మనం భవిష్యత్తులోకి సునిశితంగా చూడగలిగితే ఒక విషయం బోధపడుతుంది.మనకిష్టం ఉన్నా లేకపోయినా వ్యవసాయం మనకు తెలిసిన రైతుల చేతుల్లో మాత్రం ఉండబోవడంలేదు.అలాగే వ్యవసాయరంగం మనకు తెలిసిన విధంగా కూడా ఉండబోవడంలేదు.వృద్ధి చెందుతున్న ఆధునిక జీవసాంకేతికతా(biotechnology)పద్ధతులు వ్యవసాయాన్ని గ్రామీణుల చేతుల్లోంచి లాగేసుకుని పట్టణాలవారి చేతుల్లోకి బదలాయించబోతున్నాయి.ఇకముందు రైతులకు సరఫరా అయ్యే విద్యుత్తు కేవలం చేను తడుపుకోవడానికి కాక ఇంకా ఎన్నో ఆధునిక పద్ధతుల్లో పంటలు పండించడానికి వాడబడుతుంది.భవిష్యత్తులో పల్లెల్లోనే కాక పట్టణాల్లోను నగరాల్లోను కూడా పంటలు పండుతాయి.పెట్టుబడి అంటే కేవలం ఎరువులూ విత్తనాలూ పురుగుమందులూ కాక ఇంకా ఎన్నో కొత్త విషయాలు రంగప్రవేశం చెయ్యబోతున్నాయి.ఆర్థిక స్తోమతా, ఆధునిక పరిజ్ఞానమూ లేని చిన్న సన్నకారు రైతులకు భవిష్యత్తులో స్థానం ఉండదు.ఈ సత్యాన్ని ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత మంచిది.ఇప్పుడున్న సాగుపద్ధతులు బాగానే ఉన్నాయి కదా, చౌకగా ! జీవసాంకేతికత పేరుతో ఖరీదైన పద్ధతులెందుకు ? అంటే-ఏమీ చెప్పలేం, కాలప్రవాహం అలాంటిది అనడం తప్ప ! పదిహేను పైసల పోస్టుకార్డు వాడ్డం మానేసి మనుషులు ఫోనెందుకు చేస్తున్నారు ? అలాంటిదే ఇది కూడా ! మనుషుల ఆదాయస్థాయి హెచ్చే కొద్దీ సాంకేతికత(technology)పెరిగే కొద్దీ జీవనప్రమాణాలు ఇంకా ఇంకా ఖరీదే అవుతాయి తప్ప నేలబారు కావు.భవిష్యత్తులో వ్యవసాయం ఇంకా ఖరీదైన కార్యకలాపం కాబోతోంది గనుక దాని ఆధునికీకరణ వ్యయానికయ్యే పెట్టుబడి సంగతి ప్రభుత్వం మర్చిపోకూడదు.ఉదాహరణకు-కొన్ని రకాల పంటల్ని మంచిధర పలికేదాకా లేదా ఎగుమతి అవకాశాలు చిక్కేదాకా దాకా శీతల గిడ్డంగుల(cold_storages)లో భద్రపఱచడానికి మన రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు బహుకొద్ది.గుంటూరు నగరంలో ప్రైవేటు వ్యాపారులు రు.100 కోట్లు ఖర్చుచేసి అలాంటి శీతల గిడ్డంగులు 60 దాకా నిర్మించారు.అనేక ఇతరప్రాంతాల్లో అసలు అవంటే ఏమిటో ఎవరూ చూసి ఎఱుగరు.సన్నకారు రైతుల్ని ఇదివరకటి మాదిరే వ్యవసాయంలో కుదురుగా నిలపాలంటే ఇలాంటి సౌకర్యాల మీద దృష్టి పెట్టాలి.ఈ సౌకర్యాల్ని ఉచితంగా కాక గుంటూరు వ్యాపారుల్లాగానే కొంత ఫీజుకు అందించాలి.
రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి కావాలన్నప్పుడు కొంతమంది తేనెటీగల పెంపకమో, పట్టుపురుగుల పెంపకమో, పాల వ్యాపారమో అనుకుంటారు. ఇది అసలు సమస్యని గ్రహించలేకపోవడమే అవుతుంది.ఈ అన్ని కార్యకలాపాల్లోను విపణింపు(marketing)ఒక ప్రధాన సమస్య.పంటని అమ్ముకోవడంలో ఉన్న అన్ని రిస్కులూ వీటిల్లోనూ ఉన్నాయి.చూస్తూ చూస్తూ ఇలాంటివి నేనెవరికీ సూచించలేను.ఈ యుగం (service_sector)సేవారంగానిదని గ్రహించాలి.తక్కువైనప్పటికీ నికరమైన నింపాది సంపాదన(steady_income) ఈ కాలంలో సేవారంగం ద్వారానే సాధ్యం.ఈ యుగంలో బతకాలంటే ఉత్పాదనశక్తి ఎంత అవసరమో, ఏదో ఒక సేవని సమాజానికి అందించగల ప్రతిభ ఏకకాలంలో ఉండడం కూడా అంతే ముఖ్యం.సేవల నందించగల నైపుణ్యాలు మన రైతుల్లో కొఱవడ్డాయి.ముందు వాటిని వారిలో అభివృద్ధి చేస్తే వ్యవసాయరంగమో సేవారంగమో - ఏది అనుకూలమైతే దానిలో వారు స్థిరపడతారు.రెండో రంగం అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది.
మన సన్నకారు రైతుల బాధలకు ప్రపంచబ్యాంకునో డబ్ల్యు.టి.వొ.నో నిందించడం వల్ల ప్రస్తుతానికి ప్రయోజనం లేదు.ఏం చేసినా డబ్ల్యు.టి.వొ.నుంచి మనం బయటపడే పరిస్థితి లేదు.పెద్ద పెద్ద బ.జా.సా.లు(బహుళజాతీయ సార్థవాహాలు - MNCs)మన పొలాల మీద కన్నేశాయని ఏడ్చే బదులు భూసంస్కరణలు ఎత్తేసి మనవాళ్ళే కొంతమంది సత్తా కలిగిన భారీ జమీందార్లుగా అవతరించడానికి అవకాశమివ్వాలి.కొన్ని బ.జా.సా.లు(MNC)లు ఉండడం కూడా అవసరమే.మొత్తం మనవాళ్ళే ఉంటే మన రైతులకు సరిగా జీతాలివ్వరు.వివిధ భూస్వాముల మధ్య వ్యవసాయం బాగా తెలిసిన రైతుల కోసం పోటీ ఉంటే మన రైతులకు మంచి జీతాలందే అవకాశం ఉంది.
1 వ్యాఖ్యలు:
వ్యవసాయం మీద కేంద్రీకరించి వ్రాసినందుకు మొదలు అభినందనలు.
రైతుల ఆత్మ హత్యలకు కారణం ప్రైవేటు ఋణాలు, వడ్డీ. వారికి సంస్థాగత ఋణాలందక పోవడం కూడా ఒక కారణం. దానికి కారణం భూమి హక్కుల రికార్డులు తేలిగ్గా అందుబాటులో లేకపోవడం. నేను గత సంవత్సర కాలం నుండి మా భూముల రికార్డులు సరిచేయించుకోవడానికి రెవెన్యూ కార్యదర్శి వెంట తిరుగుతున్నాను. ఇంతవరకూ అతీ లేదు గతీ లేదు. ఇక మమూలు వాళ్ళ పరిస్థితి చెప్పనలవి కాదు.
దీని గురించి కూడా ఆలోచించి రాయండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.