Friday, November 02, 2007

"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-4

(కోడి రామకృష్ణో ఇ.వి.వి.నో సరిగా గుర్తులేదు) "హీరో అంటే ఏమిటి ? దర్శకుడు సృష్టించిన భ్రమ"అన్నారొక ప్రముఖ దర్శకుడు.ఆ భ్రమని వాస్తవంగా తీసుకుని ఆ హీరోల మీద పిచ్చి అభిమానం పెంచుకునేవాళ్ళ పట్ల నాకు కొన్నేళ్ళ క్రితం చిన్నచూపుండేది.కాని ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకున్నాను."ఉత్తరాది విలన్లూ, బొంబాయి భామలూ రాజ్యమేల్తున్న తెలుగు చిత్రసీమలో ఈనాటికీ మన తెలుగువాడే మన మెగాస్టార్"అనే సత్యం స్ఫురించాక.ఈ దర్జా ఇండియాలో అన్ని రాష్ట్రాలవాళ్ళకీ లేదని గుర్తించడం అవసరం.ముఖ్యంగా ఉత్తరాదిన హిందీ హీరోలే అన్ని రాష్ట్రాలకూ హీరోలు.వాళ్ళ హీరోయిన్‌లే అన్ని రాష్ట్రాలకూ హీరోయిన్‌లు.వాళ్ళ విలన్‌లే అన్ని భాషల వాళ్ళకూ విలన్‌లు.హిందీ సినిమాలు తప్ప వినోదానికి ఉత్తరాదిన మఱో అర్థమే లేదు.మనకింకా ఆ ఖర్మ పట్టలేదు.ఆ విషయంలో మనం ఈనాటికీ సర్వస్వతంత్రులం.

ఒక మనిషిని దేవుడిలా/దేవతలా భావించి ఆరాధించడానిక్కూడా చాలా లోతైన పరిశుద్ధ హృదయం సంస్కారబలం కావాలనేది నేను కనుగొన్న రెండో విషయం.జీవితానికొక ఆదర్శం కావాలి.ఒక ఊహ కావాలి.ఉత్‌ప్రేక్ష కావాలి.దాన్ని మనిషి భగవద్గీత ద్వారా పొందినా సరే ! బాలకృష్ణ ద్వారా పొందినా సరే ! చిరంజీవి ద్వారా పొందినా సరే ! నేను కాదనను.హీరోల్ని పిచ్చిగా అభిమానించడం వెనుక ఉన్న సానుకూల భావనల్ని నేను సంతోషంగా స్వాగతిస్తాను.ఆ హీరోల వ్యక్తిగత జీవితం గుఱించి లోపాల గుఱించి మాట్లాడి వాళ్ళ అభిమానుల హృదయాల్ని గాయపఱిచి వాళ్ళ చుట్టూ అభిమానులేర్పఱచుకున్న పవిత్ర భావనల తేజోపుంజాన్ని కకావికలు చెయ్యడానికి నేనిష్టపడను.సినీ అభిమానాల వెనుక కళాభిమానం ఉంది.సౌందర్యం పట్ల ప్రశంసాభావం ఉంది.మంచి చేసేవారి ధీరోదత్తత పట్ల ఆరాధన ఉంది.శక్తిసామర్థ్యాల పట్ల కవితాత్మకమైన ఊహ ఉంది.ఈ రూపంలో ప్రేక్షకుడు తన అభిమాన హీరోలో తన ఆత్మను దర్శించుకుంటే అది నాకు సంతోషకరం.

కాని ఇప్పుడు సినీహీరోల్ని అభిమానిస్తున్న విధానం అత్యంత హేయమైనది.చాలా సందర్భాల్లో సదరు హీరో తమ కులస్థుడు కావడం అనే ఏకైక కారణం వల్ల అభిమానించే కేటగరీని మనమిప్పుడు చూస్తున్నాం.వీళ్ళు సినీ అభిమానులు కారు, కులాభిమానులు మాత్రమే."చిరంజీవి రాజకీయాల్లోకి రావా"లని కోరుతున్నవారు ప్రధానంగా కాపుకులస్థులు కావడం గమనార్హం.చిరంజీవి రాజకీయ ప్రవేశం యొక్క మంచిచెడ్డలేంటో నాకు తెలియదు.దాని గుఱించి నేను రాయలేను.కాని ఈ ప్రతిపాదన వెనక ఉన్న అతితెలివి ఒకటే - ఒకప్పుడు చిరంజీవిలాంటి జనాకర్షణ ఉన్న ఎన్టీయార్ ఆ జనాకర్షణని ఉపయోగించుకుని రాష్ట్రాధినేత అయి కమ్మకులానికి "గుర్తింపు" తెచ్చారనీ, కనుక చిరంజీవి కూడా ఆ బాటలోనే పయనించి కాపు కులానికి "గుర్తింపు" తేవాలని !

హతవిధీ ! ఎన్టీయార్ యావత్తు తెలుగుజాతికే గుర్తింపు తెచ్చారని మనం అనుకుంటూంటే కమ్మకులానికీ నిమ్మకూరికీ గుర్తింపు తేవడమేమిటి బాబూ ! అని వాపోయి ప్రయోజనం లేదు.వాళ్ళ అంతర్గత భావన అలాగే ఉంది.చిరంజీవి సినిమారంగంలో నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడుతూ ఉన్న రోజుల్లో ఏమయ్యారబ్బా ఈ కులాభిమానులు ? ఒక్క పైసా ఇచ్చి ఆదుకున్నారా ? ఈ రోజు ఆయన పైకి రాగానే "ఆయన మావాడు"అంటున్నారు ? మొదట్నుంచీ ఈ సమాజ ధోరణి ఇలాగే ఉంది.మీరు నిరుద్యోగిగా రోడ్ల వెంట తిరుగుతున్నప్పుడు రమ్మని పిలిచి ఎవడూ బువ్వపెట్టడు.మీరు సొంతంగా కష్టపడి పైకొస్తే చందాలిమ్మనీ పన్నులు కట్టమనీ వెంటపడుతుంది ఈ సమాజం."సామాజిక బాధ్యత"అంటూ గుడ్లెఱ్ఱజేస్తుంది.ఆ రోజు మీరు ఆకలితో బాధపడ్డప్పుడు ఏమైంది ఇతరులు మీ పట్ల చూపాల్సిన సామాజిక బాధ్యత ? మీరు ఇల్లూ వాకిలీ లేక అఘోరిస్తున్నప్పుడు గుడిసె వేసుకోవడానిక్కూడా మీకెవరూ స్థలం చూపించరు.మీరు కష్టపడి ఇల్లు కట్టుకుంటే పన్నులూ, (ఉత్తుత్తి) రిజిస్ట్రేషన్‌లూ వెంటనే రంగప్రవేశం చేస్తాయి.

కులాభిమానులు జూనియర్ ఎన్టీయార్‌ని కూడా ఇలాగే గబ్బుకొట్టించారు."ఆంధ్రావాలా"సినిమా విడుదలకు ముందు గుంటూరులో"చౌదరి యూత్"అని బ్యానర్లు రాసుకుని మఱీ మోటర్‌సైకిళ్ళ మీద"జూనియర్ ఎన్టీయార్ జిందాబాద్"అంటూ ఊరేగారు.జనం గమనించారు."ఇదేదో కమ్మగోలలా ఉందే ! "అనుకున్నారు.తమ నిర్ణయం తాము తీసుకున్నారు.ఫలితం - ఆంధ్రావాలా బొక్కబోర్లా !

జాత్‌పాత్ తోడక్ మండల్ వారికి వ్రాసిన లేఖలో డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒక ప్రశ్న వేశారు :"ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతన్ని హిందువు కులప్రసక్తి లేకుండా గౌరవించగలడా ?"అని ! నేనా పుస్తకాన్ని 22 ఏళ్ళ క్రితం చదివినప్పుడు"ఎందుకు గౌరవించలేడు?"అనుకున్నాను.కాని ఇప్పుడు అభిమానసంఘాలమని చెప్పుకుంటున్న ఈ కులసంఘాల్ని చూస్తూంటే....?

4 వ్యాఖ్యలు:

రానారె said...

ఒక మనిషిని దేవుడిలా/దేవతలా భావించి ఆరాధించడానిక్కూడా చాలా లోతైన పరిశుద్ధ హృదయం సంస్కారబలం కావాలనేది నేను కనుగొన్న రెండో విషయం.జీవితానికొక ఆదర్శం కావాలి.ఒక ఊహ కావాలి.ఉత్‌ప్రేక్ష కావాలి.దాన్ని మనిషి భగవద్గీత ద్వారా పొందినా సరే ! బాలకృష్ణ ద్వారా పొందినా సరే !

భలే చెప్పారు. ఆలోచింపజేసిన మాట.

కొత్త పాళీ said...

తమాషాగా ఈ మధ్య కాలంలో భగవంతుని గురించి ఆలోచిస్తూ నేనూ ఇంచుమించుగా ఇలాగే అనుకున్నా .. భగవఛ్ఛక్తి అంటే అదేదో బయటినించి మనలో ప్రవేశించేది కాదనీ, మనసు ఉన్నదాన్నే భగవంతునిలో లీనం చేసుకుని ఆ ప్రక్రియలో మన శక్తినే తిరిగి శతగుణాధికంగా తిరిగి పొందుతామనీ తోచింది. నిత్య జీవితంలో కూడా .. సోముడు రాముణ్ణి గౌరవించి నెత్తిన పెట్టుకున్నాడూ అంటే అందులో నెత్తిన పెట్టుకోబడిన రాముడి సమర్ధత ఎంత ఉందో, పెట్టుకున్న సోముడి సహృదయతా అంతే ఉంది. ఇతరుల్లో గొప్పతనం చూడ్డం మనలోని గొప్పతనాన్నీ జాగృతం చేస్తుంది. బాగా చెప్పారు.

తెలుగు వీర said...

అయ్యా, అశ్రునయనాలతో మళ్ళీ మీకో మారు సాష్టాంగ నమస్కారం

Sudhakar said...

చాలా చక్కని టపా. ఇప్పుడు కాపున్ ప్రొటెక్షన్ ఫోర్సు కూడా వస్తుంది. తయారుగా వుండండి. దాని ఆశయాలు ఎవ్వడికీ ఇప్పటికీ అర్ధం కావటం లేదు. పవన్ మాత్రం ముందు జాగ్రత్తగా ఒక కోటి రూపాయలు తీసిపెట్టి, నా దగ్గర ఇంకా ముప్ఫై రెండు లకారాలే వున్నాయ్, ఇంకా నందినికేమిస్తాను భరణం క్రింద నెలకు ఐదు లకారాలు అని చెప్పేందుకు సిద్ధంగా వున్నట్లుంది.