Sunday, November 25, 2007

మీ చంద్రుడెలా ఉన్నాడు ?

జనం జలంలో పడి చనిపోతున్న ప్రమాదాలు వాహన ప్రమాదాలతో సాటి వస్తాయి.అయితే అందరూ నీళ్ళలో పడి చనిపోరు.చంపడానికి కొందరు ప్రత్యేక వ్యక్తుల్ని నీళ్ళు ఎంచుకుంటాయి.జాతకంలో చంద్రుడు బాగాలేనివాళ్ళే ఆ ప్రత్యేకవ్యక్తులు.మనం అలాంటి ప్రత్యేకవ్యక్తులం కామని రూఢి చేసుకుంటేనే నీళ్ళ జోలికి పోవాలి.

చంద్రుడి వల్లనే ఎందుకు ? అంటే - చంద్రుడు జీవకారకుడూ, ఓషధీనాథుడూను.జీవకారకుడు కావడం చేత నీటిక్కూడా ఆయన అధిపతి.ఆయన వల్లనే పూర్ణిమా అమావాస్యల్లో సముద్రానికి ఆటుపోట్లు వస్తాయి.ఆ సమయంలో మనుషుల రక్తం కూడా ప్రకోపించి మనస్థితిలో మార్పులొస్తాయి.

చంద్రుడు బాగాలేకపోవడం అంటే ఏమిటి ? అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో చంద్రుడు లగ్నం నుంచి పన్నెండో ఇంట్లో ఉండడం, వృశ్చికరాశిలో ఉండడం, ఆయన ఉన్న రాశికి రెండు పక్కలా ఉన్న రాశుల్లో పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహు, కేతువులు కూర్చోవడం, లేదా చంద్రుడు తానున్న రాశిలో 26 డిగ్రీలు దాటేసి గాని, 8 డిగ్రీల లోపల గాని ఉండడం.వీటిల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా సరే, ఆ వ్యక్తి జలాశయాల జోలికి పోకుండా ఉండడం మంచిదని తెలుసుకోవాలి.

జాతకం లేకపోతే ఏం చెయ్యాలి ? చంద్రుడు బాగాలేనివాళ్ళ లక్షణాలు వాళ్ళ జీవనశైలిని బట్టి తెలుస్తూనే ఉంటాయి.వాళ్ళకు వ్యాపారం గిట్టదు.ఉద్యోగమే చేస్తామంటారు.కాని ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు.తల్లితో పడదు.పైకి ఏమీ అనకపోయినా తల్లి మాటలూ చేష్టలూ నచ్చవు.లేదా ఆమెకే వాళ్ళంటే గిట్టదు.లేదా అతను కడుపులో ఉండగా గర్భవిచ్ఛిత్తి చేసుకోవాలని అతని తల్లి తీవ్రంగా ఆలోచించి ఉంటుంది.వాళ్ళకు ముక్కు సమస్యలూ జలుబు సమస్యలూ ఎలర్జీలూ వదలకుండా పీడిస్తూ ఉంటాయి.పాల వాసనే నచ్చదు.తలస్నానం చేసినప్పుడు ఊపిరాడనట్లుగా అనుభూతిల్లుతారు.క్షణానికో చిత్తంగా చంచలంగా ఉంటారు.దేని మీదా దృఢమైన అభిప్రాయాలు ఉండవు.ఉన్నా చాలా త్వరగా మారిపోతాయి.ఎలాంటి మానసిక ఒత్తిడికీ తట్టుకోలేరు.

జలగండం సాధారణంగా మాతృద్రోహం వల్లా మాతృశాపం వల్లా ఏర్పడే తీవ్రాతితీవ్రమైన జాతక లక్షణం.ఇవన్నీ పూర్వజన్మకర్మఫలమే కనుక ఇప్పుడు సత్కర్మ చేసుకుంటే దాని దుష్ఫలితాల్ని అదుపులో పెట్టవచ్చు.జగన్మాత అయిన దుర్గాదేవిని ఆరాధిస్తే ఆవిడ మాతృశాపాల్ని అడ్డుకుంటుంది.లేకపోతే తల్లిలా ప్రాణం పొయ్యాల్సిన నీరే మనిషి ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తుంది.

5 వ్యాఖ్యలు:

స్మైల్ said...

చంద్రుడి మీద మనిషి పాదం మోపి వచ్చాక కూడా ఇవన్నీ నమ్మవచ్చంటారా? మీ అభిప్రాయాల్ని నేను కాదనడం లేదు. వాటిని గౌరవిస్తూనే, ఏదీ ఇదమిద్ధంగా తెలియని కాలంలో ఇవన్నీ నమ్మవచ్చేమో కానీ కళ్లకెదురుగా కనపడుతున్న వాస్తవాన్ని కాదనలేం కదా?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మనిషి చంద్రుడి మీదికెళ్ళొస్తే చంద్రుడి దైవత్వం రద్దయిపోతుందా ? పూర్వజన్మ, రాబోయే జన్మ, కర్మఫలం అన్నీ పొల్లుపోతాయా ? వందల కోట్లసార్లు ఫలితాలు చూపించిన జ్యోతిశ్శాస్త్రం అబద్ధమయిపోతుందా ?

కళ్ళకు కనిపించేది మాత్రమే చెబుతుంది ప్రకృతివిజ్ఞానం. కళ్ళకు కనిపించనిది కూడా చెబుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం. ఏది ఎంచుకుంటారనేది వారివారి ఇష్టం.

రాకేశ్వర రావు said...

మొన్న టీవీలో ఒక కార్యక్రమం చూసా.
అందులో శాస్త్రవేత్తలు మనుషుల ప్రవర్తనకీ, పౌర్ణమీకీ ఏఁవైనా సంబంధం వుందా అని విశ్లేషించారంట. ఎటువంటి కొ-రిలేషనూ కనబడలేదంట. అంటే లేదని కాకపోవచ్చు, మీ టపా చదివి అది గుర్తుకువచ్చి చెబుతున్నా...

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఇలాంటి విశ్లేషణలు ఎంత గొప్ప శాస్త్రవేత్త చేశాడన్నా నేను నమ్మను. అతడికి నోబెల్ బహుమతి వచ్చి ఉన్నా సరే, నేను నమ్మను. నేను నమ్మేది నా సొంత అనుభవాన్ని మాత్రమే.

వాళ్ళు సదరు "విశ్లేషణ"కి దిగేముందే ఒక conclusion కి వచ్చేసి ఉంటారు. విశ్లేషణ నామమాత్రమే. అదంతా తమ conclusion ని లేదా prejudice ని నిజంగా ప్రకటించి అందరి నోళ్ళూ మూయించాలనే ఒక రకమైన బౌద్ధిక గూండాయిజంతో చేసే కసరత్తు మాత్రమే. ఇలాంటి శాస్త్రవేత్తలే ఆ మధ్య 2002 లో జ్యోతిశ్శాస్త్రం తమ విశ్లేషణలో అబద్ధమని తేలిపోయిందని ప్రకటించారు. మన దేశంలో ఉన్న నాస్తికులూ తతిమ్మా పాషండ జనమూ "ఇదిగో సైంటిఫిక్ ఒపినియన్ వచ్చేసిం"దంటూ తెగ సంబరపడిపోయారు. అదేంటో గాని, ఆ తరువాత కూడా జ్యోతిశ్శాస్త్రజ్ఞుల గిరాకీ ఏమీ తగ్గలేదు.

ఎవరీ శాస్త్రవేత్తలు ? : వీళ్ళు కంపెనీల లాభాలకు అనుగుణంగా దొంగ పరిశోధనల నివేదికలిచ్చి జనాన్ని తప్పుదోవ పట్టించడానికి సిద్ధమయ్యే కిరాయి మేధావులు. శంఖంలో పోస్తేనే గాని తీర్థం కాదని తాము ప్రచారం చెయ్యదల్చుకున్న విషయాల్ని వ్యాపారవర్గాలు వాళ్ళ నోటివెంట డబ్బులిచ్చి చెప్పిస్తూంటాయి. అలాంటి కంపెనీలు ఆ మధ్య "పొగ తాగితే కేన్సరు రా"దని ఒక "శాస్త్రీయ నివేదిక" ఇప్పించాయి. కేన్సరుకు కాలుష్యం కారణం కాదనీ, సూక్ష్మజీవులే కారణమనీ నివేదిక ఇచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియన్ "శాస్త్రవేత్తల"కు నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు (కంపెనీలవాళ్ళు దగ్గరుండి మఱీ ఇప్పించారంటే బావుంటుంది)

ఒకప్పుడు జనం మతాన్ని విజ్ఞానంగా నమ్మేవారు. ఇప్పుడు విజ్ఞానాన్ని మతంలా నమ్ముతున్నారు. మన ఆలోచనల్ని శాసించడానికి పురోహితుల స్థానంలో శాస్త్రవేత్తలని పేరుపెట్టుకున్న అల్పాచమానం గాళ్ళు తయారయ్యారు. అంతే తేడా !

మీకు చంద్రుడు బావుండడం బాగాలేకపోవడం ముఖ్యమైన విషయాలు కాకపోతే ఒదిలెయ్యండి.

Vittal said...

మీ వ్యాసం ద్వారా నాకు తెలియని ఒక విషయాన్ని తెలుసుకున్నాను, కృతజ్ఞతలు. కాకపోతే కొన్ని ఉదాహరణలు(చిత్రాలు) ప్రచురిస్తే నాలాంటి వారికి ఉపయోగకరంగా వుంటుంది.

నేను రాకెట్ ప్రయోగించటానికి కూడా ముహూర్తం చూడటం అవసరం అనే వాళ్ళల్లో ఒకడిని. నేను నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ లో విశ్వం గురించిన కార్యక్రమాలను ఎంత ఉత్సాహంగా చూస్తానో అంతకంటే ఎక్కువగా మన శాస్త్రాన్ని నమ్ముతా. మనం నేర్చుకున్న విజ్ఞానాన్ని వీలైతే రెంటినీ అనుసంధానం చేసేందుకు ఉపయోగించాలనుకుంటాను.(ఉదాహరణకు, సముద్రం దాటేటప్పుడు ఆంజనేయ స్వామికి ఒకటి కంటే ఎక్కువ సూర్యుళ్ళు కనిపించారని అంటారు, దానికి నేను జియోగ్రాఫికల్ గా ఉన్న టైం డిఫరెన్సు కారణం ఏమో అనుకుంటా). మనం విశ్వంలో ఒక కాంతి సంవత్సర దూరం కూడా ప్రయాణించలేదు, మన శాస్త్రజ్ఞులు మేము విశ్వం మొత్తం చూసేసాం, చదివేశాం అన్న తర్వాత అప్పుడు చూద్దాం ఎవరిని నమ్మాలో వద్దో.

నేను తెలుగులో బ్లాగు కి సమాధానం ఇవ్వటం ఇదే మొదటి సారి. తప్పులు ఏమైనా ఉంటే మన్నించాలి. ఇంగ్లీష్ పదాలు మధ్యలో ఎలా టైపు చెయ్యాలో తెలియలేదు.