26.8.07
గుర్తుకొస్తున్నాయి....గుర్తుకొస్తున్నాయి....
3:20 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: నా స్పందన
ఈ టపాలో మా తండ్రిగారి కాలం గుఱించి రాయాలనుకున్నాను. కానీ ఈలోపలే హైదరాబాదులో బాంబులు పేలాయి. కనుక ఇంకా వెనక్కెళ్ళి మన మునుముత్తాతల కాలం గుఱించి రాయాల్సి వస్తోంది. హతవిధీ !
ఇప్పుడు మన రాజకీయ పరిస్థితి మొఘల్ సామ్రాజ్యం అంతరించిపోవడానికి ముందు క్రీ.శ. 1730 లో ఉన్నట్లు ఉంది. ఐ.టి., సాఫ్ట్‌వేరు ఎగుమతులూ- ఇదంతా ఒక చిన్న పార్శ్వం. ప్రజలుగా మనం ఎదిగామని తెలియజేస్తాయి ఇవి. మన నాయకులు మాత్రం ఎదగలేదు. మారలేదు. సుపరిపాలన (good_governance) లేని దేశం మగదిక్కు లేని కొంపలాంటిది. కేవలం సాఫ్ట్‌వేర్లు రక్షించవు. పేలుళ్ళలో చనిపోయినవాళ్ళు ఒక్కొక్కరికీ అయిదులక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడట శేఖర్ దాదా. దుష్పరిపాలన మూలంగా మనం కోల్పోతున్నదానికి ఎవరు చెల్లిస్తారు ఎక్స్‌గ్రేషియా ? ఎంత చెల్లించగలరు ? ఎంతమందికని చెల్లించగలరు ? ప్రభుత్వ గొప్పదనం ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలోనా వెల్లడి కావాల్సింది ? 1730లో (ఇంగ్లీషువాళ్ళ చేతిలోకి వెళ్ళడానికి ముందు) మన దేశం ఎలా ఉండేదో గుర్తుచేసుకోవడం అవసరం
.
అప్పట్లో మొఘల్ రాజవంశపు అధికార పరిధి ఢిల్లీ నగర సరిహద్దుల వఱకు మాత్రమే చెల్లేది.దేశమంతటా పిండారీలు ఠగ్గులు మొదలైన మహా దొంగలు, నేరస్థులూ, వాళ్ళ ముఠాలూ. సరైన నిర్వహణ లోపించి ఒక్క పట్టణం కూడా నచ్చక ఇంగ్లీషువాళ్ళు సొంతంగా కాలనీలు కట్టుకున్నారు. అవే ఈనాటి మెట్రోలు. స్థానిక రాజులూ, నవాబులూ, జమీందార్లు ఇప్పటి మన శాసనసభ్యుల్లా ఎంపీల్లాగా విలాసభోగాల్లో మునిగితేలుతూ సొంత ఆస్తుల పెంపులోను పరిరక్షణలోను మునిగి ఆ రకమైన కక్కుర్తిలో విదేశీయులకు సైతం నోరుమూసుకుని సలామ్ కొట్టడానికి సిద్ధంగా ఉండేవారు. సలామ్ కొట్టారు కూడా.
అప్పటికి ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవం లేదు. ఇంగ్లండు ప్రాథమికంగా మనకంటే ఏ విధంగాను మెఱుగ్గా ఉండేది కాదు. పైపెచ్చు మనమే నాగరికతా విషయాల్లో ముందున్నాం కూడా ! మన రాజుల దగ్గఱ కూడా పెద్ద పెద్ద సైన్యాలూ వాటి చేతుల్లో లక్షలాది తుపాకులూ ఉండేవి. పైగా బెంగాల్, హైదరాబాద్, మైసూరు, శ్రీరంగపట్నం, తిరువాన్‌కూరు, గ్వాలియర్, బరోడా, జునాగఢ్ మొదలైన మన రాజుల కింద ఉన్న రాజ్యాలు అప్పటి యూరోపియన్ దేశాల కంటే విస్తీర్ణంలోను, ఆదాయంలోను, జనాభాలోను బాగా పెద్దవి కూడా. ఇండియాకు ఆర్థికంగా ఏ విధమైన లోటూ లేదు. ఆ కాలపు దృష్టితో చూస్తే విదేశీయుల చేతుల్లోకి వెళ్ళడానికి ఎలాంటి సంభావ్యతా లేని మహోన్నతమైన దేశం. కాని వెళ్ళింది. వెళ్ళడమే కాదు, సుమారు 200 సంవత్సరాల పాటు వాళ్ళ చెప్పులు మోసి బతికింది. ఈ ఘోర చారిత్రిక విషాదం ఎందుకు జఱిగింది ? ఒకసారి యుద్ధంలో ఓడిపోయిన మనం క్రమంగా అన్నింటిలోను ఓడిపోతూ ఈరోజు మనల్ని మనమే అసహ్యించుకునే స్థితికి, మన ఇళ్ళల్లో మన మాతృభాషని మనమే నిషేధించే ఆత్మనిందాపూర్వకమైన దుర్గతికీ ఎలా దిగజాఱిపోయాం ?
ఈ ప్రశ్నలకు సమాధానం ఈ పేలుళ్ళలో ఉంది. మైనారిటీల్ని బుజ్జగించి వారిని వోట్‌బ్యాంకులుగా మార్చుకోవాలనే దుర్బుద్ధితో ఉగ్రవాదుల్ని ఉపేక్షించడంలో ఉంది. "ఎవరు ఎలా చచ్చినా ఫర్వాలేదు. మేమూ మా పార్టీవాళ్ళూ అధికారాన్ని ఆస్తుల్నీ నిలబెట్టుకుంటే చా"లనే బాధ్యతారహితమైన వైఖరిలో గతానికి సమాధానాలు లభిస్తున్నాయి. ఏ నేరానికీ శిక్ష పడని, ఏ వ్యాజ్యాన్నీ ఒకపట్టాన తేల్చని మన న్యాయవ్యవస్థ పెంచి పోషించిన పాముల పుట్టల్లో సమాధానాలు లభిస్తున్నాయి. దేశభక్తీ, మాతృభాషాభిమానమూ లేని ఆధునిక యువతలో గతకాలపు పొడుపు కథలకు జవాబులు కనపడుతున్నాయి.
మానవ సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలే. ప్రభుత్వానికీ ప్రజలకూ మధ్య ఉన్నది కూడా అలాంటి సంబంధమే. బ్రిటిష్-పూర్వరాజులు ఈ అంశాన్ని విస్మరించారు. పూర్వకాలపు రాజనీతిశాస్త్రాల ప్రామాణ్యాల్ని మూర్ఖంగా మదంతో త్రోసిపుచ్చారు. ప్రజల గోడు వినడమే మానేశారు. తమ పదవి దైవదత్తమనుకున్నారు. భోగవిలాసాల్లో మునిగారు. పన్నులు కట్టే ప్రజలకు సేవచేసే కర్తవ్యాన్ని పక్కన పెట్టారు. విదేశీయులకు ఇష్టమొచ్చినట్లు ఎస్టేట్లు కట్టబెట్టారు.
ఈ రోజున మన పరిస్థితి మాత్రం ఏమిటి ? మనం పన్నులు కట్టడానికి వోట్లెయ్యడానికీ తప్ప ఇక దేనికీ పనికిరాము. మన నాయకులకు మన గోడుపట్టదు. వాళ్ళు సంపాదించుకోవడానికే వచ్చారు అధికారంలోకి. మన పేరిట ఉన్న ఆస్తులకు భద్రత లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకునే ప్రభుత్వం వాటి పరిరక్షణకు బాధ్యత వహించదు. మన ప్రాణాలకూ భద్రత లేదు. మన పని ప్రభుత్వానికి ఇస్తూ పోవడమే. ప్రభుత్వం మాత్రం మనకేమీ ఇవ్వదు. ఇవ్వాల్సిన అవసరం లేదు. కాని అదే ప్రభుత్వం SEZ ల పేరుతో లక్షలాది ఎకరాలు విదేశీయులకు కట్టబెడుతోంది. ఇదొక దొంగల రాజ్యం. ఈ మైనారిటీ వోట్‌బ్యాంకు రాజకీయాన్ని, ఈ దుష్పరిపాలననీ ఇంకా ఇంకా ఉపేక్షిస్తే ఒక జాతిగా ఒక రిపబ్లిక్కుగా భారతదేశపు అంతాన్ని కళ్ళజూస్తుంది. అది మన జీవితకాలంలోనే జఱిగిపోయే ప్రమాదముంది.తప్పదు. ఇది తప్పదు.అందరికీ 1750 నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
