Tuesday, February 26, 2008

అంబేడ్కర్ కూడా మనిషే

"దురదృష్టవశాత్తూ అంబేడ్కర్ రాజ్యాంగం ఇలా రాశాడు కాబట్టి గానీ..."అంటూ రాజమండ్రి లోక్‌సభా సభ్యుడు శ్రీ ఉండవల్లి అరుణ్‌కుమార్(కాంగ్రెస్)ఏదో అన్నాడని కొందరు రచ్చచేస్తున్నారు."ఆ ఎంపీని చంపాలి"అనడం తప్ప ఇంక అన్నిరకాల శిక్షలూ సూచిస్తున్నారు.ఇప్పటికే అతని దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.గోలగోలగా రకరకాల నిలదీతలు(demands) .

అతని మీద అభియోగం (case) మోపాలి.

అతన్ని అనర్హుడుగా ప్రకటించాలి.

అతను అంబేడ్కర్ (విగ్రహం) పాదాల మీద పడి క్షమాపణ వేడుకోవాలి.

అతన్ని వెలివెయ్యాలి...గట్రా...గట్రా !!

ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కరూ నచ్చాలనే నియమమేమీ లేదు.ఆ నచ్చేవాళ్ళల్లో కూడా అన్నీ నచ్చాలనే నియమం కూడా ఏమీ లేదు.నాకు మహాత్మాగాంధీ అంటే ఇష్టం.కాని ఆ మహాత్ముడిలో కూడా అన్నీ ఇష్టం లేదు.

అంబేడ్కర్‌ని కొంతమంది దేవుడితో సమానంగా చూస్తూ ఉండొచ్చు.అది వాళ్ళ ఇష్టం.అందుకు విరుద్ధంగా మఱికొంతమంది దృష్టిలో అంబేడ్కర్ దెయ్యంతో సమానం కావచ్చు.అది కూడా వాళ్ళ ఇష్టం.ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ సొంత ఇష్టానిష్టాల్ని ఏర్పఱచుకునే హక్కుంది.ఆ యిష్టానిష్టాల్ని బయటికి వ్యక్తం చేసే హక్కు కూడా ఉంది.ఇలాంటి హక్కులు అంబేడ్కరుకీ ఆయన యొక్క వీరాభిమానులకీ మాత్రమే కాదు, అందరికీ ఉన్నాయి.ఇవి ప్రపంచమంతటా మానవజాతి గుర్తించిన మానవహక్కులు.

ఈ హక్కులే గనక లేకపోతే అంబేడ్కర్ "రిడిల్స్ ఆఫ్ రామాయణ"(Riddles of Ramayana) అని రామాయణాన్ని అపహాస్యం చేస్తూ రాతలు రాయగలిగేవాడా ? ఈ హక్కులే గనక లేకపోతే ఆయన హిందువుల మీదా ప్రత్యేకించి బ్రాహ్మణుల మీదా విషం కక్కగలిగే వాడా ? అంబేడ్కరుకి ఇతరుల మీద ఉన్న హక్కులు, ఆ యితరులకు అంబేడ్కరు మీద మాత్రం ఉండకూడదంటే ఎలా ? రాళ్ళు రువ్వేముందు రాళ్ళు రువ్వించుకోవడానిక్కూడా సిద్ధంగా ఉండాలి.

దళితులు విలనైజ్ చేసిన మనువు బ్రాహ్మణ పక్షపాతి అయితే వాళ్ళు లయనైజ్ చేస్తున్న అంబేడ్కర్ దళిత పక్షపాతి.ఏమిటి తేడా కులతత్త్వంలో ? ఈనాడు ఈ అంబేడ్కర్ ఈ దళితుల్ని అక్కున జేర్చుకోవడానికి ఏ కారణాలైతే చూపిస్తున్నారో ఆ మనువు ఆనాడు ఆ బ్రాహ్మణుల్ని అక్కున జేర్చుకోవడానిక్కూడా సరిగ్గా అవే కారణాలు ఉండి ఉండొచ్చు.ఆ కాలంలో బ్రాహ్మణులు కూడా ఒక దళితవర్గమై ఉండొచ్చు.తరువాత వాళ్ళే ఒక అగ్రకులంగా మారి ఉండొచ్చు.అయిదువేల యేళ్ళ కాలప్రవాహంలో మనకు ఆ విషయాలు అంత విశదంగా తెలిసే అవకాశం లేదు.ఒక క్రీడ (game) స్వాభావికంగా అమానుషమైనదని అనుకున్నప్పుడు దాని నియమాల్ని (rules of the game) కొద్దిగా మార్చి అదే క్రీడని ఇంకా అలాగే ఆడుతూనే ఉండాలని ఆశించడం అభ్యుదయవాదం కాదు.అది కొత్త సీసాలో పాత సారా పొయ్యడంలాంటి బహిరంగ వంచనాశిల్పం.దాని స్థపతులు ఆరాధనీయులు కారు.ఆ రకంగా మనువాదం అనేది కొన్నివర్గాల దృష్టిలో బూతుమాటైతే అంబేడ్కరిజం కూడా మరికొన్నివర్గాల దృష్టిలో అంతే బూతుమాట.ఇందులో తప్పొప్పులు నిర్ణయించే సామర్థ్యం ఎవరికుంది ?

"క" కులస్థుడు "గ" కులస్థుడికి దేవుడు కానప్పుడు "గ" కులస్థుడు "క" కులస్థుడికి మాత్రం ఎందుకు దేవుడవ్వాలి ? ఏ ప్రాతిపదిక మీద ? "గ" ఆరాధ్యదైవాన్ని "క" కూడా ఆరాధ్యదైవంగా భావించకపోతే చంపుతావా ? వెలేస్తావా ? ఇవేనా నువ్వు గొప్పలు చెబుతున్న మహోన్నత రాజ్యాంగ విలువలు ?

రాజ్యాంగం రాసినవాళ్ళల్లో అంబేడ్కరు కూడా ఒకడు గాని ఆయనొక్కడే తోటలో కూర్చుని ఆశువుగా దాన్ని రాయలేదు.రాజ్యాంగసభ అనేదొకటుండేది.ఆయనొక్కడే ఏకైక రాజ్యాంగనిర్మాత కాడు.మహాత్మాగాంధి వల్లనే స్వాతంత్ర్యం వచ్చిందనడంలో ఎంత నిజముందో రాజ్యాంగాన్ని అంబేడ్కరే ఒక్కచేతి మీదుగా రాశాడనడంలోనూ అంతే నిజముంది.

ఎవరికైనా దేవుడనో దేవత అనో పేరుపెట్టకుండా గౌరవించలేకపోవడం మన భారతీయ మనస్తత్త్వంలో అనాదిగా పాతుకుపోయిన బలహీనత.వ్యక్తిత్వపరంగా అనేక అవకరాలు గల మామూలు మనుషుల్ని దేవుళ్ళుగా పేర్కొనడం ద్వారా దేవుణ్ణి కించపఱుస్తున్నామనే స్పృహ ఇలాంటివాళ్ళకు ఏ కోశానా ఉండదు.ఎన్ని చేసినా ఏ మనిషీ దేవుడు కాడు.దేవుడికి సాటి ముమ్మాటికీ దేవుడే.మనుషుల్లో దేవుణ్ణి చూసే ప్రయత్నంలో అనవసరంగా అల్పమానవుల అహంకారాన్ని వృద్ధిచెయ్యడమే కాక తఱచుగా నిరాశకు లోనవుతున్నాం.అసలైన దేవుణ్ణి మిస్సవుతున్నాం.కనుక ఇకనుంచి మనుషుల్ని మనుషులుగానే చూద్దాం.వారి యొక్క యావత్తు బలాలూ బలహీనతలతో సహా వారిని స్వీకరిద్దాం.

14 వ్యాఖ్యలు:

Swathi said...

ఈ తర్కమూ, వీవేకం, విచక్షణ మన ప్రస్తుత ప్రజాస్వామ్యం(?) లో ఎవరికి పట్టవనేది వాస్తవం. ప్రతి చిన్న వ్యాఖ్య న,ి విషయాన్ని ఒక సంచలనం గా చిత్రీకరించి దాని ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందటమే తరచూ జరిగే విషయం. ఎలానూ ఎవరైనా రెచ్చగొట్టగానే పుష్కలం గా ఆవేశపడటానికి మన వెర్రి ప్రజలు ఉండనే ఉన్నారుగా.

సత్యసాయి కొవ్వలి said...

అయ్యా, ఈ అన్నది ఉండవల్లి కాబట్టి ఎక్కువ రభస ఛేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికి ఈఆసక్తి ఉందో తేలుకుట్టిన దొంగలెవరో అందరికీ తెలుసు. ఒక జాతిగా పర(అభి)మత సహనం ఎప్పుడో కోల్పోయాం.

ప్రవీణ్ గార్లపాటి said...

నా మదిలో కూడా ఇలాంటి ఆలోచనలే మెదిలాయి.

మూర్ఖ నాయకులు వెనకుండి జరిపించే బాగోతమే ఇదంతా. చేసే వాడిక్కూడా బుద్ధుండాలనుకోండి. ప్చ్...

తెలుగు అభిమాని said...

చక్కగా చెప్పారు. దళితులు అంబేద్కర్ ను పవిత్ర గోవుగా మార్చారు. ఎంతటి నేత అయినా సద్విమర్శకు అతీతుడు కాడు. బిందెలు బిందెలు పాలాభిషేకం చేయటం బదులు ఆ పాలు అనాథపిల్లలకిస్తే అంబెద్కర్ సంతోషిస్తాడు.

Sudhakar said...

ఈ మధ్య విగ్రహాలు అన్ని ఒక మీటింగ్ పెట్టి నెత్తి మీద పాలు పోసి కంపు చేస్తున్న వెధవలందరినీ రెండు కాళ్ళ మధ్య ఒకే ఒక్కటి తందామని తీర్మానించాయంట. కాకి రెట్టేసిన పట్టించుకోని వెధవ పాలతో కడిగేసి ఆ తరువాత తుడవటం కూడా చెయ్యకపోతే వచ్చే కంపు ఎవడు భరిస్తాడు? ఆ పాలేదో రోడ్డు మీద అడుక్కునే పిల్లలకు తాగించచ్చు కదా. ఈనాడు అయితే ఒక స్పెషల్ ఏడిషన్ వేసే వరకూ వెళ్ళింది...

వికటకవి said...

ఎందుకో ఇది మీరు రాయాల్సిన టాపిక్కే అనిపించింది, మీరే రాశారు. మీరన్నవి అక్షరసత్యాలే. ఆ మధ్య ఎప్పుడో "బ్రాహ్మణుడిగా పుట్టడమే నేరమా" అంటూ ఓ వ్యక్తి ఘోష (రిజర్వేషన్లు) అంతర్జాలంలో బాగా సంచలనం సృష్టించింది. అయినా ఎవడైనా వేరేవాడంటే ఒక రకం, అదే బ్రాహ్మణుడు అయితే మరో రకం,...కనీసం అంబేడ్కర్ విషయములో. ఆయన గారి పేరు కూడా పలకనివ్వరేమో ముందు ముందు.

సుబ్బు. said...

ఈనాడు మరీ దారుణం మొన్న కాంగ్రెసోల్లు తెలుగుతల్లికి పాలాభిషేకం చెస్తే పక్కనే పాలులేని పిల్లవాడి బొమ్మవేసి నానా రాజకీయం చేసారు.ఈ రోజు "ఈనాడు"కి అటువంట్ బొమ్మాలు దొరకలేదేం.

చదువరి said...

సూటిగా అడగాల్సిన ప్రశ్నలను నిర్మొహమాటంగా అడిగేసారు. తార్కికంగా చూస్తే ఆయనామాట అని ఉండడనిపిస్తోంది. అంబేద్కరును పొగట్టం ఇవ్వాళ పొలిటికల్లీ కరెక్టు. అందునా ఓ రాజకీయుడు అంబేద్కరును విమర్శించడం కల్లోని మాట! ఆత్మహత్యతో సమానమది! ఉండవల్లి అలా అన్నాడని అనుకోలేం. దురదృష్టం కొద్దీ ఆ మాట అన్నట్టున్నాడు.

ఆయన నిజంగానే, కావాలనే ఆ మాట అన్నాడనుకుందాం.. అనకూడదా ఏంటి? విమర్శించనే కూడదా? తన అభిప్రాయం తనది, అది చెప్పుకునే హక్కు కూడా లేదా? ఈ విమర్శలూ, దిష్టిబొమ్మలు తగలెయ్యడం, ఆయనేదో హత్య చేసేసినట్టు గగ్గోలు పెట్టెయ్యడం.. ఇదంతా అనవసరమైన రాద్ధాంతం, రాజకీయం చెయ్యడం తప్ప మరోటి కాదు. ఏ అవకాశం దొరుకుద్దా.. హడావుడి చేసి, పేపర్ల కెక్కేద్దామా అనే యావే ప్రతీవాడికీ! ఇహ ఈ పాలాభిషేకాల ప్రహసనమొకటి.. ప్రతీ దానికీ పాలాభిషేకాలు చేసెయ్యడం రివాజైపోయింది.

తమను తాము మార్కెటింగు చేసుకునే రాజకీయుల తాపత్రయమిది.

కృష్ణుడు said...

వుండవల్లి ఏమన్నారో తెలియలెదు మొదటిరోజు. ఆ గొడవ చూసి ఇంకా అంపార్లమెంటరీ పదాలు ఉపయోగించారెమో అనుకున్నా.పాపం మర్చిపోయారు ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు లేదు ప్రజాస్వామ్య నాయకులకి ప్రజలకి కూడా.

మొన్న రాజశేఖర్ నిన్న వుండవల్లి రేపు ఎవరో?????????

krish said...

అనవసరంగా అందరు ఉండవల్లి కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఆయనకి అంత సీన్ లేదు మరి. ప్రజాస్వామ్యం లో అందరికి వాగే హక్కు ఉంది. కాదనను. మరి ఉండవల్లి ఎందుకు సారీ చెప్పాడు. 'నా అభిప్రాయం చెప్పే హక్కు నాకు లేదా??' అని ఎందుకు అనలేదు??

valluri said...

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు, మీ నిశ్పక్షపాత, నిష్కర్ష, నిర్భయ నిర్మోహమాట టాపాపై అందుకోండి నా అభినందనలు. వ్యాఖ్యదారులు కూడా నిర్లజ్జ ఆరాచకీయాలపై విరుచుకుపడ్డారు. హ్యట్సాఫ్ టూ యూ ఆల్.


క్రిష్ గారు, ఆ ఉండవల్లి 'సారి' చెప్పివుండకపోతే (లేదా బలవంతంగా చెప్పించకపోతే), ఈ రావణకాష్టాన్ని, పత్రికలు, రాజకీయులు మరొ సంచలనవిషయం దొరికేదాకా సాగదీస్తారు.

subbarao said...

You have summarized this RAAVANAKASHTAM very well.
nobody seems to be really interested in Ambedkar, look at the plight of hundreds and thousands of Ambedkars staues with broken limbs, decapitated and distorted ones, mushroomed all over the country. Everybody is interested in their own PROGRESS in the name of Ambedkar, who cares
for the country.
in fact, according to one of the close associates of ambedkar, ambedkar's role in shaping up or writing of the constitution was , if at all was very miniscule. He was made a part of the team at the
very end at the insistance of
NG Ranga. This gentleman told us this when we were talking to Sri.Baba Amte at his Amaravati ashram about 30 years ago...
i cannot prove anything, but a lot is being definetly attributed to Ambedkar for sure

through the pages of life said...

చాలా చక్కటి విశ్లేషణ. "అట"బోగట్టాల మీద విపరీతంగా ఆధారపడటం ఇక్కడ సర్వసాధారణం, ఆ జాడ్యం పోయేదాకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

అయినా ఎవరూ తక్కువకాదుగా....
ఒకరేమో అంబేద్కర్ అనీ, ఇంకొకరు ఎన్.టి.ఆర్ పేరుతో కొన్నాళ్ళూ, ఇప్పుడేమో రాజీవ్ గాంధీ పేరుతో అధికారంలోకి వచ్చినవాళ్ళంతా ఎవరి వర్గాన్ని వాళ్ళు బలనిరూపన చేసుకుంటూనే ఉన్నారు.

Its 4 U yar said...

Really Good
U hav Given Every common man feel in the state