వాస్తవ ప్రపంచం(the material world)లో తప్పు చేసేవాడొకడు, దాని మూలంగా బాధపడేవాడొకడు, దాని గురించి ఫిర్యాదిచ్చేవాడొకడు, బంధించి తీసుకెళ్ళేవాడొకడు, కాపలాకాసేవాడొకడు, బోనులో నిలబెట్టేవాడొకడు, ప్రశ్నలడిగేవాడొకడు, సాక్ష్యం చెప్పేవాడొకడు, తీర్పిచ్చేవాడొకడు, దాన్ని అమలుజరిపేవాడొకడు-అని ఇంతమంది ఉంటారు.
అంతిమసత్య ప్రపంచం(the world of ultimate truth)లో మాత్రం ఇంతమంది ఉండరు.అక్కడ నీకు నువ్వే ముద్దాయివి.నీకు నువ్వే బాధితుడివి.నీకు నువ్వే ఫిర్యాదీవి.నీకు నువ్వే రక్షకభటుడివి.నీకు నువ్వే చెఱసాల అధికారివి.నీకు నువ్వే పబ్లిక్ ప్రాసిక్యూటరువి.నీకు నీకు నువ్వే డిఫెన్స్ లాయరువి.నీకు నువ్వే సాక్షివి.నీకు నువ్వే న్యాయమూర్తివి.అక్కడ నువ్వు తప్ప నీకింకెవ్వరూ కనిపించరు.అదొక ఒంటరి లోకం.
అందుచేత అది ప్రపంచంలోకెల్లా అత్యంత క్రూరమైన న్యాయస్థానం.నూటికి 99.99శాతం మంది మనుషులు(మనస్సులు) దాన్ని face చెయ్యలేరు.జరిగిన సంఘటనల తాలూకు గుప్తమైన స్మృతులు చిత్రాలు(దృశ్యాలు)గా మనస్సుయొక్క లోలోపలి పొఱల్లో నుంచి సర్వసమగ్రంగా వెలికి తియ్యబడతాయి.ఆ గుప్తమైన చిత్రాలు(సంఘటనలు)గుర్తుకు రావడానికి చిత్రగుప్తుడని పేరు.
దేవుడు లేడనవచ్చు.శాస్త్రాలు అబద్ధమనవచ్చు.మతాలు కుట్ర అనవచ్చు.కాని తానున్నాడు.తాను అబద్ధం కాదు.తాను కుట్ర కాదు.తాను నిజం.అందుకే చేశాడు పరమాత్ముడా ఏర్పాటు.ఆ ఒంటరి నిర్జన న్యాయస్థానం.అక్కడ న్యాయసూత్రాలంటూ ఏమీ ఉండవు.నీకు నువ్వేర్పఱచుకున్న చట్టం ప్రకారమే నువ్వు విచారించబడతావు.నువ్వు గతంలో ఇతరులకు చెప్పిన నీతుల్ని బట్టి నువ్వు కూడా విచారించబడతావు.నువ్వు బతికుండగా ఎంత పండితుడివైతే అంత నిర్దాక్షిణ్యంగా ఉంటుంది నీమీద జరగబోయే విచారణ.నిన్ను నువ్వే దర్యాప్తు చేస్తావు.కర్కశంగా దర్యాప్తు చేస్తావు.
నువ్వంటే నువ్వు కావు.నీలో ఉన్న నీ అంతరాత్మ చేస్తుంది.ఈ మాట తఱచుగా చాలామంది వాడగా వింటూ ఉంటాం.అదేంటో తెలిసినా తెలియకపోయినా"ఏదో కర్ణాకర్ణీగా చూచాయగా విన్నాం గదా"అని ఎడాపెడా అలవోకగా వాడేసేవాళ్ళు ఎక్కువ.వేఱువేఱు కలనయంత్రాల్ని కలిపే అంతర్జాలంలా వేఱువేఱు మనుషుల్ని కలిపేది అంతరాత్మ.అందుకే దానికి ఆ పక్షపాత రహిత ధోరణి.ఆ ని:స్వార్థం.అది ప్రపంచానికి నిజమైన ప్రభుత్వం.అది తప్పొప్పుల విచారణలో బహుక్రూరమైనది.మానవ మనస్సులా అది తన్ను తాను మోసం చేసుకోదు.మానవ మనస్సు మొద్దబ్బాయిలాంటిది.తప్పించుకోవడానికి అడ్డదార్లువెతికే ఖైదీలాంటిదది.దేవుడికే లంచమిద్దామని ఆలోచిస్తుందది.లంచమిచ్చి శిక్ష మాఫీ చేయించుకుందామని పథకాలు వేస్తుందది.కాని ఆ న్యాయమూర్తి(అంతరాత్మ)లంచం తీసుకోడు.తనకు లంచంగా ఇవ్వజూపినవాటిని భద్రంగా దాచిపెట్టి శిక్షాకాలం పూర్తయ్యాక ఖైదీకే వడ్డీతో సహా అప్పగిస్తాడు.వీటికి వేఱువేఱు ఖాతాలు నిర్వహించబడతాయి.ఒక ఖాతా ప్రాతిపదిక మీద ఇంకో ఖాతా రద్దయ్యే ప్రసక్తి లేదు.ఆ అంతరాత్మ ఎవరో కాదు, స్వయంగా నువ్వే.అక్షరాలా నువ్వే.ముమ్మూర్తులా నువ్వే.కాని లక్షలాదిమంది ఈ సత్యాన్ని తాము బతికుండగా గ్రహించజాలరు.
ఇదొక పార్శ్వం.
ఒకవేళ బతికుండగానే గ్రహించగలిగితే ? అది అసంభవం కాదు.కాని నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు అలాంటివాళ్ళు.వాళ్ళకు అంతరాత్మ గ్రాంథిక భావన (బుకిష్ కాన్సెప్ట్) కాదు.కాలూ చెయ్యీ ఉండడం ఎంత నిజమో అంతే వాస్తవంగా వాళ్ళు దాన్ని అనుభవిస్తారు.
సాధారణంగా మోక్షం పొందడానికి ఇంకా కొద్దిజన్మలు మాత్రమే మిగిలి ఉన్నాయనగా అంతరాత్మదర్శనం కలుగుతుంది.అంతరాత్మ దర్శనమిచ్చినప్పుడు మనిషి దిగ్‌భ్రాంతి చెందుతాడు.ఎందుకంటే ఆ మహా మహనీయ తేజోమయమూర్తి అచ్చం తనలాగానే ఉండడం, తనకంటే అందంగా ఉండడం, తనలో లేని తేజస్సూ, పరమప్రశాంతి, ప్రేమా, దయా, వాత్సల్యమూ ఆ మూర్తిలో ఉండడం.ఆ సమయంలో తాను ఏ దుస్తులు ధరించి ఉన్నాడో అదే విధమైన దుస్తులు అంతరాత్మ కూడా ధరించి ఉండడం.ఆ భగవత్ స్వరూపం తానే అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ తాను అంత గొప్పవాణ్ణి కాను గదా ! అనే శంక వల్ల దిగ్‌భ్రాంతి చెందుతాడు.
ఆ దర్శనం ముగిసి అంతరాత్మ తిరిగి తనలో లీనమయ్యాక మానవుడు దు:ఖిస్తాడు."లక్షల కోట్లాది సంవత్సరాల వయసు గల ఆ సనాతన ధర్మమూర్తి నువ్వేనా స్వామీ ? నువ్వు అసలు లేనేలేవనుకున్నాను ఇంతకాలమూ ! కృష్ణుడు రాముడు అల్లా జీసస్ అంతా బోగస్ అనుకున్నాను స్వామీ ! నిన్నిక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాను ! నాలోనే ఉండి నాతో పాటే నా కష్టాలూ సుఖాలూ రోగాలూ రొష్టులూ యాక్సిడెంట్లూ నువ్వు కూడా అనుభవిస్తున్నావని తెలుసుకోలేకపోయాను స్వామీ ! నాకు నువ్వుంటే చాలు, ఎన్ని నరకాలైనా ఆనందంగా అనుభవిస్తానయ్యా !"అనేస్తాడు.పాపాలకు పడే శిక్షల నుంచి తప్పించుకుందామనే ఆలోచన శాశ్వతంగా అంతరించిపోతుంది.తండ్రిమాట మీద బడికి వెళ్ళడానికి సిద్ధమయ్యే బుజ్జికొడుకులాగా తప్పులకు శిక్ష అనుభవించడానికి మానవుడు ఆనందంగా సిద్ధపడతాడు.ఈ దర్శనంతో-క్రూరమైన, ఒంటరి, నిర్మానుష్య న్యాయస్థానం అనుకున్నది హఠాత్తుగా నాన్నగారి ఆఫీసుగదిలా మారిపోతుంది. ఇది ఇంకో పార్శ్వం.
అలా ఒక్క దర్శనంతో అన్నీ పటాపంచలు.అది కలిగాక వెయ్యి నాస్తిక గ్రంథాలు చదివినా ఏ మార్పూ ఉండదు.లక్షమంది నాస్తికుల మధ్య ఉన్నా ప్రభావం ఉండదు.అందరిలోను తానే కనిపిస్తాడు.లోకమంతా హఠాత్తుగా దేవాలయంలా మారిపోతుంది.ఆ స్థితిలో మనిషి మెయిన్ రోడ్డు మీద పడి అందరికీ సాష్టాంగ నమస్కారాలు చేసినా ఆశ్చర్యపో నవసరం లేదు.అంతా అంతరాత్మే, స్కూటర్లూ, కార్లూ బస్సులతో సహా, మనుషులంతా నావాళ్ళే, అంతా నేనే అనిపిస్తుంది.ఆ స్థితిలో అతడు తనని తానే పూజించుకునే సంభావ్యత కూడా ఉంది.



15 వ్యాఖ్యలు:
అద్భుతం. చాలా బాగా వ్రాశారు. చాలామందికి ఇది అర్ధం కావడం కష్టం. నేను చాలా కాలం క్రితం ఇదే ఆలోచనతో ఒక కథలాంటిది రాశాను. అయితే ఆ కథలో గహనమైన జ్యోతిష, ఆధ్యాత్మిక భావనలు ఉండడంచేత బ్లాగులో పెట్టాలో అక్కర్లేదో తేల్చుకోలేకపోయాను. ఏమైనా మీ రచన చూశాకా దాన్ని అందరితో పంచుకోవాలని అనిపిస్తూంది.
ఈ టపా చదివాక ఏదో తెలియని ఆనందం కలిగింది. కృతజ్ఞతలు.
నేను ఒక సారి ఒక ప్రభుత్వా ఆఫీసుకు వెళ్లా, అక్కడ ఒకాయన లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారు, నేను అమెరికా వెళ్లి వచ్చానన్న సంగతి ఆయనకి తెలుసు, ఆ భ్రష్టుచర్యను నేను ఒక రకమైన బాధతో కూడిన చూపుతో చూస్తూవుంటే, ఆయనకి అర్థమయినట్టు "what can we do? this is India!" అని నాతో అన్నాడు.
అప్పుడు నాకు అనిపించింది. ఇతను నాకు సర్దిచెబుతున్నాడా, లేక తన అంతరాత్మని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా అని...
అలా మోసం చేసుకుంటూ ఎన్నాళ్లు బ్రతకగలడు? ఎంత సుఖంగా బ్రతకగడు? అని...
అంతరాత్మ వున్నా లేక పోయినా, ఉందని నమ్మి ఆదర్శాలను అంటి పెట్టికుని బ్రతకడం ఓ సంతృప్తి. ఓ మనఃశాంతి.
ప్రతి ఒక్కరికి అవసరం అత్మావలొకనం ఈ రోజుల్లో అని చక్కగా తెలియజెప్పరు.
చాలా సహేతుకంగా వుంది.భౌతికత నుండి చాలా చక్కగ లింకు చేశారు ఆధ్యాత్మికత వైపుకు.
ఈ టపాకి ప్రేరణ ఏమిటండి?
"అవశ్యమ్ అనుభోక్తవ్యమ్" (అనుభవించి తీఱాలి) అనే శీర్షికతో నేను రాసిన ఒక పుస్తకంలోని కొన్ని చెదుఱుమదుఱు గద్యలు (paragraphs) ఇవి.
అద్భుతంగా ఉంది మాస్టారూ.
ఈ అవశ్యం అనుభోక్తవ్యం అన్న సూత్రాన్ని విశదీకరిస్తూ మరి కొన్ని ఇటువంటి లఘుటీకలు మీరు ప్రచురిస్తుంటే బావుంటుంది.
కొత్తపాళీగారి సూచనకు నెనర్లు. తప్పకుండా ప్రయత్నిస్తాను.
కర్మఫలం అనేది జనసామాన్యానికి ఒక unsavoury topic. కొన్ని విషయాలు చెబితే జనం భయపడతారు.
అవశ్యం అనుభోక్తవ్యమ్ అనే పుస్తకంలో నేను ఆధ్యాత్మిక శాస్త్రాల నుంచి సేకరిచిన విషయాలే కాకుండా నా స్వానుభవాల్ని కూడా పొందుపఱిచాను. కాని వాటిల్లో ఏది శాస్త్రవచనం, ఏది తాడేపల్లి యొక్క స్వానుభవం అనేది ఎవరికివారు ఊహించుకోవలసినదే. ఆ పుస్తకం ఇంకా అముద్రితమే.
అద్భుతం.
బాలు గారు,
ఇక్కడ మీరు చెప్పదచుకొన్నది మన అంతరాత్మే పరమాత్మా అనా? ప్రతి అంతరాత్మా పరమాత్మ అనా?
మీరు చెప్పదలుచుకొన్నది మొత్తం అర్థం కాలేదు కానీ, అర్థం ఐనంతవరకు ఇది అడగాలి అనిపించింది.
అంతరాత్మ దేవతా సమానం కావచ్చు కానీ దైవం కాలేదు కదా.
ప్రతి మానవ అంతరాత్మా సంపూర్ణ స్థాయిలో పరమాత్మే. ఇందులో సైజు ప్రసక్తి లేదు. పరమాత్మకున్న అన్ని అధికారాలూ శక్తులూ దానికి అంతే స్థాయిలో ఉన్నాయి. మనస్సుకూ తనకూ మధ్య మలినాల మయమైన అడ్డుతెఱ తొలగినప్పుడు మానవ అంతరాత్మ దేవతల్నే కాక సమస్త సృష్టిశక్తుల్ని సైతం కనుచూపుతో శాసించగలదు.
ఇక్కడ అతడు/మానవుడు అని మనం పేర్కొంటున్నది-ప్రస్తుత శరీరమే తానని భావిస్తున్నఅజ్ఞాన పూరిత మానవ మనస్సుని.
అంతరాత్మ మనిషిలో మనిషి (మనిషిలో నివసించే దేవుడు). ఈ ప్రస్తావన వచ్చినప్పుడు దీని గుఱించి విపులంగా రాస్తాను.
మీరు ఈ మధ్యనే వ్రాసిన ఒక టపా లో మనిషిని లో భగవంతుణ్ని చూడొద్దు, మనిషిని మనిషి గానే చూద్దామన్నారు. ఇప్పుడేమో భవంతుడు అందరిలోనూ ఉన్నాడంటున్నారు. నేను అర్ధం చేసుకోవడం లో లోపమా లేక ...
నమస్కారలతో,
సూర్యుడు :-)
సూర్యుడూ గారు, మీరు విషయాన్ని అవుటాఫ్ కాంటెక్స్టు లో చూస్తే ఇలాగా పరస్పర అభావంగా కనిపిస్తుంది. అదలా గుండగా .. తనలోనూ ఇతరుల్లోనూ ఒకే పరమాత్మని దర్శించడానికి చాలా పరిణతి కావాలి .. నిజానికి ఆ స్థితిని చేరుకుంటే అదే నిర్వాణం, సిద్ధి. ఈ లోగా కొంత లౌకికంగా ఉండక తప్పదు.
ఇక్కడ కూడా మనిషిని భగవంతుడుగా చూడమని రాయలేదు. అంతరాత్మదర్శనం కలగనివాళ్ళకు అలా చెప్పినా అది వాళ్ళకు సాధ్యపడదు కనుక. అంతరాత్మదర్శనం కలిగినవాడి స్థాయి వేఱు. కలగనివాడి స్థాయి వేఱు. కలిగినవాడి మన:స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించడం జరిగిందంతే.
అలా అంటారా. నాకు ఈ విషయం లో చాలా ప్రశ్నలున్నాయి. వీలైతే ఎప్పుడైనా టపా లో వ్రాస్తా.
నమస్కారాలతో,
సూర్యుడు :-)
బాగా రాశారు.
మీరన్న ఆ పుస్తకం కూడా అందరికీ అందుబాటులో ఉంచితే బాగుంటుంది.
Post a Comment