27.9.06

"సెక్టారు" కథ



వెంకటేశ్వర్లుగారు ఒంగోలు A.B.M.హైస్కూల్‌లో చదివే రోజుల్లో దానికి శామ్యూల్ అనే హెడ్‌మాస్టరుగా రొకాయన ఉండేవారు. ఎందుకో మెడ భుజం మీదికి వంచి తిరుగుతూండేవాడట. చాలా సంవత్సరాల తరువాత వెంకటేశ్వర్లుగారు 1975లో నెల్లూరులో రాధా టాకీసు ఎదురుగా ఉన్న ఇండియన్‌బ్యాంకు బ్రాంచిలో పనిచేసే రోజుల్లో ఒకసారి వచ్చాడట. "శామ్యూల్" అనే పేరు వినగానే వెంకటేశ్వర్లుగారు అడిగారట. "మీరు ఒంగోలులో హెడ్‌మాస్టరుగా పనిచేశారా ?" అని. ఆయన అవునన్నాడట. అప్పటికి శామ్యూల్‌గారు పదవీ విరమణ చేసి క్రైస్తవ మిషనరీలలో చేరి పూర్తికాలం పనిచేస్తూ యుగోస్లావియా, బల్గేరియా మొదలైన దేశాలు చూశాడట.

A.B.M. హైస్కూల్‌లో ఇంకో మాష్టారు ఉండేవారు. ఆయన పేరేదో చెప్పారు గాని ఈ రచయితకి గుర్తురావడం లేదు. ఆయనకి ఒక రకమైన షేపులో బట్టతల ఉండేది. అది పిల్లలకి గణితశాస్త్రంలోని "సెక్టార్" ఆకారాన్ని తలపించేది. అందుచేత పిల్లలు ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు "సెక్టార్ సార్" అనే ముద్దుపేరుతో వ్యవహరించేవారు. ఒకసారి ఆయన వస్తూంటే వెంకటేశ్వర్లుగారు "అదిగో సెక్టార్ సార్ ఒస్తున్నారు" అని తోటి పిల్లల్ని హెచ్చరించారు. తాను మెల్లగా అన్నాననుకున్నారు గాని అది "సెక్టార్ సార్" చెవిలో పడనే పడింది. ఆయన ఉగ్రుడై వెంకటేశ్వర్లుగారి దగ్గరికి వచ్చి "రాస్కెల్! పెద్దవాళ్ళకి బొడ్డుకోసి పేర్లు పెట్టేంత వాడివయ్యావురా ?" అని జుట్టుపట్టుకుని చావగొట్టారు.

తరువాత వెంకటేశ్వర్లుగారు 1975-78 ప్రాంతాల్లో గుంటూరు బ్రాడీపేట బ్రాంచి మేనేజరుగా చేసే రోజుల్లో ఆయన్ని కలవాలని ఆ మాష్టారుగారు వచ్చారు. మొదట వెంకటేశ్వర్లుగారు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. ఆయన కొంచెం సంకోచపడుతూ "నేనయ్యా, సెక్టార్‌ని" అని తనని తాను పరిచయం చేసుకున్నారు. వారబ్బాయికి బ్యాంకులో ఏదైనా నాలుగో శ్రేణి ఉద్యోగమైనా ఇప్పించాల్సిందని ఆయన అభ్యర్థన. గురువుగారు కోరినట్లే వెంకటేశ్వర్లుగారు చేశారనేది వేరే విషయం.

"సెక్టార్" అన్నందుకు చావగొట్టిన గురువుగారు చివరికి అదే పేరుతో తనని తాను శిష్యుడికి గుర్తుచెయ్యాల్సి రావడం ఇందులోని వ్యథాభరితమైన ఘట్టం. ఇది మన దేశంలోని బడిపంతుళ్ళ ఆర్థిక దుస్థితిని వెల్లడిస్తోంది.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్