2.8.07

మూణ్ణెల్ల ముచ్చట



ఆంధ్రరాష్ట్రం వచ్చిన కొత్తల్లో వెంకటేశ్వర్లుగారి మిత్రుడైన సుబ్బారావుగారికి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వోద్యోగం వచ్చింది. ఆయన వెంటనే రాష్ట్ర రాజధాని (కర్నూలు)కి వెళ్ళి ఉద్యోగంలో చేఱిపోయారు. అక్కడ ఇంకా చాలా ఉద్యోగ ఖాళీలున్నాయి. అయితే ఈ కాలంలో మాదిరి ఎంప్లాయిమెంట్ ఎక్స్ ఛేంజిలూ, రిక్రూట్ మెంట్ బోర్డులూ గట్రా ఏమీ ఉండేవి కావు. ప్రభుత్వోద్యోగమైనా సరే, పనికొచ్చేవారు ఎవరు దొఱికితే వారిని తీసుకోవడమే. ఉన్నతోద్యోగులకి ఆ విధమైన అధికారాలు ఉండేవి. "మంచివాళ్ళని చూడవయ్యా" అని ఆయన పనిచేసే విభాగపు అధిపతి సుబ్బారావుగారితో చెప్పాడు. "సరే"నని సుబ్బారావుగారు గుంటూరొచ్చి "ఒరేయ్ ! వెంకులూ ! మా సెక్షన్‌లో ఓ వేకెన్సీ ఉంది. వస్తావా ?" అని అడిగారు. భూస్వామి కావడంచేత ఒకరి కింద ఉద్యోగం చెయ్యడమంటే వెంకటేశ్వర్లుగారికి సుతరామూ మనస్కరించింది కాదు. మొదట్లో తటపటాయించినా "గుంటూరులో ఊరికే కూర్చుంటే కాలక్షేపం కావడంలే" దనుకుని మిత్రులతో కలిసి వెరైటీగా కర్నూలులో గడిపినట్లుంటుందనే యువక ఆలోచనలతో "సరే"నన్నారు. అలా కలిగింది వెంకటేశ్వర్లుగారి తొలి ఉద్యోగానుభవం 1953లో, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంలో !

అప్పట్లో కర్నూలు ఇంత మహానగరం కాదు. సౌకర్యాలు పూజ్యం. కేంద్రప్రభుత్వాన్ని మెడలొంచి సాధించుకున్న ఆంధ్రరాష్ట్ర పరిస్థితి లేచిపోయి పెళ్ళిచేసుకున్నవాళ్ళ కాపరంలాగా ఉండేదన్నారు వెంకటేశ్వర్లుగారు. అందుచేత రాష్ట్ర సచివాలయం ఓ ఆరుబయటి మైదానంలో 4000 (అక్షరాలా నాలుగువేల) గుడారాల (tents)లో నడుస్తూండేది. కర్నూలులో ఒక పాత ప్రభుత్వ భవనాన్ని రాష్ట్ర శాసనసభగా వాడేవారు. జిల్లా కలక్టరు కార్యాలయ సముదాయాన్ని రాజ్‌భవన్‌గా వాడేవారు. ఉద్యోగుల్లో పైశ్రేణివాళ్ళు కర్నూలులో ఉన్న కొన్ని మంచి ఇళ్ళని అద్దెకి తీసుకున్నారు. మిగతావాళ్ళందరికీ గుడారాలే శరణ్యం. తెలుగువాళ్ళకో రాష్ట్రమైతే ఏర్పడింది గాని సగం పరిపాలన మాత్రం మద్రాసు నుంచే జఱుగుతూండేది. అప్పట్లో మద్రాసుకూ కర్నూలుకూ మధ్య సూటి రైలుమార్గం లేదు. పనిపడ్డప్పుడు మద్రాసు ఉద్యోగులు అవసరమైన ఫైళ్ళు పట్టుకుని గుంతకల్లు దాకా రైల్లో వచ్చి అక్కణ్ణుంచి జీపుల్లోను కార్లలోను కర్నూలు గుడారాలకు చేఱుకునేవారు.

ఇప్పటి తెలంగాణా నాయకుల మాటల్లో చెప్పాలంటే - అప్పటికి ఇంకా రాయలసీమవారికీ, కోస్తావారికీ పూర్తిగా "మనసులు కలవలేదు. "కలవడానికి కలిసున్నదెప్పుడు గనక ? ఎవరి ప్రాంతంలో వారు జీవించేవారంతే ! మొదటిసారిగా కర్నూలు వెళ్ళిన వెంకటేశ్వర్లుగారి లాంటి కోస్తా మనుషులకి రాయలసీమ ప్రజల ఆహారం, వేషభాషలూ అలవాట్లూ తమాషాగా అనిపించేవి. "నాయనా ! వచ్చినాను" అని వాళ్ళు మాట్లాడుతూంటే ఏదో పదహాఱో శతాబ్దంలోకి వెళ్ళిన అనుభూతి కలిగి నవ్వుకునేవారు. అయితే ఇలాంటివాటి మీద తమ భావాలు పైకి చెప్పడం మీద అప్పటి ప్రభుత్వోద్యోగుల్లో అప్రకటిత నిషేధం ఉండేది. వెంకటేశ్వర్లుగారు పనిచేసిన శాఖాధిపతి ఒక నెల్లూరు రెడ్డి. ఆయన కొత్తగా ఉద్యోగంలో చేఱిన యువకులందరికీ తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. సుబ్బారావుగారితో పాటు వెంకటేశ్వర్లుగారు కూడా వెళ్ళారు. విందు చివర్లో ఆయన ఒక చిన్న ఉపన్యాసంలాంటిది ఇచ్చాడట. "అష్టకష్టాలు పడి తెలుగువాళ్ళమంతా కలిసి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దీన్ని ఇలా నిలబెట్టుకోవడం మన బాధ్యత. మనం ఓర్పు వహిస్తే తెలంగాణా కూడా మనతో కలుస్తుంది. ఎన్ని భేదాలున్నా తలవంచుకుపోండి. అప్పుడే మనం తలెత్తుకు తిరగ్గలుగుతాం." అన్నాడట ఆ పెద్దాయన.

పెద్దాయనతో వెంకటేశ్వర్లుగారు ఏకీభవించారు. కాని పాపం ! కర్నూలు జీవితంతోనే పూర్తిగా ఏకీభవించలేకపోయారు. పగలల్లా గుడారాల్లో ఉక్కపోత. చీకటి పడుతూనే దోమల బెడద. తిండి సరిపడక అనారోగ్యం. రెండుసార్లు జ్వరం. ఇక తనవల్ల కాదనుకున్నారు. "ఇంకొంత కాలం ఆగరా వెంకులూ ! తరవాత మనం హైదరాబాదు వెళతాం." అని సుబ్బారావుగారు హెచ్చరిస్తూనే ఉన్నారు. "నావల్ల కాదులేరా !" అని చెప్పి వెంకటేశ్వర్లుగారు తిరిగి గుంటూరొచ్చేశారు. ఆయన కర్నూలులో పనిచేసింది ముచ్చటగా మూణ్ణెల్లే. ఆయన మిత్రుడు సుబ్బారావుగారు మాత్రం ఉద్యోగావసరం ఉన్నవాడు కనుక అలా కర్నూలులోనే కొనసాగారు. ఆయన చెప్పినట్లే తెలంగాణా ఆంధ్రా ఏకమై విశాలాంధ్ర ఉద్భవించింది. గుమాస్తాగా చేఱిన సుబ్బారావుగారు హైదరాబాదు వెళ్ళి సీనియారిటీ మీద IAS కేడర్ కూడా సాధించి పదవీ విరమణ చేసేనాటికల్లా రాష్ట్రానికే అదనపు కార్యదర్శి హోదా కూడా సంపాదించారు. కర్నూలులో విడిపోయిన తరువాత వెంకటేశ్వర్లుగారూ సుబ్బారావుగారూ పదేళ్ళకొకసారైనా కలుసుకుని ఉండరు. కాని సుబ్బారావుగారు 1990-91 ప్రాంతంలో చనిపోయారని పేపర్లలో చదివి వెంకటేశ్వర్లుగారు తన జీవితంలో మొదటిసారిగా కన్నీళ్ళు పెట్టుకున్నారు.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్