కొన్నిరోజుల క్రితం ఉత్తర భారతదేశం నుంచి అందిన వార్త.ఆలస్యంగా వచ్చినందుకు ఒక పిల్లవాణ్ణి బడి చుట్టూ ఏడుసార్లు పరిగెత్తమన్నారట. ఆ పిల్లవాడు పరిగెత్తుతూ ఇక పరిగెత్తలేక చనిపోయాడట. ఇది మొదటి సంఘటన కాదు. ఇదే చివరిదీ కాబోవడంలేదు.
మన దేశంలో మగపిల్లల కోసం వెంపర్లాట చాలా ఎక్కువ. కాని మగపిల్లలు పుట్టాక వాళ్ళని పెద్దలు మన్నించే విధానం మాత్రం దారుణాతిదారుణంగా ఉంటోంది. ప్రతి చిన్న విషయానికీ వాళ్ళని వీరబాదుడు బాదెయ్యడంలో మనవాళ్ళకు ఏ విధమైన తప్పూ కనిపించడంలేదు. ఈ బాదుడు కార్యక్రమం ముందు తల్లితో మొదలై బళ్ళో ఉపాధ్యాయుల దాకా వెళుతోంది. సదరు తల్లుల్లో ఎక్కువమంది నిరంకుశులైన Control-freaks. వాళ్ళు మొదట్లో అలా ఉండరు. కాని మగపిల్లలు పుట్టాక అలా అవుతారు. మగపిల్లలు ఆడపిల్లల్లాంటివాళ్ళు కాకపోవడం వాళ్ళకొక పెద్ద సమస్యలా కనిపిస్తుంది. అయినా వాళ్ళతో వ్యవహరించడానికొక పద్ధతుందని వాళ్ళకు తెలియదు. పిల్లలే కాదు, ఎవరిలోనైనా మనం హేతువాదాంశని అందుకోగలిగితే రక్తపోట్లు తద్వారా గుండెపోట్లూ తెచ్చుకునే అవసరం రాదు
మగపిల్లల్ని పెంచడానికి ఎక్కువ సహనం కావాలి. ఎక్కువ అవగాహనాశక్తి కావాలి. ఎక్కువ వాక్చాతుర్యం కావాలి. ఎక్కువ ముక్కుసూటిదనం కావాలి. ఇవి ఎంతగా ఉంటే అంతగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. గౌరవిస్తారు. సమస్యగా కనిపించినవాళ్ళే మనకు పరిష్కారంగా మారతారు. మగపిల్లలు మనకు తలొగ్గుతున్నట్లు ఉంటూనే మన బలహీనతల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. కాని పెద్దల్లో అంతకు ముందునుంచి లేని లక్షణాలు మగపిల్లలు పుట్టాక హఠాత్తుగా వచ్చిపడవు కదా ! ఫలితమే, వాళ్ళని చావగొట్టి చెవులు మూసి అదుపులోకి తెచ్చుకుందామనే ధోరణి. మొదట్లో సత్‌ఫలితాలిస్తున్నట్లు కనిపించే ఈ పద్ధతి కొన్ని కోట్లసార్లు విఫలమై ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మగపిల్లలు పెఱిగి పెద్దయి మగవాళ్ళుగా జీవపరిణామం చెందాక వాళ్ళు ఆడవాళ్ళని మన్నించే విధానంలో ఈ వైఫల్యం నగ్నంగా బయటపడుతూంటుంది.
నా అంచనాలో నూటికి 90 మంది మగపిల్లలు ప్రేమకు మొహం వాచినవాళ్ళు. ఘోరమైన నిర్లక్ష్యానికి గురిచెయ్యబడ్డవాళ్ళు. వాళ్ళ వల్ల సమాజానికి ఇంకా జరగాల్సినంత నష్టం జరక్కపోవడం కేవలం భగవత్‌కృప. మనిషి కొన్ని విషయాల్లో కంప్యూటర్‌లాంటివాడే. ఏ మృదుసామాను ఎక్కిస్తే దాన్నే ప్రదర్శిస్తాడు. తాను పొందిన అనుభవాల్నే అతడు ఇతరులక్కూడా కలిగిస్తాడు. బాల్యం నుంచి ప్రేమరాహిత్యంతో పెఱిగిన మగపిల్లలు పెద్దయ్యాక ఇతరులకు ప్రేమ నెలా పంచగలరు ?
భోరున ఏడవడాన్నే సున్నితత్వానికి చిహ్నంగా భావించే మన తల్లులూ, మన గురువులూ, మన పెద్దలూ ఏడవడం చేతకాని మగపిల్లల బాధని ఏ విధంగా అర్థం చేసుకోగలరు ? కష్టాల్ని కన్నీళ్ళ భాషలో తప్ప మఱోరకంగా అర్థం చేసుకోలేకపోవడం సున్నితత్వమౌతుందా ?
.
