19.8.07
ఒక డాక్టరుగారి కథ-1
1:11 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
గుంటూరుజిల్లా రేపల్లెలో ఎస్.ఎస్. రావుగారనే డాక్టరుగారుండేవారు. ఆయన వెంకటేశ్వర్లుగారికి దగ్గఱి బంధువు. నిజానికాయన ఎమ్.బి.బి.ఎస్. డాక్టర్ కాదు. ఆ రోజుల్లో L.I.M అనే వైద్యపట్టా ఒకటుండేది. అది చదవడం కోసం మద్రాసు వెళ్ళేవారు. ఆయన కూడా అలా మద్రాసు వెళ్ళి L.I.M. లో చేఱాడు. ఇది నెహ్రూ భారతదేశపు అధికార పగ్గాలు చేపట్టిన కొంతకాలానికి జరిగింది.
దేశంలో - ముఖ్యంగా పల్లెపట్లలో ఆధునిక వైద్య సౌకర్యాల కొఱత ఉందనే దృష్టితో నెహ్రూ ప్రభుత్వం అప్పట్లో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అదేంటంటే- వైద్యవిద్యలో శిక్షణ పొందుతున్న సీనియర్ విద్యార్థులందఱికీ శిక్షణ పూర్తి కాకముందే తక్షణం వైద్యపట్టాలిచ్చేసి పల్లెపట్లకు వైద్యులుగా పంపడం. అనుకున్నారో లేదో వెనువెంటనే అమలు చేసేశారు. అప్పట్లో రేపల్లె మునిసిపాలిటీ కాదు. పల్లెప్రాంతం కిందనే లెక్క. కాబట్టి తాను స్వగ్రామంలో ప్రాక్టీసు పెడతానని చెప్పి ఎస్.ఎస్. రావుగారు కూడా తన వైద్యపట్టాని ముందే పుచ్చుకుని తిరిగొచ్చేశారు.
ఆయన మంచి తెలివైనవాడు. వైద్యాన్ని పూర్తికాలం పాటు అభ్యసించకపోయినా (పాతకాలం భాషలో చెప్పాలంటే) "గొప్ప హస్తవాసి" గల డాక్టరు. చెయ్యి పట్టుకున్నాడంటే రోగాలు చప్పున కుదురుతాయని అనతికాలంలోనే పేరొచ్చింది. ఆ పేరుమీదనే విపరీతంగా సంపాదించాడు. ఎంతగా అంటే ఆయన 1969లో చనిపోయాక రెండు-మూడేళ్ళకు ఆయనకు రేపల్లెలో ఉన్న ఇంటిని భార్యాబిడ్డలు అమ్ముకుంటే అప్పట్లో లక్షా ఇఱవైవేల ధర పలికిందట. (ఇప్పటి లెక్కలో యాభై లక్షలనుకోవచ్చు)
అయితే ఆయన పగటిపూట రోగుల చేతులు పట్టుకున్నట్లే రాత్రిపూట కూడా ఇంకొన్ని చేతులు పట్టుకుంటూండేవాడు. రోగాల్లేకపోయినా ఆయన దగ్గఱికి వైద్యం మిషతో కొంతమంది మహిళామణులు వచ్చేవారు. వాళ్ళ మాయరోగాన్ని తనకు చేతనైన పద్ధతిలో నయం చేసి పంపేవాడు. రావుగారికి ఈ అలవాటు డాక్టరయ్యాక వచ్చింది కాదనీ, వైద్యం చదివేటప్పుడే తోటి విద్యార్థినుల్ని సైతం ఒక చూపు చూశాడనీ బంధువులు చెవులు కొఱుక్కునేవారు. అసలు అంతకుముందే తొమ్మిదో తరగతో, పదో తరగతో చదివేటప్పుడు ఎవరో టీచరు ఆయనకు థియరీ మఱియు ప్రాక్టికల్సులో సుదీర్ఘకాలం పాటు శిక్షణ ఇచ్చిందని కూడా వదంతులుండేవి.
ఈ లోపం ఉన్నప్పటికీ రావుగారు తనయందు ఆసక్తి లేని ఆడవాళ్ళ జోలికి వెళ్ళేవాడు కాడు. దూరం నుంచే నమస్కారం పెట్టేసేవాడు. చాలా సహాయగుణం గల వ్యక్తిగా పేరు మోశాడు. ఒక డాక్టరుగా ఎంత హుందాగా నడుచుకోవాలో అంత హుందాగాను ఉండేవాడు. ఒక దశలో ఆయనకు స్త్రీల మీద మోజు తగ్గిపోయింది. దాని బదులు మత్తు పదార్థాలు అలవాటయ్యాయి. 1965 తరువాత ఆ అలవాటు శ్రుతి మించింది. పెథిడ్రిన్ అనే మత్తుపదార్థాన్ని డాక్టరుగా తనకున్న పలుకుబడితో తెప్పించుకుని అనునిత్యం అది ఇంజెక్షన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రాక్టీసు బాగా దెబ్బ తినిపోయింది. 1969 నాటికి 40 ఏళ్ళ వయసుకే ఆయనకు అవసానదశ సమీపించింది. అప్పటికాయనకు ముగ్గురు పిల్లలు.
ఆరోజుల్లో తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారనే మహాత్ముడు గుంటూరుజిల్లా చందోలులో నివసిస్తూండేవారు. ఆయన మహాతపశ్శాలి. ఆయనలో బాలాత్రిపురసుందరి నివసిస్తోందని జనం చెప్పుకునేవారు. భూత భవిష్యద్ వర్తమానాలు తెలిసిన త్రికాలవేత్త కావడాన హిందువుల్లోను ముస్లిముల్లోను "చందోలు దేవుడు" గా ప్రసిద్ధికెక్కారు. ఆయన తాకితే చాలు తమ రోగాలు నయమౌతాయని గాఢంగా నమ్మేవారు.
ఆయన ప్రసిద్ధి గుఱించి విన్న వెంకటేశ్వర్లుగారు కడపటి ఆశగా శాస్త్రిగారిచేత రావుగారికి ఆశీర్వాదమిప్పిస్తే బతుకుతాడేమోనని అక్కడికి ఆయన్ని మోసుకెళ్ళారు. కాని శాస్త్రిగారు రావుగారిని తాకడానికి ఇష్టపడనూ లేదు, ఆశీర్వదించనూ లేదు. "ఒక నెలరోజుల పాటు భాగవతం చెప్పించుకుని విను నాయనా !" అని ఇంక మాట్లాడకుండా లోపలికి వెళ్ళారు.
నెలరోజుల తరువాత రావుగారు చనిపోయారు.
