Sunday, September 09, 2007

బ్రిడ్జి పక్కకెళ్ళొద్దురా డింగరీ....

పంజాగుట్టలో భూకంపం వచ్చిందా ?
లేదు.

పంజాగుట్టపై బి-52 బాంబర్ విమానాలతో వాయుదాడి జరిగిందా ?
లేదు.

పంజాగుట్టపై అల్‌ఖైదా తీవ్రవాదులు పంజా విసిరారా ?
లేదు.

మఱి పంజాగుట్ట వంతెన (flyover)ఎందుకు కూలిపోయింది ? కిటకిటలాడే నగరం నడిబొడ్డున అంతమంది పచ్చడిపచ్చడిగా తుక్కుతుక్కుగా నలిగి నాశనమైపోవడానికి కారణమేంటి ? కట్టుబడిలో నాణ్యత లేదని నిపుణులు ధ్రువీకరించిన తరువాత కూడా "చల్ మోహనరంగా !"అని కాంట్రాక్టర్ల భుజం తట్టి పచ్చజెండా ఊపిన ప్రభుత్వపెద్దలెవరు ? ఎవడా కాంట్రాక్టరు (Gammon India Limited, Mumbai) ? వాడి కంపెనీని మూసిపారేసి వాడి కాళ్ళూ చేతులూ నఱికి బహిరంగంగా ఉరితియ్యాలి.టెర్రరిస్టుల కంటే ప్రమాదకరంగా పరిణమించిన ఈ జాతిద్రోహుల ప్రభుత్వాన్ని వెంటనే దింపి తక్షణం ఎన్నికలు ప్రకటించాలి.

ఇది అవినీతి పెట్టిన టైమ్‌బాంబు బాబూ : హే భగవాన్ ! ఎలాంటివాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు ? అసలీ రాష్ట్రంలో వీళ్ళెలా అధికారంలోకొచ్చారు ? Truth is stranger than fiction అన్నట్లు సినిమాల్లో చూపించే రాజకీయ విలనీ అవినీతి అంతకంటే హెచ్చు మోతాదులో ప్రత్యక్షంగా అనుభవంలోకొస్తున్నాయి.మొన్ననే పాతబస్తీలో ముస్లింజంగ్ వంతెన కూలిపోయింది.ఈమధ్య ఝంఝావతీ ప్రాజెక్టు ప్రారంభం చేసిన రోజే దాని ప్రాథమిక నిర్మాణాలు కూలిపోయాయి.నాయుడుగారు కూడా తమ హయాంలో ఎన్నో కట్టించారు.ఒక్కసారి కూడా ఇలా జరగలేదు.

నగరం నడిబొడ్డున చేస్తున్న నిర్మాణం పూర్తికాకముందే ఇలా అఘోరించిందే, ఇక వీళ్ళు జలయజ్ఞం పేరుబెట్టి చేస్తున్న అవినీతి యజ్ఞంలో భాగమైన ప్రాజెక్టులకు ఏ గతి పట్టబోతోందో ? కొంతకాలమాగితేనే గాని తెలియదు.కాంక్రీటు వెయ్యాల్సిన చోట్ల మట్టి తోలుతున్నారని ఇప్పటికే వార్తలొస్తున్నాయి.ఏ భారీ వరదకో ఆ ప్రాజెక్టులు కొట్టుకుపోతే జిల్లాలకు జిల్లాలే మునిగిపోతాయి.లక్షలాదిమంది కొట్టుకుపోతారు.

హైదరాబాదులో ఇంటి దగ్గర బయలుదేఱితే మళ్ళీ తిరిగొస్తామనే నమ్మకం పూర్తిగా అడుగంటింది.మొన్న జరిగిన పేలుళ్ళ దెబ్బకే ఎన్నో కంపెనీలు తమ హైదరాబాదు ప్రణాళికల్ని అచ్చంగా రద్దుచేసుకున్నాయి.ఇలా ఉన్న పళాన హఠాత్తుగా బ్రిడ్జిలు కూలిపోతూంటాయనే సమాచారం వ్యాపిస్తే అంతర్జాతీయంగా మన పరువు-ప్రతిష్ఠలు ఏం కావాలి ? ఈ సంగతి తెలిస్తే ప్రపంచబ్యాంకు మనకు అప్పులు కూడా ఇవ్వదు.

3 వ్యాఖ్యలు:

నేనుసైతం said...

ఇది ఆరంభం మాత్రమే! ఇంకెన్ని బ్రిడ్జి లు కూలాలో, ఎన్ని ప్రాజెక్టులు పగలాలో! ధనయజ్ఞం ఫలాలు ప్రజలు అనుభవించాలి కదా!
-నేనుసైతం

Vasundhara said...

మీరన్నమాట నేనూ అంటున్నాను. ఆ కాంట్రక్టరును ఆ బ్రిడ్జీ నిర్మాణంలో లంచాలు తీసుకుని పని చేసినవాళ్ళను వురి తీసినా పాపం రాదు. కానీ ఇంకో మాట ఇలాంటి తప్పులు నాయుడు గారి పరిపాలనలో జరగవన్నది మాత్రం నేను వొప్పుకోలేను. ఎవరైనా ఇంతే. పదవి నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో వాళ్ళ కింద వాళ్ళు చేసే తప్పులు చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఒకప్పుడు ఇలాంటివే సినిమాలలో చూపిస్తే చాలా కృత్రిమంగా అనిపించేవి. అవే ఇప్పుడు నిజాలవుతున్నాయి. డబ్బు, లంచాలు, పదవీ వ్యామోహంలో పడి కళ్ళముందు రక్తం ఏరులవుతున్నా కళ్ళుతెరవరు వీళ్ళు.

ప్రసాద్ said...

ఇలాంటివి జరగడం కాలంతో పాటే పెరుగుతున్నాయి. అయితే అదే సమయంలో సమాచార విప్లవం వల్ల ప్రజలకు సునాయాసంగా తెలుస్తున్నాయి. ప్రజలు ఒక్కుమ్మడిగా తిరగబడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

--ప్రసాద్
http://blog.charasala.com