3.10.06
ఆనాటి గుంటూరు
10:45 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
సబర్బన్ టౌన్‌షిప్పులు కూడా కలిపితే ఈనాటి గుంటూరు ఏడెనిమిది లక్షల జనాభా గల ఒక మహానగరం. ఏడాదికి 1,000 (వెయ్యి) కోట్ల రూపాయల వ్యావసాయిక ఉత్పత్తులు ఎగుమతి చేసే ప్రముఖ వ్యాపార కేంద్రం. Guntur Central కాక మరో మూడు రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. Guntur East, Guntur West నియోజకవర్గాలకి వేరువేరు M.L.A. లు కూడా ఉన్నారు. ఆ ఊళ్ళో ప్రస్తుతం 70 జూనియర్ కళాశాలలు, 20 డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. ఇవి కాక వివిధ బ్యాంకుల శాఖలు 100 దాకా ఉంటాయి. 136 మునిసిపల్ పట్టణాలు గల ఆంధ్రప్రదేశ్‌లో అది 4వ పెద్ద మహానగరంగా పరిగణించబడుతోంది. అయితే వెంకటేశ్వర్లుగారి చిన్నతనంలో గుంటూర్ని 3వ మహానగరంగా పరిగణించేవారట. ఎందుకంటే అప్పట్లో విజయవాడ (ఆ రోజుల్లో బెజవాడ అనేవారు. దాని ఆంగ్ల వర్ణక్రమం Bezwada) కన్నా గుంటూరులోనే జనాభా ఎక్కువట.
వెంకటేశ్వర్లుగారు మఱ్ఱిపూడిలో ఉన్న రోజుల్లో గుంటూరు జిల్లాలో అంతగా బస్సు సౌకర్యం ఉండేది కాదు. సగం కారణం-ప్రభుత్వం RTC లాంటి సంస్థల్ని అప్పటికి ఇంకా ఏర్పరచకపోవడం. ఒక్క RTC యే కాదు, మనకి తెలిసిన Electricity Board లాంటి మౌలిక సదుపాయాల (infra-structural) సంస్థలేవీ ఉండేవి కావు. రాష్ట్రమంతా కలిపి హైదరాబాదు, విశాఖపట్నాలలో మినహా ఇంకెక్కడా కరెంటు కూడా ఉండేది కాదు. "నోట్లో ముద్ద, గూట్లో దీపం" అన్నట్లు బ్రతికేవారమన్నారు వెంకటేశ్వర్లుగారు. అంటే సాయంకాలం అవుతూనే దీపాలు వెలిగించి భోంచేసేసి ఏడింటికే పడుకునేవారట. గుంటూరు పట్టణానికి కరెంటు సౌకర్యం వచ్చింది 1952 లో.
ఆ రోజుల్లో ఉన్నవన్నీ ప్రైవేటు బస్సులే. వాటి ముందుభాగం చూడ్డానికి లారీలా ఉండి బొగ్గుతో నడిచేవిట. అందుకని వాటికి బొగ్గుబస్సులని పేరు పెట్టుకున్నారు జనం. మఱ్ఱిపూడి stage దగ్గర బస్సాపి "గుంటూర్ గుంటూర్, గుంటుర్, గుంట్రు గుంట్రు గుంట్ర్..." అంటూ పల్లవి ఆలపించేవాడు క్లీనరు. బొగ్గుబస్సులు ఒకపట్టాన start అయ్యేవి కావు. ఇంజన్ వేడేక్కేదాక వేచి చూడాల్సిందే. దానికి తోడు విపరీతమైన వాయు కాలుష్యమూ, ధ్వనికాలుష్యం కూడా ! సదరు బొగ్గు బస్సులు రోజుకు మూడో నాలుగో ట్రిప్పులు అప్పికట్ల మీదుగా నడిచేవి. వాటి కోసం పడికాపులు కాయలేక జనమంతా మఱ్ఱిపూడి నుంచి బాపట్లకి ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేవారు. ఆ రోజుల్లో మనుషులకి మధుమేహవ్యాధి లాంటివి అరుదంటే మఱి కాదా ?
ఇహ గుంటూర్లోనయితే ఒంగోలు వెళ్ళాలంటే-డ్రైవర్లకీ కండక్టర్లకీ ఎవరి చేతైనా సిఫార్సు చేయిస్తే గాని సీట్లు దొరికేవి కావు. ధారా టుబాకో కంపెనీవారు వెంకటేశ్వర్లుగారికి అత్యంత సన్నిహిత బంధువులు కావడంతో ఆయనకి మాత్రం అలాంటి విషయాల్లో సమస్యలు ఎదురుకాలేదు.
రైళ్ళ విషయానికొస్తే- ఆ సౌకర్యం కూడా పెద్ద గొప్పగా ఉండేది కాదు. రోజుకో ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉండేది. గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారానికి పై కప్పు కూడా ఉండేది కాదు. అసలు అన్నీ కలిపితే ఉన్నవి ముచ్చటగా మూడే ప్లాట్‌ఫారాలు.
ఆ రోజుల్లో గుంటూరు పట్టణ జనాభా ఇంచుమించు ఒక లక్ష దాకా ఉండేది. బ్రాడీపేట నాలుగో లైనులో నాలుగైదు ఇళ్ళు దాటితే రాత్రివేళ అంతా చీకటే. అయిదో లైను సరేసరి. దొంగలు కొడతారని ఎవరూ ఆ జోలికే వెళ్లేవారు కారు. కాని రెండో లైను పేద్ద బజారులా ఉండేదిట. అరండల్‌పేటకీ బ్రాడీపేటకీ మధ్య ఉన్న మెయిన్ రోడ్డుపై 1967 ప్రాంతంలో భూ-వంతెన (flyover) కట్టడంతో నాలుగో లైనుకి దశెత్తుకుందన్నారు వెంకటేశ్వర్లుగారు. ఆ రోజుల్లో రెండో లైను చివర ఇప్పటి భూవంతెన (flyover) స్థానంలో ఒక నీలిరంగు లైటు స్తంభం ఉండేదిట. అందువల్ల ఆ ప్రాంతానికి జనం Blue light Centre అని ముద్దుపేరు పెట్టుకున్నారట. "బ్లూ లైట్ సెంటర్‌కి వెళదాం పదవోయ్"అనేవారట.
1970ల్లో శంకర్‌విలాస్ లా 1940ల్లో గుంటూరులో ఆనంద భవన్ హోటల్ చాలా ప్రసిద్ధమట.
