12.7.07

మహానటుడు శ్రీధర్ కాలధర్మం



"ఎదొ..ఏదొ అన్నది ఈ మసక వెలుతురు,
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు..."

నా బాల్యపు మధుర స్మృతుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ పాట 32 సంవత్సరాల నాటి "ముత్యాల ముగ్గు" అనే దృశ్యకావ్యంలోది. ఈ పాట పాడినది నేపథ్య గాయకుడు రామకృష్ణే అయినా విన్నప్పుడల్లా నా మనస్సులో చప్పున స్ఫురించే రూపం - ఆ పాటని పాడుతున్నట్లు నటించిన మహానటుడు శ్రీధర్ ది. ఆయన ఆ చిత్రంలో కథానాయకుడు. అప్పట్లో ఆ సినిమా నెల్లూరులో విడుదలైనప్పుడు మా నాన్నగారూ, మా అన్నయ్యలూ, నేనూ కలిసి అర్థరాత్రి సెకండ్ షోకి వెళ్ళి చూశాం. 150 కి పైగా తెలుగు సినిమాల్లో హీరోగా ఆ తరువాతి కాలంలో క్యారెక్టర్ నటుడుగా వివిధపాత్రలు పోషించిన శ్రీధర్ ఇక లేరంటే బాధగా అనిపిస్తోంది. గత కొద్దికాలంగా శ్వాసకోశ రుగ్మతతో బాధపడుతూ వచ్చిన ఆయన నిన్న తన 69 వ యేట ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు.
మహానటుడు శ్రీ సూరపనేని శ్రీధర్ కృష్ణాజిల్లాకి చెందినవారు. 1971 నాటి "తల్లా ? పెళ్ళామా ?" సినిమాలో "తెలుగుజాతి మనది" అనే పాటలో మనకు తొలిసారిగా దర్శనమిస్తారు. "ముత్యాల ముగ్గు" (1975) చిత్రంతో ఆయన హీరోగా మారారు. సినిమావ్యాసంగం నుంచి విరమించుకోక ముందే వ్యాపార రంగంలోకి అడుగిడిన శ్రీధర్ అందులో నిమగ్నులు కావడంతో గత 15 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. "ముత్యాల ముగ్గు" తరువాత సుమారు పదేళ్ళ పాటు నటనలో తీఱిక లేకుండా షూటింగులతో సతమతమైన శ్రీధర్ 1986 తరువాత క్యారెక్టర్ పాత్రలు ధరించడం కూడా తగ్గించి చిత్రపరిశ్రమ కన్నా ముందే హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. ఈనాటి యువతరానికి ఆ పేరు గల హీరో ఒకరున్నారనే విషయం కూడా తెలియనంతగా ఆయన ఏకాంత జీవితాన్ని గడిపారు. నా చిన్నప్పుడు మాత్రం ఆయన ఫోటోలు లేని పత్రికలూ, సంచికలూ ఉండేవి కావు. బడిపిల్లల నోట్‌బుక్కుల మీద కూడా ఆయన ఫోటోలు దర్శనమిచ్చిన రోజులున్నాయి. ఆయన నటించిన చివరి చిత్రం రామగోపాల్‌వర్మ తీసిన "గోవిందా..గోవిందా".
రాజకీయాలతోను, సినిమా రాజకీయాలతోను, రాజకీయ నాయకులతోను సంబంధాలు లేకపోవడం వల్ల కావచ్చు - ఎవరూ అంతటి సీనియర్ నటుడికి శ్రద్ధాంజలి ఘటించేపాటి మర్యాదా మన్ననా కూడా చూపించలేకపోయారు. తెలుగువాళ్ళెప్పుడు తెలుసుకుంటారు ?
video

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్