Thursday, December 20, 2007

రైతుల ఆత్మహత్యలు-3


ప్రతి కుగ్రామంలోను మౌలిక సదుపాయాల్ని కల్పించడం సాధ్యపడదు.కుగ్రామమంటే నేననేది-ఒక వెయ్యి(1,000)మంది కంటే తక్కువ జనాభా గలది.ఎందుకంటే మౌలిక సదుపాయాల్ని వినియోగించుకుని వాటిని నిరంతరాయంగా నడిపించగల ఒక సుస్థిరమైన వాడుకరుల ప్రాతిపదిక(niche user-base)ఒక మోస్తరు పరిమాణం గల జనావాసాల్లో లభ్యమౌతుంది.

మౌలిక సదుపాయాల సేవల్ని వాడుకరులకు ఉచితంగా అందించాలని మనం ప్రతిపాదించబోవడంలేదు.అలాగని వాటిని ఫక్తు వ్యాపార సరళిలోనే నడిపించాలని కూడా మన తాత్పర్యం కాదు.మనం అనుకుంటున్న గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రధాన లక్ష్యం కేవలం గ్రామీణ వినియోగదారుల సేవ మాత్రమే కాక-గ్రామీణుల స్తోమతకు తగ్గవిధంగా సేవలందించేదిగా రైతు కుటుంబాలకు తక్కువ విద్యార్హతలతో టూకీ శిక్షణతో ఏడాది పొడవునా ప్రత్యామ్నాయ ఆదాయవనరుగా ఉపయోగపడేదిగా వ్యవసాయ నష్టాల మూలంగా ఏర్పడ్డ జరుగుబాటు లోపాన్ని పూరించేదిగా వారిని ఆత్మహత్యల విషవలయంలో నుంచి బయటపడేసేదిగా వారు వలసకూలీలుగా మారకుండా స్థానికమైన పరిసరాల్లోనే వారికి వ్యవస్థీకృతమైన మార్గాన్నిచూపేదిగా ఉండడం.

మన రాష్ట్రంలో ఉన్న 30,000 ల చిల్లర గ్రామాల్లో వెయ్యి పై చిలుకు జనాభా ఉన్నవే అధికం.కనుక చాలా చోట్ల మౌలిక సదుపాయాల కల్పనా నిర్వహణా సాధ్యపడతాయి.అయితే ఇందులో ఇంకో విషయం ఇమిడి ఉంది.దశాబ్దాల తరబడి ఎఱ్ఱజెండాల ప్రచారం వల్ల-ఏం చేసినా అంతా ప్రభుత్వమే చెయ్యాలనీ మనం చేసేదేమీ లేదనీ ప్రభుత్వమంటే అందరికీ అన్నీ ఉచితంగా ఇచ్చేసే ఇచ్చితీఱాల్సిన ధర్మసత్రమనీ అక్షయపాత్ర అనీ మన గ్రామీణుల్లో ఒక పొఱపాటు అభిప్రాయం నాటుకుపోయింది.ఊళ్ళోవాళ్ళంతా ఇంటిమీద పడితే ఎంత అమీరైనా క్షణంలో గరీబవుతాడు.అతని మీదపడి దోచినవాళ్ళు అతనిలా అమీర్లు కాలేరు గాని ఆ అమీరు మాత్రం తన మీదపడ్డ గరీబుల్లో తానూ ఒకడవుతాడు.హైదరాబాదులో ప్రభుత్వమనే మనిషెవడూ లేడు.ప్రభుత్వం దగ్గర డబ్బులు కాచే చెట్టు కూడా ఏమీ లేదు.మన దగ్గర వసూలు చేసిందే మన కోసం ఖర్చుపెట్టాలి.ప్రభుత్వం అలా వసూలుచెయ్యాలంటే మనం ప్రభుత్వానికి ఇవ్వాలి.ముందు ఇచ్చాక మనకు ప్రభుత్వాన్ని నిర్మొహమాటంగా నిలదీసే హక్కు వస్తుంది.ఇది ఈ బ్లాగు చదివే నవీన విద్యావంతులకు బాగానే అర్థమౌతుంది.కాని మన గ్రామీణులకు మాత్రం అంత సులభంగా బోధపడదు.వాళ్ళకు నిజంగా బోధపడితే వోట్లెయ్యడానికి డబ్బు తీసుకోరు.

మౌలిక సదుపాయాల సేవల్ని ఇలా ఒక వెలకు వినియోగించుకోవాలనే ఆలోచనకు మన గ్రామీణుల్ని ముందుగా మానసికంగా సన్నద్ధం చేశాక మన పని సులభతరమౌతుంది.గ్రామీణుల దగ్గర వసూలు చేసే వాడుక-రుసుముల(user-charges)తో మౌలిక సదుపాయాల్ని నడిపించడమూ వాటిల్లో పనిచేసే రైతుకుటుంబాల సభ్యులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమూ ఆచరణాత్మకంగా సాధ్యపడుతుంది.మన వ్యవసాయం పుష్కలమైన నీటిపాఱుదల సౌకర్యం గల బహుకొద్ది జిల్లాలలో మినహా రైతులకు ఏడాది పొడవునా పని కల్పించడంలో విఫలమౌతోంది.కనుక ఈ చర్య అత్యావశ్యకం.ఇది వలసల్ని నిరోధిస్తుంది.జరుగుబాటు లేక మనిషి తనను తాను అసహ్యించుకుని ఆత్మహత్య అనే అమానవీయ చర్యకు పాల్పడకుండా ఆశారేఖల్ని అతనిలో వెలిగిస్తుంది.ప్రతి సన్నకారు రైతుకుటుంబం నుంచి కనీసం ఒక్కరికి ఉపాధి ఏర్పడేలా మనం నిబంధనల్ని రూపొందించుకోవాలి.

మౌలిక సదుపాయాల కల్పన ఉన్నపళాన వెంటనే మన రైతుజీవితాల రూపురేఖల్ని మార్చిపారెయ్యదు.వాటి మధుర ఫలాలు గ్రామీణులకు అందడానికి కొంత పొదుగుడు కాలం (gestation_period)తీసుకుంటాయి.ఏర్పఱచాలే గానీ ఒకటి-రెండేళ్ళలోనే చాలావరకు మన గ్రామీణచిత్రంలో గణనీయమైన మార్పు కనిపిస్తుందని నా విశ్వాసం.

మన గ్రామాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు ?

1. ప్రాథమిక పాఠశాల - 8 మందికి ఉపాధి
2. ఉన్నతపాఠశాల - 10 మందికి ఉపాధి
3. బ్యాంకు - 5గురికి ఉపాధి
4. ఆసుపత్రి - 6గురికి ఉపాధి
5.గ్రంథాలయ-పఠనమందిర-ఉపన్యాస భవన - అంతర్జాల కేంద్ర - దూరదర్శన - సముదాయం (దీన్నే కల్యాణమండపంగా చేసి అప్పుడప్పుడు అద్దెకివ్వొచ్చు) - 8 మందికి ఉపాధి
6. అన్ని రకాల వాహనాలకూ మరమ్మత్తుల సముదాయం - 10 మందికి ఉపాధి (వీళ్ళలో ఒకరు వాహన విడిభాగాల విక్రేత)
7. పంచాయితీ సర్కిల్ ఆఫీసు - 4గురికి ఉపాధి (పన్నుల వసూలు, భూమి సర్వేలు, ప్రజాపనులు, ప్రజాసంబంధాలు మొ.)
8. గ్రామీణ రక్షక దళం (స్థానిక పోలీసు వ్యవస్థ-Civil Patrolling Outpost)- 10 మందికి ఉపాధి (పగటి కర్తవ్యకారులు 5గురు ; రాత్రికి 5గురు)
9. బట్వాడా ప్రతినిధి - ఒకరికి ఉపాధి (ఇతడు/ఈమె రోజుకొకసారి సమీప తపాలా కార్యాలయానికి వెళ్ళొస్తారు.ఇతడు/ఈమె అందజేసిన ప్రతి ఉత్తరానికీ, పార్సెల్‌కీ స్థానికప్రజలు అర్ధరూపాయి నించి రూపాయి దాకా చెల్లించాలి)

ఇవి కొన్ని మాత్రమే.ఇంకా ఎన్నో ఉన్నాయి.వీటి నిర్వహణలో సగం ఖర్చు జిల్లా యంత్రాంగం భరించాలి.మిగతా సగం స్థానిక ప్రజల నుంచి రుసుముల రూపేణ వసూలు చెయ్యాలి.నిర్వహణ సంగతి తరువాత ! అసలు మొదటి అడుగు పడేదెలా ?

వచ్చే టపాలో...

6 వ్యాఖ్యలు:

కొత్త పాళీ said...

లలితాబాలసుబ్రహ్మణ్యంగారూ, ఈ వరుస టపాలు చాలా బాగున్నాయి.
సునిశితమైన మీ పరిశీలన, లోతైన మీ ఆలోచన, స్పష్టమైన మీ అభివ్యక్తి మాకు సుపరిచితాలే. మామూలుగానే చాలా విషయాల గురించి శాస్త్రీయమైన అవగాహన ఏమీ లేకుండా కేవలం అపోహలతో జీవితాల్ని గడిపేస్తుంటాం. పల్లె, వ్యవసాయం, రైతు జీవితం - వీటన్నిటి గురించీ చాలా ఎక్కువ అపోహలే ఉన్నాయి జనాల్లో. ఎవరి అపోహలు వాళ్ళకి ప్రియమైనవి. ఎంత సత్య దూరమైతే అంత బలమైనవి.
దీనికి ఒకటే మందు - కనీసం చదువుకున్న వర్గాల్లో .. ఈ సమాజంలో ఏం జరుగుతోంది అని ఆలోచించే వర్గాల్లో ఈ సమస్య గురించి అవగాహన పెంచి ఆలోచన రగిలించటం. నిజ పరిస్థితిని వివరిస్తూ వివరణాత్మకంగా మీ వంటి ఆలోచనాపరులు బహిరంగ వేదికల్లో రాస్తుండటం ముదావహం.
రాజకీయుల్ని తిట్టటం చాలా సులభం. రాజకీయుల్ని తప్పు పట్టడంతో సరిపోదు కదా. ప్రతి సమస్యకీ అనేక కోణాలు ఉంటాయి. ఆర్ధిక, రాజకీయ, సామాజిక అవసరాలూ, పునాదులూ ఉంటాయి. ఈ చిక్కుముళ్ళలో నిర్భయంగా వేలు పెట్టి ఏపోగు కాపోగు విడదీసి చూపించే ధైర్యం, ఓపిక ఎందరికుంటుంది?
మన బ్లాగర్ల గుంపు నించి త్వరలో ఒక think-tank ఆవిర్భవించాలని నా వాంఛ.

రవి వైజాసత్య said...

ఈ శృంఖలలో తర్వాత టపా కోసం ఆతృతతో ఎదురుచూస్తునాన్నండీ

వింజమూరి విజయకుమార్ said...

తాడేపల్లి గారూ. రైతులకి సంబంధించిన ఈ టపాలు మంచివి. ఇంకా సామాజిక ప్రయోజనం కలిగినట్టివి. కనుక, కృతజ్ఞతలు. కానీ, ఒక విషయం. ప్రజల దగ్గర నుండి రాబట్టుకున్న 'రెవెన్యూ' నే ప్రజలకోసం ప్రభుత్వం ఖర్చు పెడ్తుందనే విషయం నవీన విద్యావంతులకి తెలుసుగానీ గ్రామీణులకి తెలీక ఓట్లకి డబ్బు తీసుకుంటున్నారన్నారు. ఒకవేళ తెలిసినా తీసుకుంటారనే నేనంటాను. ఉదాహరణకి ఒక నవీన విద్యావంతుడైన ప్రభుత్వోద్యోగికి లంచం తీసుకోవడం తప్పని తెలుసు. అయినా తీసుకుంటాడు. అలాగే పెండ్లికుమారుడికి కట్నం తీసుకోవడం, MLA కమీషన్ తీసుకోవడం, మంత్రులు లంచాలు ఇవన్నీ వాళ్ళకి తప్పని తెలిసే తీసుకోవడం జరుగుతుంది. ఇక నిరక్షరాస్యుడు, పేదవాడైన గ్రామీణుడెంత? అసలే అయిదేళ్లకొకసారి వచ్చే అవకాశం. ఓటుకి యాభై రూపాయల నుండి 500 రూపాయల దాకా అభ్యర్థుల పోటీ, ఆర్థికశక్తి కనుగుణంగా పంచే డబ్బు. ఉత్తమ పౌరుడుగానైతే నేననకూడదు గానీ, కామన్ సెన్స్ కనుగుణంగా నైతే గ్రామీణ ప్రజ ఓటుకి ఒకరి దగ్గరేం ఖర్మ వీలైతే పోటీ చేసే అందరు అభ్యర్ధుల దగ్గరా డబ్బు తీసుకుని తన అంతరాత్మ ప్రభోదం అనేంత మాట అనను గానీ (డబ్బు తీసుకున్నాడు గనుక) తన యిష్టం వచ్చిన వాడికి ఓటెయ్యాలంటాను. ఎందుకంటే ఉద్యోగి లంచం తీసుకుంటే రూల్సు మార్చి ఒకరికి రావాల్సిన ప్రమోషన్ యింకోరికివ్వాల్సి వుంటుంది. అలాగే ఒక MLA ఒకరి కాట్రాక్టు మరొకరికి యిప్పించాల్సి వుంటుంది. అంటే తను తీసుకున్న లంచానికి ప్రతిఫలంగా అన్యాయం చేస్తాడన్న మాట అన్నీ తెలిసే. ఇక గ్రామీణుడికి అటువంటి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. డబ్బు తీసుకుని తన యిష్ట ప్రకారం (Free will) తను నమ్మిన మంచి అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చు. ఇక మిగిలిన అభ్యర్థులను మోసం చేసాడు గదా అంటారేమో. మరి వాళ్ళు యితడి దరిద్రాన్ని ఓటు చేసుకోవాలనే దుర్భుద్ధి చేయలేదా. కనుక, కుక్క కాటుకి చెప్ప దెబ్బ!

రవి వైజాసత్య said...

వింజమూరి గారూ, ఆ ఓట్లకి ఇచ్చే డబ్బులకు పదవిలోకి వచ్చాకా బిల్లు పంపిస్తారని మర్చిపోతే ఎట్లా?

వింజమూరి విజయకుమార్ said...

ఎటూ బిల్లు pay చేయడం అనివార్యమైనప్పుడు గ్రామీణుడు మొత్తం తన కష్టం లోంచి కాకుండా వాళ్ళ డబ్బునే వాళ్ళకి పంపించడం హర్షణీయం కాదా రవి వైజా సత్య గారూ.

రవి వైజాసత్య said...

ఎవరి డబ్బూ..నాకు బుఱ్ఱ తిరిగిందండి. రాజకీయనాయకుల డబ్బా?? భారతీయ రాజకీయ నాయకులకు సొంత డబ్బంటూ ఉంటుందా?? బిల్లు పడేది పన్నులు కట్టే ప్రజలకండీ (ఎన్ని లెక్కలు మారినా ఈ ట్రాన్సాక్సన్లో చివరికి కష్టపడి సంపాదించి పన్నులు కట్టేవాడి డబ్బు, వోటువేయటానికి డబ్బులు తీసుకునేవాడి చేతిలోకే వెళుతుందండీ) అది ముమ్మాటికీ హర్షణీయం కాదు