2.2.07
చలపాయిగారి కథ-1
10:37 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
చలపాయిగారు వరుసకి వెంకటేశ్వర్లుగారి పిన్నిభర్త. వారిది గుంటూరు జిల్లాలో నండూరు. అక్కడ వారికి ఈమధ్యదాకా కూడా చాలా పొలాలుండేవి. 1939-40 ప్రాంతంలో చలపాయిగారు బి.ఏ. (మేథమ్యాటిక్స్) చదవాలని లండన్ వెళ్ళారు. అంతకుముందే ఆయనకి పెళ్ళయింది. లండన్‌లో ఒక వృద్ధ బ్రిటీషు వితంతువు ఇంట్లో అద్దెకి దిగారు. ఆయనతో పాటు ఒక ఇంగ్లీషువాడూ ఆఫ్రికాలో అప్పట్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలిస్తూ చదువు నిమిత్తం ఇంగ్లండ్ వచ్చిన ఒక నల్లని నీగ్రో యువరాజూ అదే వాటాని తలో గదిగా విభజించుకుని ఉండేవారు. కారణం-ఆ రోజుల్లో హాష్టళ్ళు లేవు. ఇండియా ఇంగ్లండే కాదు-ప్రపంచంలో ఎక్కడా ఉండేవి కావు. మొట్టమొదటి హాస్టలు ఏర్పడింది ఆంధ్ర రాజధాని హైదరాబాదులోనే అని చెబుతారు. నిజాం రాజు హయాంలో నగర కొత్వాల్ (పోలీస్‌కమీషనర్ మరియు మునిసిపల్ కమీషనర్) గా పనిచేసిన వెంకట్రామారెడ్డి గారు కట్టించిన రెడ్డి హాస్టలే (ఆబిడ్స్ ప్రాంతం)ఆ తొట్టతొలి హాస్టల్.
చలపాయిగారి ఇంటి యజమానురాలు చాలా మంచి మనిషి. డబ్బు తీసుకునేది కాని అందుకు తగ్గట్టుగా ముగ్గురికీ మూడు పూటలా రుచికరమైన భోజనాలు వేళకి వేడివేడిగా వండి పెడుతూండేది. అందుకోసం ఎంతో శ్రమించేది. వారిలో ఎవరైనా జబ్బుపడితే అహోరాత్రాలూ దగ్గరుండి చూసుకునేది. పరీక్షల సమయంలో నయితే సరేసరి !
ఒకసారి చలపాయిగారు నీగ్రో యువరాజుతో కలిసి సినిమాకెళ్ళారు. ఆ హాలు అప్పటికే హౌస్‌ఫుల్ అయింది. అక్కడున్న గేట్‌కీపర్ ఎవరినీ లోపలికి రానివ్వడంలేదు. చలపాయిగారు వాణ్ణి బతిమాలుతున్నారు. అయినా వాడు "ససేమిరా" అంటున్నాడు. గేట్‌కీపర్ మొండితనానికి యువరాజు ఆగ్రహంతో పళ్లు పటపటా కొరికాడు. "ఇదే మా దేశంలో అయితేనా, నీ గుండెకాయ వేపుడు చేయించుకుని తినేవాణ్ణి" అంటూ శివాలెత్తాడు. గేట్‌కీపర్ సంగతేమో గాని చలపాయిగారికి ఆ డైలాగుతో గుండె పీచుపీచుమంది. "అమ్మో ఆఫ్రికన్‌లు ఎంతకైనా తగుదురు సుమా ! వీడికి ఇంట్లో హటాత్తుగా ఆకలేస్తే నా గతేం కాను ?" అనుకుని వెంటనే ఇల్లు మారాడు.
ఆ రోజుల్లో లండన్‌లో Petite అనే రంగస్థల నటీమణి తన అతిలోక సౌందర్యంతో ప్రసిద్ధికెక్కింది. ఆమెను చూసి లక్షలాది మంది యువకులకు మతులు పోతూండేవి. అలాంటి వారిలో చలపాయిగారి రూమ్ మేటయిన ఎడ్వర్డ్ ఒకడు. ఒకరోజు ఎడ్వర్డ్ సీరియస్‌గా చలపాయిగారి దగ్గరికొచ్చి " ఛలపథీ నీకో సీక్రెట్ చెప్తాను.నువ్వు మాత్రం ఎవరితోనూ అనకూడదు సుమా" అని ఒట్టేయించుకున్నాడు. తరువాత చెవిలో చేరి "I deeply love Petite, you know ?" అని గుసగుసలాడేసరికి చలపాయిగారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. "So do millions of others in this country, Edward." అని మాత్రం అన్నాడు. ఎడ్వర్డేమో మళ్లీ సీరియస్‌గా "My love is really different, Chalapathy" అన్నాడు.ఆ క్షణంలో అతనితో వాదించడం వ్యర్థమనిపించిందట చలపాయి గారికి. అలా ఉండేవి ఇంగ్లండులో సైతం కుఱ్ఱకారు వేలంవెఱ్ఱులు
1939 ప్రాంతంలో ఇంగ్లండు వెళ్ళిన చలపాయిగారు బి.ఏ.పూర్తయినా ఇండియా రావడం సుతరామూ వీలుపడింది కాదు. కారణం - రెండో ప్రపంచ యుద్ధం. ఆయన లండన్‌లోనే ఇరుక్కుపోయాడు. ఆయన ఉంటున్న ఇంటి మీద హిట్లర్ సైనికులు బాంబుల వర్షం కురిపించేసరికి చలపాయిగారు ఎక్కడిది అక్కడ ఒదిలిపెట్టి బతుకు జీవుడా అనుకుంటూ లండన్ నగర శివార్లకి పారిపోయాడు. ఆ కోపంతో లండన్‌టైమ్‌స్‌లో పాత్రికేయుడుగా చేరి కొంతకాలం హిట్లర్‌ని వాడి జర్మనీని దుయ్యబడుతూ కొన్ని వ్యాసాలు రాసి ప్రచురించాడు.
చలపాయిగారు వెళ్ళి ఏడేళ్ళయినా అయిపు లేకపోవడంతో ఆయన ఏమైపోయాడోనని గుంటూరులో ఆయన కుటుంబం వారంతా శోకాలుపెట్టారు. మనిషి ఏడేళ్ళ పాటు కనపడకుండాపోతే ఆశ ఒదులుకోక తప్పదని పురోహితులు శాస్త్రాలు వల్లించారు. ఆయన భార్య గాజులు పగలగొట్టి ఆవిడ నొసట కుంకుమ చెఱిపేసి తెల్లచీర కట్టి కూర్చోబెట్టారు. చలపాయిగారికి శాస్త్రోక్తంగా 13రోజులు కర్మకాండ చేసి పిండాలు పెట్టారు.
ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయి ప్రపంచంలో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక 1946లో చలపాయిగారు మళ్లీ గుంటూరుగడ్డపై అడుగుపెట్టాడు.అందరూ చాలా సంతోషించారు.దెయ్యమేమోనని ఎవరూ భయపడలేదు.
స్వదేశానికి వచ్చాక చలపాయిగారు సుదీర్ఘకాలం పాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్ (బొంబాయి) లో ఒక ఉద్యోగమేదో చేశారట కాని ఆ హోదా ఏంటో ఈ రచయితకి స్పష్టంగా గుర్తులేదు. అక్కడ ఆయనకి పైలట్‌మిత్రుడొకడు ఉండేవాడు. అతని ఇంటికి తరచుగా వెళ్లే క్రమంలో ఆ పైలట్ గారి భార్యతో చలపాయిగారికి "మిక్కిలి" సాన్నిహిత్యం ఏర్పడింది. ఇలా చాలా కాలం గడిచిన తరువాత పైలట్‌గారు అమెరికా వెళుతుంటే చలపాయిగారు వీడ్కోలివ్వడానికి వెంట వెళ్ళారు. ఇప్పటిలా ఆ రోజుల్లో "రన్‌వే్"ల దగ్గర భద్రతా తనిఖీలు (security checks) ఉండేవి కావు.విమానం బయలుదేరబోతూండగా ఆ మిత్రుడు చలపాయిగారి చెయ్యి గట్టిగా పట్టుకుని "చలపతీ ! నేను ఇప్పుడు చెబుతున్నానని ఏమీ అనుకోకు. నేను అమెరికాకి వెళుతున్నది తిరిగి రావడానికి కాదు. నా భార్యని బాగా చూసుకుంటావు కదూ ?" అన్నాడు.అంతే ! చలపాయిగారికి షాక్ !
చలపాయిగారి వృద్ధాప్య విశేషాలు రాబోయే టపాలో !
