
ఉ. రాయలసీమ తోఁట నొక - రమ్యసుమం బమరార్చన క్షమం
బై యిలఁ బూఁచె నా కొఱకుఁ - బాయక వెంకటపద్మజాఖ్యమై ;
ఈ యమితోత్సుకత్వ కమనీ-యతరంబగు సంకురాత్రి నా
నాయిక సిద్ధభూమి వల-నన్ దిగివచ్చె స్వశాపశాంతికై. ౧
ఉ. తల్లికిఁ దండ్రికిన్ దగిన - ధన్యతనూజ వనుంగు బంగరుం
జెల్లివి యన్నలిద్దరికిఁ - జెల్మి యొనర్చినవారి పాలి జా
బిల్లివి, యెల్ల యొజ్జలకుఁ - బ్రీతిని గూర్చిన ఛాత్రి వింక నా
యుల్లము దోఁచికొన్న వర - యోషిత వేటికి వేయి పల్కఁగన్. ౨
క. అందరికి నేర్పఁజాలు న
మందంబగు ప్రజ్ఞ నీది - మఱియొక్కరిచే
నెందును జెప్పించికొనవు,
సుందరములు నీదు శాంతి - సౌమ్యతలు ప్రియా ! ౩
ఉ. నీకు సిపారసుల్ వలదు, -నీ సుగుణంబు లగణ్యముల్, మదీ
యాకలనీయ దుర్గుణము - లట్లు ; ననున్ సయిఁపంగ నీకునున్
గాకిఁక నేరికిన్ వశము ? - కాదిలి నేస్తమ ! నేను గాక యిం
కే కరుణాత్ముఁడైనను ద్వ - దీయ గుణోత్తరత న్నెఱింగెడున్. ౪
ఉ. వాహినిలోనఁ గొట్టుకొని - వచ్చిన కట్టెల భంగి నిప్పుడీ
దేహములోన నిర్వురము - దైవవశంబునఁ గూడినాము, క
ర్మేహ ప్రకార మింకెవర - మెచ్చటి కేఁగెదమో సఖీ ! తదీ
యోహకుఁ బండుటాఁకు వలె - నుల్లము భీతిని సంచలించెడున్. ౫
సీ. రద్దు కాదీ ముద్దు, - సుద్దనుకొనవద్దు,
శుద్ధ సూనృతవాక్కు - సుబ్బసూరి
బహువర్ష సేవా వి- పాక సమార్జితం
బిది నీకుఁ బతిదేవు - హృదయకోశ
నిర్గతావక్ర ని-రర్గళాశీర్వాద
సురలోక సుమతరు - సురభి సుమ్మి !
యిది శక్తి యిది వజ్ర - మిది సుదర్శన చక్ర
మఖిల లోకముల స-మ్మాన్యమిదియె.
తే.గీ. ఆస్తిపాస్తుల కంటె న-నర్ఘమిదియె
ముందటి కలుము లిద్దాని - ముందు డిందు
తిరుగు లేకపోవలె నీకుఁ - ద్రిభువనముల
రాజమర్యాద లెల్లెడ - లభ్యమగుత. ౬
ఉ. వాసిగ నీకు వస్తు ధన - వాహనముల్ కనకాన్నవస్త్రముల్
రాసులుగా లభింపవలె - వ్రాయవలెన్ విధి దీర్ఘమాయువున్
దోసము లేని స్వస్థతయుఁ - దోరపుఁ గీర్తియు నంచు వత్సలా
శాసన మాచరింతు ఘన - శాశ్వత మంగళ వాక్పరంపరన్. ౭
(నా భార్య పుట్టినరోజు సందర్భముగా)
9 వ్యాఖ్యలు:
శెభాష్! ముఖ్యంగా 5, 6 చాలా బాగున్నాయి. నదిలో కొట్టుకు వచ్చే కొయ్యదుంగల పోలిక బహు సముచితం.
మా అందరికీ సంస్కృత పాఠాలు చెబుతున్న గురువులూ, ప్రజ్ఞలో పెద్దవారైనా వయసులో చిన్నవాళ్ళు కాబట్టి ఈ శుభసందర్భంగా మీ దంపతులిద్దరినీ ఆశీర్వదింప సాహసిస్తున్నాను.
కొత్తపాళీగారికి నెనర్లు.
భాష మీద పట్టున్న గొప్పవారు పద్యాలు ఎలా రాస్తారయ్యా అంటే, ఈ పద్యాలు చూపించవచ్చు.
మీ ఆవిడకి ఈ పద్యాలు చదివి కళ్ళలో ఆనందభాష్పాలు వచ్చివుండుట ఖాయమనిపిస్తోంది.
మీ ఇద్దిరికీ నా శుభాకాంక్షలు.
గిరి
చాలా బాగా రాసారండీ. మీ గృహలక్ష్మికి చదువులతల్లి సరస్వతితో గొప్ప బహుమతినే ఇప్పించారు.
http://sreenyvas.wordpress.com
నిజంగా మీ శ్రీమతిగారు అదృష్టవంతురాలు. ఇంత విలువైన బహుమతి పొందినందుకు. కొత్తపాళిగారన్నట్లు ప్రజ్ఞలో మాకంటే చాలా పెద్దవారు , కాని వయసులో చిన్నవారు కాబట్టి మీ దంపతులను (ముఖ్యంగా మీ మేడంగారిని) ఆశీర్వదిస్తున్నాను(సాహసించటంలేదు). అభినందనలు కూడా.
జ్యోతిగారికి నెనర్లు.
సహధర్మచారిని పట్ల మీకున్న ప్రేమకు, గౌరవానికి మిమ్మల్ని అభినందిస్తూ. . .
పండితుడిని కాదు కాబట్టి మీలా గొప్పగా ఆశీర్వదించలేక పోవచ్చు. కానీ మంచి మనస్సుతో మీఇద్దరినీ ఆశీర్వదిస్తున్నా.
సత్యసాయిగారికి నెనర్లు
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.