చాలా మంది తమ పసితనమూ బాల్యమూ తమకు గుర్తులేవనడం విని నేనాశ్చర్యపోతాను-ఇదెలా సాధ్యమా ? అని ! క్రీ.శ.1972 నుంచి జరిగినవన్నీ నాకు బాగా గుర్తున్నాయి.1970-71 కూడా లీలగా గుర్తుంది.అయితే అవి నా వ్యక్తిగత జ్ఞాపకాలకు సంబంధించినవి.నేను నా 7వ ఏటినుంచే తెలుగు దినపత్రికలు చదవడం మొదలుపెట్టాను.మా నాన్నగారికి దినపత్రికల వ్యసనం ఉండేది కనుక అది నాకూ అబ్బింది.
ఎందుకు చెబుతున్నానంటే - అప్పటికీ ఇప్పటికీ దేశంలో వచ్చిన మార్పు గుఱించి.అప్పుడు కూడా దినపత్రికలు బాగానే ఉండేవి-ఇప్పటిలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ! (అయినా ఆ రోజుల్లో ముద్రితమైన కొన్ని పత్రికలూ పుస్తకాలూ ఈనాటి కంప్యూటరీకృత ముద్రణకు దీటుగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు) హార్డువేరూ లేదు, సాఫ్టువేరూ లేదు-ఫుట్‌వేరు తప్ప ! టీవీలు కూడా లేవు.ఎక్కడో మెట్రోపాలిటన్ నగరాల్లో ధనికుల యిళ్ళలో టీవీలు ఉంటాయని వినేవాళ్ళం.కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు 1908లో స్థాపించిన ఆంధ్రపత్రికకు 1970లలో కూడా విపరీతమైన ప్రాచుర్యం ఉండేది.1990ప్రాంతంలో ఆంధ్రపత్రిక శాశ్వతంగా మూతపడింది.పున:ప్రారంభించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.చివరికి బషీర్‌బాగులో ఉన్న దాని కేంద్రకార్యాలయాన్ని 1993ప్రాంతంలో ననుకుంటా-లోకాయుక్త న్యాయస్థానంగా మార్చారు.అది కాక ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, విశాలాంధ్ర, ప్రజాశక్తి కూడా వచ్చేవి.ఆరోజుల్లో మూడు నాలుగు ఎడిషన్లు ఉండడమే గొప్ప.ఈనాడు అప్పుడప్పుడే మొదలయింది.కాని అది ఎవరికీ నచ్చేది కాదు-చాలాసార్లు ఇతర పత్రికలలో అప్పటికే ప్రచురితమైన చద్దివార్తలు వేస్తాడని పేరుండేది.ఉదయం దినపత్రికని 1985లో దాసరి నారాయణరావు స్థాపించడం, దాన్ని కీ.శే.మాగంటి సుబ్బరామిరెడ్డి కొనడం, ఆ తరువాత ఆయన ఎవరి చేతుల్లోనో కాల్పులకు గురై చనిపోవడం, అలా ఆ పత్రిక శాశ్వతంగా మూతపడ్డం - ఇదంతా మనకు తెలిసిన కథే.
ఇప్పటిలా అప్పట్లో అవినీతి కుంభకోణాలు పతాక శీర్షికల కెక్కేవి కావు.అవినీతి లేదని కాదు.సాక్షాత్తూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటే అవినీతికేం కొదవ ? కాని ఇప్పటిలా భూమ్యాకాశాల్ని మింగిపారేద్దామనేంత స్థాయిలో మాత్రం ఉండేది కాదని చెప్పగలను.జనంలో ఇంకా దేశాభిమానం తాజాగానే ఉండేది.స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న యోధులూ స్వాతంత్ర్యం గుఱించి పాటలూ పద్యాలూ కట్టిన కవులూ కోకొల్లలుగా అప్పటికింకా బ్రతికే ఉన్నారు.వాళ్ళల్లో కొంతమంది గుంటూరులో మాయింట్లో అద్దెకున్న ఆంధ్రాబ్యాంకు కొచ్చేవారు-పెన్షన్ డబ్బులు తీసుకోవడం కోసం.
అదో ఆదర్శాల యుగం.దేశం పేదగా బీదగా బక్కచిక్కి ఉండేది.నిరుద్యోగం ఎల్లెడలా తాండవించేది.అన్నింటికీ కంట్రోళ్ళూ పర్మిట్లూను.అప్పట్లో సమసమాజం గుఱించి మాట్లాడనివాడు పరమపాపాత్ముడుగా జమ.ఎల్లెడలా ప్రభుత్వ ఏకపాత్రాభినయమే.ప్రైవేటు పాత్ర అత్యంత పరిమితం.సమసమాజం హోరులో ఎవరికీ అందులో తప్పు కనిపించేది కాదు.సామాన్యజనంలో అమెరికా అంటే ద్వేషం.రష్యా అంటే పిచ్చి మోజు.పేదవాళ్ళమైతేనే, మనదొక మహాదేశం, మనదొక గొప్ప ప్రాచీన సంస్కృతి అనే గర్వం మాత్రం జనంలో ఉండేది.మనుషుల్లో"కులగుల"ఇప్పటంత ఉన్నట్లు జ్ఞాపకం రావడంలేదు.అది ఎక్కువ భాగం 1983తరువాత బయలుదేరింది.టెఱ్ఱరిజం అంటే ఏమిటో ఎఱగం.కాని హైదరాబాదు పాతబస్తీలో గొడవలుగా ఉందని మాత్రం అప్పుడప్పుడు వార్తలొచ్చేవి.మాకు తెలిసిన అతిగొప్ప హింసాకాండ అదే.
మనుషులు చిన్నచిన్న కోరికలతో చిన్నచిన్న ఆనందాలతో సరిపెట్టుకున్న రోజులవి.చక్కగా చదువుకోవడం ఎక్కడైనా ఒక చిన్న పర్మినెంటు ఉద్యోగం సంపాదించుకోవడం-ఇంతవరకే పరిమితం.ఆడపిల్లలయితే ఇంటరుతో లేదా ఆలస్యమైతే డిగ్రీతో చదువాపెయ్యడం, పెళ్ళిచేసుకోవడం-ఇలా ఉండేవి.ఉన్న పళాన కోటీశ్వరుడు కావడం, కార్లలో విహరించడం ఇలాంటివి సినిమాల్లో చూపించేవారు.జనం అవి చూసి హాయిగా నవ్వుకుని మర్చిపోయేవారు.కలలు బొత్తిగా లేవని కాదు.కాని అవి వాస్తవాలతో విడాకులు తీసుకున్నటువంటివి మాత్రం కావు.ఆ రోజుల్లో ఆడపిల్లలు యద్దనపూడి మాదిరెడ్డి నవలలు చదువుతూ వాటిల్లోని హీరోల గుఱించి ఊహల్లో తేలిపోయేవారు.అప్పట్లో అమ్మాయిల అభిమాన లక్ష్యం-టైపూ షార్ట్ హ్యాండు నేర్చుకుని ఎక్కడైనా స్టెనోగా చేరడం.అందుకని ఏ పట్టణంలో చూసినా పొద్దునే లంగా ఓణీ ధరించి తలొంచుకుని టైపింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు వెళుతున్న అమ్మాయిలు రోడ్ల మీద విరివిగా కనిపిస్తూండేవారు.కాని ఆడవాళ్ళ సంపాదన కుటుంబాలకు ప్రధానమైన ఆదాయవనరు కాదు.
అవినీతి కుంభకోణాలు భారీయెత్తున బయటపడ్డం 1980ల నుంచి మొదలయింది.మొదట్లో జనం బాధపడ్డారు.కష్టపడి స్వాతంత్ర్యం సంపాదించింది ఇందుకేనా ?అని వాపోయారు.క్రమంగా అవినీతివార్తావాహిని రోజువారీగా వెల్లువెత్తడంతో నెమ్మదిగా అలవాటుపడ్డారు.బాధ స్థానంలో"ఇదంతా మామూలే"అనే నిర్లిప్త ధోరణి చోటుచేసుకుంది.
ఇప్పుడు ఉన్నదల్లా-అలా అవినీతి చేసే అవకాశం తమకు దక్కకుండా పోయిందనే బాధ."నేను కాకపోయినా మావాడెవడైనా అవినీతి చేసి పైకొస్తే చాలు."ఇదే ఈనాటి దేశభక్తి.




4 వ్యాఖ్యలు:
నా బాల్యం నుండి చూసి మనసు లోతుల్లో అడుగుకు చేరిన పరిస్థితులను తిరిగి గుర్తుతెచ్చారు. ధన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్
బాలసుబ్రహ్మణ్యంగారు,
మీ టపాతో నా చిన్నతనపు జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారండి. ధన్యవాదాలు. నాకు కూడా చిన్నప్పటినుండి దినపత్రికలు, వారపత్రికలు చదవడం అలవాటు. మా నాన్నగారికి ఓ అలవాటు ఉండేది. ఎదైనా సంచలన వార్త కాని సంఘటన కాని జరిగి,దానిగురించి నిండిపోయిన దినపత్రికలను దాచిపెట్టడం. ఐదేళ్ళ క్రిందవరకు నా దగ్గర నెహ్రూగారు చనిపోయిన రోజు పేపర్లు, ఇందిరాగాంధి చనిపోయినరోజు నాటి పేపర్లు, అమెరికాలో జరిగిన జంట టవర్ల కూల్చివేత పేపర్లు ఉండేవి.అప్పుడప్పుడు తీసి చదువుకునేదాన్ని. వేరేవాళ్ళకి కావాలంటే ఇచ్చేసా. వారపత్రికలైతే అప్పట్లో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి,ఆంధ్రపత్రిక,యువ,చందమామ,బాలమిత్ర,స్వాతి మంత్లీ,ఇవన్నీ చదివేదాన్ని.ఈ అలవాటు మా అమ్మనుండి నాకొచ్చింది. ఇక నవళ్ళంటే మీరన్నట్టు యద్దనపూడి నవల్లు దాదాపు అన్ని చదివా. మీరు చెప్పింది నిజమే అప్పట్లో అందరు అమ్మయిలు యద్దనపూడి నవల్లొ హీరోలాంటి మొగుడిని కోరుకునేవారు. ఈ రోజుల్లోలాగా హీరోలాంటి బాయ్ ఫ్రెండ్ కాదు. అప్పట్లో ఇంటర్ చదువే ఎక్కువ అమ్మాయికి. పదో క్లాసు పాసుకాగానే టైప్ నేర్చుకోడానికి వెళ్ళేదాన్ని. కాని ఒక్కటండి. అప్పుడు అమ్మయిలకు చాలా భద్రత ఉండేది. నేను స్కూలు,కాలేజీనుండీ ఇంటికి రావడం ఆలస్యమై చీకటిపడ్డా కూడా మా అమ్మ భయపడేది కాదు. కాని ఈ రోజుల్లో అరగంట ఆలస్యమైనా భయపడే రోజులు ఆడపిల్లలైనా, మగపిల్లలైనా.నిజంగా ఆ రోజులు మరపురానివి, మధురమైనవి ఇప్పట్లా సాంకేతికంగా అభివృద్ధి లేకున్నా. ఇప్పుడంతా ఒకే భావన... మా ఇంటికొస్తే ఎమితెస్తావ్, మీ ఇంటికొస్తే ఎమిస్తావ్???
ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా బాగుంది. ఇలాంటి సంగతులు మా నాన్నగారి నుండి వినేదానిని.తాతయ్య బధువుల గురించి,స్నేహితుల గురించి చెప్పేవారు గానీ అప్పటి సా0ఘిక,ఆర్ధిక పరిస్థితుల గురించి ఎప్పుడూ చెప్పేవారు కాదు.
గురువు గారు చాలా బా రాశారు,
ఏన్నో గొప్ప గొప్ప రచనలు చేసిన మీకు నేను ఏమీ చెప్ప లేను, కాని
మీరు ఇలాంటి ఎన్నో సంగతులు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నము.
Post a Comment