Tuesday, October 10, 2006

శ్రీ సాములోరి సుబ్బమ్మగారి కథ

>క్రీ.శ.1900 ప్రాంతంలో ఎక్కడివాడో తెలీదు గాని శివానందస్వామి అనే సాధువు అప్పికట్ల వచ్చి అక్కడే స్థిరపడిపోయాడు. మఱ్ఱిపూడి ప్రజలు ఒక ఆశ్రమం కట్టించి ఇస్తామన్నా ఆయన ఒప్పుకోలేదు. సన్న్యాసులకి ఆస్తులూ వగైరా నిషిద్ధమని చెప్పి అప్పికట్ల శివాలయంలోనే ఉండడం మొదలుపెట్టాడు. ఆయన భోజనానికి గుళ్ళోనే ఏర్పాటు చెయ్యాలని అనుకున్నారు గాని ఆయన వద్దన్నాడు. ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చెయ్యడమే సన్న్యాసులకి శాస్త్రం విధించిన ధర్మమని చెప్పి ఆ చుట్టుపక్కల ఊళ్ళలో భిక్షాటనకి వెళ్ళి ఆ ప్రకారంగా జీవించేవాడు.

అప్పికట్ల శివాలయం గుంటూరు నుంచి బాపట్ల వెళ్ళే రాష్ట్ర రహదారిమీదనే ఉంది. ఆ గుడి పక్కనుంచే మఱ్ఱిపూడికి దారితీసే రోడ్డు పొలాల మధ్యలోంచి వెళుతుంది. గుడినుంచి లోపలికి (మఱ్ఱిపూడికి) ఒక మైలుంటుంది. ఈ రచయిత కూడా ఆ గుడిని ఒకసారి బయటినుంచే చూడ్డం తటస్థించింది. అది శిల్పకళారీత్యా గొప్పగా ఉండదు గాని ఆవరణ మాత్రం చాలా పెద్దది. ఆ గుళ్ళోనే చిన్నతనంలో ఆడుకునేవారిమని వెంకటేశ్వర్లుగారు చెప్పారు. ఏమైనా మఱ్ఱిపూడి-అప్పికట్ల ప్రాంతాలు ప్రాచీనకాలంలోని ఋషుల తపోవనాల మాదిరి పచ్చగా కళకళలాడుతూ ఏదో తెలియని మానసిక ప్రశాంతితో అలరారుతూ ఉన్నాయి ఇప్పటికీ.

శివానందస్వాములవారు మఱ్ఱిపూడికి వచ్చిన చాలా సంవత్సరాలకి ఎవరో ఒక అనాథపిల్ల కూడా మఱ్ఱిపూడి చేరుకుంది. తొమ్మిది-పదేళ్ళుంటాయి. తన పేరేంటో తనకే తెలీదు. శివాలయంలో ప్రసాదాలు తింటూ కొంతకాలం గడిపింది. తరువాత స్వాములవారు ఆ పిల్లని పిలిచి "అమ్మాయీ !నీకు మంత్రోపదేశం చేస్తాను. సన్న్యాసం తీసుకో. లోకం బహుచెడ్డది సుమా !" అని బోధించి సన్న్యాసదీక్ష ఇచ్చి ఆమెచేత కాషాయవస్త్రాలు కట్టించాడు. దీక్షానామం ఏమిచ్చారో తెలీదు గాని స్వాములవారు ఆమెని "సుబ్బమ్మా !" అని పిలవడాన ఊరివారంతా కూడా అలాగే పిలిచేవారు. అయితే ఊళ్ళో చాలామంది సుబ్బమ్మలుండేవారు కనుక ఎవరు ఎవరో తెలియడం కోసం ఈ స్వాములవారి శిష్యురాలిని "సాములోరి (స్వాములవారి) సుబ్బమ్మ"అనేవారు.

శివానందస్వాములవారు 1932-34 ప్రాంతంలో బ్రహ్మైక్యం చెందారు. అప్పుడు కూడా సుబ్బమ్మ కోసం మఱ్ఱిపూడి వాస్తవ్యులు ఒక ఆశ్రమం కట్టించి ఇస్తామన్నారు గాని సుబ్బమ్మ వద్దంది. తాను కూడా గురువుగారిలా శివాలయంలోనే ఉంటానని చెప్పింది. ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా సాములోరి సుబ్బమ్మగారిని పిలవకుండా ఉండేవారు కారు మఱ్ఱిపూడియన్స్. ఎవరికైనా పిల్లలు పుడితే ఆవిడ ఆశీర్వాదం కోసం అప్పికట్ల శివాలయానికి తీసుకెళ్ళేవారు. అలాగని ఆవిడ ఏ విధమైన మహిమలూ, మంత్రాలూ చూపించినట్లు కనపడదు.

సాములోరి సుబ్బమ్మగారు 1970 ప్రాంతంలో బ్రహ్మైక్యం చెందారు.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :-ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

మీరు 1950 నాటి భారతరాజ్యాంగం చేత గుర్తించబడిన రిజర్వుడు వర్గాల్లో ఏదైనా ఒకదానికి చెందినవారైతే ఆ విషయాన్ని వ్యాఖ్యతో పాటు తప్పనిసరిగా తెలియజేయండి. అంతకు ముందు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ప్రతి తాజా వ్యాఖ్యకీ ఆ విధంగా మళ్ళీ మళ్ళీ తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ వ్యాఖ్య ఇక్కడ ఉంచబడదు. అందుకు మీరే బాధ్యులు.