2.10.06
రోడ్ల మింగుడుగాడి కథ
3:06 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
వెంకటేశ్వర్లుగారి S.S.L.C. (Seconday School Leaving Certificate - అంటే ఈనాడు పదో తరగతి అన్నమాట) పరీక్ష ఒక ఘనమైన చరిత్ర. అందులో పది-పన్నెండు సబ్జెక్టులుండేవి. దాన్ని ప్రథమ ప్రయత్నంలో లంఘించగల జాంబవంతులు అరుదుగా ఉండేవారు. అందుచేత ఆయన సమవయస్కులు (same age-group) అయిన బంధువులంతా పరీక్ష తప్పి, "ఈ చదువులు మనకి అచ్చిరావులేరా !"అని ఒకడితో ఒకడు చెప్పుకుని చదువుకి స్వస్తిచెప్పి ఇంట్లో కూర్చున్నారు. వెంకటేశ్వర్లుగారేమో తొట్టతొలి ప్రయత్నంలోనే (1945) SSLC అనే భవసాగరాన్ని దాటారు. అది చూసి బంధువులందరికీ అసూయా పౌరుషాలు పొడుచుకొచ్చాయి. "మెతకగా కనిపించే వెంకులు పాస్ కాగా లేనిది మనం పాస్ కాలేమా ?" అనుకుని అందరూ వెంటనే ట్యూషన్‌లు పెట్టించుకుని పాసయ్యారు.
ఆ రోజుల్లో ఒక చిన్న సంఘటన జరిగింది. కుటుంబరావుగారనే దూరబంధువు "నీ పరీక్ష నెంబరెంత ?"అని అడిగాడట. "ఈయనకి నా నెంబరెందుకు ?" అని వెంకటేశ్వర్లుగారికి చిరాకేసి తప్పుడు నెంబరొకటి ఇచ్చారట. అది పట్టుకుని ఆయన, ఫలితాలు ప్రకటించినప్పుడు దినపత్రికలో వెతికితే, అది కూడా పాసైన నెంబర్లలోనే ఉందిట. ఈలోపల ఇంకో బంధువొచ్చి "వెంకులు తప్పా"డని చెప్పాడట. కుటుంబయ్యగారు అది నమ్మి "అరే! వెంకులు నన్ను కూడా మోసం చేశాడే !"అని విస్తుపోయాడట.
కుటుంబయ్యగారు బ్రిటీషువారి ప్రజాపనుల శాఖ (Public Works Department) లో ఓవర్సీరుగా పనిచేశారు. కరుడుగట్టిన అవినీతిపరుడని పేరు. ఒకసారి ఆయనకి ఒక రోడ్డు నిర్మాణం పని అప్పగించారు. కొంతకాలం తరువాత రోడ్డు ఎలా వేశారో చూడ్డం కోసం ఆయన మీద సూపర్నెంటుగా ఉన్న వేపా కృష్ణమూర్తిగారనే ఇంజినీరు వచ్చారు. "రండి ! రండి! చూపిస్తా"నంటూ కుటుంబయ్య ఆయన్ని ఊరికి దూరంగా తీసుకెళ్ళాడు. ఇద్దరూ పొలాల్లో పడి చాలా దూరం నడిచారు. "ఇదేంటయ్యా ! నాకిచ్చిన ప్లాన్‌లో దారి ఇలా లేదే !నువ్వు ఎక్కడ వేయించావు రోడ్డు ?" అని వేపా కృష్ణమూర్తిగారు అడుగుతూనే ఉన్నారు. "ఆగండి సార్ !చూపిస్తా" నంటూ కొన్ని అడుగులేశాక కుటుంబయ్య ఆయన కాళ్ళమీద సాష్టాంగపడిపోయాడు. ఇంజినీరుకి అంతా అయోమయం. "లే !లే !ఏంటిది ?" అని లేవదీశారు. అప్పుడు బయటపెట్టాడు కుటుంబయ్య అసలు విషయం.
కుటుంబయ్య అసలు రోడ్డు వేయించనే లేదు. అందుకోసం మంజూరైన ప్రభుత్వ ధనమంతా జేబులో వేసుకున్నాడు. వేపా కృష్ణమూర్తిగారికి చాలా కోపమొచ్చింది. మొత్తం మీద, విషయం తెల్లదొరతనంవారి దృష్టికి వెళ్ళకముందే తొందరగా రోడ్డు వేయించమని లేకపోతే సెంట్రల్ జైలు తప్పదని హెచ్చరించారు. దయామయుడు కనుక కుటుంబయ్యకి ఒక అవకాశమిచ్చారు.
అనంతర కాలంలో వేపా కృష్ణమూర్తిగారు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ఛీఫ్ ఇంజినీరు కూడా అయ్యారు (ఏ విభాగానికో గుర్తులేదు). కాని దురదృష్టవశాత్తు కృష్ణానది వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారు.
