26.9.06

"అప్పికట్లకు బాపట్ల ఆరు మైళ్ళు"



అన్నారొకసారి మహాకవి తుమ్మల సీతారామ్మూర్తి చౌదరిగారు. వెంకటేశ్వర్లుగారు తన చిన్ననాటి విశేషాలు చెప్పేటప్పుడు "నాన్నా !బాపట్ల ఊరు ఎలా ఉంటుంది ?"అని అడిగితే "ఎలా ఉంటుంది ?ఇప్పుడే ఎవరో బాంబేసినట్టుంటుంది." అని చిరాగ్గా సమాధానమిచ్చేవారు.ఆ చిరాకుకి కారణం లేకపోలేదు. బాపట్లలో ఆయన మావయ్యల సంరక్షణలో చదువుకున్నారు. ఆ మావయ్యలు వెంకటేశ్వర్లుగారి అల్లరికి ఆకతాయితనానికి విసిగి తఱచుగా దండిస్తూండేవారు. కనుక ఆ ఊరి పేరు చెబితే ఆయనకి ఆ తన్నులే గుర్తొస్తాయి. ఏదేమైనా ఆ ఊరు ఆయనకి నచ్చలేదు.

ఈనాటి బాపట్ల గుంటూరుజిల్లాలో ఒక ప్రముఖ పట్టణం. లక్ష జనాభా ఉంటుంది. అక్కడ వైద్యకళాశాల తప్ప లేనిదంటూ లేదు. ముఖ్యంగా ఆ ఊరు భావనారాయణస్వామివారి క్షేత్రం మూలాన ప్రసిద్ధికెక్కింది. అలాంటి భావనారాయణస్వామివారి ఆలయం మన రాష్ట్రంలో కాకినాడ నగర శివార్లలో సర్పవరం ప్రాంతంలో కూడా ఉంది. భావనారాయణస్వామివారి పేరుమీద బాపట్లకి "భావపురి" అనే నామాంతరం కూడా ఏర్పడింది.

ఆనాటి బాపట్ల : వెంకటేశ్వర్లుగారు మొదట్లో మఱ్ఱిపూడి నుంచి రాష్ట్ర రహదారి (State Highway) దాకా నడిచి, అక్కడినుంచి తమ కుటుంబ పొలాల మీదుగా కొంత, ఆ రహదారిమీద కొంత, మొత్తం 8 కిలోమీటర్లు రోజూ నడిచి బాపట్లలో ఉన్న హైస్కూలికి వెళ్లేవారు. ఆ రోజుల్లో లారీలు, లారీల్లా కనపడే అరుదైన బొగ్గుబస్సులు తప్ప వేరే రకాల వాహనాలేమీ లేవు. ఆయన పొలాల్లో పనిచేసే కౌలుదార్లు(ఆయనకంటే చాలా పెద్దవాళ్ళు) "అయ్యగారొస్తున్నారు" అంటూ చుట్టలు అవతల పారేసి నిలబడేవారు.(అదో ఫ్యూడల్ సమాజం కదా !)ఇలా ఒక ఆర్నెల్లు నడిచాక "ఇహ నడవలే" ననిపించిం దాయనకి. దాంతో బాపట్లలో మావయ్యల దగ్గర మకాం పెట్టక తప్పలేదు.

రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు బాపట్లలో ప్రధాన మార్గాలకి ఇరువైపులా సైనికుల్ని నిలబెట్టారట. రాత్రిపూట ఎక్కడా నిప్పుకణికైనా మెఱవడానికి వీల్లేదు. దీపాలు వెలిగించుకుంటే ఇంట్లో కిటికీలతో సహా అన్ని తలుపులూ మూసేసుకుని వెలిగించుకోవాల్సిందే. ఎక్కడైనా వెలుగు కనిపిస్తే ఆకాశంలోంచి శత్రు విమానాలు (జపాన్ వారివి) పసిగట్టి బాంబుదాడులు (bombardments) చేస్తాయని భయం.

అప్పట్లో పాకిస్తాన్ బర్మా శ్రీలంక దేశాల్ని సైతం కలుపుకుని వ్యాపించి ఉన్న ఇండియాకి రెండు కాలమండలాలు (Time-zones) ఉండేవి. నిజానికి అదే శాస్త్రీయం కూడా ! రెండో ప్రపంచ యుద్ధం రాగానే బ్రిటీషు ప్రభుత్వం ప్రజల కదలికల్ని ఇళ్ళకి పరిమితం చేసి ప్రాణనష్టాన్ని నివారించ జూసింది. అందులో భాగంగా సమయ సూచనా వ్యవస్థల్లో భారీగా మార్పులు చేసింది. తత్ఫలితంగా బ్రిటిష్ ఇండియా మొత్తం ఒకే కాలమండలంగా ప్రకటించబడింది. అంతటితో ఆగకుండా వ్యక్తిగత గడియారాలన్నీ ఒక గంట ముందుకు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం తరువాత మళ్ళీ రెండు కాలమండలాల వ్యవస్థ పునరుద్ధరించాలనుకున్నారు. కాని ఎందుకో అలాగే ఇప్పటి దాకా కొనసాగిస్తూ ఉన్నారు.

సాయంకాలం ఆరు దాటితే ఎవ్వరూ రోడ్లమీద కనిపించడానికి వీల్లేదు. కనిపిస్తే ఫలానా చోట జనావాసాలున్నట్లు శత్రువులు పైనుంచి చూసి కనిపెడతారు. గడియారాలన్నీ ఒక గంట ముందుకు పెట్టుకునేవారు కాబట్టి నిజానికి ఐదింటికే వీథులు నిర్మానుష్యం. ఆఱున్నఱకే భోజనాలు కానిచ్చి పడుకునేవారట.

మద్రాసు మీద బాంబులేస్తారని భయపడి పెద్దపెద్దవాళ్లే పల్లెప్రాంతాలకొచ్చి కొంతకాలం గడిపారట. అలాంటివారిలో టంగుటూరి సూర్యకుమారిగా రొకరు. ఆవిడ ఆంధ్ర రాష్ట్రపు మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి అన్నకూతురు. చాలా అందగత్తె. ఆ రోజుల్లో Miss Madras గా ఎంపికైంది. "రైతుబిడ్డ" మొదలైన తొలి తరం తెలుగు టాకీల్లో హీరోయిన్‌గా నటించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆవిడ అప్పికట్ల రైల్వేస్టేషన్‌ దగ్గర ఇల్లు తీసుకుని కొంతకాలం గడిపిందట.

ఆ రోజుల్లో అన్నిటికీ రేషనే. బట్టలు కాయితాలు కూడా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో రేషనుగా ఇచ్చేవారు. అప్పట్లో గుంటూరు ప్రాంతాలకి మెట్టూర్‌మిల్సు బెన్నీ కంపెనీ బట్టలు తప్ప ఇంకేవీ సరఫరా లేదు.

వెంకటేశ్వర్లుగారి చిన్నతనం నాటికి ఇండియా - అందునా ఆంధ్రాలో పరిశ్రమలు అంతగా అభివృద్ధి చెందలేదు. పెన్నులతో సహా అన్నీ ఇంగ్లాడు నుంచి దిగుమతి కావాల్సిందే. వెంకటేశ్వర్లుగారు బాపట్ల హైస్కూల్‌లో చదివే రోజుల్లో ఆ స్కూలికి ఇంగ్లాండు నుంచి పెన్నుల కోటా వచ్చిందట. విద్యార్థులంతా వాటికోసం ఎగబడ్డారట. ఆ కుమ్ములాటలో తొక్కిసలాటలో కొంతమంది గాయపడి ఏడిచారట.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్