గబ్బర్‌సింగు రాజ్యం ! బగ్గంపాడు భాగ్యనగరం !
పెళ్ళిచెయ్యడానికొచ్చిన పురోహితుడు పెళ్ళికూతుర్ని లేవదీసుకుపోతే ?
వీలునామా దాచమని ఇచ్చిన న్యాయవాదే ఆస్తి కాజేస్తే ?
చికిత్స చేస్తానని చెప్పి శరీరాంగాల్ని వైద్యుడు దొంగిలిస్తే ?
కిరాయిదారుడే యజమాని ఇంటిని అమ్మేస్తే ?
నవ్వుకుంటున్నారా ? ప్రస్తుతం ఆంధ్రదేశ రాజధానిలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కఱలేదు.ఆశ్చర్యపోయేవాడు అమాయకుడు.సరిగ్గా ఇవే కాకపోయినా ఇలాంటి సంఘటనలు ఇక్కడ పెచ్చుమీరిపోతున్నాయి.హైదరాబాదుకు ఈ దుర్గతి గత ఏడేళ్ళుగా పట్టింది.ఇది ముందు ప్రైవేటు/సహకార బ్యాంకులు వరస-వరసగా మూతపడ్డంతో ఆరంభమైంది.తెలుగుదేశం ప్రభుత్వపు నిష్క్రియాపరత్వం పుణ్యమా అని ఇల్లడదార్ల(depositors)కు చెందిన వందలాది కోట్ల రూపాయల డబ్బు స్వాహా చేసి హాయిగా తిరగ్గలమనే భరోసా వచ్చాక ప్రతివాడికీ పాపపుణ్యాల మీద నమ్మకం చచ్చింది.శేఖర్‌దాదా అధికారంలోకొచ్చాక అసలు వ్యవస్థ మీదే నమ్మకం చచ్చిపోతోంది.
రెండు లక్షలమంది బందిపోట్లు ఒకేసారి రాష్ట్రంలో ప్రవేశిస్తే ఏమవుతుంది ? ఒకవేళ వాళ్ళ నాయకులు ఇళ్ళమీదికి కాక ముందస్తుగా రాష్ట్ర సచివాలయానికీ శాసనసభకూ వెళ్ళి అక్కడ తిష్ఠ వేస్తే ఏం జరుగుతుంది ? అసలు గబ్బర్‌సింగే స్వయంగా రాష్ట్రంలో అత్యున్నత అధికారపీఠాన్ని అధిష్ఠిస్తే ఏమవుతుంది ?
ఏదీ ఊహించుకోనక్కఱలేదు.అన్నీ తేటతెల్లంగా కళ్ళముందే చకచకా జరిగిపోయాయి గనుక.మొన్నమొన్నటిదాకా ఔటర్‌రింగురోడ్డు పేరుతో పేదరైతుల భూములు కాజేశారు.తరువాత తన అక్రమ ఆస్తుల్ని బయటపెట్టాల్సి వచ్చేసరికి ఒక పెద్దాయన రాష్ట్రంలో ఉన్నవన్నీ అసైన్డు భూములేనని రెవిన్యూ శాఖవాళ్ళచేత చెప్పించడం మొదలుపెట్టాడు.ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడం కోసం కూడా వాళ్ళవి అసైన్డు భూములని ప్రకటించడం ఆనవాయితీ అయిపోయింది.
ఇక ఇప్పుడు మధ్యతరగతివాళ్ళ భూముల మీద పడ్డారు.నిజానికి ఇవి భూములు కావు.ఇళ్ళ స్థలాలు.ఇవి ఎవరూ వాళ్ళకు ఉచితంగా ఇచ్చినవి కావు.చచ్చీ చెడీ పొదుపుచేసి కొనుక్కుని దశాబ్దాల క్రితమే రిజిస్ట్రేషను కూడా అయిపోయినవి.ఇలాంటి స్థలాలున్న దాదాపు 3,700 ఎకరాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.ఇవన్ని ఎక్కడో ఊరి చివర ఉన్న భూములు కావు.ఇవి గ్రేటర్ హైదరాబాదు నడిబొడ్డున ఉన్నవి.విచిత్రమేంటంటే వీటిల్లో అధికభాగం భూములు ఇప్పటికే వ్యాజ్యాల్లో ఉన్నాయి.ఆ వ్యాజ్యాలు తెగకుండానే ఆ భూములు కావాలనడం - అధికారంలో ఉన్నవాళ్ళు ఎంత తొందరలో ఉన్నారో, ఎన్నికల గడువు వాళ్ళని ఎలా తరుముకొస్తోందో తొమ్మిదేళ్ళ సుదీర్ఘ ఆకలి వాళ్ళకి ఎలా నిద్రపట్టకుండా చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు ఇళ్ళ స్థలాలు కాజేస్తారు.తరువాత కట్టిన ఇళ్ళూ అపార్ట్‌మెంట్లూ కూడా ఏదో ఒక వంకన కూల్చేసి ఆ స్థలాలు కూడా లాక్కుంటామంటారు.అప్పుడు మధ్యతరగతివాళ్ళ పని అయిపోయాక జూబిలీ మఱియు బంజారా కొండల్లో ఉండే సంపన్న ప్రత్యర్థుల మీద పడతారు.
"హైటెక్ నాయుడు మనకొద్దు, రైతురాజ్యం తెస్తా"మంటే"ఓహో ! కామోసు"అనుకున్నాం, - వాళ్ళకు భూముల మీద ఇంత కరకర కాలే ఆకలి ఉంటుందని తెలియక.రైతులంటే పాపం ! భూమిపుత్రులు, భూమిని నమ్ముకుని బతికేవాళ్ళు అనుకున్నాం.కాని వీళ్ళు మాత్రం భూముల్ని అమ్ముకుని బతికేవాళ్ళనీ, అందులోను తమ భూములు కాక ఇతరుల భూముల్ని ప్రభుత్వ నోటిఫికేషన్ల పేరుతో ఆక్రమించుకుని మఱీ అమ్ముకునేవాళ్ళనీ ఇప్పుడు అర్థంచేసుకుంటున్నాం.ఇప్పుడు తెలిసొస్తోంది, జన్మజన్మలకీ వద్దురా బాబూ ఈ రైతురాజ్యమనిపించేలా.హైటెక్ బాబంటూ నాయుడుగారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినవాళ్ళు ఇప్పుడు అదే హైటెక్ పేరుతో నోటిఫికేషన్లు జారీచెయ్యడమే విస్మయజనకం.
మోసాలూ, ఆక్రమణలూ, అన్యాయాలూ మానవజాతి పుట్టినప్పటినుంచే ఉన్నాయనుకున్నా, తన రాజముద్ర ఉన్న కాయితాలు చెల్లవని ఒక ప్రభుత్వం పదే పదే ప్రకటించడం, తన నోటిఫికేషన్లు రాజ్యాంగాని కతీతమన్నట్లు ప్రవర్తించడం ఏ భయంకర అక్రమ అరాచకానికి సూచిక ? ఏ చారిత్రిక దశాపరిణామానికి వీళ్ళు తెఱతియ్యబోతున్నారు ? ఎటు వెళుతోందీ ఆంధ్రదేశం ? ఏమిటీ భస్మాసుర హస్తం ? ప్రపంచంలో ఏ ఇతరదేశంలో నైనా దీనికి సరిపోలే సంఘటనలు జరిగాయా ? తెలుసుకోగోరుతున్నాను.
పేదవాళ్ళ దగ్గరా, మధ్యతరగతివాళ్ళ దగ్గరా లాక్కున్న భూముల్ని ఏమని చెప్పి విపణిస్తారు (మార్కెట్ చేసుకుంటారు) ? కొనుక్కునేవాడేమైనా పిచ్చివెధవనుకుంటున్నారా ? అప్పుడు వాళ్ళ దగ్గరి నుంచి లాక్కున్న ప్రభుత్వం తరువాత నా దగ్గరి నుంచి కూడా లాక్కోదని నమ్మకం ఏంటి ? అనే అనుమానం వాడికి రాదా ? అసలు వీళ్ళు రియల్ ఎస్టేట్ ని మనుషుల మనోభావాలతో సంబంధం లేని లంకెబిందెలా ఎలా భావిస్తున్నారు ? రియల్ ఎస్టేట్ వెనక ఉన్నవి కేవలం మనోభావాలే.లేకపోతే ఒక చోట గజం అయిదొందలేంటి ? ఇంకో చోట గజం లక్షరూపాయలేంటి ? మనుషులు అంతెందుకు చెల్లించి కొనుక్కుంటారో ఆలోచించారా ? కొనుక్కున్నదానికి ప్రభుత్వ హామీ ఉంటుందనే నమ్మకం, భవిష్యత్తులో తమ దగ్గర కొనుక్కునేవాళ్ళక్కూడా ఆ హామీ విస్తరిస్తుందనే భరోసా, ఆ ప్రదేశంలో నయితే శత్రుభయం ఉండదనే విశ్వాసం, ఆదాయం ఉంటుందనే హామీ-ఇలా ఎన్నో అంశాలు ఒక స్థలానికి విలువని సమకూర్చిపెట్టడంలో పాత్రపోషిస్తాయి.అవేవీ లేని హైదరాబాదులో స్థలాలు కొనడానికి ఎవరు ముందుకొస్తారు ? ప్రతివాడూ తన స్థలం 50 లక్షలనీ కోటి అనీ రెండు కోట్లని ప్రగల్భాలు పలకడమే తప్ప ఎవడు సిద్ధంగా ఉన్నాడు హైదరాబాదు మీద అంత డబ్బు పోసి దారిన పోయే తద్దినాన్ని తలకు చుట్టుకోవడానికి ?
మగధదేశపు రాజు బింబిసారుడు తన స్నేహితుడైన వంగదేశపు రాజుకు తన ఉద్యానవనాన్ని చూపిస్తానని తీసుకెళ్ళాడు.తాను ఆ ఉద్యానాన్ని ఎంత కష్టపడి అభివృద్ధి చేశాడో, ఏయే దేశాల్నుంచి ఏయే మొక్కలు తెప్పించాడో వివరంగా వర్ణిస్తూ స్నేహితుణ్ణి తోట లోలోపలికి తీసుకెళ్ళాడు.అక్కడ ఒక మూలన రెండెకరాల స్థలం ఆవులతో, పేడతో, పిడకలతో, గడ్డీ గాదంతో చిందరవందరగా ఉంది.అక్కడే ఒక పాత గుడిసె కూడా ఉంది."అందమైన ఈ ఉద్యానానికి ఈ మూల ఇలా ఉంచేశారేమిటి మహారాజా ?"అని ఆశ్చర్యపోయాడు వంగాధీశుడు."అది నా స్థలం కాదు మహారాజా ! ఒక ముసలమ్మది."అన్నాడు బింబిసారుడు."ఆమెకు వేఱేచోట స్థలం చూపించి మీరు దీన్ని కూడా తోటగా మారిస్తే బావుండేది"అన్నాడు వంగాధీశుడు."ఇప్పటికే చాలాసార్లు అడిగి చూశాను మహారాజా ! ముసలిది ఒప్పుకోనేలేదు.చచ్చేదాకా అక్కడే ఉంటానంటోంది.నన్నేం చెయ్యమంటారు ? ఆమె కడతేఱేదాకా ఎదురుచూడ్డం మినహా నాకు మార్గాంతరం లేదు."అన్నాడు బింబిసారుడు.
అవేమో నిరంకుశ రాజఱికాలు.ఇవి ఉదార ప్రజాస్వామ్యాలు.పేర్లు బావున్నాయి కదూ !
