30.10.07

"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....- 2



షుమారు గత పాతికేళ్ళుగా తెలుగు సినిమారంగం (మంచికో చెడుకో) శ్రీ చిరంజీవినే కేంద్రబిందువుగా చేసుకుని రూపొందుతూ వచ్చిన నేపథ్యంలో శ్రీ చిరంజీవి యొక్క వ్యక్తిగత విజయాలు ఏ విధంగా అపార్థానికి గురయ్యాయో అవగాహన చేసుకుంటే తప్ప ఈ సినిమా రొంపికి కారణాలు బోధపడవు.

1. అన్నిటికంటే ముందు అర్థం చేసుకోవలసినది - శ్రీ చిరంజీవికి గాని ఆయన కుటుంబానికి గాని అంతకుముందు ఏ విధమైన సినిమా నేపథ్యమూ లేదు.ధనబలమూ లేదు.కులబలమూ లేదు.గాడ్‌ఫాదర్లూ లేరు.ఆయన కేవలం తన వ్యక్తిగత ప్రతిభా పాటవాల మీద ఆధారపడి నెగ్గుకొచ్చిన మహామనిషి.

2. శ్రీ చిరంజీవి మొదటి నుంచి మెగాస్టార్ కాడు.ఈ బిరుదు ఆయన పదీ, పన్నెండేళ్ళ పాటు సినిమారంగంలో అహోరాత్రాలూ శ్రమించగా వచ్చినటువంటిది.ఆయన మెగాస్టార్ కావడానికి కారణం మనకిప్పుడు సుపరిచితమైన చిరంజీవి మార్కు పిచ్చకొట్టుడూ, బండలాగుడూ కాదు.1986 తరువాత ఆయన్ని అందరూ కలిసి ఆ తరహా పాత్రల్లో బంధించిపారేశారు.ఇప్పటికీ అలాగే బంధించేస్తున్నారు.ఆయన్నే కాక ఆయన యొక్క యావత్తు కుటుంబాన్నీ అదే మార్గంలో ఏ మాత్రం వైవిధ్యం లేని పిచ్చకొట్టుడు మనుషులుగా మార్చిపారేస్తున్నారు.వాళ్ళు అందుకు తప్ప ఇంకెందుకూ పనికిరారనే అభిప్రాయం మేధావివర్గంలో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.ప్రస్తుతం అందరూ పిచ్చకొట్టుడు హీరోలే కనుక చిరంజీవికి గాని ఆయన కుటుంబానికి గాని ఇందులో ప్రత్యేకమైన విశిష్టత ఏమీ లేదు.

శ్రీ చిరంజీవి మెగాస్టార్ కావడానికి అసలు కారణం - ఆయన పిచ్చకొట్టుడు హీరోగా స్థిరపడకముందు నటించి మెప్పించిన గొప్ప కథాబలం ఉన్న చిత్రాలు.అంతకుముందు వారపత్రికలలో ధారావాహికలుగా వచ్చి నవలలుగా ప్రచురించబడిన కొన్ని అత్యుత్తమ కథలకు ఆయన హీరోగా నటించారు.వాటిల్లో ముఖ్యమైనవి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ నవలలు. శ్రీయండమూరి, చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని నవలలు వ్రాయలేదు.అప్పట్లో చిరంజీవి అంత గొప్ప హీరోగా పరిగణింపబడేవాడు కూడా కాదు.అయితే వాటిల్లోని హీరో పాత్రలకు శ్రీ చిరంజీవి సరిగ్గా సరిపోయారు.అలా సరిపోవడం కోసం ఆయన యండమూరి నవలల్ని శ్రద్ధగా అధ్యయనం చేశారు కూడా.అవి ఒక మహానటుడుగా చిరంజీవి స్థానాన్ని శాశ్వతం చేశాయి.ఆ సినిమాల్లో మనకు కనపడే చిరంజీవే అసలైన మెగాస్టార్.

1983వ సంవత్సరం ఆంధ్రదేశ చరిత్రలో ఒక పెద్ద మలుపు.అప్పుడే శ్రీ NTR 35 సంవత్సరాల నిరంకుశ కాంగ్రెస్ పాలనని తొలిసారిగా కూలద్రోశారు.ఆ సంవత్సరం మన సినిమారంగచరిత్రలో కూడా ఒక పెద్ద మలుపే.చిరంజీవి తొలిసారిగా పూర్తిస్థాయి హీరోగా నటించిన ఖైదీ విడుదలయింది అప్పుడే. చిరంజీవి పేరు అంతకుముందే అంధ్రదేశమంతటా ప్రసిద్ధం.కాని హీరోగా కాదు."చట్టానికి కళ్ళు లేవు, పున్నమినాగు, ఐ లవ్ యూ, ఇది కథ కాదు"మొదలైన సినిమాల ద్వారా యాంటిహీరోగా విలన్‌గా రేపిస్టు పాత్రధారిగా !! ఆ కారణం చేత "నాకు చిరంజీవి ఇష్టం"అని ఆ రోజుల్లో ఎవరూ అనేవారు కారు.ఎక్కువమంది ఆయన్ని మోహన్‌బాబుకు ప్రత్యామ్నాయంగా చూసేవారు.కాని అంతకుముందు చిరంజీవి నటించని పాత్ర అంటూ దాదాపుగా ఏమీ లేదు.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్