చెంత సెల్లు -సొంత యిల్లు
వింత కారు - కొంత క్యాషు
ఇవే మన ఆధునిక చతుర్విధ పురుషార్థాలు. నిలబడి నీళ్ళు తాగడమనే తత్వశాస్త్రాన్ని నమ్మడం ఎప్పుడో మానేశాం. పరుగెత్తి పాలు తాగడమే ఈనాటి తాజా పోకడ. అదేమంటే-"ఇండియాలో నూటికి 60 శాతం మంది యువకులే కాబట్టి ఈ మాత్రం దూకుడు అనివార్య"మని సెలవిస్తున్నారు. బానేవుంది .కాని ఎంతగా యువకులైతే అంతగా ఆశపోతుతనం కూడా ఉంటుంది. అదీగాక ఇదే యువజనాభా 30-35 ఏళ్ళ తరువాత ముసలి జనాభా అవుతుంది. అప్పుడు"మన అన్ని దుర్దశలకీ కారణం మనలో 60 శాతం మంది ఏ పనీ చెయ్యలేని ముసలివాళ్ళుండడం" అని కొత్త పల్లవి ఎత్తుకుంటారు. కలియుగంలో ధర్మమనే ఎద్దు సత్యమనే ఒంటికాలి మీద నడుస్తుందని పుస్తకాల్లో రాశారు. నాకయితే ఆ వొంటికాలు కూడా ఎక్కడా కనిపించడంలేదు. అన్నిచోట్లా మాటయిచ్చి తప్పడమే కనిపిస్తోంది. అలా తప్పలేనివాడు శుంఠలా చూడబడ్డం కూడా కనిపిస్తోంది. "తాడేపల్లిగారూ ! అద్దెకి ఇల్లు తీసుకుంటున్నాం, కొంచెం వాస్తు చూసిపెట్టండి"అని అడిగితే "సరే"నని వెళ్ళాను. మేము వెళ్ళేసరికే ఆ యిల్లు ఇంకొకరికి అద్దెకిచ్చేశారని తెలిసింది. అవతలి వ్యక్తి రెండువేలు అదనంగా ఇస్తానన్నాడట. నా మిత్రుడిచ్చిన బయానా (advance) తిరిగిచ్చేశాడు సదరు యజమాని. పొద్దున మాట్లాడుకుని ఖాయం చేసుకున్న యిల్లు సాయంకాలానికల్లా ఇంకొకరికి దఖలు పడిందంటే ఏమనాలి ?
సొంత ఫ్లాట్‌ల దగ్గఱా ఇదే తంతు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కట్టుబడిదార్లు (builders) చాలామందికి ఇలాగే బయానాలు (advances) తిరిగిచ్చేశారు. అదేమంటే "ఈ మధ్యలో ధరలు పెఱిగాయి కాబట్టి పెఱిగిన తేడా కట్టండి, లేకపోతే మీ అడ్వాన్సు మీరు తీసుకుని వెళ్ళిపోండి" అని తెగేసి చెప్పారు. మఱి బయానా చెల్లించినప్పుడు రాసుకున్న ఒప్పందానికి ఏమీ విలువ లేదా ? మనిషి మాట్లాడే మాటలకే కాక రాసే రాతలక్కూడా విలువ లేని రోజులొస్తే ఇహ బతికేదెలా ? "బ్రహ్మ సత్యమ్ - జగత్ మిథ్యా" అని చిన్నప్పటినుంచి చదువుతూనే ఉన్నాను. అప్పుడేమీ నమ్మకం కలిగింది కాదు. ఇప్పుడే కొంచెం కొంచెంగా నమ్మకం కలుగుతోంది.
"ధర్మం నాలుగు పాదాలా నడిచిన రోజుల్లో" జనం లంచం తీసుకుని పనిచేసి పెట్టేవారు. ఈ పిదపకాలంలో లంచమిచ్చినా పని జఱగడంలేదు. వ్యక్తిగత జీవితాల్లో మనమెప్పుడూ రుచిచూడని నీతులూ నిజాయితీలూ ఎవడో పాటిస్తున్నాడంటే - లేదా ఎవడో ఎప్పుడో ఒకనాడు పాటించాడంటే నమ్మడం కూడా కష్టమౌతుంది. "నేను మంచిగా ఉన్నా నన్ను ఎవడూ నమ్మకపోతే ఈ నీతి నిజాయితీ నాకెందు"కని మంచివాడు కూడా చెడ్డవాడుగా మారిపోతాడు.
కాకినాడలో ఒక పేరుమోసిన విద్యాసంస్థ ప్రశ్నపత్రాల్ని తమ విద్యార్థులకి లోపాయికారీగా వెల్లడించడంలాంటి వెధవ పనులు చేసి పట్టుబడింది. ఇంక ఆ సంస్థ పనైపోయిందనుకున్నారు, దూరంనుంచి గమనించేవాళ్ళందరూ ! కాని అనూహ్యంగా అదే సంవత్సరం ఆ సంస్థ అడ్మిషన్లు మూణ్ణాలుగు రెట్లు పెఱిగాయి. "అలాంటి చోట మీ అబ్బాయిని/ అమ్మాయిని చేఱుస్తున్నారెందుకు?" అని తల్లిదండ్రుల్ని అడిగితే "వాళ్ళే నయం బాబూ ! పేపర్ల లీకో ఏదో ఒకటి చేసి పాస్ చేయిస్తారు" అని సమాధానం చెప్పారు. వెధవపన్లు చెయ్యగలిగినవాడి చుట్టూ చేఱుతున్నారు జనం, "మహాప్రభో ! నువ్వే ది"క్కంటూ ! ఇహ మనం మన నాయకుల్ని ఏ మొహం పెట్టుకుని విమర్శించగలం ? వాళ్ళు మనలోంచే వచ్చారు. కాకపోతే మనకంటే రెండాకులు ఎక్కువ చదివారంతే !
లోక్‌సత్తాలాంటి పార్టీ అధికారంలోకొస్తే ఇవన్నీ చక్కబడతాయని భావిస్తున్నారు కొందఱు. అసలు మొదట్లో అన్నీ లోక్‌సత్తాలే, కాంగ్రెస్‌తో సహా ! కాలక్రమంలో అక్రమ సంపాదనావకాశాల రుచి మఱిగిన తరువాత నీతులూ, ఆదర్శాలూ విషప్రాయంగా గోచరిస్తాయి. మార్పు వ్యవస్థల్లో కాదు, నాయకుల్లో కాదు - ముందు మనలో రావాలి. ముందు మన వ్యక్తిగత సంస్కారాలూ స్వభావాలూ మారాలి.
కలియుగాంతం వస్తేనో క్రీస్తు రెండోసారి వస్తేనో అంతా చక్కబడుతుందని భావించే ఆధ్యాత్మికవాదులున్నారు. అంతా నాశనమైపోయాక ఇక చెడిపోవడానికంటూ ఏమీ మిగలదు కాబట్టి ఆ మాటా కొంతవఱకు నిజమే ! నాకు మొదట్నుంచి ఇంకో అనుమానమేంటంటే - కృతయుగాలూ కలియుగాలూ గట్రా భారత ఉపఖండానికి తప్ప మఱింకే ప్రాంతానికీ వర్తించవని ! నిజానికి చాలా దేశాల్లో సత్యయుగమే నడుస్తోంది (మనతో పోలిస్తే). కాబట్టి ఆ ప్రాతిపదిక మీద జననష్టాలు జఱగవనుకుంటా. కాని మనం మారితేనే యుగం మారుతుంది.
Tuesday, September 18, 2007
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
3 వ్యాఖ్యలు:
బాగా చెప్పారు. అందుకే గాంధీ గారన్నాడు - "ప్రపంచంలో నువ్వు జరగాలనుకుంటున్న మార్పు ముందుగా నీతో మొదలు పెట్ట"మని.
చాల బాగ చెప్పారు.. కాని మన దేశంలో అర్ధం చేసుకొని పాటించే వాళ్ళే తక్కువ....మంచితనమనేది కనుచూపు మేరలో ఎక్కడ కనపడడం లేదు..
మార్పు మనతో మొదలుపెట్టడం జరిగితే.. మొదట ఫూల్స్ ని చేసెది కూడా మనల్నే.. ఈ చెడ్డవాళ్ళు అని చెప్పబడే మంచివాళ్ళు.. (ప్రస్తుతం వాళ్ళే మంచివాళ్ళుగా కూడా చలామణీ అవుతున్నారు మరి)
బిల్డర్సే కాదు.. బ్యాంక్ అప్పులు కూడా ఇదేవిధంగా వున్నాయి.. వడ్డీపెరిగినప్పుడల్లా ఇక్కడ EMI లు పెంచెయ్యడం.. అసలు.. అస్సలు తీరకపొవడం.. ఎమన్న అంటే.. వడ్డి పెరిగిందంటూ బ్యాంక్ వాళ్ళ కంటినీటితుడుపు మాటలు అసలు బ్యాంక్ అప్పుతీసుకొని ఇల్లెందుకు కొన్నామురా బాబు అని వాపొతున్నవాళ్ళు కోకొల్లలు..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.
మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.