2006 లో మన దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 1,18,112 అని జాతీయ నేర నమోదుల విభాగం(National Crime Records Bureau)ఒక నివేదిక లో పేర్కొంది.వీరిలో 35 శాతం మంది విషం తీసుకుని తనువు చాలించారు.32 శాతం మంది ఉరేసుకుని తుదిశ్వాస విడిచారు.షుమారు 9 శాతం మంది ఒంటికి నిప్పంటించుకుని ఆహుతయ్యారు.తక్కినవారు అనేక ఇతరేతర పద్ధతుల్లో ఈ లోకాన్ని విడిచివెళ్ళారు.26 శాతం మంది గృహచ్ఛిద్రాల కారణంగాను, 22 శాతం మంది ఆరోగ్య సమస్యల మూలంగాను, మూడున్నర శాతం మంది ప్రేమవైఫల్యాల వల్లా, మఱో ఐదు శాతం మంది వెనకబాటు, పేదఱికం మొదలైన కారణాల వల్లా ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.
ప్రోద్బలం ఏదైనప్పటికీ ఆత్మహత్యని ప్రభుత్వాలు నేరంగా పరిగణిస్తాయి.ఏ నేరప్రవృత్తి అయినా సర్వసాధారణ మానసిక స్థితి కాదు.అది కొద్దిమంది మాత్రమే గుర్తించగల మానసిక వైకల్యం.దానికి కొన్నిసార్లు నిపుణుల చికిత్సతో గుణం కనిపిస్తుంది.కొన్నిసార్లు కనిపించదు.కొన్నిసార్లు గుణం తాత్కాలికమే.దీనిక్కారణం సరిగా తెలియదు.ఒకానొక వ్యక్తి యొక్క మనోవైకల్యం తనకు తాను హాని చేసుకునే రూపంలో బయటపడ్డాక నేరాభియోగం మోపక తప్పదు.నేరాలకు దారితీసే అన్ని మనోవైకల్యాల్లాగానే దాన్ని చూడక తప్పదు.
అన్ని మతాలూ ఆత్మహత్యని పాపంగా పేర్కొని నిర్‌ద్వంద్వంగా నిషేధించాయి.హిందూమతం, క్రైస్తవ్యం, ఇస్లామ్ వంటి ఆస్తిక మతాలే కాక జైనం బౌద్ధం వంటి నాస్తికమతాలు కూడా ఆత్మహత్యని తీవ్రంగా ఖండించాయి.ఏ మతాన్నీ నమ్మక సర్వసంప్రదాయ విరుద్ధమైన పాషండమార్గంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించిన ప్రపంచ ప్రఖ్యాత నాస్తిక తత్త్వవేత్తలు కీ.శే.జిడ్డు కృష్ణమూర్తి, ఉప్పులూరివంటివారు కూడా ఆత్మహత్యని పదేపదే గర్హించారు.ఒక శస్త్రచికిత్స సందర్భంగా తనకు వృద్ధాప్యంలో కలిగిన దివ్యానుభవంతో శ్రీ జిడ్డు మరణానంతర జీవితాన్ని అంగీకరించారు.కాని ఆత్మహత్య ఎందుకు మంచిది కాదో ఎప్పుడూ వివరించలేదు.ఏదో సందర్భంలో"మనిషికి ఇంకేంటి దిక్కు, ఆత్మహత్య తప్ప ?"అన్న శిష్యుడితో వివేకానందస్వామి"అందుమూలంగా ఇంకా కీడు మూడుతుంది.అలాంటి ఆలోచనలే చెయ్యవద్దు."అని హెచ్చరించారు.
ఎవరి బతుకు వారు బతకడానికి ఉన్న హక్కు ఎవరి చావు వారు చావడానికి లేదా ? ఎవరి శరీరం వారిది.దానికి వారు అన్నం పెట్టుకుంటారు.మానుకుంటారు.కావలిస్తే చంపుకుంటారు.మనకెందుకు ? మతాల కెందుకు ? మతగురువుల కెందుకు ? ప్రభుత్వాల కెందుకు ? అని ప్రశ్నిస్తే చాలా విషయాలు ప్రస్తావన కొస్తాయి.
అసలు ఎవడి బతుకు వాడిదనే ఈ తప్పుడు సిద్ధాంతం రెండో ప్రపంచయుద్ధం తరువాత కట్టుతప్పిన అమెరికన్లు ప్రపంచం మీద ప్రయోగించిన మరో మారణాస్త్రమే తప్ప అంతకుముందు చరిత్రలో ఎవరూ దీన్ని అంగీకరించలేదు.దీన్ని బాగా భుజానికెత్తుకుని ప్రచారంలోకి తెచ్చిన సంఘవ్యతిరేకశక్తుల్లో ఫెమినిస్టులు ప్రముఖులు.అమెరికన్లకు సమాజం నుంచి అన్నీ కావాలి.సమాజాన్ని తమ అవసరాల కోసం పీల్చిపిప్పిచెయ్యాలి.కాని తమ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎవరూ జోక్యం చేసుకోకూడదు.ఇది అక్కడ ఎంతగా ముదిరి కుళ్ళి పుచ్చిపోయిందంటే అక్కడ భార్యాభర్తలక్కూడా ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళకున్నాయి.కుటుంబసభ్యులు పరస్పరం తప్పనిసరిగా పోషించాల్సిన సలహాదారు పాత్రని సైతం కోల్పోయారు.అదో గొప్పలాగా చెప్పుకుంటారు వాళ్ళు.పాపం వాళ్ళు చాలా అడ్వాన్సుడు.మనమందరం వెధవాయిలం.కొన్నిసార్లు ఆలోచిస్తే ఈ సిద్ధాంతం మూలంగా యూరోపు పాడైనట్లు అమెరికా పాడుకాలేదనే అనిపిస్తుంది."There's no society.There are only individuals"అన్న మార్గరెట్ థాచర్(మాజీ యు.కె.ప్రధానమంత్రిణి)మాటలు గుర్తుతెచ్చుకోండి.
ఇది నిజమేనా ? ఎవడి బతుకు వాడిదేనా ? మనిషికి తన జీవితం మీద అంతులేని స్వయంనిర్ణయాధికారం నిజంగానే ఉందా ?
ముందు అర్థం చేసుకోవలసింది ఇది.నీకు ఒకదానిమీద స్వతస్సిద్ధమైన అధికారం ఏర్పడాలంటే నీ సొంత సంకల్పబలంతో నీ ప్రతిభతో నీ వనరులతో నువ్వు దాన్ని నిర్మించి ఉండాలి.మానవుడి జీవితం అలా మొదలైందా ? నీ పుట్టుక నీ తల్లిదండ్రుల జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంటు.వాళ్ళు కూడా నీ పుట్టుకకు ముందస్తుగా ప్రణాళిక రచించి ఉండలేదు.నువ్వెవరో వాళ్ళకు తెలియదు.వాళ్ళెవరో నీకు తెలియదు.పుట్టాక మీరు ముగ్గురూ పరిచయమయ్యారు.నీ పుట్టుక నీ సంకల్పతో జరిగింది కూడా కాదు.అది నీకు స్పష్టంగా తెలుసు.నీకు అంత తెలివితేటలున్నాయా ? నీ పళ్ళు తోముకునే పళ్ళపొడి కూడా నువ్వు తయారుచేసుకోలేవు.అది కూడా వేఱే ఎవడో తయారుచేసి నీకు అమ్మాలి.ఇంక ఏకంగా శరీరాన్నే నిర్మించుకోవడమా ? అన్నన్నా ! ఎంతమాట ? నీ సంకల్పంతో ఏదైనా అయ్యేదుంటే ఇలా ఎందుకు పుట్టడం ? సూపర్‌మ్యాన్‌లాగా పుడతావు.బాల్యం అవసరం లేకుండానే ఏకంగా యౌవనవంతుడుగానే పుడతావు.ముసలితనమూ చావూ లేని జీవితాన్నే నిర్మించుకోగలుగుతావు.ఉక్కుతునకలాంటి వజ్రదేహాన్నే నిర్మించుకుంటావు.మఱేది ? ఎక్కడుంది నీకు స్వేచ్ఛ ?
కనుక ఈ శరీరం నీది కాదు.ఈ ప్రపంచం కూడా నీది కాదు.నీది అనుకుంటున్నదేదీ నీది కాదు.నువ్వు పుట్టకముందే ఈ ప్రపంచం ఉంది.నువ్వు మరణించాక కూడా ఇది ఉంటుంది.వీటన్నింటికీ సుప్రీమ్‌బాస్ వేఱే ఒకడున్నాడు.వాడికి దేనితోను సంబంధం లేదు.కాని వాడిది ఉక్కుపిడికిలి, ఉడుంపట్టు.వాడి ఆగ్రహమూ అనుగ్రహమూ రెండూ ప్రచండమైనవే.నీ శరీరమూ నీ జీవితమూ వాడి ఆస్తి అయివుండగా దాన్ని వాడి అనుమతి లేకుండా ధ్వంసంచేసే హక్కు నీకెవరిచ్చారు ? నీ శరీరం ఒక అద్దెకొంప.దానికి నువ్వు చెల్లించాల్సిన అద్దె-దాని యజమానిని రోజూ తల్చుకోవడమే.కిరాయిదారు తన ఇంటిని బాంబులుపెట్టి పేలుస్తానంటే యజమాని ఒప్పుకుంటాడా ? అక్షరాలు దిద్దుకోమని రాసిచ్చిన పలకని నేలకేసి పగలగొడితే తండ్రి ఊరుకుంటాడా ? లెక్కలు చెయ్యమని ఇచ్చిన హోంవర్క్ పుస్తకాన్ని చింపి చిద్రుపలు చేస్తే పంతులుగారు ఊరుకుంటాడా ? నా యిల్లు నా యిష్టం, నా పలక నాయిష్టం, నా నోట్‌పుస్తకం నా యిష్టం అని వాదించగలవా ?
భగవంతుడు తన సృష్టిలో మనిషికి స్చేచ్ఛ అంటూ అనుమతించి ఉంటే అది అత్యంత పరిమితం.ఒక రాటకు కన్నెత్రాటితో ఒక ఆవుని కట్టేసినప్పుడు ఆ తాడు ఎంత వ్యాసార్ధాన్ని (radius) ఏర్పఱచగలదో అంత పరిధి(range)లో మాత్రమే ఆ ఆవు మెయ్యగలదు.మనిషికి దేవుడిచ్చిన స్వేచ్ఛ ఇలాంటిది.కాని మనిషి గొప్పతనమేమిటంటే ఈ కొద్దిపాటి స్వేచ్ఛతోనే అంతులేని పాపాలు చెయ్యగలగడం.
దానవుడౌతాడు మనిషి దైవాన్ననుకున్నప్పుడు. (ఆత్మహత్య గుఱించి మఱికొంత వచ్చే టపాలో)




10 వ్యాఖ్యలు:
చివర్లో పోలికలు బాగా, నాటుకుపోయేలా చెప్పారండీ, మలి టపా కోసం ఎదురచూస్తూ ఉంటా..
చాలా బాగుందండి దీని తరువాతి టపాకై ఎదురుచూస్తుంటాను.
"దానవుడౌతాడు మనిషి దైవాన్ననుకున్నప్పుడు" ఇది అక్షరసత్యం
హత్య అయినా ఆత్మహత్య అయినా హింసతో ముడిబడింది. హింస అంటేనే తప్పు. (ఒక జీవిని హింసించి, చంపి మరో జీవి కడుపు నింపుకోవడం తప్పని తెలుసుకునే గదా బ్రాహ్మణులు శాకాహారులయింది) కనుక హత్య, ఆత్మహత్య రెండూ తప్పనే విషయం జిడ్డు కృష్టమూర్తి గారు క్షుణ్ణంగా చెప్పారు. మీకు పుస్తకాలు ఉదహరించాలంటే నాకు కొంత సమయం పడుతుంది. అలాగే శస్త్ర చికిత్సానంతరం కృష్టమూర్తి గారు మరణానంతర జీవితం గురించి అంగీకరించారనే విషయం మీకెలా తెలిసిందో వివరించగలరు. అదేవిధంగా పాషండమార్గం అంటే కూడా ఏమిటో తెలియపరచ గలరు. చివరగా ఒకమాట. కృష్టమూర్తి గారు నాస్తికులు కారు. సత్యం ఒకటుందని నమ్మినవారు. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఒకరు వేసిన మార్గం ఆ వ్యక్తికి తప్ప మరోకరికి పనికి రాదనీ, ఆ మార్గం ఎంగిలిదనీ, ప్రతి వ్యక్తీ తనకు తానుగా స్వతంత్రంగా సత్యశోధనకి ఉపక్రమించాలనీ, అప్పుడే సత్యం తెలుసుగోగలమనీ ఎలుగెత్తి చాటిన మనిషి. ముఖ్యంగా ఆస్తికులు. గమనించ మనవి.
ఇక్కడ రెండు పదాలు వాడబడ్డాయి. ఒకటి-నాస్తిక ; రెండోది-పాషండ ;
మనుధర్మశాస్త్రంలో "నాస్తికో వేదనిందక:"అని చెప్పబడింది. వేదాల్ని నిందించేవాడు నాస్తికుడు. ఇక్కడ వేదానికి ఋగ్యజుస్సామాదులనే వాచ్యార్థం కాకుండా పవిత్రగ్రంథాలు అనే సామాన్యార్థం తీసుకోవాలి. పవిత్రగ్రంథాల్ని నిందించడమంటే వాటిల్లో చెప్పబడిన విషయాల్ని ఖండించడం. 1984-85-86 ప్రాంతాల్లో శ్రీ జిడ్డు మద్రాసు వచ్చినప్పుడల్లా నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయన ఉపన్యాసాలకు స్వయంగా హాజరయ్యేవాణ్ణి. అప్పుడు ఆయన నేరుగా తిరుపతి క్షేత్రాన్ని అక్కడి దేవుణ్ణీ విమర్శించడం జరిగింది. గురు అంటే "heavy" అని అపార్థం చెబుతూ "గురువనేవాడు శిష్యుల నెత్తిమీద అనవసరపు బరువు" అని గురునింద చెయ్యడం కూడా జరిగింది. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోమనడం ఏ మతపరిధిలోకీ రాదు. మతాలు ఆ విధంగా చెప్పవు. ఏ మత పరిధిలోకీ రానివాళ్ళూ ఏ మతాన్నీ గౌరవించడానికి ఇష్టపడనివాళ్ళూ నాస్తికులని పిలిపించుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ కారణం చేత శ్రీ జిడ్డును నాస్తిక తత్త్వవేత్తగా వర్గీకరించడం జరిగింది.
పాషండ శబ్దానికి పాఖండ అనే రూపాంతరం కూడా ఉంది. దీనికి శ్రీ వామన్ S.ఆప్టే తన సంస్కృత నిఘంటువులో ఇచ్చిన అర్థం "heretic" అని. అంటే తనకంటే పూర్వమున్న మతవిశ్వాసాల మీద తిరుగుబాటు చేసినవాడు అని అర్థం. శ్రీ జిడ్డు తాను శిక్షణ పొందిన దివ్యజ్ఞాన సమాజపు విశ్వాసాల నుంచి తాను ఒకప్పుడు అధ్యక్షత వహించిన Order of the Star నుంచి, విభేదించి బయటికి వచ్చేసిన మాట నిజం. అందుచేత ఆయన పాషండుడనడంలో విప్రతిపత్తి లేదు.
శ్రీ జిడ్డు తనకు వృద్ధాప్యంలో జరిగిన శస్త్రచికిత్స (అది దేని గుఱించి చేశారో నాకు గుర్తులేదు) సందర్భంగా మృత్యుదేవుడు తనని రమ్మనడమూ తాను వెళ్ళడానికి తిరస్కరించి మృత్యుదేవుడితో గంటల కొద్దీ సంవాదమూ జరపడమూ - ఈ విషయాలు ఆయన శిష్యురాలైన Mary Lutyens వ్రాసిన జీవిత చరిత్ర రెండో భాగంలో ఉన్నాయి.
అంతకుముందు శ్రీ జిడ్డు ఏ దేవతల అస్తిత్వాన్నీ అంగీకరించలేదని, తాను బాల్యంలో పొందిన దర్శనాల్ని సైతం తన భ్రమలుగా పేర్కొని ఉండడాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి.
మీరు చెప్పిందంతా నిజమే గానీ సహేతుకంగా చెప్పలేదేమో? వారన్నారు, వీరన్నారు, ఈ మతం చెప్పింది అనేవి సహేతుకమా? నా దృష్టిలో మతాలు ఆయా కాలాలలో ఆయా సమాజ ప్రభావాల పరంగా బలంగా తీర్చిదిద్ద బడ్డాయే తప్ప, మానవాళి అందరినీ ఒక తాటిపైనకు తెచ్చే ఒక్క సిద్ధాంతాన్ని ముందుకు తేలేదు. తెచ్చినా అవి ఈ మనుషలకు పట్టలేదు.
ఇక ఆత్మహత్య : దీనిని ఖండించేవారు ఉరిశిక్షని ఖండిస్తున్నారా? అది ముందర చెప్పండి. ప్రభుత్వం ఆత్మహత్య తప్పంటంది. చల్లగా సమాజపు చేతులతో ఉరి శిక్షలు అమలు చేసేస్తుంది. ఇదెక్కడి ద్వంద్వన్యాయం? నా ఆత్మ, నా ఇష్టం. దాని మీద సర్వ హక్కులు నాకుంటాయ్. అలాంటప్పుడు ఈ సమాజం దానిని నేరం అని ఎలా చెప్పగలదు? అదీ సరే అని ఒప్పుకున్నా, ఆ సమాజానికి నా ఆత్మను హత్య చేసే హక్కు ఎవరిచ్చారు.
మానవాళి పుట్టుకనుంచి ఇప్పటి వరకూ ఒక్క సారి వెనుకకు తిరిగి చూసుకుంటే మనం ఎటు పోతున్నాం? మన చుట్టూ వున్న కనిపించని పదార్ధాన్ని ఇంకా బలవంతం చేసుకుంటూ పోతున్నాం. కొంతకాలానికి మనుష్యులు కేవలం సమాజంలో బతకడానికే పుడతారేమో? ఇప్పటికే అలా తయారయ్యామనుకుంటాను.ఆకలిరాజ్యంలో అన్నట్లు ఎందుకు పుట్టావురా అంటే...ఆవేశమాపుకోని అమ్మా నాన్నదే తప్పా అని ఆలోచించే రోజులొస్తాయి.
ఎవడిమానాన వాడిని బతకనివ్వండి. ఇప్పటికే ఈ సమాజం ఎయిడ్స్ లాగా మానవ ఔన్నత్యాన్ని శాసిస్తుంది.
సహేతుకంగా చెప్పడం :
హేతువులన్నీ కొన్ని accepted axioms/ premises మీద ఆధారపడి ఉంటాయి. నా professed axiom/ stated premise దేవుడైతే, మీ professed axiom/ stated premise మనిషికి ఉందని మీరనుకుంటున్న స్వేచ్ఛ. చాలా సందర్భాల్లో "నాకు తెలిసిన భాష/పదజాలం నువ్వు వాడలేదు కనుక నీ వాదం అహేతుకం, అశాస్త్రీయం" అని త్రోసిపుచ్చేవాళ్ళు ఎక్కువ. At certain level, it all boils down to competitive skill of wording. కాబట్టి ఏ హేతువాదమూ సమగ్రం కాదు.
"అవశ్యమ్ అనుభోక్తవ్యమ్" హిందూమత పరిధికి పూర్తిగా లోబడినటువంటిది. ఇతర మతాల యొక్కా ఇతర తత్త్వాల యొక్కా references దానికి అంతగా ప్రసక్తం కాదు. ప్రసక్తమైతే అవి హిందూమత విశ్వాసాలకు అనుగుణంగా ఉన్నతవఱకే వాటిని స్వీకరించడం జరిగింది. కనుక ఇది హిందువుల కోసమూ హిందూ విశ్వాసాలకు లోబడేవాళ్ళ కోసమే ఉద్దేశించినది తప్ప అందరినీ ఒప్పించే ఉద్దేశం రచయితకు లేదు. అది సాధ్యపడదు కూడా.
ఆత్మహత్య ఒక ఆధ్యాత్మిక ఉపద్రవం. ఆ దృష్టితోనే ఆ ప్రస్తావనని ఈ పుస్తకం పొడవునా మన్నించడం జరిగింది. దాని సామాజిక కోణాన్ని తత్సంబంధిత వేత్తలకే వదిలివేస్తున్నాను.
మీరు కేవలం ఆధ్యాత్మికం పరంగానే ఈ టపా రాసారని గమనించలేదు.అలా అయితే నా వ్యాఖ్య ఈ టపాకు పొందదు.
అసలు వ్యక్తి ఈ సృష్టికి మూలమేమిటనే ఆలోచన చేసినప్పుడే దేవుడనైనా, సత్యమనైనా ఒక సమాధానం లభిస్తుంది. పెద్దలు చెప్పారనే నెపంతో ఆ దేవుడిని గానీ, సత్యాన్ని గానీ, వాటిని కనుగొనే మార్గం మతాన్ని గానీ గుడ్డిగా విశ్వసించడం తప్పనే నేననుకుంటా. మన పెద్దలు, మనకంటే ముందు పుట్టినవాడు స్వయంగా తెలుసుకోగలిగింది నేనెందుకు స్వయంగా తెలుసుకోలేను అనే సెల్ప్ కాన్ఫిడెన్స్ వ్యక్తికి వుండాలి. నా ముందు పుట్టిన వాడు కనుగొన్నదాన్ని నేను కనుగొనలేనంత అల్పుడిని కాదు, నేనూ కనుకొనగలను అనే నిండుతనం మనిషిలో వుండాలనుకుంటా. పెద్దలు చెప్పినదాన్ని ప్రశ్నించకుండా నమ్మడంలో మన అమాయకత్వం దాగుందనుకుంటా. జిడ్డు కృష్టమూర్తిని కూడా గుడ్డిగా విశ్వసించరాదనే నేనంటా. కాకుంటే ఆయన చెప్పినవి సత్యాలా, సత్యదూరాలా అన్నది ముఖ్యం. అలాగే జిడ్డు కృష్టమూర్తి గారు చివర్లో లివర్ కాన్సర్ తో బాధ పడ్డారు. బహుశా దానికే శస్త్ర్ర చికిత్స చేయించుకుని వుంటారు. తర్వాత, ఆయన శిష్యురాలు చెప్పిన విషయం బహుశా విశ్వసనీయమైనది కాదనుకుంటా. ఎందుకంటే జె.కె. తన తత్వానికి గానీ,తన అనుభవాలకి గానీ, తన రచనలకి గానీ భాష్యాలూ/వక్రభాష్యాలూ చెప్పేవారిని నమ్మవద్దన్నారు. కానీ మీరన్నట్టు ఏ మనుధర్మశాస్త్రమో మరొకటో విశ్వాసం మీద ఆధారపడినవాటి ప్రకారం మీరు టపా రాసినట్టైతే నేను మిమ్మల్ని ప్రశ్నించను. ఎందుకంటే వాటిని నేను విశ్వసించలేను గనుక. కృతజ్ఞతలతో . . .
Post a Comment