Tuesday, February 06, 2007

ఆంధ్ర రాష్ట్రం కథా కమామిషు

వెంకటేశ్వర్లుగారు పుట్టకముందునాటి సంగతి.గుంటూరులో గురునాథం గారనే బడిపంతులు ఒకాయన ఉండేవాడు.ఆయన ఇంటి పేరేంటో ఏ బడిలో పనిచేసేవారో అలాంటి వివరాలు వెంకటేశ్వర్లుగారికి కూడా తెలీదు.అప్పట్లో గురునాథం గారు ఒకసారి ఏదో పని మీద నైజాం (తెలంగాణాని అలా పిలిచేవారు) వెళ్ళాడు.అక్కడ తెలుగువారికి గాని తెలుగుభాషకి గాని ప్రాధాన్యం సంగతి అలా ఉంచి బొత్తిగా విలువే లేకపోవడం గమనించి చాలా మానసిక వ్యథకి లోనయ్యాడు.తెలుగు గడ్డపైనే తెలుగుకు అవమానాలు జరుగుతున్న దుర్భర పరిస్థితి నుంచి బయటపడాలంటే తెలుగువారంతా ఏకమై ఒకే రాజ్యంగా ఏర్పడాలని ఆయనకి బలంగా అనిపించిందట.ఆయన గుంటూరుకు తిరిగి వచ్చాక కూడా ఆ విషయమే అహోరాత్రాలూ ఆలోచించేవాడు.

ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా వందేమాతర ఉద్యమం జరుగుతూండేది.బ్రిటీషు ప్రభుత్వం అఖండ బెంగాల్ ప్రావిన్సుని తూర్పు పశ్చిమ బెంగాల్ ప్రావిన్సులుగా విడగొట్టాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బెంగాలీలంతా ఏకమై భూమ్యాకాశాలు బద్దలయ్యేలా ఆందోళన చేసేవారు.విడగొడతామంటే బెంగాలీలు గొడవ చేస్తూండిరి.తెలుగువారి విషయానికొస్తే అందరూ విడిపోయే ఉన్నారు.ఇక్కడ దాని గురించి బాధపడేవాడు కూడా లేకుండా పోయాడు.ఈ అంశం గురునాథం గారిని చాలా బాధించింది.

ఆ రోజుల్లో ఆయన Guntur Literary Association అనే సాంస్కృతిక సంస్థకి కార్యదర్శి (Secretary)గా ఉండేవాడు."మన అఖండ తెలుగు రాజ్యం"అనే పేరుతోఆయన ఒక పెద్ద మ్యాపు గీశాడు.అందులో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఉన్నాయి.ఆ మ్యాపు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మ్యాపు కన్నా పెద్దదట.ఒక రకంగా అదే నిజమైన ఆంధ్రా మ్యాప్ అనడం సమంజసమేమో !ఆ మ్యాపుని ఆయన అసోషియేషన్ కార్యాలయంలో వేలాడదీసినప్పుడు జనం చూసి ఆనందించారు తప్ప వారిలో పెద్దగా చలనం లేదు.

ఆయన"తెలుగువారందరికీ కలిపి ఒక రాజ్యం ఉండాలి"అని అసోషియేషన్‌లో మొదటిసారిగా మాట్లాడినప్పుడు ఆయనకేదో పిచ్చెక్కిందనుకున్నారు మిగతా సభ్యులు.పాపం ! వారి తప్పేమీ లేదు.ఆనాటి తెలుగువారు నానా రకాల పరాయి జాతుల కబంధ హస్తాల్లో ఆ రకంగా చిక్కుకుపోయి ఉన్నారు.ఆ స్థితిలోంచి బయటపడే ఆలోచన చెయ్యడం వారికి కలలో కూడా సాధ్యం అయ్యేది కాదు.ఉన్నట్లుండి గురునాథం గారు అలా మాట్లాడ్డం గుంటూరులో పెద్ద చర్చనీయాంశమైందట.ఇది 1906నాటి ముచ్చట.

తత్వం తలకెక్కడం వల్ల కావచ్చు లేదా గురునాథం గారి అనుయాయులూ శిష్యులూ తరువాతి కాలంలో సాహిత్య రాజకీయ ప్రాబల్యాన్ని సంపాదించుకోవడం వల్ల కావచ్చు.మొత్తం మీద 1914నాటికి ఆంధ్ర రాష్ట్ర నినాదం ప్రతి తెలుగువాడి గుండెకి చేరిపోయింది.అది చివరికి నిజాం సింహాసనాన్ని సైతం కూకటి వేళ్ళతో పెళ్ళగించింది.

0 వ్యాఖ్యలు: