15.12.07
రైతుల ఆత్మహత్యలు-2
11:49 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: వ్యవసాయం
మన అసలు సమస్య ఇక్కడే ఉంది. అది - మన రైతులకు సాగు తప్ప వేఱే నైపుణ్యాలేమీ లేకపోవడం. అసలు ఏ నైపుణ్యాలూ లేనివాళ్ళూ, అవి సంపాదించుకునే అవకాశం కూడా లేనివాళ్ళూ మాత్రమే సాగులో చొఱబడుతున్నారని ఇంతకుముందే అనుకున్నాం. అయితే నైపుణ్యాలు వికసించడానికి అవసరమైన వాతావరణం లేకుండా వాటిని సంపాదించాలనే ఇచ్ఛ కూడా కలగదు. ఆ నైపుణ్యాలకొక తక్షణ ప్రయోజనమూ, వినియోగ్యతా (utility) తాము నివసించే పరిసరాల్లో ఉండాలి. అణుశక్తి కేంద్రాలు లేని దేశంలో ఆ శాస్త్రం చదివిన మేధావికి వలసపోవడం తప్ప గత్యంతరం ఉండదు. ఇది మఱీ పెద్ద ఉదాహరణ అనుకోండి. ప్రస్తుతం ప్రయోజనమూ, వినియోగ్యతా అనేవి మన దేశంలో పట్టణప్రాంతాల్లో మాత్రమే లభ్యమౌతున్నాయి. అందుచేత సాగు చెయ్యలేక పట్నాలకు వలసవచ్చి ఏదో ఒక ఇతర నైపుణ్యాన్ని అలవర్చుకున్న గ్రామీణులు రెండు పూటలా అన్నం తినగలుగుతున్నారు. తిరిగి పల్లెకు పోవడానికి ఇష్టపడట్లేదు కూడా.
ఇందుకు భిన్నంగా మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర నైపుణ్యాల అభివృద్ధికి ఏం చెయ్యాలో మనం ఆలోచించాలి. ఇక్కడ వ్యవసాయం అంటే కేవలం దుక్కిదున్నడం కాకుండా తత్సంబంధితమైన ఇతర కార్యకలాపాలు (allied_activites) కూడా వస్తాయి. ఈ పని చెయ్యకుండా ఎన్ని పావలా వడ్డీలైనా, ఋణాల మాఫీలైనా, ఉచితవిద్యుత్తులైనా, అలాంటి ఏ ఇతర ధర్మసత్రపు చర్యలైనా సరే గ్రామీణుల్ని ఉద్ధరించవు. వాస్తవం చెప్పాలంటే పైన పేర్కొన్న ధర్మసత్రం చర్యలన్నీ అసలు సమస్యల మూలాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడని రాజకీయ జీవుల సృష్టే తప్ప - రైతులెప్పుడూ తమకు అవి కావాలని అడగలేదు. రైతులేమీ భిక్షగాళ్ళు కారు. వాళ్ళకు ఆత్మాభిమానమూ ఆభిజాత్యమూ ఉన్నాయి. వాళ్ళు ఏదీ ఊరికే వచ్చిపడాలని కోరుకోరు. వాళ్ళు ఆశిస్తున్నదల్లా కొంచెం అవగాహన, కాస్త మార్గదర్శనం. అంతే ! అయితే వాళ్ళకు ఆ రెండూ తప్ప మిగతావన్నీ పుష్కలంగా అందుతున్నాయి.
నాగరికత యొక్క ప్రాథమిక దశల్లో ఆహారం డబ్బుని సృష్టిస్తుంది. కాని నాగరికత పరాకాష్ఠకు చేరుకున్న దశలో డబ్బే ఆహారాన్ని సృష్టిస్తుంది. ఆ డబ్బు ఇప్పుడు నైపుణ్యాల సక్రమ వినియోగం ద్వారా సృష్టించబడుతోంది. నైపుణ్యాలకు తమ పరిసరాల్లో తక్షణ ప్రయోజనం ఏర్పడాలంటే ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు (infrastructure) ఏర్పడాలి. సదరు మౌలిక సదుపాయాల్ని నడిపించడానికి ఆ నైపుణ్యాలు ఉపయోగపెట్టబడతాయి. తద్ద్వారా నిరుద్యోగం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక చిన్న క్లినిక్ ఉంటే - అక్కడొక మందుల కొట్టు అవసరమౌతుంది. ఆ క్లినికి కి ఒక నర్సు, ఒక కాంపౌండరు, ఒక పారిశుద్ధ్య కార్మికుడు/ కార్మికురాలూ అవసరమౌతారు. ఒక గుడి ఉన్నా, బడి ఉన్నా, మఱొక గ్రంథాలయ - పఠనమందిరం ఉన్నా ఇలాగే వాటిల్లో ఒక్కొక్కదాన్నీ ఆశ్రయించుకుని డజనో, అరడజనో ఉద్యోగాలేర్పడతాయి. కాని మన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నవి బహుకొద్ది. మన దేశపు అభివృద్ధికి ఉన్న ఉన్న ప్రధానమైన చీకటికోణం ఇదే. మన దేశంలో నగరాలకే మౌలిక సదుపాయాలు లేవు. ఈ దేశంలో ప్రభుత్వ కార్యాలయాలు సైతం కిరాయికి తీసుకున్న వివిక్త (private) భవనాల్లోనే నడుస్తాయి .ఉదాహరణకు-హైదరాబాదులో ప్రతి చదరపు కిలోమీటరుకు ఎన్ని గ్రంథాలయాలున్నాయి ? ఎన్ని పార్కింగు లాట్లున్నాయి ? ఎన్ని పార్కులు ఉన్నాయి ? ఎన్ని ఆటస్థలాలున్నాయి ? పిల్లలు రోడ్ల మీద క్రికెట్టాడే పరిస్థితి ఎందుకొచ్చింది ? లెక్కవేసి ఆలోచించండి. ఇక పల్లెల కోసం ఏమాశిస్తాం ? మన దేశంలో ఇప్పుడందరూ మౌలిక సదుపాయాల సంగతి విస్మరించి చాలా పెద్ద యెత్తులెత్తుతున్నారు. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి భారీ చేపట్ల (projects) లో ఒక ఉద్యోగావకాశాన్ని కల్పించడానికి కోటి నుంచి పదికోట్ల దాకా ఎంతైనా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంత చేసినా బహుకొద్దిమంది సుశిక్షితులైన మేధావులకు మాత్రమే వాటిల్లో ఉపాధి లభిస్తుంది. మౌలిక సదుపాయాల రంగంలో అంత పెట్టుబడి అవసరం లేదు. ప్రతిలక్ష-రెండులక్షల రూపాయల పెట్టుబడికొకరు చొప్పున ఉపాధి కల్పించవచ్చు. మౌలిక సదుపాయాల్ని నిర్వహించడానికి పెద్దగా విద్యార్హతలు గానీ శిక్షణ గానీ అవసరం లేదు కూడా.
నైపుణ్యాలు ఎక్కువ సందర్భాల్లో అక్షరాస్యతని ఆశ్రయించుకుని ఉంటాయి. ఒకప్పుడు అన్నం ఉన్నవాడు విజ్ఞానాన్ని కూడా సంపాదించేవాడు. ఇప్పుడు విజ్ఞానమే మనిషికి అన్నం పెడుతోంది. అక్షరాస్యత పుష్కలంగా ఉన్న దేశాల్లో దాన్ని వినియోగించుకుని వేలాది కోట్ల డాలర్ల భారీస్థాయిలో వ్యాపారాలు కూడా నడుపుతారు. అక్కడ అమ్మేదీ కొనేదీ అంతా సమాచారమే. మఱి మన పల్లెల్లో అక్షరాస్యతే కఱువు. సర్వశిక్షా అభియాన్ నిధుల్ని తినేసే ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో రైతుల కంటే ముందు అక్షరాస్యతే ఆత్మహత్య చేసుకుంటోంది. ఇక మన రైతులకు ఏ విధంగా ఇతర నైపుణ్యాల్ని అలవఱుస్తాం ? ఎలా వాళ్ళని ఈ ఆత్మహత్యల విషవలయంలోంచి ఇవతల పడేస్తాం ?
