ఒక కార్పొరేట్ గుంపుని తీసుకుంటే అందులో అనేక ఉపసంస్థలుంటాయి.వాటిల్లో ప్రధానసంస్థని Flagship_Company అంటారు.మిగతావాటిని subsidiaries లేదా sister_concerns అంటారు.సిస్టర్ కన్సర్నుల స్థాపనాది వ్యయాల్ని మొదట్లో ఫ్లాగ్‌షిప్ కంపెనీయే భరిస్తుంది.సిస్టర్ కన్సర్నులు వ్యాపారపరంగా పూర్తిస్థాయి వ్యవహారదశ(operational_stage)లోకి వచ్చాక మాతృసంస్థ(flagship_company)వాటిమీద ఒక్క పైసా కూడా వెచ్చించదు.అలా ఎన్ని ఉపసంస్థలున్నా సరే ! అన్నీ స్వయంసమృద్ధంగా వ్యవహరించాల్సిందే తప్ప ఒక ఉపసంస్థకు చెందిన లాభాల మార్జిన్‌ని ఇంకో ఉపసంస్థలో మదుపుచెయ్యడానికి వీల్లేదు.చేస్తే దాన్ని ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తారు.ఒకవేళ ఒక ఉపసంస్థ ప్రతి ఆర్థిక సంవత్సరమూ నష్టాలు చూపిస్తూంటే దాన్ని వదిలించుకుంటారే తప్ప దానిమీద పైసా కూడా అదనంగా పెట్టరు.
దీన్నే ఇంకొంత స్పష్టతరమైన శైలిలో పెడితే-స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి వ్యవసాయరంగం మీద ప్రభుత్వానికి ఖర్చే తప్ప ఏ విధమైన ఆదాయమూ లేదు-దాని మీద 65శాతం మంది బతుకుతున్నప్పటికీ ! వ్యావసాయిక లాభాల మీదనే కాదు వాటి అమ్మకం మీద గాని భూముల అమ్మకం మీద గాని ఎలాంటి పన్నూ (Capital Gains Tax)లేదు.అంటే జనాభాలో 65శాతం మంది ఆదాయం పన్ను కట్టకుండా బతుకుతున్నారన్నమాట.మఱి ఇందరు చట్టబద్ధమైన ఎగవేతర్లని పెట్టుకుని ప్రభుత్వం ఎలా నడుస్తోంది ? అంటే ఈ 65శాతం మంది కోసం తక్కిన 35 శాతం మందినీ పీల్చి పిప్పి చేస్తోంది.అందరి సంగతీ చూడ్డం ప్రభుత్వానికి విధాయకం కనుక అది సరిపెట్టుకోవచ్చు.కాని ఆ 65 శాతం మందిని భరించడం ఈ 35 శాతం మందికి ఏ విధంగా విధాయకం ? ఏమిటా జన్మజన్మల ఋణం ? ఎందుకు భరించాలి ? ఇందువల్ల ఈ 35 శాతం మందిమీదా భారీగా ఆదాయం పన్నుకోతల శాతాలూ అమ్మకం పన్నుకోతల శాతాలూ పడి ఎంత నష్టపోతున్నారో, వ్యవసాయం మీద పన్నురూపేణా ఆదాయం లేక యావత్తు దేశమే ఎలా నష్టపోతోందో, ప్రభుత్వాలు ప్రతి అభివృద్ధి పనికీ ఎలా ఘోరంగా అప్పుల పాలైపోతున్నాయో ఎవరైనా గమనించారా ? వ్యవసాయం మీద ఆదాయం లేకపోబట్టి ప్రభుత్వాలు ప్రజలకు తాగుడు మప్పి సంపాదించుకోవలసి వస్తోంది.అత్యంత పెద్ద ఉత్పాదక రంగమైన వ్యవసాయం మీద పన్ను విధిస్తే తాగుడు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ రాజస్వం(revenue)అందుబాట్లోకి వస్తుంది.అప్పుడు మన ప్రభుత్వాలు తాగుడు మీద వచ్చే పాపిష్ఠి డబ్బుకు స్వస్తి చెప్పగల స్తోమత కలిగి ఉంటాయి.
సరే ! బడుగురైతులు ఆదాయంపన్ను చెల్లించలేరు.ప్రస్తుతం ఆదాయంపన్ను చట్టంలో ఎంతోమందికి ఇచ్చినట్లే వారికీ మినహాయింపు ఇవ్వొచ్చు.మఱి అందరూ బడుగురైతులేనా ? ఏకమొత్తంగా వ్యవసాయదారులందరూ పన్నుమినహాయింపుకి అర్హులేనా ? అందులోనూ శాశ్వతంగా ? మోతుబరి రైతుల్నీ కామందుల్నీ భూస్వాముల్నీ సైతం ఆదాయంపన్ను నుంచి ఎందుకు మినహాయించారు ? ఎవరి బాగు కోసం ఈ పనిచేశారు ? అడిగితే రౌరవాది నరకాలకేమీ వెళ్ళం గదా ! మన రైతుల్లో 80 శాతం మందికి పైగా బడుగులే ఉంటే వ్యవసాయం మీద పన్ను విధించడం ద్వారా ఆశించినంత ఆదాయం సమకూడుతుందా ? అనే సందేహం వ్యక్తం చేస్తారు కొందరు. ఇక్కడే విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక అయోమయాన్ని విడమర్చాల్సి ఉంది. 80 శాతం మంది బడుగు రైతులంటే దానర్థం-80 శాతం సాగుభూమి బడుగు రైతుల చేతుల్లోనే ఉందని కాదు. ఈ 80 శాతం మంది చేతుల్లో ఉన్నది 30 శాతం భూమే. మిగతా 70 శాతం భూమీ పెద్దపెద్ద భూస్వాముల చేతుల్లోనే ఉంది. మనం వ్యవసాయం మీద పన్ను విధించబోయేది ఈ 70 శాతం జమీందార్ల భూముల మీదనే. అందుచేత ఇప్పటి నాణెక విలువల్ని (currency value)అనుసరించి ఎకరానికి రు.500 వార్షిక పన్ను విధించినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీస్థాయిలో ఉంటుంది. ఆ సందర్భంగా 30 శాతం బడుగుభూమినుంచి మాత్రమే మనకు రాజస్వం (revenue) రాదు. ఇలా వ్యవసాయరంగం నుంచి ప్రభుత్వానికి క్రమబద్ధమైన నికర వార్షికదాయం ఉండే పక్షంలో మనం దానితో ఒక రాష్ట్ర రైతు సహాయనిధి ఏర్పఱుస్తాం. కేంద్రసహాయం కోసం గోతికింద నక్కల్లాగా ఎదురుచూసే పని ఉండదు. వఱదలొచ్చి లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమైనా మనం వెనువెంటనే పూర్తి పెట్టుబడి ఖర్చుల్ని నష్టపరిహారంగా ఇచ్చి రైతుల్ని ఆదుకోగలుగుతాం. తద్ద్వారా వారు తరువాతి పంట కోసం అప్పుచేసే అవసరం లేకుండా చూడగలుగుతాం. "పన్ను అని పేరుపెట్టే బదులు పంటల బీమా అనొచ్చు గదా !"అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం ఇండియాలో అమలులో ఉన్న బీమాచట్టాల ప్రకారం ఫలానా దానికి బీమా తీసుకోండని ఎవరూ ఎవరినీ ఒత్తిడి చెయ్యకూడదు. మోటారు వాహనాల చట్టంలో మాత్రం ఇలాంటి నిర్బంధబీమా వెసులుబాటు కల్పించబడింది. ఒత్తిడి చెయ్యకపోతే రైతులందరినీ ప్రభుత్వ రక్షణచ్ఛత్త్రం క్రిందికి తేలేము. పన్ను అంటే అందరూ కడతారు. బీమా అంటే కొందరే కడతారు. ఆ కొందరి నిధులూ కలిపితే అందరినీ అన్నివేళలా ఆదుకోవడానికి సరిపోవు. ఒక ఇబ్బంది లేకపోలేదు. ఒక శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంకో శాఖకు తరలించే దురలవాటు మన ప్రభుత్వంలో పెచ్చుమీరిపోయింది. ప్రస్తుతం అన్ని శాఖల కన్నా ఎక్కువగా ఇందుకు బలవుతున్నది దేవాదాయ-ధర్మాదాయశాఖ. అది రేపు వ్యవసాయశాఖ కాకుండా మనం ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యవసాయం మీద ప్రభుత్వానికి ఆదాయం లేదంటే దాని అర్థం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదాయం లేదని ! ఏ ఆదాయాన్నీ జాతికి సమకూర్చని గ్రామీణ ప్రాంతాల మీద ప్రభుత్వం ఎందుకు ఖర్చుపెడుతుంది ? అలా ఖర్చుపెట్టమని ఏ మొహం పెట్టుకుని అడుగుతాం ? వ్యవసాయం వల్ల జాతికి ఆహారమూ కొన్ని పారిశ్రామిక ముడిసరుకులూ లభిస్తున్నాయి కాబట్టి ఖర్చుపెట్టాలంటారా ? ఖచ్చితంగా అది కాకపోయినా ప్రతి ఇతరరంగం నుంచి జాతికి అదే విధమైన లాభాలు ఉన్నాయి.కాని ఆ రంగాలన్నీ పన్నుచెల్లిస్తున్నాయి.వ్యవసాయం మాత్రం ఎందుకు చెల్లించకూడదు ? వ్యవసాయం మీద పన్ను రాబట్టగలిగితే గ్రామీణ ప్రాంతాల స్థితిగతుల్ని మెఱుగుపర్చడానికి మనకు ఇతోధికమైన అవకాశం లభిస్తుంది కదా ! అదే సమయంలో పట్టణప్రాంతాల వారి మీద అవాస్తవికమైన, హింసాత్మకమైన పన్నుశాతాల భారం తగ్గుతుంది కదా !
దీని గుఱించి మఱికొంత రేపటి టపాలో...




5 వ్యాఖ్యలు:
వ్యావసాయిక ఆదాయముపై పన్నూ లేదు అనే లొసుగుని విపరీతముగా అనుచితముగా వాడుకుని లాభపడుతున్న జనాభాలో ఎక్కువ మంది రాజకీయ నాయుకులు వారి అనుచరగణాలే.బడుగురైతులు కోసం ఉద్ధేశించిన ఈ మినహాయింపు ఇప్పుదు నల్ల ధనముని తెల్ల ధనముగ మార్చే ముఖ్య మార్గముగ రాజకీయ నాయుకులు వాదుకుంటున్నారు.
Today the main beneficiaries of this tax exemption are our politicians and their goons. So there is no chance of this farm income tax exemption ever being removed. No amount of argument or explaining as to how illogical this tax exemption, is going to change anything. Because this loop hole of farm income tax exemption is the biggest and the easiest channel to convert blcak money into white for our politicians, corrupt govt. employees and others. This is but one more channel for pillaging our country by our politicans.
Thanks for writing on this topic which causes much heartburn for people like us.
ఇంతకీ మీ ఉద్దేశ్యం గ్రామీణ వ్యవసాయాన్ని నిరుత్సాహ పరచాలనా లేక సాంతంగా వ్యవసాయ రంగాన్నే నిరుస్తాహ పరచాలనా? చివరి pera నన్నీ సందేహానికి పురికొల్పింది.
ఒక రంగాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో ఆ రంగం మీద ఎవరూ వ్యాసాలు రాయరు.
1. వ్యవసాయరంగం ఇప్పటి బాధ్యతారహితస్థితి నుంచి బయటపడి బాధ్యతాయుతంగా మారాలి.
2. అందుకు వ్యవసాయరంగం మీద పన్ను విధించాలి.
3. వ్యవసాయరంగం మీద వచ్చిన ఆదాయంతో వ్యవసాయరంగాన్ని ఆదుకోవాలి.
ఇప్పటికే నకిలీ విత్తనాలు మొదలుకొని ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ వరకూ నానావిధ సమస్యలతో కష్టాలపాలవుతున్న రైతాంగంపై అది చాలదన్నట్టు పన్నువిధించడంకూడా ప్రారంభిస్తే మరి దాన్ని నిరుత్సాహపరచడం అనక మరింకేమనాలి?
ఈ అత్మహత్యలని అరికట్టడానికి రైతు స్వయంసంఘాల ఏర్పాటు, తక్కువ వడ్డీకి ౠణాలనిచ్చే సంస్థల ఏర్పాటు, కొద్ది పాటి ప్రభుత్వ తోడ్పాటు కావాలి గాని. మీ పై పన్ను వేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని మీఅభివృద్ధికే వుపయోగిస్తాం అంటే రైతులేకాదు రాష్ట్రంలో (దేశంలోకూడ) నమ్మడానికి యెవరూ సిద్ధంగాలేరు. నిజంగా పన్ను విధించాల్సినంత లేదా విధిస్తే భరించి అదేవ్రుత్తిలోకొనసాగగలిగేంత సుసంపన్న స్థితిలో అత్యధికులైన రైతులు లేరు. ఈ విషయాన్ని మీరేఒప్పుకున్నారుకూడా. అయినాకూడా గ్రామీణ వ్యవసాయం లాభదాయకంగాలేదుకాబట్టి తక్షణమే సహాయం నిలిపి వేయాలనటం సబబుగా లేదు. ఏనాడైనా రైతు శ్రేయస్సుకోసం నిఝ్ఝంగా కృషి జరిగి అప్పటికీ ఆరంగం అలాగే వుండిపొయుండుంటే మీలా అభిలషించటంలో ఒక అర్ధం వుంది(?? మరి నిరుద్యోగిత సమస్య, ఆహార భద్రత వగైరాలు? ఒక వేళ ఆహార భద్రత కూడా పెట్రో నిల్వల్లాగే సాధించగలిగేదిగా భావిస్తే ఇక దీని గురించి మాట్లాడటానికేమీ లేదు) .దళారీ వ్యవస్థను రూపుమాపటానుకి మనం వుపక్రమించం, మద్దత్తు ధరలూ ప్రకటించం, సబ్సిడీలా ఇప్పుడు వాటి గురించి మాట్లాడటమే పపమైపోయింది. కానీ విదేశాలలో వాటన్నిటి సహాయంతో రైతులు కారు చవకగా పండిస్తే స్వేచ్చా వాణిజ్యం పేరుతో ఇబ్బడి ముబ్బడి గా దిగుమతి చేసుకొని ఇక్కడి రైతాంగం నడ్డీ విరుస్తుందీ మనమే.
మదంతో కళ్ళుమూసుకుపోయినవాళ్ళు కొందఱైతే సానుభూతితో కళ్ళుమూసుకుపోయినవాళ్ళు కొందఱు. మీకు సమస్య యొక్క సమగ్రరూపం తెలియదు. మీరు ప్రచారాల వెల్లువలో పడి కొట్టుకుపోతున్నట్లుంది. తెలియనప్పుడు నేను మీకు ఏం చెప్పీ కన్ను తెఱిపించలేను. అయితే ఈ విషయాల మీద ఇంకో వ్యాసపరంపర మొదలుపెడతాను. అప్పుడు చదువుదురు గాని !
Post a Comment