7.10.06
గ్యాంగ్ లీడర్
11:20 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
మఱ్ఱిపూడిలో చెరువు లక్ష్మీపతిశాస్త్రిగారనే బ్రాహ్మణు డొకాయన ఉండేవాడు. మఱ్ఱిపూడి ప్రజలకి ఆయనే friend, guide and philosopher. ఆయన చిన్నప్పట్నుంచి యజుర్వేదాన్ని సాంగోపాంగంగా అభ్యసించిన శుద్ధ సనాతనుడు. ఇంగ్లీషు చదువులంటే ఏంటో ఆయన ఎరగనే ఎరగడు. మధ్యాహ్నం వేళ ఎవరైనా పక్కనే పంక్తికి ఉంటేనే గాని భోంచేసేవాడు కాడు. అలా అతిథి ఎవరూ దొరకని రోజున అలాంటివారిని వెతుక్కుంటూ ఊరి చివర మఱ్ఱిచెట్టు దాకా నడుచుకుంటూ వెళ్ళి కళ్ళు అరచేత్తో కాసుకుంటూ నిలబడేవాడు. కొన్నిసార్లు ఆయనకి అతిథులుగా బ్రాహ్మలెవరూ దొరికేవారు కారు. ఇతర కులాలవారెవరైనా దొరికితే వారికి వరండాలో భోజనం పెట్టించి తాను లోపలికి పోయి తినేవాడు. కొన్నిసార్లు వారు కూడా లభించక మాలలో మాదిగలో దొరికేవారు. "ఏం జేస్తాం ? ఆ శంభోశంకరుడు ఈ రోజుకి మనకింతే రాశాడు. రండి" అని పైకి బిగ్గరగానే అంటూ ఇంటికి తీసుకెళ్ళి వారికి విస్తరి వాకిట్లో వేయించేవాడు.
మఱ్ఱిపూడిలో ఆయనకి 500 (అయిదు వందల)ఎకరాల భూమి ఉండేది. అందులో పనివారంతా మాలలే. వారంతా తరాల తరబడి ఆయన పొలంలోనే పనిచేసేవారు. కాని మఱ్ఱిపూడి భూస్వాములు ఎవరిచేతా వెట్టిచాకిరీ చేయించుకునేవారు కారట. లక్ష్మీపతిశాస్త్రిగారైతే అప్పు తీసుకోవడానికీ, అప్పు ఇవ్వడానికీ రెంటికీ ఇష్టపడేవాడు కాడు. ఋణానుబంధాలు పెరిగిపోయి వచ్చే జన్మలో కూడా పట్టి పీడిస్తాయనే భయం. ఆ ఊళ్ళో ఉన్నవారంతా ఆయన మార్గాన్నే అనుసరిస్తూ ఉండేవారు.
పొలం విషయాలు విన్నవించడానికి మాలవాళ్ళు ఇంటికొస్తే, లక్ష్మీపతిశాస్త్రిగారు ఉయ్యాలబల్ల మీద కూర్చున్నవాడు కాస్తా వాళ్ళ మొహం చూడకుండా వెనక్కి తిరిగేవాడు, "ఊఁ ! ఇప్పుడు చెప్పరా !"అంటూ. ఆయనొక్కడి విషయమే కాదు ఆ రోజుల్లో మఱ్ఱిపూడిలోని అగ్రకులాలన్నీ అంతే ! ఏదో పూర్వాచారం పాటించాలనే ధోరణే తప్ప మాలవాళ్ళ పట్ల ఆ ప్రాంతంలో మఱింకేమీ ఉండేది కాదు. కాని అన్ని ఊళ్ళలో లాగానే మఱ్ఱిపూడిలో కూడా మాలలకి వేరుగా మాలవాడ ఉండేది. లక్ష్మీపతిశాస్త్రిగారి జీవితకాలంలోనే మఱ్ఱిపూడి మాలలందరూ క్రమక్రమంగా క్రైస్తవం తీసుకున్నారు. కాని బ్రాహ్మల పొలాల్లో పనిచెయ్యడం మాత్రం మానలేదు.
చెరువు లక్ష్మీపతిశాస్త్రిగారికి ఎనిమిది మంది సంతానమట. అందులో నలుగురు ఆడపిల్లలు. నలుగురు మగపిల్లలు. మగపిల్లల్లో చివరివాడైన సుబ్రహ్మణ్యం అనే అతన్ని విష్ణుభొట్లవారి వంశానికి దత్తత ఇచ్చేశారట. సదరు విష్ణుభొట్లవారికి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు దగ్గర 100 ఎకరాల భూమి ఉంది కాని సంతానం లేదు. అందుకని ముందుగానే ఒప్పందం చేసుకుని సుబ్రహ్మణ్యం రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడే తీసుకెళ్ళిపోయారట. విష్ణుభొట్ల సుబ్రహ్మణ్యం కుమారుడైన విష్ణుభొట్ల లక్ష్మీపతిశాస్త్రిగారు ప్రస్తుతం గుడ్లవల్లేరులోనే ఉండి అ 100 ఎకరాలు చూసుకుంటున్నట్లు వినవస్తోంది.
అసలు చెరువు లక్ష్మీపతిశాస్త్రిగారు తానే స్వయంగా ఒక దత్తపుత్రుడు. చెరువు వంశానికి ఉన్న వెయ్యెకరాలకి వారసుడు లేకపోవడం చేత ఆయన్ని దత్తత తెచ్చుకున్నారట. ఆయన కుమార్తెల్లో పెద్దదైన చాముండేశ్వరి పెళ్ళయి కాపురానికి వెళ్ళిన తరువాత క్షయవ్యాధి సోకి మరణించిందట. ఆ రకంగా ఆయనకున్న 8 మందిలో ఆరుగురే మిగిలారు.
అదే ఊళ్ళో ఉన్న మరో భూస్వామి తాడేపల్లి లక్ష్మీనరసింహశాస్త్రిగారికి 250 ఎకరాల భూమి ఉండేది. కాని సంతానం లేకపోవడం చేత వేమూరి వంశీకుడైన తాడేపల్లి శ్రీరాములుగారిని దత్తత తెచ్చుకున్నారు.
చెరువు లక్ష్మీపతిశాస్త్రిగారు 1960-61 ప్రాంతంలో తన 104వ ఏట మరణించారు. మఱ్ఱిపూడి బ్రాహ్మణుల సనాతన సంప్రదాయాలు ఆయనతోనే అంతరించి పోయాయని చెప్పుకోవచ్చు.
