బీసీల వేసట (యాష్ట)
బీసీల"రాజ్యాధికారపార్టీ"త్వరలో ప్రారంభం కాబోతోంది. అది ప్రారంభమైతే ఇంతకుముందే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్థాపించిన"93 బీసీ కులాల ఐక్యవేదిక"తెలంగాణా ప్రాంతానికి అందునా కేవలం హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు పరిమితమయ్యే అవకాశముంది.ఇప్పుడు కూడా ఐక్యవేదిక తరఫున కార్యకలాపాలేమీ చురుగ్గా జరగడంలేదు.జ్ఞానేశ్వర్‌కి నాయుడుగారితో పడక తెలుగుదేశం పార్టీలోంచి బయటికి రావడం, ఆయనకు ఇతరకులాల్లో పెద్దగా పలుకుబడి లేకపోవడం, అలా అది ప్రాథమికంగా ముదిరాజుల వేదికగా మిగిలిపోవడం ఇందుకు కారణాలు.
"రాజ్యాధికారపార్టీ"అనే పేరింకా ఆధికారికంగా ఖాయం కాలేదు.కాని ఆ పేరు బాగాలేదు.పార్టీ అంటేనే అధికారం కోసం కుమ్ములాడే ఒక జనసమూహం అని మనకు తెలుసు.బీసీలకు అధికారం కావాలనే ఆశయం బావుంది కానీ అది మఱీ పచ్చిగా పార్టీ పేరులోనే చొఱబడ్డం బాగాలేదు-మాంసం తింటున్నారు కదా అని ఎముకలు మెడలో వేసుకున్నట్లు.పైగా అది చాలా ఆత్రాన్నీ (desperation) అసహనాన్నీ సూచిస్తోంది."సర్వజనసమాజం, మహాజనసమాజం"లాంటి పేర్లు బావుంటాయి.
ఇప్పుడు రాష్ట్రంలో నానాపార్టీలు నానాప్రాతిపదికల మీద ఏర్పడి నడుస్తున్నాయి.ఇందిరాగాంధి పేరుచెప్పుకుని కాయలమ్ముకునే కాంగ్రెస్సు, ఎన్టీయార్ ఘనత మీద ఆధారపడి ఉన్న తెలుగుదేశం, సమసమాజం ఎప్పుడో తప్పకుండా వస్తుందంటూ కాలజ్ఞానం చెప్పుకుని బతికే కమ్యూనిస్టులూ, "తెలంగాణా రేపు"అని గోడమీద రాసుకున్న టి.ఆర్.ఎస్, హిందీపేరు పెట్టుకుని తెలుగువాళ్ళ వోట్లతో ఇతరరాష్ట్రాల్లో కూడా విస్తరించాలని పగటి కలలు కంటున్న, ఉట్టికెగరలేని లోక్‌సత్తా, నందికొండ వాగుల్లోన, నల్లతుమ్మ నీడల్లో అఘోరిస్తున్న స్థానిక బి.ఎస్.పి.,శివసేన, రిపబ్లికన్, త్రిలింగ పార్టీలు -ఇలా ఛప్పన్న పార్టీలూ, ఉఱుము లేని పిడుగులూ, వట్టి పుట్టగొడుగులూ.వీటికి తోడుగా జోరుగా విహరిస్తున్న చిరంజీవి సొంతపార్టీ ఊహాగానాలూ.
ఇన్ని పార్టీలుండగా మళ్ళీ బీసీల పార్టీ ఒకటా ? అనిపిస్తుంది. ఎవరబ్బా, వీళ్ళందరికీ వోట్లేసి గెలిపించబోతున్నది ? అని కూడా అనిపిస్తుంది.మంచి ప్రశ్నే. బీసీలకోసం ప్రత్యేకంగా పార్టీ అవసరమా ?
అవసరమే-బీసీ నాయకులు విడుదల చేసిన వివరాల్ని బట్టి చూస్తే. ఎన్ని రాజ్యాంగ కబుర్లు చెప్పినా ఈ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాలు రెండు ఎస్సీ కులాలకూ, రాజకీయాలు మూడు అగ్రకులాలకూ పరిమితమై కూర్చున్నాయి.ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది కఠోరవాస్తవం.వీళ్ళల్లో ఒక అగ్రకులం తమని కూడా బీసీల్లో చేర్చాలనీ తమక్కూడా రిజర్వేషన్లు కావాలని చాలాకాలం నుంచి డిమాండు కూడా చేస్తున్నది.వాళ్ళు చిరంజీవిని రంగంలోకి దించాలని చాలా కాలం నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు.ఇది బీసీలకు మంటెత్తిస్తోంది.బీసీలు పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడానికి ఇదొక తక్షణ కారణం.సదరు అగ్రకులం డిమాండ్లు ఎలా ఉన్నప్పటికీ వాళ్ళ గుఱించి మిగతా సమాజంలో అభిప్రాయం మాత్రం వేరుగా ఉంది.అందువల్ల ఆ డిమాండ్లని ఇంతదాకా ఎవరూ పట్టించుకోవడం జరగలేదు.నిజంగా వెనకబడి ఉన్న కులాల వైపు మనం దృష్టి సారించాలనడంలో విప్రతిపత్తి లేదు.బీసీలు అలాంటివాళ్ళే.
బీసీలు రాష్ట్ర జనాభాలో 50 శాతం మంది దాకా ఉంటారు.అయినా ఇతరులకున్న ధనబలం గానీ గూండాయిజం గాని ఆశపోతుతనం గానీ వారికి లేవు.రాజకీయాల్లో వారినెవరూ పట్టించుకోకపోవడానికి గాని వారు పైకి రాకపోవడానికి గాని కారణం ఇదే.వారిచేత వోట్లేయించుకోవడమే తప్ప వారికి కొన్ని సీట్లయినా కేటాయించాలనే ఇంగితజ్ఞానం కొఱవడిన రాజకీయపార్టీలతో వారు విసిగిపోయారు.బీసీల బాహుళ్యాన్నీ అనైక్యాన్నీ ఆసరాగా చేసుకుని వారితో ఆటలాడుకుంటూ తమాషా చేస్తున్న ఆ అయిదు కులాల నాయకులకూ గట్టిగా బుద్ధిచెప్పాలని వారు ఎట్టకేలకు నిర్ణయించుకున్నారు.అయితే మన మనసులో మరోపక్క సంశయమేమిటంటే-ఇన్ని పార్టీలు పరస్పర పొత్తు లేకుండా ఎన్నికల్లో తలపడితే బహుముఖపోటీలేర్పడి తక్కువ వోట్లు గెల్చుకునే లోకకంటకులే అధికారంలోకి వచ్చే ప్రమాదముందని ! లేదా ప్రతి పార్టీకి బొటాబొటీగా సీట్లు వచ్చి ఎవరికీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే సత్తా లేక త్రిశంకుసభ ఏర్పడ్డం, తన్మూలకంగా రాష్ట్రపతి పాలనో, సంకీర్ణ ప్రభుత్వమో సంప్రాప్తించడం జరుగుతాయని ! అయినా ఎందులో ఏ భగవత్‌సంకల్పముందో ఎవరికి తెలుసు ? వినూత్న ప్రజాస్వామిక ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాలంటే ఇలా బహుపార్టీలూ, అలా సంకీర్ణ ప్రభుత్వాలూ ఏర్పడ్డం అవసరమేమో ! ఏమో...
మంచిదే ! శుభం భూయాత్ ! శివోzస్తు తే పంథా: (మీ దారి నిష్కంటకమౌ గాక)
0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.