లేచిపోదాం...రా-2
"
వాళ్ళిద్దరినీ విడదీయాలి.
వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అసహ్యమేసిపోవాలి.
ఒకరి పొడే ఒకరికి గిట్టకుండా పోవాలి."
"వాళ్ళ ఖర్మకి వాళ్ళ నొదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి మేడమ్ ! వాళ్ళని పూర్తిగా మర్చిపొండి ! అదే వాళ్ళకు తగిన శిక్ష. "
"అలా కుదరదు. ఎంత ఖర్చయినా సరే, ఇస్తాను. మీ వల్ల కాదంటే చెప్పండి !"
"మా వల్ల కాదనీ కాదు, మీరివ్వలేరనీ కాదు మేడమ్ ! మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకర్థం కావట్లేదు. మీరాలోచిస్తున్నది చాలా తప్పు.భార్యాభర్తల్ని విడదీయడం....అలాంటివాటికి శిక్షలున్నాయి. మామూలు మనుషులకి అర్థమయ్యే విషయాలు కావు మేడమ్ ఇవి."
పై సంభాషణకు పూర్వరంగం : ఆమె ఒక బి.సి. కులానికి చెందిన భాగ్యవంతురాలైన స్త్రీ. ఆమెకి ఒకే ఒక గారాల కూతురుంది. ఆ పిల్లని తల్లిదండ్రులు చాలా ముద్దుగా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. ఎంత జాగ్రత్తగా అంటే-రోజూ వాళ్ళ నాన్నగారే ఆమెని ఇంజనీరింగ్ కళాశాల దగ్గర కార్లో దిగబెట్టి మళ్ళీ సాయంకాలం కూడా కార్లో ఎక్కించుకుని ఇంటికి తెచ్చేవారు. అయితే ఆ పిల్లకి ఆ కళాశాలలో ఒక అగ్రకుల విద్యార్థితో పరిచయమైంది. అతను ఆమె కన్నా పై తరగతి చదువుతున్నాడు. చూడ్డానికి చాలా వికారంగా ఉంటాడు. పెద్దగా ఉన్నవాళ్ళు కూడా కాదు. మరి ఈ పిల్ల అతనిలో ఏం చూసి పడిపోయిందో తెలియదు. ఈ గ్రంథం చాలా సంవత్సరాల పాటు నడిచింది. కాని ఇంట్లో ఇసుమంతైనా అనుమానం రాలేదు. ఆ అమ్మాయి అంత చాకచక్యంగా నిర్వహించుకుంటూ వచ్చింది. బీటెక్ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు చివరి పరీక్ష అయిపోతుంది గదాని ఆ వేళకు కళాశాలకు కారు తీసుకెళ్ళిన వాళ్ళ నాన్నగారికి అక్కడ అమ్మాయి కనిపించలేదు గాని సెల్లు మోగింది.
"నాన్నా ! నేను కాచిగూడా నుంచి మాట్లాడుతున్నాను."
"చెప్పమ్మా ! నేనింతసేపూ నీ కోసం మీ కాలేజి గేటు దగ్గరే ఎదురుచూస్తున్నాను."
"ఇంక నువ్వు వెయిట్ చెయ్యనక్కర్లేదు నాన్నా ! ఇంటికెళ్ళిపో !"
"అదేంటమ్మా ! నువ్వు తరవాతొస్తావా ? కారు పంపించనా ? కాచిగూడాలో ఎక్కడున్నావమ్మా ? మీ ఫ్రెండువాళ్ళింట్లోనా ?"
"నాన్నా ! నేను...మరి.. రాను. నాకు...నాకీ రోజు పెళ్ళయిపోయింది..."
"అదేంటమ్మా ? పెళ్ళేంటి ? ఎవరి పెళ్ళి ?"
"నా పెళ్ళే నాన్నా ! మీకెవరికీ చెప్పలేదు."
"జోకులేస్తున్నావా తల్లీ ? ఈ ముసలాడితో జోకులేంటమ్మా ?"
"జోక్ కాదు నాన్నా ! నిజమే చెబుతున్నాను. పరీక్షలైపోగానే నేనూ,_____పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. చేసుకున్నాం."
ఆ తండ్రి ఏమీ మాట్లాడలేక చాలాసేపు ఆ కారు పక్కనే నీరసంగా కూలబడిపోయాడు. తరువాత శక్తి కూడదీసుకుని లేచి వెళ్ళి భార్యతో చెప్పాడు. ఆవిడ ఆడ హైడ్రోజన్ బాంబులా రగిలిపోయింది. పేలిపోయింది. ఆయన సర్ది చెప్పాడు."ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్ళిచేసుకుని అత్తవారింటికి వెళ్ళాల్సిందే.అది మన ఖర్మ కొద్దీ ఇలా సంభవించింది.పోనీ ! వాళ్ళిద్దరినీ పిలిచి రిసెప్షన్ అయినా ఏర్పాటు చేద్దాం"అన్నాడు. ఆవిడ ఒప్పుకోలేదు. "ఛీ ! ఆ కూటికి గతిలేని వెధవసంతని తీసుకొచ్చి బంధువులుగా పరిచయం చేసి పరువు తీసుకోమంటారా ? ఠాఠ్ ! చస్తే వల్ల కాదు. అసలా ముండ చచ్చిందనుకుంటాను.అది నాకూతురే కాదు.అదో అలగా ముండ పాడు ముండ పాకీముండ !"అంటూ కూతుర్ని వైవిధ్యభరితంగా తిట్టింది.ఆయనే ఎలాగో కష్టపడి భార్యని ఒప్పించి రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. ఆ వరుడు బంధువులెవరికీ నచ్చలేదు. ఎంతగా నచ్చలేదంటే-"వీడేమిటి, నీకు అల్లుడేమిటి ?"అని ఆవిడ మొహం మీదనే అన్నారు కొందరు.ఆ మాటలు ఆవిడలో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడదీయాలనీ ఆ తాళి తెంపి తన కూతురికి మళ్ళీ పెళ్ళి చెయ్యాలనీ ఆవిడ దృఢంగా నిశ్చయించుకుంది.
2 వ్యాఖ్యలు:
ఇది కల్పితమా లేక నిజంగానే జరిగిందా. మీ తపా చదువుతుంటే ఈనాడులో ఇంతకుమునుపు వచ్చే "ఇది కథ కాదు" గుర్తుకొస్తుంది నాకు.
ఒక విషయాన్ని అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క టపాలో ఒక్కొక్క వాస్తవ జీవిత సంఘటనని తీసుకుంటున్నాం.
Post a Comment