architect) సరదాగా తన డిజైన్‌ని ఇలాంటి వీథిమూతలతో నింపడం వగైరా సవాలక్ష కారణాల వల్ల ఇలా జరుగుతోంది.చిత్రమేంటంటే వీథిమూతలు చాలా తప్పనే విషయం ఘరానా వాస్తువేత్తలకు కూడా తెలియకపోవడం.

ఇంకా చిత్రమేంటంటే అమెరికాలో ఇలాంటి వీథిమూత ప్లాట్ల కోసం పిచ్చిజనాల వేలంవెఱ్ఱి ! కాస్త అధికం వెచ్చించి మఱీ వాటిని సొంతం చేసుకోవడానికి ఎగబడతారు.అది ప్రైవసీ అట. నిజమే, ప్రైవసీ ! వంశానికే శాశ్వతంగా ప్రైవసీ !

4 వ్యాఖ్యలు:

prasadm said...

నాకు ఇలాంటి విషయాలపై నమ్మకం లేదు. కానీ జరిగిన విషయం కూడా నమ్మశక్యంగా లేదు. నాకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన ఒక వ్యక్తి (పుట్టిన రోజు 22 అనగా 4 సంభంధిత వ్యక్తి) ఎలాంటి కష్టాలు లేకున్నప్పటికీ, ఆత్మహత్యకు అనేకసార్లు ప్రయత్నిచడం నాకు తెలుసు. నా నమ్మకాలతో నిమిత్తం లేకుండా జరిగిన నిజం మాత్రం ఇప్పుడు గుర్తొచ్చి చెబుతున్నాను. కృషితో నాస్తి ధుర్భిక్షం అని నమ్మిన నాకు మన ప్రతి కదలిక ముందే నిర్ణయించబడి వుంటుందని అనుకోవడానికి మనసు అంగీకరించడం లేదు.

ప్రసాదం

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఎవరి నమ్మకాలతోను నమ్మకపోవడాలతోను గ్రహాలకు అవసరం లేదు. వాటి పని అవి చేసుకుంటూ వెళతాయి. మొండికేసి తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే.

"కృషితో నాస్తి దుర్భిక్షమ్" నిజమే అయితే, కృషిచేసే ప్రతివాడూ బాగుపడితే అందరూ బిలియనీర్లే అయ్యేవారు. కానీ కొందరే మిలియనీర్లు. మిగతావాళ్ళంతా వాళ్ళ కింద పనివాళ్ళు. ఎందుకంటారు ? కర్మఫలం. దాన్ని ప్రతిబింబించే జ్యోతిశ్శాస్త్రం అబద్ధం కాదు.

రాకేశ్వర రావు said...

ఒక సందేహం. మీరు అన్న పుట్టిన రోజు, మన పంచాంగం ప్రకారమా లేక పోతే పాశ్యాత్యుల కాలెండర్ ప్రకారమా.. మన శాస్త్రాలు ఎప్పటినుండో వున్నాయి కాబట్టి అవి మన పంచాంగం ప్రకారమే అనుకుంటున్నాను...

ఇంకో ఆలోచన, ఇంటి నెంబర్లు, వీధి నెంబర్లు వగైరా వాడడం మానేస్తే హత్యలూ అవీ తగ్గవచ్చనుకుంట. అంతా చేసి అవి మనం తగిలించుకున్న సంఖ్యలేగా..

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

పంచాంగం ప్రకారం కాదు. మన పంచాంగం చాంద్రమాన ప్రకారం ఉంటుంది. ఇంగ్లీషు నెలలు సౌరమానం ప్రకారం ఉంటాయి. కాబట్టి అవి కూడా ప్రామాణికమే.

....మనం కల్పించుకున్నవేగా ?

సంఖ్యల్ని మనం కల్పించలేదు. మనం అవి ఉన్నాయని తెలుసుకుని వాటిని అర్థం చేసుకున్నామంతే ! అవీ వాటి లక్షణాలూ సృష్టిలోనే ఉన్నాయి. మన యింటికి కేటాయించిన నెంబర్లు కూడా మనం వేసినవి కావు. They were assigned to us by some private company or govt. agency. ఒకవేళ మనకు మనంగా వేసుకున్నా కూడా ఆ సంఖ్యలకు సృష్టిలో నిర్ణయించబడ్డ లక్షణాల్నే అవి ప్రదర్శిస్తాయి. మీకు మీరు ఎంచుకున్న స్నేహితుడైనా తన లక్షణాల్నే ప్రదర్శిస్తాడు గాని మీ లక్షణాల్ని ప్రదర్శించడు కదా ! అలాగే !