Friday, August 03, 2007

మద్రాసు పిలిచింది

కర్నూలు నుండి తిరిగొచ్చేసిన కొంతకాలానికి వెంకటేశ్వర్లుగారికి మద్రాస్ పచ్చయప్ప కళాశాలలో LL.B.తరగతిలో ప్రవేశం లభించింది.అది మద్రాస్ విశ్వవిద్యాలయానికి ఉన్న సొంత కేంపస్సుల్లో ఒకటి.అసలు మద్రాస్ విశ్వవిద్యాలయానికి మన విశ్వవిద్యాలయాల్లాగా ఒక కేంపస్సంటూ ఏమీ లేదు.హాస్టళ్ళు ఈనాటికీ లేవు.విద్యార్థులు తమ కళాశాలకి దగ్గరగా ఉన్న ప్రైవేటు ఇళ్ళలో గదులు అద్దెకి తీసుకుని వెళ్ళొస్తూండడమే.దానికి చెందిన వివిధ కళాశాలలు మద్రాస్ నగరమంతటా అక్కడక్కడా చెల్లాచెదురుగా ఉన్నాయి.మద్రాసు బీచి దగ్గర విక్టోరియన్ శైలిలో కట్టబడిన ఒక పాత కట్టడంలో దాని పరిపాలనా భవనమూ గ్రంథాలయమూ నెలకొని ఉన్నాయి.

వెంకటేశ్వర్లుగారు మద్రాసు వెళ్ళిన కొత్తల్లో తాను కూడా ఒక గది తీసుకుని ఉన్నారు.ఆ జీవితం ఆయనకు బొత్తిగా నచ్చలేదు.ఇలా కాదనుకుని తన ఆప్త బంధువులైన ధారావారితో తన ఇబ్బంది చెప్పుకున్నారు."ఛీ ! గదుల్లో ఎందుకురా వెంకులూ, ఉండడం ? మద్రాస్‌లో మన కంపెనీ గెస్ట్ హౌస్ ఉందిగా !"అన్నారు ధారావారు.ధారావారికి ఒంగోలు కేంద్రకార్యాలయంగా పనిచేస్తున్న "ధారా అండ్ కంపెనీ"అనే పొగాకు గ్రేడింగ్ మరియు ఎగుమతుల సంస్థ ఉంది.దానికి ఒంగోలులో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది.దేశమంతా మార్కెటింగ్/పరిపాలన నిమిత్తం కట్టిన గెస్ట్ హౌసులున్నాయి.ఆ రోజుల్లో ఆ కంపెనీకి వెంకటేశ్వర్లుగారు మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం కూడా చేశారు. అయితే ఆ మొత్తం ఈనాటికీ వెనక్కి రాకపోవడం వేరే విషయం.ఆ విధంగా అలాంటి ఒక గెస్ట్ హౌసుకి మకాం మార్చారు వెంకటేశ్వర్లుగారు.

గుంటూరులో లాగా ఈసారి ఆయన వెంట తల్లిగాని తమ్ముడు గాని ఎవరూ లేరు.ఆయనొక్కడే ఉన్నాడు మద్రాసులో.ఈ పరిస్థితి ఆయనకి మంచి ఉత్సాహాన్నిచ్చింది.తీఱిక సమయాల్లో స్నేహితులతో కలిసి మద్రాసంతా షికార్లు కొట్టేవారు.ముఖ్యంగా బీచి, బర్మా బజార్లతో పాటు సినిమా తారలు విశేషంగా నివసించే టి.నగర్, కోడంబాకం, పానగల్ పార్కు, పాండీబజారు పరిసరాల్లో బాగా విహరించేవారు.ఒక్కొక్క సినిమాతార గురించి స్నేహితులు వివరిస్తూంటే ఆ మఱ్ఱిపూడి కుఱ్ఱవాడు ఆశ్చర్యపోయి వినేవాడు.

అప్పట్లో మద్రాసులో తమిళం పెద్దగా వినపడేది కాదు.అంతా తెలుగుమయం.ఎటు చూసినా తెలుగువాళ్ళే ఉండేవారు.ఆ విధంగా ఆనాటి మద్రాసుని ఈనాటి హైదరాబాదుతో పోల్చవచ్చు.ఆ కారణం చేత మద్రాసులో ఐదేళ్ళున్నా వెంకటేశ్వర్లుగారికి తమిళం పట్టుపడలేదు.ఆయనే కాదు, తెలుగువాళ్ళందరి పరిస్థితీ అలాగే ఉండేది. కాకతాళీయమే కావచ్చు-వెంకటేశ్వర్లుగారే కాదు ఆయన సంతానమంతా తమిళనాడులో విద్య నభ్యసించారు-ఆయన కుమార్తె మినహా.

0 వ్యాఖ్యలు: