Sunday, August 05, 2007
ఆనాటి వెండితెఱ వెలుగులు-1
వెంకటేశ్వర్లుగారు మద్రాసులో LL.B.చదువుతున్నప్పుడు తఱచుగా ఒక హోటలుకి ఉదయాన్నే కాఫీ తాగడం కోసం వెళ్లేవారు.ఆనాటి సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు రమణారెడ్డి కూడా అక్కడికే వచ్చేవారు.ఒకసారి వెంకటేశ్వర్లుగారి తమ్ముడు తాడేపల్లి సత్యనారాయణ(వెంకటేశ్వర్లుగారి కంటే 12ఏళ్ళు చిన్న)అన్నయ్యని చూడాలని మద్రాసొచ్చాడు.మర్నాడు ఉదయాన్నే తమ్ముణ్ణి తీసుకుని హోటలుకి వెళ్ళారు వెంకటేశ్వర్లుగారు.ఇద్దరూ ఒక బల్ల దగ్గర కూర్చుని కాఫీ తాగుతూండగా యథాప్రకారం రమణారెడ్డిగారు కూడా వచ్చారు.ఈసారి కాకతాళీయంగా ఆయన వీళ్ళు కూర్చున్న బల్ల దగ్గరికే వచ్చి కూర్చుని కాఫీ తెమ్మని పురమాయించారు."ఎవరన్నయ్యా ఈయన ? అచ్చు రమణారెడ్డిలా ఉన్నాడు ?"అని గుసగుసలాడాడు అన్నయ్యతో తాడేపల్లి సత్యనారాయణ."నీ బొంద.రమణారెడ్డిలా కాదురా !ఆయనే సాక్షాత్తూ రమణారెడ్డి."అని చెప్పారు వెంకటేశ్వర్లుగారు.అప్పటికే చాలా సినిమాల్లో హాస్యనటుడుగా రమణారెడ్డిగారిని చూసీ చూసీ తాడేపల్లి సత్యనారాయణ నవ్వాపుకోలేకపోయాడు-ఇప్పుడు రమణారెడ్డిగారిని ప్రత్యక్షంగా చూసేసరికి.పకపకా నవ్వుతూనే ఉన్నాడు."ఛ ! ఊరుకోరా ! ఆయనేమన్నా అనుకుంటాడు."అని వెంకటేశ్వర్లుగారు పదేపదే మందలిస్తున్నా సత్యనారాయణకి నవ్వాగలేదు.దాంతో కాఫీ తాగడం అర్ధాంతరంగానే కానిచ్చి తమ్ముణ్ణి బలవంతంగా బయటికి తీసుకెళ్ళారు వెంకటేశ్వర్లుగారు.
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
నామాంకం (లేబెల్) : మా నాన్నగారి స్మృతులు
Subscribe to:
Post Comments (Atom)




0 వ్యాఖ్యలు:
Post a Comment