దీపం కింది చీకటిలాగా ఇక్కడ ఈ నడమంత్రపు సిరితో పాటే సమాంతరంగా కటిక పేదఱికం కూడా ఉంది.నిర్లక్ష్యానికి గురైన పేదఱికం.ఈ సరికొత్త విపణివ్యవస్థ(market_economy)కి దీటైన నైపుణ్యాలు లేకపోవడంవల్ల మిగిలిపోయిన పేదఱికం.దానికీ సంపదకీ మధ్య అంతరం భారీగా ఉంది.అది ఇంకా పేదలుగానే మిగిలిపోయినవారిలో తీవ్రమైన ఆవేదనకీ హతాశకీ అసూయకీ దారితీస్తోంది.తమ కళ్ళముందే తమ సాటి(వృత్తిపని)వాళ్ళు ప్రతిదానికీ రు.500 నోట్లు బయటికి తీసే స్థాయికి ఎదిగిపోవడం తాము మటుకు ఇంకా ఱెక్కాడితే గాని డొక్కాడని, ఱెక్కాడినా నికరంగా రు.100 కూడా గిట్టుబాటు కానటువంటి అనిశ్చితిలో కొట్టుమిట్టాడాల్సి రావడం వారికి ఎంతమాత్రం మింగుడుపడ్డంలేదు.
తత్ఫలితంగా గతకొద్దికాలంనుంచి ఇక్కడ పిల్లల అపహరణలూ ఇళ్ళల్లోనే హత్యలూ పెరిగిపోతూ రావడాన్ని గమనిస్తున్నాను.ఈ ఆర్థికనేరాలకు పాల్పడ్డవాళ్ళెవరికి అంతకుముందు నేరచరిత్ర లేదు.పైపెచ్చు నేరస్థులు హతులకు ఏదోవిధంగా మిక్కిలి సన్నిహితులు కూడా.వాళ్ళెవరూ నేరాల్లో కరుడుగట్టిన వృత్తినిపుణులు కారు.వాళ్ళంతా ఎక్కువ సందర్భాల్లో జీవితానుభవం అంతగా లేని యువజనం.వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉండడం ఆందోళనకరం.నిరుడు తెలుగుదేశంపార్టీకి చెందిన ఒక మాజీ మహిళా శాసనసభ్యురాల్ని పనిమనిషే డబ్బు కోసం కిరాతకంగా చంపేసింది.ఒక వ్యక్తి దగ్గర ఏదో ఒక సందర్భంలో ఒక కట్ట నోట్లు కంటపడ్డం, దాని ఆధారంగా అతని దగ్గర కట్టలు కట్టలుగా డబ్బు ఉందనే అపోహతో దాన్ని దోచుకుందామనీ దానితో తమ జీవితమే మారిపోతుందనే దురాశతో చేసినవి సదరు నేరాలు.ఈ మధ్య చాలామంది పిల్లలూ పెద్దవాళ్ళూ కూడా ఈ హత్యలకు బలైపోయారు.
తమ దగ్గర డబ్బు, ఆస్తి ఉన్నాయని గాని, తాము ఫలానా సంస్థలో ఫలానా హోదాలో ఉంటున్నామని గాని పొక్కితే భద్రత లేని రోజులివి.పనివాళ్ళముందు డబ్బు బయటికి తియ్యడం ప్రాణాంతకమని ఋజువైన కాలమిది.తామో తమవాళ్ళో ప్రవాస భారతీయులని చెప్పుకోవడం కూడా ముప్పే.తమ కంటే ముందు తమ పిల్లలకే ప్రమాదం.
చట్టపరమైన చర్యలతో ఈ సమస్య సమసిపోతుందా ? ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమా ? సామాజిక భద్రత లేని సమాజంలో శాంతిభద్రతల నిర్వహణ కృత్రిమమే అవుతుందా ?
ఆలోచించాల్సి ఉంది.




6 వ్యాఖ్యలు:
నిజమే, ఇలాంటి వి ఆలోచిస్తూ ఉంటే ఆందోళన గా ,అయోమయంగా అనిపిస్తూంటుంది.
ఈ పరధనాపేక్ష వెనుక కేవలం అవసరాలే కాక చాలా మానసిక విషయాలు కూడా ఉంటాయి.
"డబ్బున్నవాణ్ణి అందరూ దోచుకోవచ్చు, ఎంత దోచుకున్నా తప్పు లేదు. అనే మనస్తత్త్వం మనవాళ్ళల్లో ఎఱ్ఱజెండాలు చొప్పించినది. అందుకని మన దేశంలో నేరాలు చేసేవాళ్ళల్లో ఒక గణనీయ సంఖ్యాకులకి జీవితంలో ఎక్కడో ఒకచోట వామపక్ష నేపథ్యం ఉంటుంది. ఆఖరికి ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తుంది. అందరూ కలిసి దోచేస్తే ఎంత ధనికుడైనా చివరికి దరిద్రుడే అవుతాడు.
అసలు వాస్తవం - ధనికుడు తన డబ్బుని తన పీట కింద వేసుకుని కూర్చోవడం లేదు. తన స్వలాభం నిమిత్తమే అయినా మొత్తం మీద దాన్ని అతడు సంఘంలో పెట్టుబడి పెడుతున్నాడు. ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాడు. సమాజానికి కొత్త సాంకేతికతల్ని (technologies)ని పరిచయం చెయ్యాలన్నా వాటిగుఱించి పరిశోధనలు చేయించాలన్నా ధనికుడికే సాధ్యం. అదనపు ధనాన్ని మూటగట్టేవాళ్ళు సమాజంలో వందమందికి సాధ్యం కాని విషయాల్ని తామొక్కరే సాధించగలుగుతారు. ఒకరకంగా వాళ్ళు నాగరికత పట్ల వందమందికుండాల్సిన బాధ్యతని తామొక్కరే నెత్తిమీద వేసుకున్నవాళ్ళనడం సమంజసం. కూడూ గూడూ గుడ్డా చాలుననేవాళ్ళూ ఏమీ సాధించలేరు. ధనికులకూ వారి ధనానికీ రక్షణ కల్పించడంలోనే సమాజప్రగతి ఇమిడి ఉంది. ఎఱ్ఱజెండాల ప్రభావం నుంచి బయటపడి మనవాళ్ళెప్పుడీ విషయాల్ని గుర్తిస్తారో ఏమిటో !
ఈ నాయకులు చేసే వాగ్దానాలు కొన్ని వర్గాల వారికి కలర్ టీవి కేబుల్ కనెక్షన్ , ఉచిత సౌకర్యాలు మెదలైనవి చూస్తుంటే , వాటి పరిణామాల పట్ల నాకు ఎంతో ఆందోళన , సందేహాలు కలుగుతూ ఉంటాయి.
ఈ అంశం పై ఒక టపా రాయగలరని కోరుతున్నాను.
ONE'S LOSS IS SOMEONE'S GAIN
ఒకడి నష్టం మఱొకడి పాలిట లాభంగా పరిణమిస్తుంది. ఇదొక ఆర్థిక సూత్రమే కాదు, ప్రకృతిసూత్రం కూడా. ఒకడికి మనం ఏదైనా ఉచితంగా సమకూరుస్తున్నామంటే ఆ మేరకు ఇంకొకడి జేబుకు (వాడికీ మనకూ తెలియకుండానే) కన్నం వేస్తున్నామన్నమాట. కొన్నిసార్లు ఆ జేబు సాక్షాత్తు మనదే అయివుండొచ్చు. కొన్నిసార్లు ఆ విషయం మనకు తెలిసే మనం ఆ పని చేస్తూండొచ్చు కూడా.
అయితే మొదట్లో తనకు నష్టదాయకాలనుకున్న ప్రతి ప్రకృతిసూత్రాన్ని మనిషి కాలక్రమంలో తన కనుకూలంగా మచ్చిక చేసుకుని మలచుకుని మార్చుకుని ఉపయోగించుకోవడం నేర్చుకున్నాడు. అదే విధంగా పై సూత్రాన్ని ఉపయోగించుకుని కొంతమందికీ కొన్ని ప్రాంతాలకూ మానవప్రయత్నంతో కృత్రిమపద్ధతిలో కొన్ని విషయాలు లేకుండా చెయ్యాలి. తద్ద్వారా వీరికి లోపించినవాటి విషయాల్లో వారికీ, వారికి లోపించిన విషయాల్లో వీరికీ అవకాశం కల్పించాలి. అప్పుడు అందరికీ అన్నీ సమకూడతాయి. అందరికీ పని దొరుకుతుంది. అందరూ సుఖపడతారు. అందరూ అన్నీ చేసేస్తామనడం సరైన పద్ధతి కాదు.
@తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: అయ్యా! తమరి టఫా మంటనక్కలో సరిగ్గా కనపడటంలేదు. ఐ.యిలో బాగానే కనపడుతుంది. ఇంకొక విషయం - కుడిచేతివైపు పాఠంతోనే యీ ఇబ్బంది అంతా!
మీ టపాలోని ఎడమచేతివైపు అక్షరాలు,టపా క్రింది వాఖ్యల లోని అక్షరాలు సరిగ్గానే కనపడుతున్నవి.
యండమూరి ఎక్కడో అన్నాడు: విజయవాడలోని ఒకనాటి వామపక్ష కార్యకర్తలు, బడా పెత్తందారిలైనతరువాత, ఏలురు రోడ్డుని, కారల్ మార్క్స్ వీధిగా మార్చి తాము ఇంకా వామపక్ష "వాదులు" గానే ఉన్నామని చాటుకున్నారని.
మీరన్న " "డబ్బున్నవాణ్ణి అందరూ దోచుకోవచ్చు, ఎంత దోచుకున్నా తప్పు లేదు. అనే మనస్తత్త్వం మనవాళ్ళల్లో ఎఱ్ఱజెండాలు చొప్పించినది" అన్నదానితో ఏకిభవించడం కష్టం.
Post a Comment