14.8.07

మెట్టపంటలకు ప్రత్యేక ప్రోత్సాహం



సియా ఖండం మళ్ళీ ఆహార సంక్షోభంలోకి ప్రవేశిస్తోందనే ఆందోళన వ్యక్తం చేశారు భారతదేశపు హరిత విప్లవ వైతాళికుడు ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ ఎమ్.ఎస్. స్వామినాథన్. ఈ ఆందోళనకు పెఱుగుతున్న జనాభా ప్రధాన కారణం. మఱో హరిత విప్లవం రావాలనేది కొందఱు శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ఇదివఱకటి హరిత విప్లవం విమర్శలకు అతీతం కాదు. అది కొన్ని ప్రాంతాలకే తోడ్పడిందని ఎక్కువ ప్రాంతాలు దానికి దూరంగానే ఉండిపోవాల్సి వచ్చిందని పెదవి విఱిచేవారు కూడా ఉన్నారు. కొత్త వంగడాలు సాంప్రదాయిక మొక్కజాతుల్ని తుడిచిపెట్టాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. ముఖ్యంగా గత 30-35 ఏళ్ళలోనే వందలాది వరి రకాలు అంతరించిపోవడం నిజంగా బాధాకరం.

ఇప్పుడు శాస్త్రవేత్తలు కోరుకుంటున్న హరిత విప్లవం సరికొత్త జీవసాంకేతికతా (biotechnology) పద్ధతుల వినియోగానికి సంబంధించినది. అయితే ఇవి బహుళ జాతీయ విత్తన సార్థవాహాల (multi-national seed companies) ద్వారా జఱగాల్సి రావడం పట్ల పర్యావరణ ఉద్యమకారుల్లో అనేక సందేహాలూ, అభ్యంతరాలూ ఉన్నాయి. బి.టి/ జి.ఎమ్.పంటల అవశేషాల్ని పశువులు తిని మరణిస్తున్న సంఘటనలు రైతుల్లో భయాందోళనల్ని తీవ్రతరం చేశాయి.

జనాభా పెఱుగుదల భూవినియోగం మీద అనేక రకాలైన వొత్తిళ్ళని పెంచింది. పొలాలు సాగేతర అవసరాల కోసం కబ్జా చెయ్యబడుతున్నాయి అడవుల్ని కొట్టేసి, మిట్టపల్లాలు చదునుచేసి పొలాలుగా మార్చడం వల్ల వఱదనీటి నుంచి ఆ పొలాలకే కాక వాటికి ఆనుకుని ఉన్న పల్లెలకూ పట్టణాలకూ, రక్షణ లేకుండా పోతోంది. పులి మీద పుట్రలా ఆహారం చాలకపోవడమనే బెడద కూడా ముంచుకొస్తోంది.

మన నాయకుల్లో ఎక్కువమందికి పొలాలున్నాయి. చాలా ఎక్కువ పొలాలున్నాయి కూడా ! కాని ఎవఱికీ వ్యవసాయరంగం సంగతి అక్కఱలేదు. వ్యవసాయరంగమంటే వాళ్ళ దృష్టిలో తమ సొంత పొలం వఱకు, అంతే ! ఈ సంకుచిత ధోరణి మూలంగా ఉప్పతిల్లనున్న సంక్షోభాల్లో ఒకటి ఈ ఆహార కొఱత. ఏ దేశంలోను లేనంత ఎక్కువశాతం (55%) భూమి మన దేశంలో సాగులో ఉంది. మన రాష్ట్రంలో నైతే ఇంకో 5 శాతం ఎక్కువేమో కూడా ! ప్రపంచ సగటు 11 శాతం మాత్రమే. అయినా మనకీ బాధేంటి ?
దీని మూలాలు గత పాతికేళ్ళుగా వ్యవసాయ సంపన్న ప్రాంతాల మోతుబరి రైతులకు అనుకూలంగా ప్రభుత్వం అవలంబిస్తూ వచ్చిన విధానాల్లో ఉన్నాయి. గత హరిత విప్లవ ఫలితంగా గోధుమ విపరీతంగా పండే ప్రాంతాలు కొన్ని తయారయ్యాయి, పంజాబ్ హర్యానా లాంటివి. అదనపు పంట అమ్ముకోవడం కోసం 1986-87 నుంచి గోధుమ అలవాటు లేని ప్రాంతాల్లో సైతం గోధుమ వంటల మేళాలు నిర్వహించారు. రేషన్ షాపుల్లో స్థానిక ప్రజల ప్రధాన ఆహారం (staple food) బదులు గోధుమ సరఫరా చెయ్యడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు అలా సరఫరా చేసినది ఉత్తరాదివాళ్ళు వొద్దని ఛీకొట్టిన నాసిరకం ధాన్యం అనుకోండి. అది వేఱే విషయం. అలా అందఱికీ గోధుమ అలవాటు చెయ్యడానికి ప్రయత్నించారు. కొంత సఫలమయ్యారు కూడా ! అలా స్థానికంగా పండని ధాన్యం తినడానికి అలవాటుపడ్డం మెట్ట ప్రాంతాల ప్రజల్లో ఆహారపరంగా పరాధీనతని పెంపొందించింది. అంతకుముందు వారు జొన్నలో, రాగులో సొంతంగా పండించుకుని తినేవాళ్ళు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పరిణామం ఉద్దేశపూర్వకంగా కాకపోయినా యాదృచ్ఛికంగా చోటుచేసుకుంది. ఇది ఎన్.టి.ఆర్.హయాంలో మొదలైంది. ఆయన "రెండు రూపాయలకే కిలో బియ్యం" పథకం ప్రవేశపెట్టాక రాష్ట్రంలో ఎక్కువమందికి వరి తినడం అలవాటైంది. వరి పండని ప్రాంతాలవాళ్ళు పండే ప్రాంతాల మీద విపరీతంగా ఆధారపడాల్సి వస్తోంది. ఎవఱూ తినని మెట్టపంటలు వెయ్యడం రైతుకు లాభసాటిగా లేదు. తద్ద్వారా ఆ భూముల విలువ కూడా పడిపోయింది.

దేశప్రజలందఱినీ కేవలం ఒకటి రెండు ధాన్యాలకు మప్పడం, తద్వారా ఆహారం పండించగలిగిన భూముల్ని కూడా వాణిజ్య పంటలకు అప్పగించడం - ఇది ఏ మాత్రం తెలివైన పనో ఆలోచించాల్సి ఉంది. ఏదేమైనా ఆహారం కోసం మాగాణి పంటల మీదనే ఆధారపడ్డం తగ్గించాలి. స్థానికంగా పండడానికి అవకాశమున్న మెట్టపంటల్ని ప్రోత్సహించాలి.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్