6.10.06
మూడు ముక్కలాట
1:51 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: మా నాన్నగారి స్మృతులు
గుంటూర్లో B.Com.పరీక్ష విజయవంతం కాకపోవడం చేత వెంకటేశ్వర్లుగారు తిరిగి మఱ్ఱిపూడి వచ్చేశారు. అక్కడ ఆయన జీవితం కులాసాగా గడిచేది. "పరీక్షలో తప్పావా ?పాసయ్యావా ?" అని అడిగేవారు గానీ "ఎట్టెట్టా ?హవ్వ !" అంటూ బుగ్గలు నొక్కుకునేవారు గానీ ఆ రోజుల్లో ఎవరూ ఉండేవారు కారు. మఱ్ఱిపూడి పొలాల్లో గడ్డివాముల వెనక కూర్చుని కులాసాగా ఫిల్టర్ కాఫీ తాగుతూ మిత్రబృందంతో బంధువర్గంతో జల్సాగా పేకాడుతూ రేడియోలో ప్రాంతీయ వార్తలు వింటూ ప్రొద్దుపుచ్చేవారు.
మఱ్ఱిపూడిలో రాధాకృష్ణమూర్తిగారనే బ్రాహ్మణ భూస్వామి ఉండేవాడు. గుంటూరు కొత్త పట్టాభిపురంలో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూర్యనారాయణ (Plant Protection Industries Limited, Corporate Office:Punjagutta, Hyderabad) గారికి ఆ రాధాకృష్ణమూర్తిగారు బాబాయి అవుతాడు. కాకతాళీయం (coincidence) గా వెంకటేశ్వర్లుగారి మావయ్య పేరు కూడా రాధాకృష్ణమూర్తే. అందుచేత ఎవరు ఎవరో సులభంగా తెలియడం కోసం వెంకటేశ్వర్లుగారి మావయ్యని "నల్ల రాధాయి" అని ఆ పెద్దాయన్ని "ఎర్ర రాధాయి" అని వ్యవహరించేవారు మఱ్ఱిపూడి వాస్తవ్యులు. పారిశ్రామికవేత్త సూర్యనారాయణగారు పెద్దగా ఏమీ చదువుకోలేదు. స్కూల్‌ఫైనలు కూడా పాసవలేదు. ఆరోజుల్లో ఆయన కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రం కావడంతో సున్నపు బట్టీల్లో పనికి కుదిరారు. ఆ రోజుల్లో భవనాలు కట్టడానికి సిమెంటు బదులు సున్నం వాడేవారు. దాన్ని కట్టుబడి సున్నం అనేవారు.అది సున్నపు బట్టీల్లో తయారయ్యేది. తరువాత బర్మా షెల్ కంపెనీలో పనికి కుదిరారు. ఆ కంపెనీ ఇండియా విడిచి వెళ్ళేటప్పుడు ఒక పెట్రోలు బంకుని సూర్యనారాయణగారికి చౌకగా ఇచ్చేసింది. ఆ తరువాత ఆయన ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన కంపెనీ ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలంతటా వ్యాపించి ఉంది. సూర్యనారాయణగారు డబ్బు దగ్గర మహాగట్టి. ముసలితనంలో పేకాడేటప్పుడు కూడా వెంకటేశ్వర్లుగారి దగ్గర అణా పైసలతో సహా వసూలు చేసుకునేవాడు.
ఈ మిత్రబృందంతో పేకాడే క్రమంలో వెంకటేశ్వర్లుగా రొకసారి అయిదొందల (500) రూపాయలు పోగొట్టుకున్నారు. అయిదొందలంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. ఎకరా పొలం ధరే వెయ్యి నుంచి రెండువేల దాకా ఉండేది. ఎర్ర రాధాయిగారు వెంకటేశ్వర్లుగారి మీద మనసులో ఏం అక్కసు పెట్టుకున్నాడో తెలీదు గాని "వెంకులుకి పేకాటలో అయిదొందలు పోయాయి" అని మఱ్ఱిపూడిలో అడిగినవాడూ, అడగనివాడూ అనే తేడా లేకుండా మెడమీద తలకాయ ఉన్న ప్రతివాడికీ ఉచితంగా టాంటాం వేసేశాడు. దీనికి అసలు కారణం వేరే ఉంది. వెంకటేశ్వర్లుగారు పేకాటలో తఱచుగా గెలవడమే గాని ఓడిపోవడం ఎఱుగరు. ఆ రకంగా మఱ్ఱిపూడిలో ఆయనతో తలపడి ఓడిపోయి డబ్బు పోగొట్టుకున్నవారే ఎక్కువ. ఆ కసి కొంత మనసులో ఉండేది కొంతమందికి.
ముసలితనంలో కూడా వెంకటేశ్వర్లుగారికి పేకాటలో నైపుణ్యం ఏమాత్రం తగ్గలేదు. 1989 లో ఆయనతో ఆడిన యువకులు యథాప్రకారం ఓడిపోయి డబ్బు పోగొట్టుకున్నారు. "మావయ్యా !ఈ రోజు గెల్చుకున్నది చాలు నువ్వింకో మేడకట్టడానికి" అన్నారు. వెంకటేశ్వర్లుగారు నవ్వి "వెంట్రుకలు కాలిస్తే బొగ్గులవుతాయా ?" అని ఒక పాత సామెత వల్లించారు.
B.Com తప్పిన కొత్తల్లోనే మరోసారి వెంకటేశ్వర్లుగారు పేకాటలో నూటెనభై (180) రూపాయలు గెల్చుకున్నారట. ఆ డబ్బుతో ఒక విదేశీ బ్రాండు సైకిలు కొన్నారట. తరువాతెప్పుడో దాన్ని మఱ్ఱిపూడిలోనే చెరువు గోపాలకృష్ణయ్యగారికి అమ్మేశారట. ఆయన ఆ సైకిలెక్కి ఊరూరు తిరుగుతూ Andhra Life Insurance Corporation (ఇది తరువాత LIC లో విలీనమైంది) తరఫున జీవితబీమా పాలసీలు కట్టించుకుంటూ ఉండేవాడు. అలా అలా ఆయన ఆ వ్యాపారంలోనే పైకొచ్చి కారూ ఇల్లూ కూడా కొనేశాడు.
అంతా వెంకటేశ్వర్లుగారి సైకిలు చలవ !
