21.8.07

ఒక డాక్టర్‌గారి కథ-3



డాక్టర్ గారికి ఇద్దరు అన్నయ్యలు.( పూర్తి పేర్లెందుకులెండి ! శర్మ, శాస్త్రి అనుకుందాం !) ఆ రోజుల్లో L.C.E అనే ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సు ఒకటి ఉండేది. అది ఇప్పటి పాలిటెక్నిక్కుతో సమానం. వాళ్ళిద్దరూ మద్రాసు వెళ్ళి అక్కడ గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆ కోర్సు చదివారు. అప్పట్లో దక్షిణ భారత దేశానికంతా కలిపి గిండీ ఒక్కటే ఇంజినీరింగ్ కళాశాల. దాన్నే ఇప్పుడు అణ్ణా యూనివర్సిటీ అంటున్నారు.

తరువాత పెద్దాయన శర్మకి స్వగ్రామమైన రేపల్లె రైల్వేలోనే ఉద్యోగం వచ్చింది. అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఆయన డాక్టర్ గారికి రక్తసంబంధ రీత్యానే కాక ఇతరవిషయాల్లో కూడా అన్నయ్యే. అయితే ఒక తేడా ఉంది. డాక్టర్ గారికీ సంప్రదాయానికీ ఆమడ దూరం. శర్మగారు మాత్రం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి విభూతి పిండికట్లు దట్టించి పెట్టి నిష్ఠగా పూజలో కూర్చుని "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ" అంటూ పెద్దపెద్దగా ఇల్లెగిరిపోయేలా ఓ గంటసేపు హంగామా చేసి ఆఫీసుకెళ్ళిపోయేవాడు. సాయంకాలం ఆఫీసునుంచి తిరిగొచ్చాక మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి పట్టు పైజమా పట్టు లాల్చీ ధరించి ఒళ్ళంతా అత్తరు కొట్టుకుని మేడమీది గదిలోకెళ్ళిపోయేవాడు. ఎవరెవరో వచ్చేవారు. తెలతెలవారుతూండగా వెళ్ళిపోయేవారు. ఒక విశేషం ఉంది.పాపం ! శర్మగారిది చాలా విశాలహృదయం. కుల మత వర్గ విచక్షణ లేదు.

శర్మగారి మొదటి భార్య ఒక పిల్లని కని చనిపోయింది. రెండో పెళ్ళి చేసుకుంటే రెండో ఆమె ద్వారా అయిదుగురు కొడుకులూ ఒక కూతురూ పుట్టారట. వాళ్ళెవ్వరూ ఇప్పుడు ఇండియాలో లేరు.

శర్మగారు 1994-94 మధ్యకాలంలో ఎప్పుడో రేపల్లెలోనే కాలం చేశారని తెలియవస్తోంది. నిశ్చయంగా తెలీదు.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్