వెంకటేశ్వర్లుగారు నెహ్రూ ఇందిరాగాంధీల విధానాల్ని విమర్శించేవారు.కాని ఒక పాతకాలపు మనిషిగా ఆయన కాంగ్రెస్ అభిమాని కూడా కావడాన ఆ విమర్శల్లో తీవ్రత ఉండేది కాదు.కాంగ్రెస్ భాషారాష్ట్రాల విషయంలో స్వాతంత్ర్యం వచ్చాక చేసిన వాగ్దానభంగం గురించి "అది మాట తప్పడం కా"దన్నారు.అప్పుడే వలసపాలనలోంచి బయటపడ్డ ఇండియా ప్రభుత్వం జాతికొక రాష్ట్రమిచ్చేటంత గొప్ప ఆర్థికస్థితిలో లేదన్నారు.పరిస్థితులు సంతృప్తికరంగా చక్కబడేదాకా కొంతకాలంపాటు బ్రిటీషువారు ఏర్పరచిన ప్రెసిడెన్సీల్నే యథాతథంగా కొనసాగించాలనుకున్నారట.అదీగాక దేశవిభజన సమయంలో 10లక్షలమంది ప్రాణాల్ని బలిగొన్న మతిహీనమైన హింసాకాడ మారణహోమం చూసి నాయకులే బెంబేలెత్తిపోయారు.ఆ పరిస్థితుల్లో ఏ విధమైన పునర్విభజనైనా ప్రమాదకరంగా తోచింది వారికి.
ఇండియా పరిస్థితి పరమ దయనీయంగా ఉండేది.చైనాతో ఇండియాకి ఉన్న వేలాది కిలోమీటర్ల సరిహద్దు పొడవునా ఒక్క నరమానవుడు కూడా కాపలా ఉండేవాడు కాడంటే ఈనాటివారికి దిగ్భ్రాంతి కలుగుతుంది.వేరే కారణమేమీ లేదు.సరిహద్దుల కాపలా కొఱకు లక్షలాదిమందిని నియమించుకునే శక్తి అప్పట్లో ఇండియాకి లేదంతే.చైనా టిబెట్‌ని ఆక్రమించుకున్న తరువాత కూడా ఆ దేశ తత్త్వాన్ని ఇక్కడివారు గ్రహించలేకపోయారు.ముఖ్యంగా నెహ్రూ ! చైనా చాటుమాటుగా లోపాయికారీగా ఇండియా భూభాగాన్ని కాజేసిన తరువాత ఎంతో కాలానికి గాని ఆ విషయం ఇండియాకి తెలియలేదు.తెలిసేసరికి నెహ్రూకి నోట మాట రాలేదు.చైనాతో ఢీకొనడమంటే పాకిస్తాన్‌తో పరాచికాల్లాంటిది కాదు.సైన్యం సరిపోక మలబార్ పోలీసుల్ని పంపారు.వేలాదిమంది మలబార్ పోలీసులు యుద్ధం మొదలుకాకముందే పిట్టల్లా నేలకూలారు.ముసలి బ్రాహ్మడు భయంతో గజగజ వొణికిపోయాడు.కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యం మళ్ళీ విదేశీయుల చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో ! ఇంత మిత్రద్రోహమా ? బానిసదేశాల్లో కూడా ఇంత సామ్రాజ్యకాంక్షా ? అని ఆలోచిస్తూంటే ఆయనకి మతిపోయినంత పనైంది.తనకేమో చావు సమీపిస్తోంది.తన తరువాత ఇండియా సంగతి చూసేదెవరు ? ఈ అలోచనలతో సతమతమై ఆయన తనమీద తాను కంట్రోల్ కోల్పోయాడు.పులిమీద పుట్రలా ఒరిస్సా పర్యటనలో ఉండగా పక్షవాతం వచ్చింది.కోలుకున్నట్లే కోలుకుని ఆ తరువాత కొన్ని రోజులకి నెహ్రూ అస్తమించాడు.
అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయి దెబ్బతిన్న నెహ్రూలా కాదల్చుకోలేదు ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన ఆయన కూతురు ఇందిరాగాంధి.ఇందిరాగాంధి నిరంకుశత్వం వెనుక ఆవిడ మిలిటరీ ధోరణి వెనుక నెహ్రూ తిన్న దెబ్బలున్నాయి.నెహ్రూ వైఫల్యాలున్నాయి.ఆయన పొందిన చేదు అనుభవాలు ఆవిడని జీవితాంతం వెంటాడాయి.అందుకే ఇండియాని కూడా చైనాతో సమానంగా ఒక ప్రబల సైనిక శక్తిగా మార్చాలని ఆవిడ నిశ్చయించుకుంది.తత్ఫలితమే 1974లో పొఖారన్‌లోఇండియా జరిపిన మొదటి అణుబాంబు పరీక్ష.ఆవిడ ఇండియా కాల్బలాన్ని సైతం 12 లక్షలకి పెంచింది.నెహ్రూ చనిపోయిన 10ఏళ్ళలోనే ఇండియా ప్రపంచంలో నాలుగో మహా సైనిక శక్తిగా అవతరించడానికి కారణమిదే.




0 వ్యాఖ్యలు:
Post a Comment