20.8.07

ఓ డాక్టరుగారి కథ-2



డాక్టర్ గారి పెద్ద కొడుకు పేరు మోహన్. అందఱూ మోనాయ్ అని పిలిచేవారు.మోనాయ్ పుట్టినప్పుడు ఆరోగ్యంగానే పుట్టాడు. 10-12ఏళ్ళ వయసొచ్చేదాకా కూడా అసాధారణత్వాలేమీ గోచరించలేదు. కానీ చదువులో బాగా వెనకబడి ఉండేవాడు. పదేళ్ళొచ్చినా అతనికి తెలుగుభాషలో ఒక్క అక్షరమైనా చదవడం గానీ రాయడం గానీ రాదు. సంభాషణ మాత్రం అందఱిలాగానే బాగా చేసేవాడు. ఎంతకాలం పోయినా ఒకటో తరగతిలోనే ఉంచాల్సి రావడం పెద్దలకే అవమానకరంగా తోచి చదువే మానిపించేశారు, "వాడి తలరాత ఎలా ఉంటే అలా జఱగనీ !"అనుకుని. ఇంట్లో ఉన్నప్పుడు మోనాయ్ ఒక పెన్సిల్‌తో గోడల మీద ఎక్కడ పడితే అక్కడ "లులులులులులులులు"అని అంతులేకుండా రాస్తూండేవాడు. గుడికి తీసుకెళితే గుడిద్వారం దగ్గఱ నిలబడ్డానిక్కూడా భయపడిపోయేవాడు. దేవుడి పేరు చెబితే మీదపడి చెయ్యి దొఱకబుచ్చుకుని కొఱికేసేవాడు. వాడి ప్రవర్తనలో అసాధారణత్వాలున్నాయని 13-14ఏళ్ళ వయసులో మొదటిసారిగా పెద్దల దృష్టికి వచ్చింది. ఉన్నట్లుండి నలుగుఱిలో బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడేవాడు. పెద్ద పెద్ద బెల్లం గడ్డలు కొఱుక్కుతినేవాడు. పెద్దగా అఱుస్తూనో తనలో తాను మాట్లాడుకుంటూనో బయటికి వెళ్ళిపోయేవాడు. ఒకసారి అలా వెళ్ళినవాడు నెలరోజులైనా రాలేదు. మనుషుల్ని పెట్టి మఱీ వెతికించారు. ఎలాగో దొఱికాడు. వెంకటేశ్వర్లుగారు వాణ్ణి ఎంతోమంది మానసిక వైద్యులకు చూపించారు. ఏమీ లాభం లేకపోయింది. వాడు బయటికి వెళ్ళకుండా కుక్కని కట్టేసినట్లు గొలుసులతో కట్టేశారు. అది కూడా ఎక్కువకాలం ఫలితమివ్వలేదు. పిచ్చిబలంతో గొలుసుల్ని కూడా తెంచుకుని పారిపోయాడొకసారి. వెంకటేశ్వర్లుగారు మళ్ళీ వాణ్ణి ఎలాగో వెతికించి పట్టుకుని "వెధవా ! ఇంక బయటికి వెళ్ళవు గదా !"అని చావగొట్టారు."బుద్ధిగా ఉంటా"నని మాట యిచ్చినవాడు మళ్ళీ కొన్ని నెల్ల తరువాత పారిపోయాడు. ఇలా కొంతకాలం జఱిగాక వెంకటేశ్వర్లుగారు విసిగిపోయి వాడి సంగతి పట్టించుకోవడం మానేశారు. వాడు అలా వెళ్ళిపోతూండడం ఇల్లు గుర్తొస్తే ఇంటికి రావడం-ఇలా అనేక సంవత్సరాలు జఱిగింది. అతన్ని వెంకటేశ్వర్లుగారు చిట్టచివఱిసారిగా చూసినది 1976లో. అప్పుడు వెళ్ళిపోయినవాడు ఇక మళ్ళీ వెంకటేశ్వర్లుగారి దగ్గఱికి రాలేదు. అతని తల్లి మాత్రం"అన్నయ్యా !మన మోనాయ్ ఏమైపోయాడో వెతికించు అన్నయ్యా !"అని పరిపరి విధాల బతిమాలేది. వెంకటేశ్వర్లుగారు మాట్లాడేవారు కారు. కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఆమె అంజనాలు ప్రశ్నలూ నాడీజాతకాలంటూ ఎంతోమంది చుట్టూ తిరిగేది. మోనాయ్ రానేలేదు.

"నాన్నా ! ఇప్పుడు మోనాయ్ ఎక్కడుండి ఉంటాడు ?" అని 1991 లో వెంకటేశ్వర్లుగారిని అడిగితే, "ఇంకెక్కడుంటాడ్రా ? ఎప్పుడో (చచ్చి)పోయుంటాడు." అన్నారాయన. ఇప్పుడు వెనక్కి తిరిగి లోతుగా చూస్తే మోనాయ్ పిచ్చివాడు కాదనిపిస్తుంది. కాని అతను మూల్యం చెల్లించక తప్పలేదు.

ఆ తండ్రీకొడుకుల ఋణానుబంధం అలా తీఱిపోయింది.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్