మనం ప్రేక్షకులుగా ఉండడానికి నిశ్చయించుకున్నాం.చివరికి మౌనప్రేక్షకులుగా మిగిలిపోయాం.నిజంగా మన చేతుల్లో ఏమీ లేదా ?
మనం చెయ్యగలది చాలానే ఉంది.కాని అలా చెయ్యడానికి ముందు మనం కళ్ళు తెఱుచుకుని గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
1. సినిమా, కళే గాని వ్యాపారం కాదు. కొందరు దాన్ని వ్యాపారంగా మార్చారు.మఱికొందరు ఇంకొంచెం ముందుకు పోయి దానిలో తమ భావి రాజకీయజీవితం, రియల్ ఎస్టేట్ లాంటి కళావిరుద్ధ లక్ష్యాలకు బీజాల్ని దర్శిస్తున్నారు.వెరసి సినిమా అనేది జాతి మీద పన్నిన కుట్రలా తయారయింది.మనం దీని కళాప్రతిపత్తిని తిరిగి మునుపటిలాగానే పునరుద్ధరించగలమని దృఢంగా నమ్మడం.
2. ఏ కళయినా ఒక విధమైన స్వచ్ఛంద ప్రజాసేవ మాత్రమే.అది ఆదాయాన్ని సమకూర్చిపెట్టడం యాదృచ్ఛికం.నిజమైన కళాభిమాని కళాసృష్టి చేసేటప్పుడు దాన్నుంచి ఆదాయాన్ని ఆశించకూడదు.బ్లాగుల నుంచి మనం ఏమి ఆదాయాన్ని ఆశిస్తున్నాం ?
3. మనక్కావాల్సిన వినోదాన్ని సినిమా పెద్దలు అందించలేకపోతున్నప్పుడు మన వినోదాన్ని తయారు చేసుకునే హక్కూ శక్తీ మనకు ఉన్నాయని నమ్మడం.ఇందుకోసం ప్రేక్షకుడే సినిమాని నిర్మించాలి.అది అతని కోసమూ అతనిలాంటివాళ్ళ కోసమూ.అంతేగాని రాష్ట్రమంతటా 250 ప్రింట్లతో విడుదల చేసి అమ్ముకుని లాభాలు గడించడానిక్కాదు.
4. ఈరోజు ఎన్నో విషయాలు వికేంద్రీకరణకు లోనవుతున్నాయి.బొంబాయి ఇంకెంతమాత్రమూ భారతదేశానికి ఏకైక ఆర్థిక రాజధాని కాదు.అలాగే హైదరాబాదొక్కటే తెలుగు చిత్రపరిశ్రమకు కేంద్రం కావాల్సిన అవసరం కూడా లేదు.జిల్లాల్లో కూడా కవులున్నారు.రచయితలున్నారు.నటులున్నారు.నాట్యనిష్ణాతులున్నారు.గాయకులున్నారు. సంగీత విద్వాంసులున్నారు.నిజానికి వాళ్ళు హైదరాబాదువాళ్ళ కంటే ఎక్కువ ప్రతిభావంతులని నా నమ్మకం.వాళ్ళంతా మనకప్పుడప్పుడు ప్రైవేటు టీవీ ఛానళ్ళలో టూకీగా దర్శనమిచ్చి కనుమఱుగవుతూంటారు.వాళ్ళని సెబాస్ అని మెచ్చుకునేవాళ్ళెవరూ వాళ్ళకు అవకాశమివ్వరు.తెలుగు సినిమాని ప్రజలే తమ చేతుల్లోకి తీసుకుని "ప్రజాసినిమా"ని నిర్మించుకున్ననాడు మన జాతికంతా కలిపి ఏకైక ఈ మెగాస్టార్లూ ఏకైక దర్శకరత్నలూ లాంటి కరువుకాటకాల నుంచి విముక్తి పొందుతాం.
5. ఒకప్పుడు ధనికవర్గాలకే పరిమితమనుకున్నవెన్నో ఈనాడు మధ్యతరగతిక్కూడా అందుబాటులోకివచ్చినప్పుడు సినిమా నిర్మాణం ఎందుకు రాదు ? ఒక నలభయ్యేళ్ళ క్రితం బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకునే కెమేరా కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు.ఈరోజు క్యాంకార్డర్లూ వీడియో కెమేరాలూ మధ్యతరగతికి అందుబాటులోకి వచ్చాయి.సినిమా తీసిన తరువాత ధ్వనినీ దృశ్యాన్నీ కూడా అద్భుతమైన నాణ్యతతో ఎడిట్ చేసుకోవడానికి Pinnacle వంటి ఉచిత మృదుసామాన్లు (సాఫ్ట్‌వేర్లు) అందుబాటులో ఉన్నాయి. గ్రాఫిక్స్ సహకారమందించడానికి యానిమేషన్ నిపుణులు విరివిగా లభిస్తున్నారు.మఱింక అడ్డేమిటి ?
6. ఒకప్పుడు దసరాకీ వినాయక చవితికీ కాలనీలో ఉన్న ఔత్సాహిక కళాకారులంతా కలిసి స్టేజి మీద నాటకాలాడినట్లే ఇప్పుడు మన సొంత సినిమాలో నటించి దాన్ని కాలనీలో ప్రదర్శించే అవకాశముంది.మనమా పని ఎందుకు చెయ్యడంలేదు ? ఈ సినిమావాళ్ళ నిరంకుశత్వం నుంచి బయటపడాలనే కోరిక మనలో ఎందుకు కలగడంలేదు ? మనకు లభిస్తున్నదంతా నెంబర్ వన్ సరుకని మనం భ్రమించడం చేతనా ? లేక మనలో ఆత్మవిశ్వాసం కొఱవడిందా ?
7. మనం ఊరూరా వందలాది చిత్ర పోషక సంఘాలు (Film Patrons' Clubs) గా ఏర్పడాలి.మనమందరమూ వాటిల్లో సభ్యులుగా చేరి వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించాలి.ఒకరు తీసిన సినిమా మఱొకరు తమ ఊళ్ళో తమ సంఘపు కార్యాలయంలోనే ప్రదర్శించేలా నోటిమాట ఒప్పందం చేసుకోవాలి.ఇందులో అంతా స్వచ్ఛందతే తప్ప ఇసుమంతైనా వ్యాపారాలూ సంతకాలూ లాభనష్టాలూ ఉండకూడదు.అప్పుడు మాస్ పేరుతో మన నోటిముందు "నాణ్యమైన వినోదపు కూడు" తీసేసిన డబ్బున్న అలగా మనుషులకు బుద్ధి చెప్పినట్లవుతుంది.
ఏదేమైనా మన సినిమా కళ యొక్క మౌలికతనీ నిరాడంబరతనీ అమాయకత్వాన్ని అందాల్నీ స్వచ్ఛతనీ స్వచ్ఛందతనీ ఔత్సాహికతనీ పునరుద్ధరించి దాన్ని వ్యాపారమని ప్రచారం చేసేవాళ్ళ నోళ్ళు మూయించాలి. ముందో వెనకో ఇది జరుగుతుంది. (ఈ వ్యాసపరంపర సమాప్తం)
10 వ్యాఖ్యలు:
ఈ వ్యాసం మొదటి నుండీ చదువుతున్నాను.అందరిలానే బాధని వెళ్ళగక్కుతున్నారు అనుకున్నాను.కానీ ఈ చివరి టపా మిగిలిన వాటి నుండి మీ ఈ వ్యాసాన్ని వేరు చేసి అందనంత ఎత్తుకు నిలబెట్టింది.లోపాలు అందరూ ఎత్తి చూపుతారు.కానీ ఏమి చెయ్యాలో చెప్పేవాళ్ళు తక్కువ వుంటారు.మీ సూచనలు బాగున్నాయి.అలోచన పరం గా అందరికీ నచ్చుతుంది.ఆచరణలో కష్టమేమో? తినేవాళ్ళందరూ వండాలి అంటే.......
5th point bagundi, developed countries lo 5th point jaragadam nenu chusa, chala baguntundi.
రెండవ పాయింట్ తప్పు. చేసే పని మీద శ్రద్ధ ఉండడం వేరు, ఆదాయాన్ని ఆశించక పొవడం వేరు. కళ ప్రజాసేవ కాదు. కళ ఉన్నది కళాకారుడి కొసమే. దానిని ప్రజలుచూచి ఆనందించడం - ఒక side effect.
తాడేపల్లి గారూ,
మీ అభిప్రాయాల్లో కొన్నిటితో నేను విభేధిస్తున్నాను.
ముఖ్యంగా, సినిమా కళే గానీ, వ్యాపారం కాదు అన్నది సరికాదేమో. అసలు సినిమా వ్యాపారమే కానీ కళ కాదు అన్నది సరేమో. ఈ మాటేదో ఈనాటి సినిమాలు చూసి చెప్పట్లేదు. మీరు 60 లేదా 70 దశకాల సినిమాలు చూసినా ఇదే పరిస్థితి. అప్పటి జయమాలినులు, జ్యోతిలక్ష్మిల నృత్యాలు ఆ రోజుల్లో ఎలా సెన్సారు తప్పించుకొని తెరపైకెక్కాయో నాకిప్పటికీ ఆశ్చర్యమే. ఈనాటి అయిటం సాంగ్స్ చాలా వరకు బలాదూరే వాళ్ళ ముందు.
ఆ మాటకొస్తే నిజాయితీగా కళ అని భావించి సినిమాలు తీసే గౌతం ఘోష్, బి.నర్సింగ రావులు లాంటి వాళ్ళ సినిమాలు ఎంత మంది చూడొచ్చారు. 50 వ దశకంలో ఎన్ని సినిమాలు విఫలం కాలేదు(కళాత్మకమయినా).
కళ అన్నమాట నిర్వచనం కూడా కాలానుగుణముగా మారుతోంది. కె.విశ్వనాథ్ చిత్రాలు గొప్ప కళాఖండాలుగా మీకూ నాకూ అనిపిస్తే, రాం గోపాల్ వర్మ చిత్రాలు మరి కొందరికి. స్వదేస్ సినిమా తీసి గొవారికర్ చేతులు కాల్చుకోలేదా. సినిమాకొచ్చిన లోపమేముంది. ఉన్న లోపమల్లా మాస్ గా పిలవబడే జనాలకి నీతులు చెప్పేవాడి సినిమా నచ్చలా.
కాకపోతే, మీరన్నట్లు జనాలే తమకి తాము సినిమాలు తయారుచేసుకోటం సంగతి యధాతధంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ, కాస్త ఆ దిశగా జరుగుతున్నదే, శేఖర్ కమ్ముల, నాగేష్ కుకునూర్ లాంటి వాళ్ళు తీసే సినిమాలు ఆ పరిణామక్రమములో భాగమని అనిపిస్తోంది.
http://sreenyvas.wordpress.com
1. నటన కళయితే, నాట్యం కళయితే, సంగీతం కళయితే, కథారచన కళయితే వాటన్నింటి సమ్మేళనమైన సినిమా మాత్రం కళ కాదనీ వ్యాపారమనీ పిడివాదం చేసేవాళ్ళకు నేను చెప్పేదేముంది ? సినిమా యొక్క ప్రస్తుత దుస్థితిని బట్టి అదే దాని అసలు స్వభావమని మనవాళ్ళని నమ్మించడంలో ఈ భ్రష్ట సినిమా జనం ఎంత విజయవంతం అయ్యారో నాకిప్పుడు అర్థమౌతోంది.
(వాళ్ళు సినిమాని ఏం చెయ్యదల్చుకున్నారో అదే మన ప్రేక్షకుల నోటివెంట చెప్పించడం. తద్వారా కళ యొక్క వ్యాపారీకరణకు అందరి ఆమోదముద్రనీ సంపాదించడం. ఈ వ్యాసపరంపర సరిగ్గా ఈ వక్రదృష్టిని సరిదిద్దడానికే ఉద్దేశించబడింది)
2. ఈ వ్యాసపరంపర యథాస్థితివాదుల కోసం ఉద్దేశించినది కాదు.
3. శేఖర్ కమ్ముల సినిమా వ్యాపారి కాడని నమ్మడానికి ప్రస్తుతం లభ్యమౌతున్న ఆధారాలు సరిపోవు.
మనం కూడా ఇలాంటి ప్రయత్నం చేద్దామేటి?
బ్లాగర్లలలో కథకులకు, ప్రతిభావంతులకు, ఔత్సాహికులకు కొదవ లేదు. మంచి సినిమా తీ(చూ)శామన్న దూల తీరుతుంది. లేదా ఒక కథనాల కర్మాగారం (స్క్ర్తిప్ట్ ఫ్యాక్టరీ) ఒకటి ప్రారంభిచ్చవచ్చు. లేద మన లోకల్ రచయితలను ఈ దిశగా ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు, మదనపల్లె రచయితల సంఘంలో ప్రతిభావంతులు కోకొల్లలుగా ఉన్నారు.
చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకొనుట కంటే...ఒక చిన్న దీపం వెలిగించుట మంచిది కదా?
నవీన్ గారిచ్చిన సమాచారం చాలా బావుంది.
అసలు మన సొంత కథలూ మన తెలుగు కథకవర్గమూ సినిమావాళ్ళనుకుంటున్నంత తక్కువ తరహావేమీ కావు. ఒకవేళ కల్పించినవి నచ్చలేదంటే నిజజీవితంలోనుంచే కథలు తీసుకుందాం. నటించాలనే కోరిక ఉండాలే గాని మన బ్లాగర్లలోనే అందమైనవాళ్ళు చాలామంది ఉంటారు.ఇప్పటి సినిమాల్లాగా రెండుగంటలపాటు కాకపోయినా కనీసం గంటా-గంటన్నరసేపు నిడివి గల సినిమా తియ్యొచ్చు.ఇలాంటి ఔత్సాహిక తెలుగు సినిమాల్ని ఆన్‌లైన్‌గా ప్రదర్శించడం కోసం ఒక ప్రత్యేక సాలెగూడు పెట్టుకోవచ్చు.ఇంత శ్రమా పడి ఉచితంగా చూపించడం ఇష్టం లేకపోతే ఋణరేకు (credit card) ద్వారా ఆన్‌లైన్‌గా రు.10 మన సాలెగూటికి చెల్లించాలని కోరవచ్చు.
తనికెళ్ళ భరణి "సిరా", శేఖర్ కమ్ముల "డాలర్ డ్రీమ్స్", నాగేష్ "హైదరాబాద్ బ్లూస్", ఉపేంద్ర "తర్లే నన్న మగ", ఫలానా "హైదరాబాద్ నవాబ్స్" అన్నీ రొడ్డకొట్టుడు సినిమాలకు విసిగిపోయి కొత్త తరహాలో మనలాంటోళ్ళు తీసిన సినిమాలే. మొదటి లక్ష్యం...కధనం (script) ఐతే చాలు...సినిమా తీయడమో, కధనం అమ్మడమో, అటకెక్కించడమో తరువాత చూసుకోవచ్చు.
ఔత్సాహికులంతా చేతులు లేపండి...లేపి వేరుకుంపటి పెట్టండి. ఈ ప్రక్రియ కనీసం మనలో క్రియేటివిటీ (తెప?)ని సత్తాను..పరిక్షించుకునే వేదికగా కూడా బావించవచ్చు. 24*7 ప్రేమ్స్ వెంకట్‌గారు వింటున్నారా?
అమెరికా పచ్చనోట్లు ఇచ్చిన బలంతో చాలా మంది ఔత్సాహికులు సొంత సినిమాలు తియ్యడానికి సాహసిస్తున్నారు. కానీ వాటిల్లో చాలా మట్టుకు వ్యక్తిగతమైన పైత్యం పాళ్ళు ఎక్కువై సోదిలోకి రాకుండా పోతున్నై. ఐనా సినిమా తియ్యాలి అనే ఉత్సాహం చూపుతున్న జనాలు (కనీసం నేను మాట్లాడిన వాళ్ళు) సినిమా గ్లామరు మోహంలో ఉన్నవాళ్ళే గానీ ఏదో మంచి కళాత్మక విలువలున్న సినిమా తియ్యాలని తపన ఉన్నవాళ్ళు కాదు.
ఇక్కడ రాసినది కొందరు అర్థం చేసుకోలేదు. వాళ్ళకు అర్థమయ్యేలా రాయకపోవడం బహుశా నాదే తప్పనుకుంటా. ప్రతిభా-అభిరుచులున్న ప్రేక్షకులే స్వయంగా తీసే సాంఘిక కథా సినిమాలు (ప్రజాసినిమాలు) రావాలి. అదే సమయంలో వాటిని (వ్యాపార సినిమాల్లాగా) థియేటర్లలో ప్రదర్శించాలని అనుకోకూడదు. ప్రేక్షకులుగా మనం తీసుకునే సినిమాలు మన ఆనందం కోసం మాత్రమే. నష్టపొమ్మని నేను చెప్పడంలేదు. టిక్కెట్టు పెట్టొద్దనీ నేననను.కాని మంచి కథాబలం గల సాంఘిక సినిమాల కోసం మొహం వాచిన ఆలోచనాపరుల వర్గం ప్రతి ఊళ్ళోను చాలానే ఉంది. అలాంటివాళ్ళ కోసం ఆయా ఊళ్ళలోని కమ్యూనిటీ హాళ్ళలోను, పాఠశాలల/కళాశాలల లెక్చర్ హాల్సులోను మన సినిమాలు విడుదల చేసుకుని నామమాత్రపు టిక్కెట్టు (రు.10-15) పెట్టుకుని తరువాతి సినిమా తియ్యడానికి సిద్ధం కావచ్చు. మొత్తం మీద సామాన్యమానవుడి వినోదం మీద కోట్లు సంపాదించాలనే ధోరణికి స్వస్తిచెప్పాలి. కళను సృష్టించడంలో కొంత పెట్టుబడి ఉన్నప్పటికీ అదేమీ వ్యాపారం కాదు. ఒక చిత్రకారుడు వేసిన బొమ్మకు కోట్ల ధర పలకొచ్చు. అంతమాత్రాన అతను వ్యాపారస్థుడైపోడు. ఒక హరిదాసుకు ఒక సభలో ఒక్కరోజులో పదివేల రూపాయల దక్షిణ ముట్టొచ్చు. అంతమాత్రాన అతను వ్యాపారస్థుడైపోడు. కళ కళే, వ్యాపారం వ్యాపారమే. కళని వ్యాపారంగా మార్చి అది అసలు కళే కాదని వాదించడం - ఒక పతివ్రతని మానభంగం చేసి ఆమెకు వేశ్య అని పేరుపెట్టడంలాంటిది.
ఇప్పుడు పెద్దపెద్ద డిజిటల్ వీడియో స్క్రీన్లు కూడా వచ్చాయి. సినిమా ప్రదర్శించడానికి ఒక CD ఉంటే చాలు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.