తెలుగు సినిమా ఇలా ఎందుకు తయారయిందని కొందరు మిత్రులు అప్పుడప్పుడు తమ బ్లాగుల్లో వ్యక్తం చేసిన ఆవేదన గుఱించి అలోచిస్తున్నాను.నాకు గుర్తున్నంతవఱకు ఈ దిగజారుడుకు మూలాలు మెగాస్టార్ చిరంజీవి 1980 లలో నటించిన సినిమాలలో ఉన్నాయి.అంటే మెగాస్టారే దీనికి కారకుడని నేనంటున్నానని అపార్థం చేసుకోవద్దు.ఆ సినిమాలు ఆయన నిర్మించినవి కావు.ఆయన నటించినవి మాత్రమే.
ఒక నటుడుగా శ్రీ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు లభించిన ఒక అనర్ఘరత్నం.ఆ రత్నం పరిశ్రమలో అడుగుపెట్టిన ఏడెనిమిదేళ్ళకు గాని దాని విలువ పరిశ్రమకు తెలియలేదు.ఆయన కుఱ్ఱకారు పాత్రలు ధరించడం మానేశాక సరిగ్గా అలాంటి రత్నం కోసం మన పరిశ్రమ ఎన్నో రాంగ్ నెంబర్లు నొక్కుతూ వస్తోంది.ఇప్పుడు ఆయనకు డూపుల్లాంటివాళ్ళు చాలామంది తయారయ్యారు గాని, మఱో చిరంజీవి మాత్రం ఇంతవఱకు లభించలేదు."లభించరు కూడా" అని నిస్సంశయంగా చెప్పవచ్చు.
ఆ రోజుల్లో శ్రీ చిరంజీవి కాకుండా వేఱే హీరోలు చాలామంది ఉండగా కేవలం శ్రీ చిరంజీవి సినిమాల వల్లే తెలుగు సినిమా భ్రష్టుపట్టిందనడం సమంజసమా ? అనే ప్రశ్న తలెత్తుతుంది.శ్రీ చిరంజీవి నటించిన మొత్తం 150 సినిమాల్నీ మనం తప్పుపట్టడంలేదు.వాటిల్లో ఆయన నటనా వ్యాసంగానికి (film career) మంచి బ్రేక్ ఇచ్చిన సూపర్ హిట్లున్నాయి.చిరంజీవి సూపర్ హిట్ల శకం 1983 లో విడుదలైన "ఖైదీ" సినిమాతో మొదలయింది.సరిగ్గా ఇవే తెలుగు సినిమా పరిశ్రమకి తప్పుడు సంకేతాలిచ్చాయి.ఆ తప్పుడు సంకేతాలేమిటంటే-
1. సినిమాలో కథ అప్రస్తుతం 2.హీరో క్లాస్ మనిషి కాకుండా మాస్ మనిషై ఉండాలి 3. మాస్ భాష మాట్లాడాలి 3. మాస్ చేష్టలు చెయ్యాలి 5. ఎంత మోటుగా మొఱటుగా దరిద్రంగా ఉంటే అంత మంచిది 6. హీరో పాడే పాటకూ కథకూ సంబంధం ఉండాల్సిన పని లేదు 7. పాట పూర్తిగా తెలుగులోనే ఉండాల్సిన పనిలేదు 8. హీరోనే హాస్యం కూడా చెయ్యాలి 9. హీరోని అన్ని ఫ్రేముల్లోను అందంగా చూపించాల్సిన పనిలేదు (చివరికి ఇదెలా దారి తీసిందంటే ఇప్పుడు మనం అల్లు అర్జున్ లాంటి సగటు ముఖాల్ని కూడా హీరోలుగా అంగీకరించే పరిస్థితి వచ్చింది) ఇంకా ఇలాంటివే....ఎన్నో....ఎన్నెన్నో !
ఖైదీ సినిమా (1983) విడుదల కాకముందు తెలుగు సినిమాలు ఎలా ఉండేవి ? అది విడుదలయ్యాక ఎలా తయారయ్యాయి ? ఒకసారి విశ్లేషిస్తే మనకు అసలు విషయం, రోగానికి మూలం బోధపడుతుంది. తరువాత వచ్చిన అన్ని సినిమాలూ - ఎలాంటి మినహాయింపులూ లేకుండా - చిరంజీవి సినిమాల మోటుతనాన్ని అనాగరికతనీ మాత్రమే ప్రతిబింబించడం మొదలుపెట్టాయి. అంతకుముందు కోమలమైన హీరో పాత్రలు చేసినవాళ్ళు కూడా తరువాత చిరంజీవిలా మొఱటు హీరో పాత్రల్ని అంగీకరించడం మొదలుపెట్టారు.ఇందులో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ అనే తేడా లేదు.సినిమాల నిండా అదే (హీరోగారి) రౌడీయిజం, అదే తెచ్చిపెట్టుకున్న మేషో మేనరిజం, అవే నాసిరకం లేబర్ క్లాస్ డైలాగులు, అదే పిచ్చకొట్టుడు, అవే గ్రూపు డాన్సులు.గత ఇఱవై నాలుగేళ్ళుగా ఈరోజుకీ అదే పోకడ,. పాత్రధారులు మారారంతే ! నాగార్జునా, బాలకృష్ణ బదులు అదే పిచ్చకొట్టుడు పాత్రల్లో ఈరోజు ప్రభాస్‌నీ మహేష్‌బాబునీ విష్ణువర్ధన్‌నీ అల్లు అర్జున్‌నీ ఇ.వి.వి.కొడుకుల్ని చూస్తున్నాం. ఇంకో పాతికేళ్ళు పోయాక అవే పిచ్చకొట్టుడు బండలాగుడు పాత్రల్లో వాళ్ళ కొడుకుల్ని చూస్తాం."ఇదేంటయ్యా ! బాబూ !"అంటే, "ఇది మాసండీ ! మీరు క్లాస్.మీకు నచ్చదులెండి"అనడం."పోవోయ్ ! బుడంకాయ్ ! నువ్వు చూడకపోతే మాకేంది ?"అన్నట్లు.ఆ రకంగా (1983)అంతకుముందు చిరంజీవి సినిమాల్ని ఎంతో ఇష్టంగా చూసిన (మాలాంటి)వాళ్ళంతా తరువాత్తరువాత ఏకమొత్తంగా సినిమాలకే దూరమైపోవాల్సిన పరిస్థితి వచ్చింది.సినిమా అందరి కోసమూ తియ్యడంలేదా ? ఇందులో క్లాసు, మాసు ప్రసక్తి ఎందుకొస్తుందో నాకర్థం కాదు. ఈ రోజు క్లాస్ అనుకుంటున్న సినిమాల్ని ఆరోజు 1950 లలోను 60 లలోను మాస్ కూడా ఎగబడి చూసి విజయవంతం చేసేవారు కాదా ? క్లాస్ హీరో అయిన ఎన్.టి.ఆర్.కి మాస్ వోట్లు ఎలా పడ్డాయి ? ఈ విభజన ఎవరు చేశారు ? సినిమావాళ్ళు తమకు తాముగా చేసుకున్న సంకుచిత విభజన కాదా ఇది ? "మేము మాసు, మేము క్లాసు, మా కోసం నువ్వు ఇవే తియ్యాలి"అని ఎవడైనా వాళ్ళతో పోయి చెప్పాడా ? ఏమీ లేదు.
"ఒక్క హిట్టిస్తే చాలు, ఏలుకుంటాం"అనుకుంటున్న ఈ నవతరం హీరోలు - ఎన్.టీ.ఆర్.నాగేశ్వరరావు, శోభన్‌బాబు మోహన్‌బాబు, చంద్రమోహన్, చిరంజీవిలాంటి పాతతరం నటులు ఎన్ని కష్టాలుపడి ఆ స్థాయికి చేరుకున్నారో బొత్తిగా ఎఱగనివాళ్ళు.నిజానికి ఈ జాబితాలో ఎవరూ డబ్బు సంపాదించడం కోసం సినిమాల్లో చేరినవాళ్ళు కారు.వీళ్ళంతా ఆ రోజుల్లో నటన అంటే ఒక వెఱ్ఱి అభిమానంతో మద్రాసు బండి ఎక్కారు.అద్దెకొంపల్లో పడి అఘోరించారు.ఒకపూట తిని ఇంకోపూట తినక భూలోకనరకాన్ని అనుభవించారు.స్టార్‌డమ్ గట్రా తరువాత వచ్చాయి.శ్రీ చిరంజీవి స్వయంగా చాలా సైడ్ రోల్సూ విలన్ పాత్రలూ చేశారు."మెగాస్టార్ అవ్వడంలో మీ విజయరహస్యం ఏమిటి ?"అని శ్రీ చిరంజీవినే ఒకసారి అడిగితే, ఆయన ఇచ్చిన ప్రత్యుత్తరం సువర్ణాక్షరాలతో లిఖించి దాచుకోదగ్గది."ఆ రోజుల్లో నాకు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా చేసేవాణ్ణి.అదే నా విజయ రహస్యం."