ఏ పని చెయ్యాలన్నా ముందు లావుగా డబ్బు కావాలి. కనీసం 20 వేల తెలుగు గ్రామాల్లోనైనా మౌలిక సదుపాయాలూ, తద్ద్వారా సన్నకారు రైతుకుటుంబాలకు క్రమబద్ధ ఉపాధీ (regular_employment) కల్పించడమంటే తమాషా కాదు. ఇండియాలో మౌలిక సదుపాయాల్ని చెక్కపలకలతో కల్పించడం సాధ్యం కాదు. ఇటుకా, ఇసుకా, సిమెంటూ తప్పనిసరి. ప్రస్తుతం ఇటుక ఒక్కింటికీ 4రూ.50 పైసలుంది. సిమెంటు బస్తా రూ.200 దాటిపోయింది.
ఎవఱికి వాళ్ళు చేసుకోండని చెప్పడానికి ఈ విధానం ఇదివఱకు ఎక్కడా ప్రయోగించి చూడబడ్డ నిరూపిత అభివృద్ధి నమూనా (proven model of development) కాదు."అవేర్"మొదలైన స్వచ్ఛంద సంస్థలు కొన్ని మారుమూల గ్రామాల్ని దత్తు తీసుకుని వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన మాట నిజమే. కాని వాళ్ళు ఆ పని ఈ దృష్టితో చెయ్యలేదు. కనుక వారేర్పఱచిన సదుపాయాల్లో వాళ్ళవాళ్ళే పనిచేస్తున్నారు. అందుచేత ఈ పనికి ముందు ప్రభుత్వమే ప్రయోగాత్మకంగా పూనుకోవాలి.
ఇందులో మూడు అంశాలున్నాయి. ఒకటి - మౌలిక సదుపాయాలు ఏర్పఱచడం (establishment). రెండు - వాటిని నిర్వహించడం, వాటిల్లో పనిచేసేవారికి వేతనాలివ్వగలగడం (running/maintenance). మూడు - వాటిని విస్తరించడం (expansion).
అలాగే అన్ని గ్రామాలకూ ఒకేసారి సేవలు ప్రారంభించడం కుదరదు. గ్రామీణ మౌలిక సదుపాయాల పైలట్ ప్రాజెక్టు కింద మూడు ప్రాంతాల్లోను కొన్నికొన్నింటిని క్లస్టర్స్ గా తీసుకుని ఈ పథకాన్ని అమలుజరపాలి. వాటిల్లో వచ్చిన ఫలితాల్ని మూణ్ణాలుగేళ్ళ పాటు గమనించి విశ్లేషించాక ఇతర గ్రామాలక్కూడా ఈ పథకాన్ని వర్తింపజెయ్యొచ్చు.
ఒకవేళ ఈ పథకం రైతుల ఆత్మహత్యల్ని అఱికట్టడంలో సఫలమైతే ఆ విధంగా వర్తింప జేయడానికి ప్రభుత్వం దగ్గఱ డబ్బుందా ?_ఏ అవసరం కలిగినా పంచపాండవులకు శ్రీకృష్ణపరమాత్మే గుర్తొచ్చినట్లు మన ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు తఱచుగా గుర్తొస్తుంది. దీనిక్కూడా ప్రపంచబ్యాంకే శరణ్యమా ?_లేక తద్‌భిన్నంగా మనకు సొంత ప్రత్యామ్నాయ వనరులేమైనా అందుబాట్లో ఉన్నాయా ?
దీనికి సరైన సూటి సమాధానం - ఏ అదనపు వనర్లూ మన ప్రభుత్వం దగ్గర లేవు.
ఎందుకు లేవు ?..... ఱేపటి టపాలో....
